ఫుడ్ పార్కు ఏర్పాటుపై లోక్ సభలో దుమారం
కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నియోజకవర్గం అమేథీలో ఫుడ్ పార్కు ఏర్పాటు ఉపసంహరణపై లోక్ సభలో మంగళవారం దుమారం చెలరేగింది. దీంతో స్పీకర్ సభను రెండు సార్లు వాయిదావేశారు. ఇటు రాజ్యసభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యవహారం ఆందోళనలు వ్యక్తమయ్యాయి. సభను అదుపులోకి తెచ్చే క్రమంలో చైర్మన్ రాజ్యసభను ముడుసార్లు వాయిదావేశారు.
కాగా వివాదాస్పద భూ సేకరణ చట్టం సవరణ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. 30 మంది సభ్యులతో ఏర్పాటయిన ఈ కమిటీకి డార్జిలింగ్ బీజేపీ ఎంపీ ఎస్ ఎస్ అహ్లువాలియా నేతృత్వం వహిస్తారు. కమిటీ సభ్యుల్లో 20 మంది లోక్సభకు చెందినవారు కాగా, 10 మంది రాజ్యసభ సభ్యులు. కమిటీ ఏర్పాటును మంగళవారం లోక్సభ ఆమోదించింది. ఏఐడీఎంకే పార్టీ తప్ప మిగతా పక్షాలన్నీ అంగీకరించడంతో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు రాజ్యసభ సెలెక్షన్ కమిటీ ముందుకు వెళ్లనుంది.
గతంలో రూపొందించిన భూ సేకరణ బిల్లుకు ఎన్డీఏ చేసిన సవరణలు రైతులకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి అంగీకరించబోమని కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎన్డీఏకు అంతగా బలంలేని రాజ్యసభలో భూ బిల్లు వీగిపోవడంతో మరోసారి ఆర్డినెన్స్ తీసుకువచ్చిన ప్రభుత్వం ఎలాగైనా సరే బిల్లును ఆమోదింపజేయాలని పట్టుదలతో ఉంది. 15 లేదా 21 మంది సభ్యులతో కూడిన రాజ్యసభ సెలెక్షన్ కమిటీ జీఎస్టీ బిల్లును పరిశీలించనుంది.