Manipur Ruckus In Parliament: PM Modi Takes A Jibe At Opposition INDIA Alliance - Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌లో మణిపూర్‌ రచ్చ.. ప్రతిపక్షాలపై మోదీ సంచలన వ్యాఖ్యలు

Published Tue, Jul 25 2023 2:52 PM | Last Updated on Tue, Jul 25 2023 4:05 PM

Manipur Ruckus In Parliament: PM Jibe At INDIA Opposition Alliance - Sakshi

మణిపూర్‌ హింసాకాండతో పార్లమెంట్‌ దద్దరిల్లుతోంది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తక్షణమే స్పందించి, సమాధానం ఇవ్వాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ప్రతిపక్ష సభ్యుల నినాదాలు, ఆందోళనలు, నిరసనలతో ఉభయ సభలు స్తంభిస్తున్నాయి. అయితే మణిపూర్‌ ఘటనపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని చెప్పినా.. విపక్షాలు వెనక్కి తగ్గకపోగా మరింత తీవ్ర స్వరంతో నినాదాలు చేస్తున్నాయి. కాంగ్రెస్‌, ఆప్‌, టీఎంసీ సహా విపక్షాలు అన్నీ ఆందోళనకు దిగుతూ.. సభాకార్యకలాపాలను అడ్డుకుంటున్నాయి. 

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో వరుసగా నాలుగో రోజూ మంగళవారం సైతం ఇదే అంశంపై విపక్షాలు ఉభయ సభలను అడ్డుకున్నాయి. దీంతో ప్రతిపక్షాల తీరుపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మణిపూర్‌ ఘటనపై పార్లమెంట్‌లో విపక్షాలు సృష్టిస్తోన్న రాద్దాంతంపై ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ప్రధాని మోదీ సహా సీనియర్‌ నేతలంతా ఈ భేటీకి హాజరయ్యారు.
చదవండి: జేడీఎస్ భవిష్యత్‌పై పార్టీ అధినేత దేవె గౌడ కీలక వ్యాఖ్యలు..

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’పై విరుచుకుపడ్డారు. కేవలం ఇండియా అనే పేరు పెట్టుకున్నంత మాత్రాన సక్సెస్‌ కాలేరని విమర్శించారు. ఉగ్రవాద సంస్థ ‘ఇండియన్‌ ముజాహిద్దీన్‌’ లోనూ ఇండియా పేరు ఉందని, బ్రిటీష్‌ వారి ‘ఈస్ట్‌ ఇండియా కంపెనీ పేరుతో మనల్ని దోచుకున్నారని మండిపడ్డారు. దేశం పేరు చెప్పుకొని ప్రజలను తప్పుదోవ పట్టించలేరని దుయ్యబట్టారు. 
చదవండి: ఎన్డీయేపై సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం?

విపక్ష పార్టీలు దిశానిర్దేశం లేకుండా ఉన్నాయని మోదీ విమర్శించారు. ఇలాంటి ప్రతిపక్షాలను ఎప్పుడూ చూడలేదని అన్నారు. ప్రతిపక్షాల వైఖరి చూస్తుంటే ఎక్కువ కాలం అధికారంలో ఉండాలనే కోరిక లేదన్నట్లుగా కనిపిస్తోందని ఆరోపించారు. ఓడిపోయి, అల‌సిపోయి, ఆశ‌లేని పార్టీలుగా విప‌క్షాలు మిగిలిపోయిన‌ట్లుగా ఉందని ప్ర‌ధాని ఎద్దేవా చేశారు. కాగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని గద్దె దించాలన్న లక్ష్యంతో 26 ప్రధాన ప్రతిపక్షాలు కలిసి ‘ఇండియా’ పేరుతో కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే.

ఇక ప్రధానిమోదీ వ్యాఖ్యలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కౌంటర్‌ ఇచ్చారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. తాము పార్లమెంట్‌ సాక్షగా మణిపూర్‌ సమస్య గురించి మాట్లాడాలని కోరుతుంటూ.. ప్రధాని మాత్రం ఈస్ట్‌ ఇండియా కంపెనీ గురించి చెబుతున్నారని దుయ్యబట్టారు. పార్లమెంట్‌లో చాలా మంది ప్రతినిధులు నిబంధన 267 కింద నోటీసులు ఇస్తున్నారని, కాబట్టి పార్లమెంట్‌లో చర్చించాల్సిన ఇతర అంశాలను పక్కకుపెట్టి, మణిపుర్‌ ఘటనపై చర్చ జరగాలన్నారు. ఈ అంశంపై కేవలం అరగంట చర్చ సరిపోదు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement