న్యూఢిల్లీ:పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై రెండు వారాలు కావొస్తున్నా.. సభా కార్యకలాపాలకు తీవ్ర విఘాతం ఏర్పడుతూనే ఉంది. గత కొన్ని రోజుల నుంచి ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ వ్యవహారం, వ్యాపం స్కామ్ లపై పార్లమెంట్ లో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే కీలకమైన భూసేకరణ బిల్లులోని మార్పులకు సంబంధించి బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ను ఇరుకున పెట్టే యోచనలో ఉన్నట్లు కనబడుతోంది. వివాద క్లాజులకు తొలగింపునకు సర్కారు సన్నద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం.
దీనిలో భాగంగానే కాంగ్రెస్ ఆమోదించిన క్లాజులపై మొగ్గు చూపేందుకు ప్రభుత్వం సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎలాంటి బిల్లులో ఎలాంటి మార్పులు చేపట్టకుండా.. గతంలో యూపీఏ అమలు చేసిన విధానాన్నే అవలంభించాలని కేంద్రం భావిస్తోంది. భూసేకరణ బిల్లులోని మార్పులపై వెనక్కి తగ్గి కాంగ్రెస్ ను ఇరుకున పెట్టాలని మోదీ వ్యూహంగా కనబడుతోంది.