రాబోయే కాలానికీ... రక్ష నీవే! | Dileep Reddy writes opinion on Triple talaq Supreme verdict | Sakshi
Sakshi News home page

రాబోయే కాలానికీ... రక్ష నీవే!

Published Fri, Aug 25 2017 1:55 AM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM

రాబోయే కాలానికీ... రక్ష నీవే! - Sakshi

రాబోయే కాలానికీ... రక్ష నీవే!

సమకాలీనం
చట్టాలకూ, రాజ్యాంగానికీ వ్యతిరేకంగా వ్యక్తులు గానీ, రాజ్యం గానీ దాష్టీకాలకు దిగిన ప్పుడు ఎదిరించి తమను తాము రక్షించు కోవడం ఈ వ్యవస్థలో చాలా తక్కువ మందికే సాధ్యం! దేశంలోని అత్య ధికులకు ప్రభుత్వాలు కల్పించే రక్షణ చర్యలు, చట్టాలు, రాజ్యాంగం, న్యాయ స్థానాల అండ అవసరమయ్యే పరిస్థితులే నేటికీ ఈ దేశంలో నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా పౌరులందరి నిత్య జీవితాల్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా శాసిస్తున్న రాజకీయ వ్యవస్థను క్రమబద్ధీకరించాల్సి ఉందని ప్రతి పౌరుడూ భావిస్తున్న తరుణమిది!

భారత అత్యున్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు 48 గంటల వ్యవధిలో రెండు విప్లవాత్మకమైన తీర్పులను వెల్లడించి రాజ్యాంగాన్ని ఈ దేశపు సగటు మనిషికి మరింత చేరువ చేసింది. స్ఫూర్తిదాయకమైన మన రాజ్యాంగం పట్ల మరింత విశ్వసనీయతను పెంచింది. మూడుమార్లు ‘తలాక్‌’ అంటే విడాకు లిచ్చేసినట్టేనన్న ఆటవిక నీతి ఇక చెల్లదంది. వ్యక్తిగత గోప్యత పౌరుల ప్రాథ మిక హక్కేనని నిర్ద్వంద్వంగా తేల్చింది.

రాజ్యాంగం కల్పించిన హక్కుల ఉల్లంఘన ఏ రూపంలో జరిగినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. సంప్ర దాయ ఆచరణలు, సంక్షేమ అవసరాల వంకతో ప్రాథమిక హక్కులకు జరిపే ఏ వక్రీకరణలనూ, అనుచిత భాష్యాలనూ అనుమతించేది లేదని తన చరి త్రాత్మక తీర్పులతో ధృవీకరించింది. ఇదే చొరవ... ఎన్నికల సంస్కరణలు, ముఖ్యంగా ప్రజాప్రాతినిధ్య (పీఆర్‌) చట్టం, ఫిరాయింపుల నిరోధక చట్టం స్ఫూర్తిని అమలుపరచడంలో చూపాలని యావద్భారతావని కోరుకుం టోంది. నిన్నటికి నిన్న నంద్యాలలో జరిగిన ప్రజాస్వామ్య పరిహాస పర్వం కళ్ల చూసిన వారందరికీ... సుప్రీం జోక్యం తప్ప ఈ దేశంలో ఏ శక్తీ ఇలాంటి దారుణాల్ని అరికట్టలేదేమోనన్న సందేహం బలపడుతోంది.

సుదీర్ఘకాలం నుంచి సంశయాత్మకంగా ఉన్న పౌరహక్కుల్ని నిస్సందేహంగా ఖరారు చేస్తూ సుప్రీం ధర్మాసనాలు తాజా తీర్పులు వెలువరించిన దరిమిలా.... కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తిని వెక్కిరించేలా జరుగుతున్న పార్టీ ఫిరా యింపులు, ఎన్నికల ప్రహసనాలు–పాలకపక్ష ఆగడాలు, సర్కార్ల ఇష్టా రాజ్యాన్ని  ఎవరూ అడ్డుకోలేని దుస్థితి ఆందోళన కలిగిస్తున్న తరుణమిది. అందుకే, ప్రజాస్వామ్య వాదులంతా సుప్రీంకోర్టు వైపు చూస్తున్నారు.

రాజ్యాంగ విధానాల బాటన, న్యాయస్థానాల కనుసన్నల్లో పౌరులకు రక్షణగా నిలవాల్సిన ప్రభుత్వాలే వక్రమార్గాలననుసరిస్తే ఇక వారికి దిక్కెవ్వరు? ‘కన్నతల్లే దయ్యమైతే తొట్టెల కట్టే తావెక్కడ?’ అన్న చందంగా తయార యింది పౌరుల స్థితి! ప్రజలిచ్చిన అధికారాన్ని విచ్చలవిడిగా వాడుతూ ప్రజా స్వామ్య వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసే çసర్కార్ల వైఖరిని పౌరులు జీర్ణిం చుకోలేకపోతున్నారు.

డెబ్బయ్యేళ్ల స్వతంత్ర భారతావనిలో అత్యంత ఖరీద యినదిగా నంద్యాల ఎన్నికను నిలిపిన తీరు జుగుప్సాకరం. ఈ ఎన్నికల్లో వేర్వేరు రూపాల్లో డబ్బు విశ్వరూపం చూపింది. చివరకు.... ‘మాకు వేస్తే ఓటుకు పదివేలు, మాకు వేయకున్నా సరే ప్రత్యర్థికి వేయకుండా మిన్నకుంటే అయిదువేలు’ ఇస్తామనే కొత్త విష సంస్కృతికి పాల్పడిన అధికార పక్షం నైచ్యం అందరినీ విస్మయపరుస్తోంది.     

నంద్యాల ఓ దురాగతం
ఎన్నికల నియమావళి, నిబంధనల ఉల్లంఘనకు నంద్యాల ఉప ఎన్నిక ఓ నిలువెత్తు ఉదాహరణ. ఎన్నికల సంఘం ఆదేశాలు–నిఘాను బేఖాతరంటూ, అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగానే ఇందుకు సంబంధించిన నియమావళినీ, ఆదేశాలనూ పదే పదే ఉల్లంఘించింది. ఏకంగా ముఖ్యమంత్రి‡స్థాయి వ్యక్తి ఎన్నికల నిబంధనలను పట్టించుకోవాల్సిన అవసరం లేదనీ, ఉల్లంఘిస్తే మహా అయితే నోటీసు మాత్రమే ఇస్తారనీ మంత్రులు, ఎమ్మెల్యేలకు టెలి కాన్ఫరెన్స్‌లో ఆదేశాలిచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నియమా వళి, నిబంధన ప్రకారం ఎన్నికల ముంగిట్లో ప్రభుత్వం కొత్త హామీలు ఇవ్వ కూడదు.

నంద్యాల ఉప ఎన్నికల కోడ్‌ కొనసాగుతుండగానే, మరో రెండు నెలల్లో నిరుద్యోగ యువతకు భృతి ఇవ్వనున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసు కుంది. ఈ విషయాన్ని లీకులిచ్చి మరీ తన అనుకూల మీడియాతో విస్తృత ప్రచారం చేయించింది. మహిళల కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఏర్పాటు చేస్తా మని పొదుపు సంఘాల మహిళలతో నిర్వహించిన సమావేశంలో ముఖ్య మంత్రే హామీ ఇచ్చారు. డ్వాక్రా సంఘాలకు పసుపు–కుంకుమ పథకం కింద మూడో విడతగా రూ.4వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్రం లోని ఏ ఇతర నియోజకవర్గాల్లో మహిళలకు మూడో విడత డబ్బులు జమ చేయలేదు. ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి ఓట్లు వేయకపోతే పెన్షన్లు, రేషన్‌ కార్డులు తీసివేస్తామని సర్వే టీమ్‌లను పంపించి బెదిరించారు.

సర్వేలు చేయ వద్దని ఎన్నికల సంఘం ఆదేశించినా అధికార పార్టీ సర్వే బృందాలను పంపి మరీ ఈ బెదిరింపులకు పాల్పడింది. తమకు ఓటు వేస్తేనే రోడ్ల విస్తరణ, భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సరఫరా పథకాలు చేపడతామనీ, ఇదివరకు చేప ట్టినవి కొనసాగిస్తామనీ సీఎంతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పదేపదే ప్రకటించారు. నిబంధన ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు జిల్లాకు చెందని వ్యక్తులు జిల్లాను వీడి వెళ్లాలి. నంద్యాల నియోజకవర్గానికి చెందని ఇతర నేతలు నంద్యాల నియోజకవర్గంలో ఉండకూడదు. ఈ స్ఫూర్తికి గండికొ డుతూ మంత్రులు, ఎంఎల్‌ఏలు పక్క నియోజకవర్గమైన బనగాన పల్లెలోని ఓ ఎమ్మెల్యే ఇంట్లో తిష్ట వేశారు. ఈ వ్యవహారమంతా ఆధారాలతో బయ టపడింది. ఎమ్మెల్యేలు ఏకంగా పోలింగ్‌ రోజు నంద్యాల నిమోజక వర్గం మొత్తం కలియదిరిగారు.

అనపర్తి ఎమ్మెల్యే కానాలలో ప్రత్యక్షం కాగా, బనగానపల్లె ఎమ్మెల్యే యాళ్లూరులో ఏకంగా డీఎస్‌పీతో మాట్లాడుతూ మీడియా కంటపడ్డారు. కర్నూలు, శ్రీశైలం, కోడుమూరు ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, బుడ్డా రాజశేఖర రెడ్డి, మణిగాం«ధీలు నంద్యాల పుర వీధుల్లో దర్జాగా తిరుగుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు. మంత్రి భూమా అఖిల అయితే మీడియా ముఖంగా ప్రకటించి మరీ ఆళ్లగడ్డ నుంచి నంద్యా లకు వెళ్లారు. అక్కడ పలు టీవీలకు ఇంటర్వ్యూలూ ఇచ్చారు. ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ యథేచ్ఛగా సాగింది. బహుశా దేశచరిత్రలోనే ఇంతగా డబ్బు, మద్యం పంపిణీతో ఎన్నికలు జరగలేదంటే అతిశయోక్తి కాదేమో! పాలకపక్షం వందల కోట్ల మేర ఖర్చు చేసిందని ఒక అంచనా. ఓటుకు  రూ. 2 వేలు పంచుతూ అధికార పార్టీకి చెందిన రైతునగర్‌ సర్పంచ్‌ కొండారెడ్డి కెమెరాకు చిక్కారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి.

ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీకి చెందిన కౌన్సి లర్‌ అభిరుచి మధు మారణాయుధాలను కార్లలో పెట్టుకొని తిరుగుతూ ప్రతి పక్ష పార్టీకి చెందిన నేత, మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డిపై దాడికి తల పడ్డారు. ఏకంగా కత్తి తీసుకొని నడిరోడ్డుపై గీత గీసి దాన్ని దాటి రమ్మని సవాల్‌ విసరడం, గాల్లో కాల్పుల ఘటన, పోలీసులు ప్రేక్షకపాత్ర వహిం చడం ప్రజాస్వామ్య ప్రక్రియకే సరికొత్త సవాళ్లు.

మూలాలు ఛేదిస్తేనే....!
విలువలకు తిలోదకాలిచ్చి, పాలకపక్షాలు అధికారమే పరమావధిగా వ్యవహ రించడం వల్లే ఇలాంటి విపరిణామాలు తారస్థాయికి చేరుతున్నాయి. ఇప్పు డున్న అధికారాన్ని విచ్చలవిడిగా అనుభవించడమే కాకుండా తర్వాతి ఎన్ని కల్లోనూ తామే గెలుపొందాలనే దురాశ వారిని అన్ని అనైతిక చర్యలకూ పురి గొల్పుతోంది. అర్థబలం, అధికారం దన్నుగా వీలయితే ప్రలోభాలు లేదంటే బెదిరింపులు... ఏదైతేనేం? వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యర్థి పార్టీల ఉనికే లేకుండా చేయాలనే దుర్నీతి రాజ్యమేలుతోంది. నంద్యాల ఉప ఎన్నికకు దారి తీసిన పరిస్థితులకు మూలకారణమదే! ప్రత్యర్థి పార్టీ తరపున గెలిచిన ప్రజాప్రతినిధుల్ని తమ పార్టీలోకి లాక్కొని, మంత్రిపదవులిస్తూ ప్రజాతీర్పునే వంచిస్తున్న సిగ్గుమాలిన చర్యలు ఇటీవల పెచ్చుమీరాయి.

ఫిరాయింపు (నిరో ధక) చట్టంలోని లొసుగుల్ని సానుకూలంగా వాడుకుంటూ పాలకపక్షాలు బరి తెగిస్తున్న తీరుకు విరుగుడు కనిపించడం లేదు. పైగా, వేదికలెక్కి నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఈ జాడ్యానికి ప్రభా వవంతమైన పరిష్కారం లభించడం లేదు. నిబంధనల్ని ఉల్లంఘిస్తూ పార్టీ ఫిరాయించిన వారిని అనర్హులుగా ప్రకటించే ప్రక్రియలో చట్టసభల స్పీకర్లదే కీలకపాత్ర! వారీ విషయంలో పార్టీలకతీతంగా వ్యవహరించి, అలా పార్టీ మారిన వారిని చట్టప్రకారం అనర్హులుగా ప్రకటించాలి. కానీ, కాలక్రమంలో స్పీకర్లు పాలకపక్షాల కనుసన్నల్లో నడుచుకోవడం వల్ల, అధికారంలోని వారికి అనుకూలంగానే తప్ప చట్టబద్ధ, రాజ్యాంగబద్ధమైన నిర్ణయాలు తీసుకోవడం లేదు.

పలుమార్లు ఈ వివాదాలు న్యాయస్థానాలకూ చేరాయి. ఎప్పట్లోగా నిర్ణయం తీసుకోవాలో తాము వారిని నిర్దేశించలేమని, వారొక మారు నిర్ణయ మంటూ తీసుకుంటే... దాని రాజ్యాంగబద్ధతను తాము సమీక్షించగలమని న్యాయస్థానాలంటున్నాయి. తెలంగాణ ఎమ్మెల్యే సంపత్‌ (కాంగ్రెస్‌) పిటిషన్‌ మేరకు ఫిరాయింపుల కేసొకటి సుప్రీంకోర్టు విచారణలో ఉంది. శుక్రవారం అది విచారణకు రావాల్సి ఉంది. ‘దీనిలోని సంక్లిష్టత దృష్ట్యా... ఈ కేసు విచా రణను ఎందుకు రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించకూడదు?’ అని సుప్రీం కోర్టు గత డిసెంబర్‌లో ప్రశ్నించింది. అయినా ఆ ప్రక్రియ జరిగినట్టు లేదు! సుప్రీంకోర్టు చొరవ తీసుకొని రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి ఈ ఫిరా యింపుల జాడ్యానికి చరమ గీతం పాడాల్సిన అవసరం ఉంది.

అత్యధికులకు అండ న్యాయస్థానాలే!
పలువురు భావిస్తున్నట్టు, కొందరు వక్రీకరిస్తున్నట్టు... వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా పేర్కొన్న సుప్రీం తీర్పు ‘ఆధార్‌’కు వ్యతిరేకమేం కాదు. తగు జాగ్రత్త చర్యలతో ‘ఆధార్‌’ను యథేచ్ఛగా కొనసాగించవచ్చు, పలు అభి వృద్ధి–సంక్షేమ కార్యక్రమాలకు అనుసంధానం చేయవచ్చు. నిర్దిష్ట అవసరాల కోసం పౌరుల వద్ద నుంచి సేకరించే వ్యక్తిగత సమాచారాన్ని అదే అవస రాలకు వాడటం, ఇతరేతర మార్గాల్లో అది దుర్వినియోగం కాకుండా, ఇతర ప్రైవేటు సంస్థల బారిన పడకుండా తగు భద్రతా చర్యలు తీసుకోవడం ఇకపై ప్రభుత్వాల బాధ్యత అవుతుంది.

అందుకోసం, అవసరమైతే ప్రత్యే కంగా సమాచార భద్రతా చట్టం తీసుకురావాల్సి ఉంటుంది. ఆధార్‌ విష యంలో జరుగుతున్న తప్పిదాల్ని, లోపాల్ని, పౌరుల వ్యక్తిగత సమాచార భద్రత విషయంలో ఇప్పటికే జరిగిన తీవ్ర నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన అడ్డగోలు వాదనకు ఈ తీర్పు చెంపపెట్టు! అందుకే, ఈ తీర్పునకు సర్వత్రా స్వాగతం లభిస్తోంది. హర్షామోదాలు వ్యక్తమౌతు న్నాయి. వ్యక్తిగత గోప్యత మన దేశంలో అసలు హక్కే కాదని వాదించిన కేంద్రం ఇప్పుడు గొంతు సవరించుకుంటోంది.

ప్రాథమిక హక్కే గానీ పరి మితులుంటాయని తాము పేర్కొన్నట్టు ఇప్పుడు మాట మారుస్తోంది. సుప్రీంకోర్టు ఇది ప్రాథమిక హక్కే అని చెప్పటమైనా, మూమ్మారు ‘తలాక్‌’ అని ఉచ్చరించినా, పరోక్షంగా ఫోన్‌ చేసినా, ఓ చిన్న మెసేజ్‌ పంపినా చాలు విడాకులిచ్చినట్టే అన్న పద్ధతి చెల్లదని ప్రకటించడమైనా రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడమే! చట్టాలకూ, రాజ్యాంగానికీ వ్యతిరేకంగా వ్యక్తులు గానీ, రాజ్యం గానీ దాష్టీకాలకు దిగినప్పుడు ఎదిరించి తమను తాము రక్షించు కోవడం ఈ వ్యవస్థలో చాలా తక్కువ మందికే సాధ్యం! దేశంలోని అత్య ధికులకు ప్రభుత్వాలు కల్పించే రక్షణ చర్యలు, చట్టాలు, రాజ్యాంగం,  న్యాయ స్థానాల అండ అవసరమయ్యే పరిస్థితులే నేటికీ ఈ దేశంలో నెలకొని ఉన్నాయి.

ముఖ్యంగా పౌరులందరి నిత్య జీవితాల్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా శాసిస్తున్న రాజకీయ వ్యవస్థను క్రమబద్ధీకరించాల్సి ఉందని ప్రతి పౌరుడూ భావిస్తున్న తరుణమిది!  ఇప్పుడు నెలకొని ఉన్న ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రభు త్వాల జవాబుదారీతనమైనా, ఎన్నికల సంస్కరణలైనా, రాజకీయ పరివర్త నైనా...... సుప్రీంకోర్టు చొరవ, క్రియాశీలతే ఈ దేశ పౌరులకు తక్షణ రక్ష!

దిలీప్‌రెడ్డి
ఈమెయిల్‌:
dileepreddy@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement