సాక్షి, విజయవాడ: భూసేకరణ సవరణ బిల్లు ఆలోచనను చంద్రబాబు మానుకోవాలని భూహక్కుల పరిరక్షణ సమితి సూచించింది. రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న ఈ బిల్లును తాము ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని తేల్చి చెప్పింది. 2013 భూసేకరణ చట్టాన్ని సవరించవద్దని డిమాండ్ చేస్తూ భూ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారమిక్కడ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా పర్యావరణ వేత్త శ్రీమన్నారాయణ మాట్లాడుతూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీర్పు కారణంగా 25వేల ఎకరాల సాగుభూమిని కాపాడామని తెలిపారు. వరదప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని ఎన్జీటీ స్పష్టం చేసిందని చెప్పారు. ఏపీ రాజధాని అమరావతిలో ప్రస్తుతం నిర్మించిన సచివాలయం, అసెంబ్లీ కూడా వరద ప్రభావిత ప్రాంతంలోనే ఉన్నాయని తెలిపారు. స్టార్టప్ ఏరియాపైనా ఎన్జీటీ తీర్పు ప్రభావముందని శ్రీమన్నారాయణ తెలిపారు. కొండవీటి వాగు ప్రవాహాన్ని మార్చొద్దని ట్రిబ్యునల్ చెప్పిందని, ఈ విషయంలో ఏపీ సర్కారు భిన్నంగా వ్యవహరిస్తే మళ్లీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment