
'పార్టీలన్నీ మా ఉద్యమంలో పాలుపంచుకోవచ్చు'
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన భూసేకరణ ఆర్డినెన్స్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ప్రముఖ సామాజిక వేత్త అన్నా హజారే న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఉద్యమానికి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. అన్నా చేపట్టిన ఉద్యమానికి పలుపార్టీలు ఇప్పటికే మద్దతు ప్రకటించి ప్రభుత్వ తీరును ఎండగట్టడానికి సిద్ధమైయ్యాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం అన్నా తలపెట్టిన ఉద్యమానికి మద్దతు ప్రకటించాడు. దీంతో కేజ్రీవాల్ సీఎం పగ్గాలు చేపట్టిన అనంతరం కేంద్రానికి వ్యతిరేకంగా తలపెట్టిన తొలి నిరసన.
అయితే తాను ఎట్టిపరిస్థితిల్లోనూ దీక్షకు మాత్రం దిగనని హజారే స్పష్టం చేశారు. దేశ ప్రజలకు తన ప్రాణాలు ముఖ్యమని.. అందుచేత ఉద్యమాన్ని పాదయాత్ర రూపంలో తీవ్ర స్థాయికి తీసుకువెళతానని ప్రకటించారు. పార్టీలకతీతంగా తన ఉద్యమం ఉంటుందన్నారు. ఈ ఉద్యమంలో ఏ పార్టీ అయినా పాల్గొని తమకు మద్దతు తెలుపవచ్చన్నారు. మూడు-నాలుగు నెలలపాటు తన ఉద్యమాన్ని కొనసాగిస్తానని హజారే తెలిపారు.