ఎగువ సభలు, పౌర సమాజం - ఆవశ్యకత | upper house of parliament civil society | Sakshi
Sakshi News home page

ఎగువ సభలు, పౌర సమాజం - ఆవశ్యకత

Published Wed, Jun 17 2015 11:55 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

ఎగువ సభలు, పౌర సమాజం - ఆవశ్యకత - Sakshi

ఎగువ సభలు, పౌర సమాజం - ఆవశ్యకత

 ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాల్లో ఎగువ సభ ఏర్పాటు, రద్దు విషయంపై.. రాష్ట్రాలకు లేఖ రాస్తూ  అభిప్రాయాలను కోరారు. ఎగువ సభల ఏర్పాటు, రద్దు రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణపై ఆధారపడడం, దేశవ్యాప్తంగా  ఏకరూపత లేకపోవడం లాంటి తదితర అంశాలపై ప్రధాన మంత్రి చొరవ ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే భూసేకరణ బిల్లును రాజ్యసభలో అడ్డుకునేందుకు ప్రతిపక్షం ప్రయత్నాలు చేసింది. దీనిపై కేంద్ర మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేయడం, దానిపై ప్రతిపక్షాలు ప్రతిదాడికి దిగడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.
 
 ఈ నేపథ్యంలో ఎగువసభల ఆవశ్యకత, రాజకీయ గతిశీలత తదితర అంశాలను విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో శాసన వ్యవస్థకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. చట్టాలను రూపొందించడం, ప్రజా పాలనపై పర్యవేక్షణ చేయడం, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడడం, కార్యవర్గం జవాబుదారీతో పనిచేసేలా నియంత్రించడం, ప్రజాసమస్యల పరిష్కారానికి, ప్రజాభిప్రాయానికి వేదికగా పనిచేయడం మొదలైన అధికార విధులను శాసనసభ నిర్వహిస్తుంది.
 
 ఏక సభ - ద్విసభ పద్ధతులు
 ప్రస్తుతం చాలా దేశాల్లో చట్ట సభల్లో ద్వి సభా విధానం అమల్లో ఉంది. అంటే ఎగువ, దిగువ సభలనే రెండు సభలు ఉన్నాయి. సాధారణంగా ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్న సభ్యులతో కూడిన సభను దిగువ సభని, పరోక్ష పద్ధతిలో నిర్దిష్ట ఓటర్లు ఎన్నుకున్న సభ్యులతో కూడిన సభను.. ఎగువ సభగా పేర్కొంటారు. భారతదేశంలో పార్లమెంటులో దిగువ సభను లోక్‌సభగా, ఎగువ సభను రాజ్యసభగా వ్యవహరిస్తున్నారు. అలాగే కొన్ని రాష్ట్రాల్లో రెండు సభల విధానం ఉంది. అక్కడ శాసన సభలో ఉన్న దిగువ సభను విధాన సభగా, ఎగువ సభను విధాన పరిషత్తు లేదా విధాన మండలి లేదా శాసనమండలిగా పిలుస్తారు. ఇంగ్లాండ్‌లో దిగువ సభను హౌస్ ఆఫ్ కామన్స్‌గా, ఎగువ సభను హౌస్ ఆఫ్ లార్డ్స్‌గా వ్యవహరిస్తారు. అలాగే అమెరికాలో దిగువ సభను హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌గా, ఎగువ సభను సెనేట్‌గా పేర్కొంటారు.
 
 ఎగువ సభ ఆవశ్యకత
 సాధారణంగా సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థల్లో కేంద్ర స్థాయిలో ఎగువ సభ తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ఎగువ సభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించి రాష్ట్రాల ప్రత్యేక ప్రయోజనాలను పరి రక్షించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దిగువ సభ నియంతృత్వ పోకడను కట్టడి చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్న దిగువ సభల్లో మేధావులు, ఇతర వర్గాలకు ప్రాతినిధ్యం ఉండకపోవచ్చు. అలాంటి వారికి ప్రాతినిధ్యం కల్పించే మరో సభ ఆవశ్యకత ఉంటుంది. రెండో సభలో మేధావులకు చోటు కల్పించి చట్టాల రూపకల్పనలో వారికి భాగస్వామ్యం ఇవ్వడం సాధ్యపడుతుంది. మారుతున్న భారతదేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చట్ట సభల్లో మైనారిటీలకు, అణగారిన వర్గాలకు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించాల్సి ఉంటుంది. రిజర్వేషన్ పద్ధతి ద్వారా ప్రాతినిధ్యం కల్పించినప్పటికీ అది పూర్తి స్థాయిలో ఉండకపోవచ్చు. ద్వి సభా పద్ధతిలో ప్రజాభిప్రాయ వ్యక్తీకరణకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాగే ఎగువసభ శాశ్వత సభగా ఉండడం వల్ల శాసన ప్రక్రియలో నిరంతరత ఉంటుంది. చట్ట సామర్థ్యం పెరుగుతుంది.
 
 ఎగువ సభల పనితీరు
 
 స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 1980 వరకు ఎగువ సభలు క్రియాశీలకంగా పనిచేసిన దాఖలాలు లేవు. మొత్తం శాసన వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ ఏక ఛత్రాధిపత్యంలో ఉండడంతో అది ‘‘కాంగ్రెస్ సిస్టం’’లో పని చేసింది. కానీ ఒక బలమైన శాసన సభగా పనిచేయలేదు. 1980 వరకు బలమైన ప్రతి పక్షం లేకపోవడం కూడా దీనికి కారణమని చెప్ప వచ్చు. అయితే 1990లలో పౌర సమాజంలో వచ్చిన నూతన సామాజిక ఉద్యమాల నుంచి పుట్టిన ప్రాంతీయ పార్టీలతో కేంద్రంలో సంకీర్ణ రాజకీయాలకు దారితీసింది. దీంతో ఎగువ సభ సామాజికంగా, ప్రాతినిధ్య పరంగా కొత్తరూపం సంతరించుకుంది. అంతకుముందున్న పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడంతో ఎగువ సభల్లో ఆయా పార్టీలకు ప్రాతినిధ్యం పెరిగింది. అయితే మారుతున్న కాలానికి, పరిస్థితులకు అనుగుణంగా ఎగువ సభ నిర్మాణం, స్వభావం మారడం లేదు.
 
 ఎగువ సభ-దిగువ సభ క్రీనీడేనా?
 సాధారణంగా ఎగువ సభ మేధావులకు, నిపుణులకు, సమాజంలోని విభిన్న వర్గాలకు, పెద్దలకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. అందుకే దీన్ని పెద్దల సభ అంటారు. కానీ గత మూడు దశాబ్దాల ఎగువ సభ సభ్యుల వయసును, అనుభవాన్ని పరిశీలిస్తే ఆ స్వభావం కానరావడం లేదన్నది స్పష్టమవుతుంది. మొత్తం లోక్‌సభ సభ్యుల సరాసరి వయసు మొత్తం రాజ్యసభ సభ్యుల సరాసరి వయసుకు సమానంగా ఉంటుంది.దిగువ సభ సభ్యులు ఏ రాజకీయ నేపథ్యంలో ఎన్నికవుతున్నారో అదే పద్ధతి ఎగువ సభల్లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. దిగువ సభకు పోటీ చేసి ఓడిపోయిన వారిని లేదా ప్రత్యక్షంగా ఎన్నిక కాలేక పోయినవారిని, ఇతర రాజకీయ అవసరాల కోసం పరోక్షంగా ఎగువ సభకు పంపుతున్నారు.
 
 అందువల్ల ఎగువ సభలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయనే అపవాదు ఉంది. ఎగువ సభలో చర్చలు లోతుగా, విశ్లేషణాత్మకంగా, మేధోపరంగా జరగాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. దిగువ సభలు చేసే అనవసర హడావుడి, అర్ధరహిత వాద ప్రతి వాదనలకు, విమర్శ, ప్రతివిమర్శలకు వేదికగా మారింది. సభా కార్యక్రమాలకు అడ్డు తగలడం, అసందర్భ వ్యాఖ్యలు, అనవసర ఆర్భాటాలు, బాధ్యతా రాహిత్య వాకౌట్లు, తిట్ల పురాణాలు మొదలైన పరిణామాలే ఎగువ సభలో చోటు చేసుకుంటున్నాయి.
 
 విధాన మండలి-అధికార పార్టీ అభీష్ట మండలి
 రాష్ట్రాల్లో ఎగువ సభ ఏర్పాటు పూర్తిగా ఆ రాష్ట్ర ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. అందుకే మండలి ఏర్పాటు, రద్దు.. కేవలం రాజకీయ అవసరంగా మారిపోయింది. ఆయా రాజకీయ పార్టీలు ప్రత్యేక ప్రయోజనాలను ఆశించి వాటిని ఏర్పాటు, రద్దు చేయడం జరుగుతుంది. ఒక జాతీయ విధానమనేదే లేదు. ప్రజా అవసరాలు, ప్రయోజనాలు పట్టవు. ఆంధ్రప్రదేశ్‌లో 1958లో విధాన మండలిని ఏర్పాటు చేశారు. కానీ 1985లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని రద్దు చేసింది. కేవలం ఆ రోజు తెలుగుదేశం పార్టీకి విధాన మండలిలో మెజారిటీ లేకపోవడం వల్లే దాన్ని రద్దు చేశారన్న విమర్శ ఉంది. 2007లో కాంగ్రెస్ పార్టీ తిరిగి స్వీయ రాజకీయ కారణాలతో శాసన మండలిని పునఃస్థాపితం చేసింది. దీని ద్వారా స్పష్టంగా రాజకీయ పార్టీలు శాసనమండలిని ప్రజా ప్రాతినిధ్యం, ప్రజా అవసరాలు అనే దృష్టి కోణంతో చూడడం లేదని అవగత మవుతోంది.
 
 సమకాలీన ప్రాముఖ్యత లోపం
 శాసన మండలిలోని సభ్యులు "functional representation’’ ప్రకారం ఐదు ప్రధానమైన నియోజక వర్గాలు ప్రాతినిధ్యం వహిస్తాయి. మొత్తం సభ్యుల్లో 1/3వ వంతు మందిని శాసన సభ్యులు ఎన్నుకుంటారు. మరో 1/3వ వంతు మందిని స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకుంటారు. 1/12 వంతు మంది సభ్యులను ఉపాధ్యాయులు ఎన్నుకుంటే.. మరో 1/12 వంతు సభ్యులను పట్టభద్రులు ఎన్నుకుంటారు. మిగిలిన 1/6వ వంతు మంది సభ్యులను వివిధ వర్గాలకు చెందిన నిష్ణాతులను గవర్నర్ నామినేట్ చేస్తారు.కానీ ప్రస్తుతం స్థానిక సంస్థల ప్రతినిధులు మినహా, ఉపాధ్యాయులు, పట్టభద్రులు, ఎంఎల్‌ఏల నియోజకవర్గాలు అప్రధానంగా మారాయి. దిగువ సభలోని చాలా మంది పట్టభద్రులు, అలాగే ఉపాధ్యాయులుగా పనిచేసిన వారు ఉన్నారు. అలాంటప్పుడు ప్రత్యేకంగా పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం కల్పించడంలో సమకాలీన ఔచిత్యం లేదు.
 
 పౌర సమాజ ప్రాతినిధ్యం పెరగాలి
 స్వతంత్రం వచ్చిన తొలి మూడు దశాబ్దాలు ప్రభుత్వాలు ఏక పక్షంగా ఉండేవి. సంపన్న, కుల ఆధిపత్య ధోరణిలో రాజకీయాలు సాగేవి. వాటిలో కింది శ్రేణులకు ప్రాతినిధ్యం అనే అంశం లేదు. అయితే 1980 తర్వాత సమాజంలో చైతన్యం, అస్థిత్వ స్థూల మార్పులు వచ్చాయి. అస్థిత్వ సామాజిక ఉద్యమంలో పుట్టుకొచ్చిన శక్తులైన దళిత, స్త్రీ, ఆదివాసీ, మైనారిటీలకు కొంతవరకు స్థానం లభించింది. తద్వారా రాజకీయాల్లో అనేక స్థూల మార్పులు వచ్చాయి.
 
 
 పెద్ద దిక్కుగా నిలవాలి
 రాజకీయాల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా శాసన మండలి నిర్మాణంలో మార్పులు అనివార్యం. ఇప్పటి వరకు ఉన్న నియోజక వర్గాలను తొలగించి అస్థిత్వ ఉద్యమాల నుంచి వచ్చిన దళిత, స్త్రీ, ఆదివాసీ, మైనారిటీలకు ప్రాతినిధ్యం వహించేలా నిర్మాణం చేయాల్సి ఉంది. రాజ్యాంగ నిర్మాతల ఆశయం నెరవేరాలంటే తక్షణమే శాసన మండళ్ల నిర్మాణం మార్చాల్సి ఉంటుంది. వాటికి సమకాలీన అస్థిత్వాన్ని గుర్తించాలంటే సవరణలు అనివార్యం. ఎగువ సభ పౌర సమాజంలోని శక్తులకు ప్రాతినిధ్యం వహించేలా ఉండాలి. రాజకీయ అవసరాలను తీర్చేలా ఉండకూడదు. పెద్దల సభ పరిపాలన దిశ-దశలను మార్చే పెద్ద దిక్కుగా నిలవాలంటే ఆదర్శ రాజకీయ స్ఫూర్తిని కొన సాగించాల్సిన ఆవశ్యకత ఎంతో అవసరం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement