
ఒకే రోజు ఆరు బిల్లులకు ఆమోదం
బీసీ కమిషన్ కోరలులేని పులి వంటిదే: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: ఒకేరోజు శాసనసభ ఆరు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. భూసేకరణ బిల్లు, బీసీ కమిషన్ చట్ట బిల్లు, ఏపీ ట్రిబ్యునల్‌లోని తెలంగాణ పెండింగ్ కేసులు హైదరాబాద్ ఉన్నత న్యాయ వ్యవస్థకు బదిలీ చేసే బిల్లు, టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్ బిల్లు, ఉమ్మడి రాష్ట్రంలోని కొన్ని ఉపయోగం లేని శాసనాలను రద్దు చేసే బిల్లు, ఖమ్మం పోలీసు కమిషనరేట్ ఏర్పాటు బిల్లుకు బుధవారం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బీసీ కమిషన్‌పై సభలో తీవ్ర చర్చ జరిగింది. బీసీ కమిషన్ బిల్లు కోరలు లేని పులిలాంటిదేనని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. కమిషన్ చైర్మన్ నియామకం కోసమే బిల్లు ప్రవేశపడు తున్నట్లు ఉందన్నారు.
బీసీలపై జరుగుతున్న అకృత్యాలను, అన్యాయాలను కమిషన్ ఆపలేకపోతోందని, రిజర్వేషన్ల అమలులో జరిగిన అన్యాయాన్ని పరిష్కరించలేక పోతోందని వివరించారు. కమిషన్‌కు విస్తృతమైన అధికారాలు కావాలని కోరారు. బీజేపీ నేత లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీ కమిషన్ 112 కులాల స్థితిగతులకు అనుగుణం గా పని చేయాలని, వారి జీవన విధానం, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉండాలని, ప్రఖ్యాత రచయితగా , సామాజిక శాస్త్రవేత్తగా బీఎస్ రాములుకు మంచి పేరుందని, ఆయన పేరును చెడగొట్టే విధంగా బీసీ కమిషన్ ఉండొద్దని అన్నారు. కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్, సీపీఎం సభ్యులు సున్నం రాజయ్య తదితరులు బీసీ కమిషన్‌కు విశేష అధికారాలు ఇవ్వాలని సూచించారు. సభ్యుల సూచనలను పరిగిణలోకి తీసుకొ¯నే బిల్లు ప్రవేశపెట్టామని మంత్రి జోగు రామన్న చెప్పారు.