హైదరాబాద్: కేంద్రం తీసుకొస్తున్న భూ సేకరణ చట్టం సవరణ బిల్లును లోక్‌సభలో వ్యతిరేకించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. ఆదివారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ ఎంపీలు బుట్టా రేణుక (కర్నూలు), వరప్రసాద్ (తిరుపతి), వైవీ సుబ్బారెడ్డి (ఒంగోలు), పొంగులేటి శ్రీనివాసరెడ్డి (ఖమ్మం) ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశం అనంతరం మేకపాటి వివరాలను వెల్లడిస్తూ.. భూసేకరణ బిల్లును సోమవారం లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతోందని, దీనిని తాము వ్యతిరేకించనున్నామని చెప్పారు.
గత చట్టంలో ఉన్న బహళ పంటలు పండే భూములకు మినహాయింపు, రైతుల నుంచి భూమి సేకరించడం వల్ల సమాజంపై పడే ప్రభావాన్ని అంచనా వేయడం తదితర క్లాజులను.. ప్రస్తుత సవరణ చట్టం నుంచి తొలగించడాన్ని తమ పార్టీ తొలినుంచీ వ్యతిరేకిస్తోందని, ఇపుడు కూడా అదే వైఖరిని అనుసరించాలని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తమకు చెప్పారని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే చట్టంలో ఈ రెండు క్లాజుల సవరణను తొలగిస్తే మంచిదని, లేనిపక్షంలో తామే వాటికి సంబంధించి సవరణలు ఇస్తామని, ఓటింగ్‌ను కూడా కోరతామని మేకపాటి వెల్లడించారు.
ప్రత్యేక హోదా కోసం కృషి
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామనే హామీని అమలుకు లోక్‌సభలో కృషి చేస్తామని మేకపాటి చెప్పారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఈ విషయాన్ని లేవనెత్తుతామన్నారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా పదేళ్లపాటు ఉండాలని బీజేపీ నేత వెంకయ్యనాయుడు కోరారని, ప్రస్తుతం కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కనుక వారు మాట నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదాకు సానుకూలంగానే ఉన్నారు కాబట్టి.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు.
అటు కేంద్రంలో టీడీపీకి చెందినవారు, ఇటు రాష్ట్రంలో బీజేపీకి చెందిన వారు మంత్రులుగా ఉన్నారు కనుక ప్రత్యేక హోదా సాధించాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఎక్కువగా ఉందని మేకపాటి అన్నారు. ప్రత్యేక హోదా ఉండటానికి, లేక పోవడానికి పెద్ద తేడా ఏమీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పడం సరికాదన్నారు. ఏపీ మాదిరిగానే పశ్చిమబెంగాల్, బిహార్‌కు ప్రత్యేక ఆర్థికసాయం చేస్తామని బడ్జెట్‌లో చెప్పారే గాని ఏపీకి ఎలా ఇస్తారో చెప్పలేదని అన్నారు. అస్సాంకు 1969 నుంచీ ప్రత్యేక హోదా ఉందని, దానిని ఇంకా కొనసాగించాలని ఇటీవలే అక్కడి అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపిందన్నారు. పోలవరానికి కేవలం రూ. వంద కోట్లు కేటాయించడం శోచనీయమన్నారు.
హైకోర్టు విభజనలో జాప్యం ఎందుకు?: పొంగులేటి
తెలంగాణ అభివృద్ధి కోసం లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ తరఫున పోరాడతామని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడం వల్ల తమ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. హైకోర్టును విభజించాలని ఎప్పటి నుంచో ప్రజా ప్రతినిధులు కోరుతున్నా జాప్యం ఎందు కు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలోని ప్రాణహిత-చేవెళ్ల బృహత్తర ప్రాజెక్టుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా కేంద్రం చిన్నచూపు చూసిం దని, దీనిని తాము లోక్‌సభలో ప్రశ్నిస్తామని ఆయన చెప్పారు. ఇవే కాదు, తెలంగాణ ప్రజల తరఫున ఎలాంటి పోరాటానికైనా తాము సంసిద్ధంగాఉన్నామని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.