'భూసేకరణ చట్టంలోని సవరణలతో తీవ్ర పరిణామాలు'
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న భూసేకరణ చట్టంలోని సవరణలతో భవిష్యత్తులో తీవ్ర పరిణామాలుంటాయని సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ హెచ్చరించారు. ఈ బిల్లు రైతులకు పూర్తి వ్యతిరేకంగా ఉందని ఆయన తెలిపారు. లోక్ సభలో ఈ బిల్లుపై చర్చించడానికి విపక్షాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ఎస్పీతో పాటు, బీఎస్పీ, లెఫ్ట్ పార్టీలు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలన్నీ భూసేకరణ సవరణ బిల్లును వ్యతిరేకించాయి. దీనిపై ఎస్పీ కొన్ని సూచనలు చేయడంతో ప్రభుత్వం సంప్రదింపులకు దిగింది.
అంతకుముందు రాజ్యసభలో కూడా భూసేకరణ ఆర్డినెన్స్ బిల్లుపై చర్చకు విపక్ష పార్టీలు నిరసన తెలిపాయి. ముఖ్యంగా రైతులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న భూసేకరణ బిల్లును తాము ఏమాత్రం ఆమోదించేది లేదని కాంగ్రెస్, జేడీయూ ఇతర విపక్షాలు ముక్త కంఠంగా తేల్చి చెప్పాయి. మంగళవారం రాజ్యసభలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవగానే స్పీకర్ హమీద్ అన్సారీ ప్రశ్నోత్తరాలను ప్రవేశపెట్టారు. అదే సమయంలో భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై చర్చను చేపట్టాలని ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసును ఆయన తిరస్కరించారు. దీంతో తక్షణమే బిల్లును వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.