ఒక్కతాటిపైకి విపక్షాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకురానున్న భూసేకరణ ఆర్డినెన్స్ బిల్లుపై తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. విపక్ష పార్టీలన్నీ ఒక్క తాటిపై ఉండటంతో భూసేకరణ సవరణ బిల్లు ఒక్క అడుగుకూడా ముందుకు కదల్లేదు. లోక్ సభలో ఈ బిల్లుపై చర్చించడానికి విపక్షాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. సమాజ్ వాదీ పార్టీతో పాటు, బీఎస్పీ, లెఫ్ట్ పార్టీలు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలన్నీ భూసేకరణ సవరణ బిల్లును వ్యతిరేకించాయి. తాము ఎట్టిపరిస్థితిల్లోనూ భూసేకరణ సవరణ బిల్లుకు అనుమతించేది లేదని స్పష్టం చేశాయి. ఈ బిల్లుతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని విపక్షాలు ఆందోళన చేపట్టాయి.
ఇదిలా ఉండగా రాజ్యసభలో ఇదే సీన్ రిపీట్ అయ్యింది. రైతులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న భూసేకరణ బిల్లును తాము ఏమాత్రం ఆమోదించేది లేదని కాంగ్రెస్, జేడీయూ ఇతర విపక్షాలు ముక్త కంఠంగా తేల్చి చెప్పాయి. మంగళవారం రాజ్యసభలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవగానే స్పీకర్ హమీద్ అన్సారీ ప్రశ్నోత్తరాలను ప్రవేశపెట్టారు. అదే సమయంలో భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై చర్చను చేపట్టాలని ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసును ఆయన తిరస్కరించారు. దీంతో తక్షణమే బిల్లును వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే దీనిపై లోక్ సభలో సమాజ్ వాదీ పార్టీ కొన్ని సూచనలు చేయడంతో ప్రభుత్వం ఆ పనిలో నిమగ్నమయ్యింది. విపక్ష పార్టీలతో సంప్రదింపులకు దిగిన ప్రభుత్వం ఈ బిల్లుపై ఉభయ సభల్లోనూ ఆమోదం పొందేందుకు తీవ్ర యత్నాలు చేస్తోంది.