
30న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం?
► భూసేకరణ బిల్లుకు సవరణల కోసం..
► నకిలీ విత్తన పరిహార బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశం
► మే 2న ముగియనున్న గవర్నర్ పదవీ కాలం
► ఆలోగా బిల్లుల ఆమోదానికి ప్రభుత్వ ప్రయత్నం
సాక్షి, హైదరాబాద్: కేంద్రం కోరినట్లుగా భూసేకరణ బిల్లుకు సవరణలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 30న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. గతేడాది డిసెంబర్ 28న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ బిల్లును శాసనసభ ఆమోదించి.. కేంద్ర హోం శాఖకు పంపించింది. రాష్ట్రంలో ఉన్న అవసరాల దృష్ట్యా ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలపాలని గడిచిన నాలుగు నెలల వ్యవధిలో ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సూచించిన సవరణలను న్యాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది.
ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అర్వింద్‌కుమార్ ద్వారా సవరణలకు సంబంధించిన ఫైలు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరినట్లు సమాచారం. ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనాలతో అర్వింద్‌కుమార్ బుధవారం ప్రత్యేకంగా సమీక్ష జరిపారు. కేంద్రం సూచించిన సవరణలు, అభ్యంతరా లను పరిశీలించి తగిన మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించారు. ప్రతిపాదిత మార్పులతో బిల్లుకు సవరణలు సిద్ధం చేయటంతోపాటు అసెంబ్లీలో ఆమోదం తీసుకోవాల్సి ఉండటంతో రెవెన్యూ, న్యాయశాఖలకు ఈ బాధ్యతలను అప్పగించారు.
కేంద్రం ప్రధానంగా మూడు సవరణలు కోరిందని, ఇవన్నీ పదాల మార్పులేనని అధికారులు చెబుతున్నారు. భూసేకరణ బిల్లు సవరణలతో పాటు నకిలీ విత్తన పరిహార బిల్లును సైతం ఇదే సమావేశంలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. నకిలీ విత్తన చట్టాన్ని అమల్లోకి తెస్తామని, త్వరలోనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని ప్లీనరీ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. మరోవైపు మే రెండో తేదీన గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పదవీ కాలం ముగియనుంది. మరో విడత ఆయన పదవీకాలాన్ని పొడిగించే అవకాశాలు న్న ప్పటికీ.. కేంద్రం పరిధిలో ఉన్న అంశం కావ టంతో ఈలోగానే బిల్లులు గవర్నర్ ఆమోదం పొందేలా చూసుకోవాలని ప్రభుత్వం యోచి స్తోంది. అందుకే నెలాఖరులోగా సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నదనే ప్రచారం జరుగుతోంది.