
రైతు హక్కులపై తొలి దెబ్బ
* భూసేకరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
* మూజువాణి ఓటుతో గట్టెక్కిన ప్రభుత్వం
* ఓటింగ్‌కు శివసేన దూరం; కాంగ్రెస్ సహా విపక్షం వాకౌట్
* వ్యతిరేకంగా ఓటేసిన వైఎస్సార్‌సీపీ
* 9 సవరణలు ప్రతిపాదించిన ప్రభుత్వం
* భూయజమాని ఆమోదం, సామాజిక ప్రభావ అంచనా,
* బహుళ పంటల భూముల సేకరణపై నిషేధం జోలికి వెళ్లని వైనం
* వాటిపై సవరణలకు విపక్షం పట్టు; పట్టించుకోని సర్కారు
భూ సేకరణ బిల్లును మంగళవారం లోక్‌సభ ఆమోదించింది. కీలకాంశాల జోలికి వెళ్లకుండా మొక్కుబడిగా 9 సాధారణ సవరణలతో బిల్లును తెచ్చిన ప్రభుత్వం మూజువాణి ఓటుతో దాన్ని గట్టెక్కించింది. మిత్రపక్షం శివసేన ఓటింగ్‌కు దూరంగా ఉండటం విశేషం. ఓటింగ్ సమయంలో కాంగ్రెస్ సహా విపక్షం సభ నుంచి వాకౌట్ చేయగా.. వైఎస్సార్సీపీ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసింది. బహుళ పంటల భూముల సేకరణ, సామాజిక ప్రభావ అంచనా అంశాలకు సంబంధించి వైఎస్సార్సీపీ ప్రతిపాదించిన సవరణ సహా విపక్షాలు ముందుకు తెచ్చిన 52 సవరణలు వీగిపోయాయి. అయితే విపక్షం ఆధిక్యత స్పష్టంగా ఉన్న రాజ్యసభలో కేంద్రానికి అసలు పరీక్ష ఎదురుకానుంది.
న్యూఢిల్లీ: నమ్ముకున్న భూమిపై అన్నదాతలకున్న హక్కును తొలగించే దిశగా మోదీ సర్కారు తొలి అడుగు వేసింది. భూసేకరణ బిల్లును లోక్‌సభ గడప దాటించింది. విపక్షాల నిరసనలు, వాకౌట్ల మధ్య మూజువాణి ఓటుతో ‘సముచిత పరిహారం, పారదర్శకతలతో భూసేకరణ, పునరావాస(సవరణ) బిల్లు-2015’ మంగళవారం దిగువ సభ ఆమోదం పొందింది. ఎన్డీఏ మిత్రపక్షాలు, విపక్షాల, వ్యవసాయ సంఘాల సూచనలను పరిగణనలోకి తీసుకున్నామంటూ.. బిల్లులో 9 అధికారిక సవరణలను ప్రతిపాదించిన ప్రభుత్వం.. వాటిలో భూ యజమానుల ఆమోదం, సామాజిక ప్రభావ అంచనా, బహుళ పంటలు పండే భూముల సేకరణపై నిషేధం.. తదితర రైతు అనుకూల అంశాల జోలికి మాత్రం వెళ్లలేదు.
ఓటింగ్‌కు మిత్రపక్షం శివసేన దూరంగా ఉండగా.. విపక్ష పార్టీలు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, ఆర్జేడీ, బీజేడీలు వాకౌట్ చేశాయి. వైఎస్సార్‌సీపీ వ్యతిరేకంగా ఓటేసింది. ఎన్డీఏ మిత్రపక్షం స్వాభిమానిపక్ష సూచించిన సవరణతో పాటు విపక్షాలు ప్రవేశపెట్టిన 52 సవరణలు వీగిపోయాయి. మెజారిటీ ఉన్న లోక్‌సభలో సులభంగానే గట్టెక్కిన ఎన్డీఏ ప్రభుత్వానికి విపక్షం ఆధిక్యత ఉన్న రాజ్యసభలో అసలు పరీక్ష ఎదురుకానుంది.
రైతు ప్రయోజనాలే పరమావధిగా..
బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చకు గ్రామీణాభివృద్ధి మంత్రి చౌధరి బీరేందర్‌సింగ్ సమాధానమిచ్చారు. ప్రతిపక్షాలు సూచించిన అనేక సవరణలను బిల్లులో పొందుపర్చామని, రైతుల ప్రయోజనాలను కాపాడటం కోసం విపక్షం మరిన్ని సూచనలిచ్చినా స్వాగతిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రైతు ప్రగతికి కృషి చేయని కాంగ్రెస్‌లా కాకుండా.. వారి అభివృద్ధికి, వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాటలువేసేలా ఈ బిల్లు రూపొందించామన్నారు. రైతుల ఆమోదం, సామాజిక ప్రభావ అంచనాలపై విపక్ష సభ్యులు సవరణలను ప్రతిపాదిస్తున్న సమయంలో.. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ లేచి వివరణ ఇచ్చారు.
సామాజిక ప్రభావ అంచనాపై రాష్ట్రాలకు విశిష్టాధికారం ఉంటుందన్నారు. అలాగే, బహుళ పంటలు పండే సారవంత భూములను సేకరించబోమని హరియాణాకు చెందిన కాంగ్రెస్ సభ్యుడు భూపేందర్ హూడాకు చెప్పారు. ఐదేళ్లలో ప్రాజెక్టు పూర్తవాలన్న నిబంధనను తొలగించడంపై స్పందిస్తూ.. కోర్టుకేసుల వల్ల ఎక్కువ జాప్యం జరుగుతోందన్నారు. అయితే, కోర్టు కేసులకైన సమయాన్ని మినహాయించి, మిగతా సమయాన్ని పరిగణనలోకి తీసుకుని, ఆ సమయంలోపల ప్రాజెక్టు పూర్తికాకపోతే సంబంధిత భూములను రైతులకు వెనక్కు ఇచ్చే ప్రతిపాదన బిల్లులో ఉందన్నారు.
కార్పొరేట్ల బిల్లు ఇది.. బిల్లుపై చర్చ సందర్భంగా ప్రభుత్వ తీరును విపక్షాలు తీవ్రంగా ఆక్షేపించాయి. రైతుల ఆమోదమనే కీలక నిబంధన లేకపోవడంపై అభ్యంతరం తెలిపాయి. కార్పొరేట్ సంస్థల కోసం రూపొందించిన బిల్లుని విమర్శించాయి. ‘తమ ఆమోదం, సామాజిక ప్రభావ అంచనా అధ్యయనం కావాలని రైతులు కోరుతున్నారు. కార్పొరేట్ సంస్థల మాట మాత్రమే వింటారా? ఇంతకన్నా సిగ్గుచేటు లేదు’ అంటూ కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ అన్నారు. రైతులను ప్రత్యర్థులుగా చూడొద్దని, మనకు ఆహార భద్రత కల్పిస్తోంది వారేనని ప్రభుత్వానికి హితవు పలికారు. ఈ బిల్లు వల్ల ప్రతిపక్షమంతా ఏకమైందంటూ తృణమూల్ సభ్యుడు దినేశ్ ద్వివేదీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఐఎన్‌ఎల్‌డీ, జేఎంఎం సభ్యులు బిల్లును స్థాయీ సంఘానికి పంపించాలని డిమాండ్ చేశారు. అప్నాదళ్ ఎంపీ అనుప్రియ మాట్లాడుతూ.. మున్సిపల్ కార్పొరేషన్లు, ఇతర సంస్థల వద్ద ఉన్న అదనపు భూమిని పరిశ్రమల ఏర్పాటుకు వాడే విషయంపై దృష్టి పెట్టాలన్నారు. భూమి కోల్పోయిన రైతులకు ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కల్పించాలన్నారు.
మద్దతు కోసం.. బిల్లుపై ఎన్డీఏ మిత్రపక్షాల నుంచి కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. ఆ పార్టీల ప్రతినిధులతో మంత్రులు వెంకయ్య,జైట్లీ, బీరేందర్ భేటీ అయ్యారు. బిల్లులో తేదలచిన సవరణలను వారికి వివరించారు.
‘వారికి రాజకీయమే ముఖ్యం’
పార్లమెంటులో కొన్ని పార్టీలకు దేశ ప్రయోజనాలు, అభివృద్ధి కంటే రాజకీయమే ఎక్కువైంది. అభివృద్ధి ఫలాలు రైతులకు అందకుండా అడ్డుకుంటున్నారు. సమాఖ్య స్ఫూర్తితో అందరితో మాట్లాడే సవరణలు తెచ్చాం. విపక్షాల డిమాండ్ మేరకు అధికారికంగా ఈ బిల్లుకు సవరణలు చేశాం’
- వెంకయ్య నాయుడు
వైఎస్సార్‌సీపీ సవరణ
భూ సేకరణలో బహుళ పంటలు పండే సారవంత భూములను సేకరించకూడదని, సామాజిక ప్రభావ అంచనా అధ్యయనం తప్పనిసరిగా ఉండాలని పేర్కొంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఒక సవరణను ప్రతిపాదించారు. దీనిపై ఓటింగ్ జరగ్గా.. అనుకూలంగా 101 మంది, వ్యతిరేకంగా 311 మంది ఓటేయడంతో ఆ సవరణ వీగిపోయింది. 18 మంది సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు
- పారిశ్రామిక కారిడార్లలో రహదారులు, రైల్వే లైన్లకు ఇరువైపులా భూ సేకరణను కిలోమీటరు వరకే పరిమితం చేయడం.
- భూసేకరణ ప్రభావం పడిన రైతు కూలీల కుటుంబంలో కనీసం ఒక్కరికి ఉద్యోగం కల్పించడం.
- జిల్లాస్థాయిలో ఫిర్యాదుల పరిష్కారం.
- అవసరమైనంత మేరకే భూ సేకరణ(కనిష్ట భూసేకరణ).
- సామాజిక మౌలిక వసతుల ప్రాజెక్టులకిచ్చిన మినహాయింపు తొలగింపు (మినహాయింపు నిబంధనతో ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు కాలేజీలు, ఆస్పత్రులను ఏర్పాటు చేస్తారన్న భయాల నేపథ్యంలో)
యూపీఏ ప్రభుత్వ భూసేకరణ చట్టం
- భూ సేకరణకు కనీసం 70% మంది భూ యజమానుల ఆమోదం తప్పని సరి
- సారవంతమైన, ఏడాదికి ముక్కారు పంటలు పండే భూములను సేకరించరాదు
- ఆ ప్రాజెక్టుకు సంబంధించి సామాజిక
ప్రభావ అంచనా అధ్యయనాన్ని తప్పని సరిగా చేపట్టాలి.