ఏటీఎంల్లో 100 మందిని మోసం చేశాడు
న్యూఢిల్లీ: ఏటీఎం కేంద్రాల్లో డబ్బులు విత్ డ్రా చేసేందుకు ఖాతాదారులకు సాయపడుతున్నట్టుగా నటిస్తూ వందమందిని మోసం చేసి వారి నుంచి డబ్బు కాజేసిన ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని హరియాణాలోని పల్వాల్కు చెందిన ఇమ్రాన్ (25)గా గుర్తించారు.
ఇమ్రాన్ స్వగ్రామానికి చెందినవారితో ఓ గ్యాంగ్ను ఏర్పాటు చేసుకుని, సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎమ్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడ్డాడని క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ రవీంద్ర యాదవ్ చెప్పారు. ఇమ్రాన్ గ్యాంగ్ ఢిల్లీలో 100 మందికి పైగా ఏటీఎమ్ ఖాతాదారులను మోసం చేసిందని తెలిపారు. ఇతర నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. 'ఎటీఎం కేంద్రంలో ఓ ఖాతాదారుడు వెళ్లినపుడు ఇమ్రాన్ ముఠా సభ్యుడు కూడా వెళ్లి అతని సమీపంలో ఉండేవాడు. ఏటీఎం ఖాతాదారు నగదు విత్ డ్రా చేసేందుకు మొత్తాన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇమ్రాన్ ముఠా సభ్యుడు అతని దృష్టి మళ్లించి క్లియర్ బటన్ నొక్కేవాడు. దీంతో ఏటీఎం నుంచి డబ్బు వచ్చేదికాదు. ఆ సమయంలో ఇమ్రాన్ ముఠా సభ్యుడు మరొకడు వచ్చి ఏటీఎం పనిచేయడం లేదని చెబుతాడు. ఖాతాదారు ట్రాన్సాక్షన్ను క్యాన్సిల్ చేయకుండా ఏటీఎం కేంద్రం నుంచి బయటకు వెళ్లాక, నిందితుడు అతని ఎకౌంట్ నుంచి డబ్బులు కాజేసేవాడు. కొన్నిసార్లు రహస్యంగా ఏటీఎమ్ నెంబర్ను గుర్తించి, ఆ తర్వాత ఏటీఎం కార్డులను మార్చడం ద్వారా మోసాలకు పాల్పడేవారు' అని రవీంద్ర యాదవ్ చెప్పారు.