ఖైదు లోంచి ఖైదు లోకి... | Review Of Anees Salim Vanity bagh Book | Sakshi

Published Mon, Jul 30 2018 1:24 AM | Last Updated on Mon, Aug 13 2018 7:56 PM

Review Of Anees Salim Vanity bagh Book - Sakshi

జైలు నుంచి తప్పించుకునే ప్రణాళికలు వేస్తుండగానే, ఇమ్రాన్‌ను పుస్తకాలకి అట్టలు వేసే పనిలో నియమిస్తారు జైలు అధికారులు. వాటి ఖాళీ పేజీలని ఒక నోట్‌బుక్‌గా కుట్టి, తన ఊరి గురించీ, దానికీ మెహెందీకీ ఉన్న వైరానికున్న మూల కారణాల గురించీ రాసుకుంటాడు పుస్తకాలని అసహ్యించుకునే ఇమ్రాన్‌. 

‘భారతదేశపు ప్రతి పట్టణంలోనూ ఒక చిన్న పాకిస్తాన్‌ ఉంది’ అన్న మాటలు, ‘వ్యానిటీ బాగ్‌’ నవల అట్టమీద ఉన్నవి. దీని కథానాయకుడైన ఇమ్రాన్‌ జైల్లో కూర్చుని, గడిచిన తన జీవితాన్ని గుర్తు చేసుకుంటుంటాడు. కాల్పనిక ‘మ్యాంగో బాగ్‌’ అనే ఊర్లో ‘మెహెందీ’ ప్రాంతంలో హిందువులుంటే, ‘వ్యానిటీ బాగ్‌’ అధికంగా ముస్లిములూ, కొద్దిపాటి క్రైస్తవ కుటుంబాలూ ఉండే ప్రదేశం. ‘పాకిస్తాన్‌లో ప్రసిద్ధికెక్కిన ధనవంతుల పేర్లు పెట్టుకోవడం మాకు అలవాటే’ అంటాడు పాకిస్తానీ క్రికెటర్‌ పేరున్న ఇమ్రాన్‌ జబ్బారీ. మెహెందీ వాసులు వీళ్ళ ప్రాంతాన్ని ‘లిటిల్‌ పాకిస్తాన్‌’ అని పిలుస్తారు. జీవితంలో ఒక లక్ష్యం అంటూ లేకుండా, బలాదూరుగా తిరుగుతూ సామాన్యమైన జీవితాలు గడుపుతూనే, పరపతి గణిద్దామనుకునే యువకులు ఏర్పరుచుకున్న, ‘5బి పురుషులు’ అన్న గ్యాంగులో ఇమ్రాన్‌ చేరతాడు. ‘బి’కి కారణం వారిలో ఒకరైన యాహ్యా వినలేకపోవడం, మాట్లాడలేకపోవడం. 

ఒకరోజు దొంగిలించబడిన స్కూటర్లని పట్టణం నలుమూలలకీ తీసుకెళ్ళి వదిలేసే పని దొరుకుతుంది వీరికి. ఇమ్రాన్‌ ఆ పని ముగించిన కొంతసేపటికే, స్కూటర్లో ఉన్న బాంబులు పేలి, మ్యాంగో బాగ్‌ పౌరులని గాయాలపాలు చేస్తాయి. అప్పుడు కానీ తను తీవ్రవాద చర్యలో పాలు పంచుకున్నానని ఇమ్రాన్‌ గుర్తించడు. 14 ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది. జైలు నుంచి తప్పించుకునే ప్రణాళికలు వేస్తుండగానే, అతన్ని పుస్తకాలకి అట్టలు వేసే పనిలో నియమిస్తారు జైలు అధికారులు. వాటి ఖాళీ పేజీలని ఒక నోట్‌బుక్‌గా కుట్టి, తన ఊరి గురించీ, దానికీ మెహెందీకీ ఉన్న వైరానికున్న మూల కారణాల గురించీ రాసుకుంటాడు పుస్తకాలని అసహ్యించుకునే ఇమ్రాన్‌. బయటి లోకంతో అతనికుండే ఒకే సంబంధం ప్రతీ నెలా కొడుకుని కలుసుకునేటందుకు జైలుకొచ్చే అతని తల్లి. ఊర్లో జరిగే సంగతులన్నీ కొడుక్కి చెప్తూ ఉంటుంది. ఆమె రావడం ఆగిపోయిన మూడు నెలలకి తండ్రి వచ్చి, తల్లి మరణించిందని చెప్తాడు.

రచయిత అనీస్‌ సలీమ్, ఇమ్రాన్‌ పట్ల జాలి కలిగించే ప్రయత్నం చేయరు. ఎవరినీ జడ్జ్‌ చేయరు. ఏ సెంటిమెంటూ చూపించకుండా, అగౌరవమైన మాటలని కూడా సులభంగా వాడతారు. ఒంటరితనాన్నీ, వ్య«థనీ, నిరాశనీ హాస్యరూపంలో వ్యక్తీకరిస్తారు. నీతులు చెప్పకుండా కథనాన్ని నిర్లిప్తంగా కొనసాగిస్తారు. నవల మధ్యలో అనేకమైన కోట్స్‌ ఉంటాయి: 
‘కథలల్లడం, ప్రతిదానికీ పేరు పెట్టడం అంటే మొహల్లావారికి ఎంత పిచ్చంటే, సరిగ్గా మసీదు ఎదురుగానే ఉన్న చెట్టుని కూడా వదలక, దాన్ని ‘ఫ్రాంక్లిన్‌ అని పిలుస్తారు. అదేదో క్రైస్తవ తల్లీతండ్రీకి పుట్టి, గరాజిలో పని చేసే పింటోస్‌తో పాటు సెయింట్‌ థామస్‌ చర్చికి ఆదివారాలు వెళ్తున్నట్టు’.

దేశంలో సరైన చదువు, ఉద్యోగం లేకపోయిన యువకులు గడిపే జీవన విధానాన్నీ, దాన్ని తప్పించుకునే దారి వారికి లేకపోవడం గురించీ రాస్తారు సలీమ్‌. ప్రత్యేకంగా– మైనారిటీ వర్గాల ఆశలు, నిష్ఫలమైన నిరాశలుగా మారడం గురించి వర్ణిస్తారు. ‘నవల ఆశ గురించినది కాదు. నైరాశ్యం గురించినది. మానవత్వాన్ని విభజించగల మతపరమైన అసహనం, ఎన్నికల్లో నెగ్గడం గురించినది’ అంటారు కేరళకు చెందిన సలీమ్‌.
2013లో ‘హిందూ ప్రైజ్‌ ఫర్‌ బెస్ట్‌ ఫిక్షన్‌’ అవార్డు పొందిన ఈ నవలని పికడొర్‌ ఇండియా పబ్లిష్‌ చేసింది.
-కృష్ణ వేణి
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement