మూడోసారి భూ ఆర్డినెన్స్ | NDA Cabinet re-promulgates land Ordinance | Sakshi
Sakshi News home page

మూడోసారి భూ ఆర్డినెన్స్

Published Sun, May 31 2015 2:01 AM | Last Updated on Sun, Sep 3 2017 2:57 AM

మూడోసారి భూ ఆర్డినెన్స్

మూడోసారి భూ ఆర్డినెన్స్

జారీ చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: ‘భూ’ బిల్లుపై కేంద్రం పట్టు వదలటం లేదు. విపక్షాలు, రైతు సంఘాలు, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా, రాజ్యసభలో సరైన సంఖ్యాబలం లేకపోయినా, భూసేకరణ బిల్లు విషయంలో ఎన్డీఏ సర్కారు వెనక్కి తగ్గటం లేదు. ఇప్పటికే రెండు సార్లు తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను మూడోసారి జారీ చేయాలని నిర్ణయించింది. గత మార్చి నెలలో రెండోసారి జారీ చేసిన భూ ఆర్డినెన్స్ గడువు జూన్ మూడో తేదీతో ముగియనుండటంతో తిరిగి జారీ చేసేందుకు శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి సంతకం చేస్తే..

గత ఏడాది కాలంలో కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ల సంఖ్య 13కు చేరుకుంటుంది. 2013 భూసేకరణ చట్టానికి ప్రతిపాదించిన సవరణల్లో 13 కేంద్ర చట్టాలను చేర్చటం ద్వారా రైతులకు కొన్ని ప్రధాన ప్రాజెక్టులలో పరిహారం లభించేలా చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని కేబినెట్ సమావేశానంతరం కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ విలేకరులకు తెలిపారు. ఆర్డినెన్స్‌ను తిరిగి జారీ చేయకపోతే.. రైతులకు పరిహారం చెల్లించటానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి పద్ధతంటూ ఉండదని అన్నారు.

2013 నాటి భూసేకరణ చట్టానికి డిసెంబర్ 29న మోదీ సర్కారు తొలి ఆర్డినెన్స్ జారీ చేసింది. 10 అధికారిక సవరణలతో లోక్‌సభ ఆమోదం పొందినప్పటికీ, సంఖ్యాబలం లేని కారణంగా రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టడానికి కూడా సాహసించలేకపోయింది. బడ్జెట్ తొలి దశ సమావేశాలు ముగిసిన తరువాత రెండోసారి ఆర్డినెన్స్‌ను జారీ చేశారు. మలిదశ సమావేశాల్లోనూ బిల్లుకు మోక్షం లభించకపోవటంతో 30 మంది సభ్యులతో సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాల్సి వచ్చింది.
 
బంగ్లాతో ఒప్పందాలకు ఓకే.. జూన్ తొలివారంలో బంగ్లాదేశ్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఆ దేశంతో కుదుర్చుకోనున్న రెండు ఒప్పందాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇరుదేశాల మధ్య మానవ అక్రమ రవాణా నిరోధక ఒప్పందంతో పాటు, జల రవాణా ఒప్పందానికి కేంద్రం అంగీకరించింది. దీంతో పాటు గుజరాత్, మహారాష్ట్రల్లోని పారిశ్రామిక వాడల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 4,318 కోట్ల నిధుల కేటాయింపునకు కేంద్ర ఆమోదం లభించింది. అంతేకాకుండా, స్వీడన్‌తో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగంలో పరస్పర సహకార ఒప్పందానికీ కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
 
హెచ్‌ఆర్‌ఏ నగరాల స్థాయిల్లో మార్పులు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఇంటి అద్దె, రవాణా అలవెన్స్‌లకు సంబంధించి 2011 జనాభా లెక్కల ప్రకారం నగరాలు, పట్టణాలను అప్‌గ్రేడ్ చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు ను ‘జెడ్’ తరగతి నుంచి ‘వై’ తరగతికి అప్‌గ్రేడ్ చేశారు. ఇక నుంచి నెల్లూరులోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘వై’ తరగతి కింద ఇంటి అద్దె అలవెన్స్‌లు అందనున్నాయి. 2011 జనాభా లెక్కలను అనుసరించి అహ్మదాబాద్, పుణేలను ‘వై’ తరగతి నుంచి ‘ఎక్స్’ తరగతికి, 21 పట్టణాలను ‘జెడ్’ తరగతి నుంచి ‘వై’ తరగతికి అప్‌గ్రేడ్ చేస్తూ  కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పట్టణ, నగరాల అప్‌గ్రేడ్ 1.04.2014 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది.
 
ఘనంగా అంబేడ్కర్ 125వ జయంతి
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి వేడుకలకు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం ప్రధాని మోదీ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ కమిటీలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్యనాయుడు తదితరులు సభ్యులుగా ఉంటారు. కేంద్ర సామాజిక న్యాయ శాఖ 16 కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కేబినెట్‌కు నోట్ సమర్పించింది. ఇందులో ప్రధానంగా 15, జన్‌పథ్‌లో రూ. 197 కోట్లతో అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రం ఏర్పాటు ఒకటి. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement