
భూ బిల్లుపై రైతులతో జైట్లీ చర్చలు
రైతుల సూచనల నమోదుకు కమిటీ ఏర్పాటు
న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లుపై తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం.. వివిధ అంశాలపై రైతుల సందేహాలను పరిష్కరించేందుకు, వారి ఆందోళనలను పరిగణనలోకి తీసుకునేందుకు గురువారం వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు ప్రతినిధులతో చర్చలు జరిపింది. భూసేకరణ బిల్లులో ‘భూ యజమాని అంగీకారం’ నిబంధనను పునరుద్ధరించాలనే అంశంతో పాటు పలు డిమాండ్లు రైతుల నుంచి వచ్చాయి. సమాచార, ప్రసార శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ సమక్షంలో గంటసేపు ఈ సమావేశం జరిగింది. రైతుల సూచనలను కూడా చేర్చిన తర్వాతే ఈ అంశంపై ప్రభుత్వం ముందుకు వెళుతుందని, వారి ప్రయోజనాలను విస్మరించబోమని జైట్లీ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.
బీజేపీ కిసాన్ మోర్చా మాజీ నేత, దూరదర్శన్ కిసాన్ చానల్ సలహాదారు నరేశ్ సిరోహీ ఈ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఈ భేటీలో 30కి పైగా రైతు సంఘాల ప్రతినిధులు భూ సేకరణ బిల్లుపై తమ అభిప్రాయాలను వెల్లడించారని తెలిపారు. రైతుల సలహాలను నమోదు చేసి, నివేదిక అందించేందుకు ఐదారుగురు సభ్యులతో ఒక కమిటీని జైట్లీ ఏర్పాటు చేశారని.. ఈ కమిటీకి తాను సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నానని చెప్పారు. ఈ భేటీ సందర్భంగా వివిధ రైతు సంఘాలు జైట్లీకి వినతిపత్రాలు సమర్పించా యి. యూపీఏ ప్రభుత్వం 2013లో తెచ్చిన చట్టంపై ఎన్‌డీఏ సర్కారు తెచ్చిన భూసేకరణ బిల్లు ఒక జోక్ అని భారతీయ కిసాన్ యూనియన్ అభివర్ణించింది.
బిల్లుపై జేపీసీ తొలి భేటీ నేడు
ఇదిలావుంటే.. భూసేకరణ బిల్లును పరిశీలించే సం యుక్త పార్లమెంటరీ సంఘం తొలి సమావేశం శుక్రవారం జరగనుంది. బీజేపీ ఎంపీ ఎస్.ఎస్.అహ్లూవాలియా నేతృత్వంలో 30 మంది సభ్యులు గల ఈ సంఘం.. తన నివేదికను పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజున సమర్పిస్తుంది.