అనంతపురంలో అపహరించి.. పెనుకొండలో వదిలేసిన యువతి
ఇరుగు పొరుగు కుటుంబాల మధ్య మనస్పర్థలే కారణం
పోలీసుల చొరవతో తల్లిదండ్రుల చెంతకు బాలుడు
యువతిపై కేసు నమోదు
అనంతపురంలో కిడ్నాప్ అయిన బాలుడి కథ సుఖాంతమైంది. ఇరుగు పొరుగు కుటుంబాల వారి మధ్య ఉన్న మనస్పర్ధల కారణంగా అభం శుభం తెలియని మూడేళ్ల బాలుడిని ఓ యువతి కిడ్నాప్ చేసినట్లు తేలింది. పోలీసుల చొరవతో బాలుడు తల్లిదండ్రుల చెంతకు చేరాడు.
బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను అనంతపురం వన్‌టౌన్ సీఐ రాఘవన్ సోమవారం మీడియాకు వెల్లడించారు. మున్నానగర్‌లో నివాసముంటున్న మహబూబ్‌బాషాతో పొరుగింటి వారికి కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. దీన్ని మనసులో పెట్టుకున్న పొరుగింటి యువతి మహబూబ్‌బాషా, ఆయేషా దంపతుల కుమారుడు ఇమ్రాన్ (3)ను ఆదివారం కిడ్నాప్ చేసింది. ఎవరి కంటా పడకుండా తీసుకుపోయి పెనుకొండలో వదిలిసేంది. సాయంత్ర వరకు తల్లిదండ్రులు ఎంత గాలించినా బాలుడి ఆచూకీ తెలియలేదు.
దీంతో బాలుడు తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ‘మాయమైన మూడేళ్ల బాలుడు’ అన్న శీర్షికన సాక్షి పత్రికలో ఫొటోతో సహా ప్రచురితమైంది. కిడ్నాప్ చేసిన యువతి ఆ బాలుడిని తీసుకొని బస్టాండ్‌కు ఆటోలో వెల్లింది. ఉదయాన్నే పత్రికల్లో చదివిన ఆటో డ్రైవర్ సదురు బాలుడిని ఓ యువతి తీసుకెళ్లి్లందని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అదే సమయంలో పెనుకొండలో బాలుడిని చేరదీసిన స్థానికులు ఉదయాన్నే ఇమ్రాన్ ఫొటో చూసి పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి ఇమ్రాన్‌ను సురక్షితంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు వివరాలు ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. చిన్నారి పట్ల కర్కశంగా వ్యవహరించిన యువతిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ రాఘవన్ తెలిపారు.