న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లు నేడు (బుధవారం) రాజ్యసభ ముందుకు రానున్న నేపథ్యంలో ఆ బిల్లులో ప్రధాన విపక్షం సూచించిన పలు మార్పులకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. రాజ్యసభలో బీజేపీ మద్దతు కూడగట్టేందుకుగాను ఈ మేరకు బిల్లులో పలు క్లాజులను మార్చేందుకు కేంద్రం సమ్మతించింది. గతంలో జరిగిన భూసేకరణలకూ వర్తించేలా బిల్లులో పేర్కొన్న క్లాజులను సాగునీటి ప్రాజెక్టులకు జరిపిన భూసేకరణలకు వర్తింపచేయరాదంటూ బీజేపీ నేత అరుణ్ జైట్లీ సూచన చేయగా.. ఆ మేరకు మార్పులు చేసేందుకు గ్రామీణాభివృద్ధి మంత్రి జైరాం రమేశ్ అంగీకరించినట్లు సమాచారం. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణలో భూమిని కోల్పోయే రైతులకు నష్టపరిహారం గానీ లేదా పునరావాస కల్పనగానీ ఏదో ఒకటి మాత్రమే ఇచ్చేలా ప్రత్యేకంగా పేర్కొనాలన్న దానికి కేంద్రం, బీజేపీ రెండూ ఏకాభిప్రాయంతో ఉన్నాయి. కాగా భూసేకరణ బిల్లు ఇటీవలే లోక్‌సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.