న్యూఢిల్లీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం రాత్రి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రమాణస్వీకారం చేశారు. మోదీ సహా 72 మందితో కేంద్ర క్యాబినెట్ కూడా ఏర్పాటైంది.
ప్రధాని, మంత్రులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. 30 మందికి క్యాబినెట్ మంత్రులుగా అవకాశం లభించింది. మరో ఐదుగురిని స్వతంత్ర హోదాతో సహాయ మంత్రులుగా, 36 మందిని సహాయ మంత్రులుగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కొత్తగా ఏర్పాటైన నరేంద్ర మోదీ క్యాబినెట్ తొలి సమావేశం సోమవారం జరగనునంది. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని లోక్‌కళ్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని నివాసంలో క్యాబినెట్ సమావేశం ఉంటుంది.
కాగా ఇటీవల వెలువడిన లోక్‌షభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకపోవడంతో మిత్ర పక్షాలైన టీడీపీ, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో కలిసి మూడోసారి ప్రధానిగా పదవీ స్వీకరించారు మోదీ. ఫలితాలు వెలువడిన నాలుగు రోజులకే మోదీతో సహా 72 మంది మంత్రులతో కూడిన పూర్తిస్థాయి మంత్రివర్గం ఆదివారం ప్రమాణ స్వీకారం చేసింది.
కీలక మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూలకు రెండు మంత్రి పదవులు (ఒక కేబినెట్ ర్యాంకు, ఒక రాష్ట్ర మంత్రి) దక్కాయి. అయితే మరో కీలక పదవి అయిన లోక్‌సభ స్పీకర్ ఎవరికి దక్కుతుందే ప్రశ్న ఇంకా ఉత్కంఠగానే మిగిలి ఉంది. ఈ ఎన్నికల్లో కింగ్‌మేకర్‌గా అవతరించిన టీడీపీ, జేడీయూలు ఈ పోస్టుపై కన్నేసిన్నప్పటికీ.. దానిని వదులుకునేందుకు బీజేపీ ఆసక్తి చూపడం లేదు.
అయితే రాజ్యాంగం ప్రకారం, కొత్తగా ఎన్నికైన లోక్‌సభ మొదటిసారి సమావేశమయ్యే ముందు స్పీకర్ పదవి ఖాళీ అవుతుంది. హౌస్‌లోని సీనియర్ సభ్యుల నుంచి రాష్ట్రపతి .. ఒకరిని ప్రొటెం స్పీకర్‌గా నిమిస్తారు. ఈ ప్రొటెం స్పీకర్ కొత్త ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం సాధారణ మెజారిటీతో హౌస్ సభ్యుల నుంచి ఒకరిని స్పీకర్‌గా ఎన్నుకుంటారు.
లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికవ్వడానికి నిర్దిష్ట ప్రమాణాలు, ప్రత్యేక నియమాలేవి లేకపోయినా... రాజ్యాంగం, పార్లమెంటరీ నియమాలపై అవగాహన కలిగి ఉండటం అవసంరం. గత రెండు పర్యాయాలలో లోక్‌షభలో బీజేపీకి మెజారిటీ ఉండటంతో సుమిత్రా మహాజన్, ఓం బిర్లా స్పీకర్‌లుగా ఎన్నికయ్యారు.
కాగా లోక్‌సభ స్పీకర్ పదవనేది కీలక పదవి. ఫిరాయింపు కారణంగా సభ్యులపై అనర్హత వేటు వేయడానికి సంబంధించిన కేసులను నిర్ణయించడంలో ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం స్పీకర్‌కు సంపూర్ణ అధికారం ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల్లో ఇలాంటి ఘటనలు కూడా జరిగాయి. పార్టీలో తిరుగుబాటు చేయడం ద్వారా పార్టీ చీలికలకు దారి తీసి ప్రభుత్వాన్నే పడగొట్టిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఇలాంటి వాటికి చోటివ్వకుండా ఉండేందుకు టీడీపీ, జేడీయూ ఈ పదవిని కోరుకుంటోంది. మరి చూడాలి ఎవరిని స్పీకర్ పదవి వరిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment