కశ్మీర్ లో అమలు చేసే దమ్ముందా?
ముంబై: భూసేకరణ బిల్లుపై మొండిగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై శివసేన పార్టీ విరుచుకు పడింది. భూసేకరణ బిల్లును అమలు చేయడం జమ్మూకశ్మీర్ నుంచి ప్రారంభించాలని ఎన్డీఏ సర్కారుకు సవాల్ విసిరింది. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ బిల్లును కశ్మీర్ లో అమలు చేసే దమ్ముందా అని ప్రశ్నించింది.
అన్నదాతల ఆక్రందనలు పట్టించుకోకుండా వారి భూములు లాక్కుకోవడానికి సిద్ధమవుతున్న ఎన్డీఏ సర్కారు... ఆర్టికల్ 370 కారణంగా కశ్మీర్ లో మాత్రం తోక ముడిచిందని శివసేన పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో పేర్కొంది. జైతాపూర్ న్యూక్లియర్ విద్యుత్ ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్న కేంద్ర ప్రభుత్వం ఈ సాహసాన్ని కశ్మీర్ లో చేయగలదా అని నిలదీసింది. జమ్మూకశ్మీర్ దేశంలో అంతర్భాగమైనప్పటికీ మనదేశ చట్టాలు అక్కడ అమలు కావడం లేదని శివసేన వాపోయింది.