న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది బీజేపీ. ఎన్డీయే కూటమిలో భాగాస్వామ్యమైన, టీడీపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్), శివసేన(ఏక్‌నాథ్ షిండే) సహాకారంతో మూడోసారి ప్రధానిగా మోదీ జూన్ 9 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం కేంద్ర మంత్రి వర్గం కూడా కొలువుదీరనుంది.
ప్రమాణ స్వీకారానికి తేదీ దగ్గరపడుతుండటంతో కేంద్ర మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపుపై కసరత్తు ప్రారంభమైంది. బీజేపీ నుంచి ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రణాళికలు రచిస్తున్నారు. కేంద్ర పదవుల కోసం ఎన్డీయే మిత్రపక్షాలు టీడీపీ, జేడీయూ బేరసారాలు ప్రారంభించాయి ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్‌లుగా అవతరించిన చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ కేంద్ర మంత్రి పదవుల్లో కీలక శాఖలను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే కీలక మంత్రిత్వ శాఖలు బీజేపీ వద్దనే ఉండే అవకాశం ఉంది. మిత్రపక్షమైన టీడీపీ లోక్‌సభ స్పీకర్ పదవిని కోరగా..దీనిని ఇచ్చే ప్రస్తకే లేదని కాషాయ పార్టీ తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పదవిని ఆఫర్ చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అటు జేడీయూకి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవులు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇక హోంశాఖ, రక్షణ, విదేశాంగ ,ఆర్ధిక,రోడ్లు , రైల్వే.. వంటి నాలుగు కీలక మంత్రిత్వ శాఖలను బీజేపీ తమ వద్దనే ఉంచుకోనుంది. వీటిని మిత్ర పక్షాలకు ఇచ్చేందుకు కాషాయపార్టీ విముఖత వ్యక్తం చేస్తోంది. అంతేగాక రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, వ్యవసాయం, మౌలిక వసతులు, సంక్షేమ రంగాలపై పట్టు వదులుకోకూడదని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టణాభివృద్ధి శాఖ, పౌర విమానయాన శాఖ, ఉక్కు శాఖ టీడీపీకి దక్కే అవకాశం ఉంది.
గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖలు జేడీయూకి ఇచ్చే అవకాశం ఉంది. భారీ పరిశ్రమల శాఖ శివసేనకు, వ్యవసాయ శాఖ జేడీఎస్‌కు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, జనసేన నుంచి బాలశౌరి, ఏపీ బీజేపీ నుంచి పురందేశ్వరికి మంత్రి పదవులు వరించనున్నట్లు సమాచారం. ఆహార ప్రాసెసింగ్, భారీ పరిశ్రమలు, టూరిజం, స్కిల్ డెవెలప్‌మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ వంటి తక్కు ప్రాధాన్యత కలిగిన పోర్ట్‌ఫోలియోలను మిత్రపక్షాలకు అప్పగించేందుకు బీజేపీ యోచిస్తోంది. వీటితోపాటు ఆర్థిక, రక్షణ వంటి పెద్ద- మంత్రిత్వ శాఖలలో రాష్ట్ర మంత్రి పదవులు కట్టబెట్టాలని చూస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment