న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లుకు తెచ్చిన సవరణలకు ప్రస్తుత రూపంలో తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదని ఎన్‌డీఏ భాగస్వామ్యపక్షమైన శివసేన మంగళవారం స్పష్టం చేసింది. రైతు ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే ఏ చట్టాన్నీ శివసేన సమర్థించబోదని ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంతో నమ్మకంతో రైతులు బీజేపీకి ఓటేసి అధికారంలోకి తెచ్చారని, వారి గొంతునులిమే పాపానికి ఒడిగట్టవద్దని ఉద్ధవ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
రాజ్యసభలో శివసేనపక్ష నేత సంజయ్ రౌత్ ఈ ప్రకటనను విడుదల చేశారు. పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి శివసేన వ్యతిరేకం కాదని, అయితే బలవంతంగా రైతుల నుంచి భూములు లాగేసుకొని అభివృద్ధి సాధించాలనుకోవడం సరికాదని థాకరే అభిప్రాయపడ్డారు. ఎన్‌డీఏలో బీజేపీ తర్వాత రెండో పెద్ద పార్టీ శివసేనయే. ఈ పార్టీకి లోక్‌సభలో 18 మంది, రాజ్యసభలో ముగ్గురు ఎంపీల మద్దతుంది. ఉభయసభల సంయుక్త సమావేశంపై ఆశలు పెట్టుకున్న బీజేపీకి శివసేన వైఖరి శరాఘాతమే. ఎందుకంటే శివసేన మద్దతు లేకపోతే సంయుక్త సమావేశంలో కూడా మెజారిటీ సాధించడం కేంద్రానికి కష్టమే.
ఆమోదయోగ్యం కాదు: శివసేన
Published Wed, Feb 25 2015 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM
Advertisement
Advertisement