ఎన్‌డీఏదే విజయం: ఎగ్జిట్ పోల్స్
శుక్రవారం ఆర్‌బీఐ పాలసీ సమీక్ష
విదేశీ పెట్టుబడులు, గణాంకాలు కీలకమే
ఈ వారం ట్రెండ్‌పై స్టాక్ నిపుణులు
న్యూఢిల్లీ: ప్రధానంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్‌నివ్వనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే శనివారం(1న) వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో అధికార బీజేపీ అధ్యక్షతన ఏర్పాటైన ఎన్‌డీఏ భారీ విజయా న్ని సాధించనున్నట్లు అంచనాలు వెలువడ్డాయి. దీంతో మంగళవారం(4న) వెలువడనున్న లోక్‌సభ ఫలితాలలో తిరిగి బీజేపీ కూటమి అధికారాన్ని అందుకుంటుందన్న అంచనాలు బలపడినట్లు రాజకీయ వర్గాలు తెలియజేశాయి.
వరుసగా మూడో సారి భారీ మెజారిటీతో నరేంద్ర మోడీ ప్రధాని పదవిని చేపట్టే వీలున్నట్లు పేర్కొన్నాయి. వెరసి స్టాక్ మార్కెట్లలో ప్రోత్సాహకర సెంటిమెంటుకు తెరలేవనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ ప్రభావంతో నేడు(3న) మార్కెట్లు జోరు చూపే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు.
అయితే 4న ప్రకటించనున్న వాస్తవిక ఫలితాలు భిన్నంగా వెలు వడితే.. మార్కెట్లలో దిద్దుబాటుకూ అవకాశమున్న ట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలియజేశారు. కాగా.. గత వారం సెన్సెక్స్ చరిత్రాత్మక గరిష్టం 76,010కు, నిఫ్టీ 23,111కు చేరినప్పటికీ సెన్సెక్స్ 1,449 పాయింట్లు(1.9 శాతం) కోల్పోయి, నిఫ్టీ 426 పాయింట్లు(1.9 శాతం) పతనమై ముగిశాయి. ఈ బాటలో బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ సైతం 1.5 శాతం చొప్పున డీలా పడ్డాయి.
జీడీపీ దన్ను
గత వారాంతాన వెలువడిన జీడీపీ గణాంకాలు సైతం ఇన్వెస్టర్లకు జోష్‌నివ్వనున్నట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. గతేడాది క్యూ4(జనవరి–మార్చి)లో ఆర్థిక వ్యవస్థ 7.4 శాతం పురోగతిని సాధించగా.. పూర్తి ఏడాదికి అంచనాలను మించుతూ 8.2 శాతం వృద్ధి చూపింది. ప్రోత్సాహకర ఎగ్జిట్ పోల్స్, జీడీపీ గణాంకాల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) సైతం కొనుగోళ్లకు ఆసక్తి చూపే వీలున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. ఎగ్జిట్ పోల్స్ పరిధిలోనే వాస్తవిక ఫలితాలు సైతం వెలువడితే.. రాజకీయ, పాలసీ కొనసాగింపుపై ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళనలకు చెక్ పడుతుందని ఎమ్‌కే రీసెర్చ్ నివేదికలో పేర్కొంది.
రెపో యథాతథం
లోక్‌సభ ఫలితాల తదుపరి దేశీ స్టాక్ మార్కెట్లను శుక్రవారం(7న) వెలువడనున్న ఆర్‌బీఐ పాలసీ సమీక్షా నిర్ణయాలు ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 5న ప్రారంభంకానున్న ఆర్‌బీఐ పాలసీ సమావేశం 7న ముగియనుంది. 2024 ఏప్రిల్‌లో నిర్వహించిన పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ కమిటీ వరుసగా ఏడోసారి వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగించేందుకే నిర్ణయించింది. ఇక ఈ వారంలో మే నెలకు తయారీ(3న), సరీ్వసెస్ పీఎంఐ(5న) గణాంకాలు వెలువడనున్నాయి. చైనా, యూఎస్ తయారీ, ఉపాధి గణాంకాలు సైతం 3, 5న వెల్లడికానున్నాయి. వీటికితోడు ఎఫ్‌ఐఐల పెట్టుబడుల తీరు, విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయగలవని మార్కెట్ నిపుణులు ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment