కార్పొరేట్ల సిరి, లేత ఆశకు ఉరి
సమకాలీనం
నియంత్రణ లేని వ్యవస్థలో ర్యాగింగ్ భూతమొకటి! బంగారు భవిష్యత్తును పణంగా పెట్టి చిన్న వయసులో భావి భారత పౌరులు బలవన్మరణాలకు సాహసిస్తున్నారు. గత రెండున్నరేళ్లలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో యాభై మందికి పైగా విద్యార్థులు ఇలా అర్ధంతరంగా తనువు చాలించారు. ఎంత మంది చనిపోతున్నా ప్రభుత్వాలకు పట్టదు. కార్పొరేట్ సంస్థలపై కేసుల్లేవు. లోగడ చాలా విచారణ కమిటీలు వేసినా, కొన్ని కమిటీలు నిర్దిష్టమైన సిఫారసులు చేసినా అవి అమలుకు నోచుకోలేదు.
‘‘ఆత్మవిశ్వాసాన్నీ, నిగ్రహాన్నీ కోల్పోకుండా... దేన్నయినా వినగలిగే, ఎదు ర్కోగలిగే సామర్థ్యాన్నిచ్చేదే విద్య’’ అంటాడు నాలుగుమార్లు పులిట్జర్ అవార్డు పొందిన అమెరికా కవి రాబర్ట్ లీ ఫ్రాస్ట్. మనం మన పిల్లలకు ఏ రకం విద్య అందిస్తున్నాం? ఎంత ఆత్మ విశ్వాసాన్ని వారిలో నింపగలుగుతున్నాం? ఏపాటి అవగాహన బతుకుపై వారిలో కలిగిస్తున్నాం? ఎంతటి జీవితేచ్ఛను వారిలో రగిలిస్తున్నాం? ఒకసారి గుండెల మీద చేయి వేసుకొని మనమందరం ఆలోచించాల్సిన అంశం. పాపం, చంద్రశేఖర్, నవీన దంపతులు తమ ఒక్కగానొక్క కొడుకు వంశీకృష్ణ గురించి ఎన్నెన్ని కలలు కన్నారో! అంతలోనే ఆ కలలు కల్లలయి.... కన్న కొడుకు లేత వయసులో చదువు చట్రాల ఇరుసులో పడి నలిగాడు. పూవై నూరు రేకులతో వికసించాల్సినవాడు మొగ్గగానే రాలిపోతే... నలభై రోజుల పైగా రెండు హృదయాలు తుపానులో చిగురుటాకుల్లా అల్లాడినై.‘తమకే ఎందుకిలా జరిగింది...’ దుఃఖం తన్నుకొస్తున్నా ఏ వైపు నుంచీ సమాధానం లేదు. కడకు ఆత్మహత్యతో రెండు బతుకులూ కడతేరినై.
విన్న ప్రతి హృదయాన్నీ కదిలించిందీ గుంటూరు జిల్లా దుర్ఘటన! వెలిగే ఓ చిరుదివ్వె కొండెక్కితే, ఉన్న రెండు దీపాలూ దీనంగా ఆరిపోయినయ్. ఆ దినమలా గడిచింది. ఎప్పటిలాగే పొద్దువాలింది, మళ్లీ తెల్లారింది. ఏం జరగనట్టే, అంతా సద్దుమణిగింది! రారండంటూ సర్కారు, ప్రైవేటు బడులు స్వాగతం పలికాయి. పొలోమంటూ పిల్లలు బడులకు పరుగులు తీశారు. పిల్లల భవి ష్యత్తు గురించి కలలు కంటున్న తల్లిదండ్రులూ వారిని బడుల్లో దింపు తున్నారు, హాస్టళ్లలో కుక్కుతున్నారు. లేత ఆలోచనల్ని పునాదుల్లో పూడ్చి ఆశల సౌధాలు కడుతూనే ఉన్నారు. షరా మామూలే! ఇదిలా సాగాల్సిందేనా! ఎవరూ మనసు పెట్టి ఆలోచించరా? బడులు–కాలేజీలెందుకు పిల్లల పాలిట వధ్యశిలలవుతున్నాయి? సర్కారు బడులెందుకు కంటికానని దుస్థితికి జారు తున్నాయి? మూడు బడులు ఆరు కాలేజీలై ప్రైవేటు విద్యా వ్యాపారం కోట్లకెలా, ఎందుకు పడగలెత్తుతోంది? చిరుప్రాయంలోనే విద్యాకుసుమాలెం దుకు రాలుతున్నాయి? ఎందరి మెదళ్లనో తొలుస్తున్న శేష ప్రశ్నలివి. అనా రోగ్యంతో అసువులు వీడారనో, ఆత్మహత్యతో కడతేరారనో, ప్రమాదవశాత్తు మరణించారనో... ఎప్పటికప్పుడు ఓ కథ వినిపిస్తున్నారు. నూరు పుటల వారి బతుకు పుస్తకాల్ని తొలి పేజీల్లోనే కర్కశంగా మూసేస్తున్నారు. కన్నవారికి తీరని గర్భశోకం మిగిలిస్తున్నారు. స్వేచ్ఛగా ఎదగాల్సిన లేత మెదళ్లు ఒత్తిడిలో చిత్తవుతున్నాయి.
అత్యాశే తప్ప, ఆశెప్పుడూ తప్పు కాదు
ఆర్థిక సరళీకరణ తర్వాతి పరిణామాల్లో ఎదుగుదల అవకాశాలు అందరికీ కనిపించాయి. ఆశలు రేపాయి. పద్ధతిగా సాగిన కొన్ని కలలు సజావుగా నెర వేరుతున్నాయి. వాస్తవిక దృక్పథంతో కాకుండా అత్యాశతో ఆలోచించి, పథ కాలు రచించిన చోట విలువలు వేగంగా పతనమయ్యాయి. ఈ దురవస్థ, కుటుంబ వ్యవస్థలో మానవ సంబంధాలైనా, బయటి సమాజంలోని వ్యాపార లావాదేవీలైనా మినహాయింపు లేకుండా అంతటా వర్తిస్తోంది. అభిరుచి స్థాయితో నిమిత్తం లేకుండా తమ పిల్లలు పెద్ద చదువులు చదివి, గొప్ప కొలువులు పట్టి, బోలెడు సంపాదించాలన్న తలిదండ్రుల అత్యాశ పిల్లల లేత మెదళ్లపై ఒత్తిడి పెంచే గుదిబండౌతోంది. ఈ బలహీనతే, తక్కువ సమయంలో ఇబ్బడి ముబ్బడిగా ధనార్జన చేయాలనుకున్న స్వార్థ విద్యా వ్యాపారులకు పెట్టుబడి అయింది. దొడ్డి దారిన సంపద కూడగట్టాలనుకున్న అధికార పెద్దలకిదొక అక్రమార్జన మార్గమయింది. విశ్వవ్యాప్తంగా, వేల సంవత్సరాలు కీర్తిమానమైన భారతీయ విద్య, విలువలతో కూడిన సంస్కృతి సర్వనాశనమైంది. మనం గొప్పగా చెప్పుకునే కేంబ్రిడ్జి, హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్ వంటి యూనివర్సిటీల కన్నా కొన్ని వందల యేళ్లకు ముందే విశ్వ విద్యకు శ్రీకారం చుట్టిన నలంద, తక్షశిల, విక్రమశిల వంటి విశ్వవిద్యాలయాలకు నెలవైన నేల మనది. స్వేచ్ఛా విద్యార్జనకు నిలయంగా విశ్వకవి రవీంద్రుడు ‘శాంతినికేతన్’ నెలకొల్పిందిక్కడే!
అటువంటిది ప్రస్తుతం విద్య ఫక్తు వ్యాపా రమైంది. ఆమీర్‌ఖాన్ ఓ చక్కటి కళాఖండంగా తీర్చిదిద్దిన ‘త్రీ ఇడియట్స్’లో సందేహించినట్టు విద్యార్థులుంటున్నది కాలేజీయో, ప్రెజర్‌కుక్కరో తెలియని పరిస్థితులు దాపురించాయి. భరించలేని ఒత్తిళ్లలో పిల్లలు నలిగి పోవడానికి తల్లిదండ్రుల అత్యాశ కూడా కారణమే! తమ పిల్లల ఆసక్తి, నైపుణ్యాలు, మానసిక ప్రవర్తన వంటి అంశాలతో నిమిత్తం లేకుండానే వారిని ఏదేదో చేసేయాలనుకోవడంలోనే లోపముంది. ఏటా ఎంతమంది ఇంటర్ పాసయి ఉన్నత విద్యకు వెళ్తుంటే, ఎన్ని ఐఐటి సీట్లున్నాయి, ఎంత నిష్పత్తి అన్న లెక్కయినా లేకుండా... పిల్లల్ని ఎట్లయినా నెట్టాలని చూడటమే వింత. వారి అభిరుచి–ఆసక్తిని ఏ మాత్రం లెక్క చేయకుండా ఐఏఎస్–ఐపీఎస్ చేయాల నుకునే ఆశలేమిటో అంతుబట్టదు. వీరి వేలం వెర్రితత్వాన్ని చూసి ఇంటర్, పదో తరగతి, ఆరో తరగతి... ఇలా కిందకు వస్తూ, వస్తూ చివరకు ఒకటో తరగతి నుంచే ఐఐటీ శిక్షణ అని విద్యావ్యాపార సంస్థలు వారికి వలపన్నే దాకా వచ్చింది. ఫలితంగా ఐఐటీ, ఒలంపియాడ్, టెక్నో, కాన్సెప్ట్, ఈ– టెక్నో, ఈ–శాస్త్ర, కాన్వెంట్, పబ్లిక్‌స్కూల్, ఇంటర్నేషనల్... ఇలా ఎన్ని పేర్లో! ఎంతెంత ఫీజులో! అంతే లేదు. అక్కడ దరఖాస్తు ఫారమ్ నుంచి పుస్తకాలు, బెల్ట్, డ్రెస్, తిండి, రవాణా... సర్టిఫికేట్ల వరకు ప్రతిదీ వ్యాపారమే!
బడుల నుంచి కాలేజీల దాకా....
విద్యా కుసుమాలు అసాధారణ ఒత్తిళ్లలో వాడిపోతున్న విపరీతం అన్ని స్థాయిల్లోనూ ఉంది. ఈ జాఢ్యం పాఠశాలల నుంచి కాలేజీల దాకా పాకింది. కార్పొరేట్ విద్యాసంస్థల ప్రమేయం పుణ్యమా అని ప్రత్యక్ష–పరోక్ష కారణా లతో ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీల్లో చదువులు సన్నగిల్లాయి. ఏడు, ఎనిమిది తరగతులకొచ్చాక కూడా సరిగా తెలుగు చదవలేని, రాయలేని, గుణింతాలు–భాగహారాలు చేయలేని ‘ప్రమాణాలు’న్నాయి. సర్కారు విప రీత నిర్లక్ష్యం వాటిని కునారిల్లేలా చేసింది. సర్కారు బడులపై విరక్తి చెంది, అప్పో సొప్పో చేసయినా ప్రైవేటులో చదివించాలని సామాన్యులు కూడా తపన చెందే బలీయ వాతావరణం తీసుకొచ్చారు. తెలంగాణలో 14,250 పై చిలుకు ప్రైవేటు బడుల్లో 29.66 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, ఇతర పట్టణ ప్రాంతాల్లోని దాదాపు 9వేల పాఠశాలల్లోనే సుమారు 20 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో 13,513 ప్రయివేటు పాఠశాలల్లో 27.85 లక్షల విద్యార్థులు న్నారు. అక్కడ కూడా మెజారిటీ పాఠశాలలు విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి తదితర పట్టణ ప్రాంతాలతో పాటు జిల్లా కేంద్రాల్లో కేంద్రీ కృతమై ఉన్నాయి. భారీ ఫీజులే తప్ప విద్యా ప్రమాణాలు ఎక్కడా గొప్పగా లేవు. ఇక క్రీడలు, సైన్స్ ల్యాబులు, గ్రంథాలయాలు, ఇతరేతర సదుపా యాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అనుమతి లేకున్నా చాలా చోట్ల హాస్టల్స్ నడుపుతున్నారు. వాటి నిర్వహణ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి, కార్పొరేట్ విద్యాసంస్థలు తమ ఇష్టానుసారం వాటిని నడుపుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలన్నీ గాలికిపోతాయి. ప్రవేశాలు, ఫీజులు, సిలబస్, సెలవులు, వసతులు... ఇలా అన్ని విషయాల్లో ప్రభుత్వం ఎప్పటి కప్పుడిచ్చే ఏ ఉత్తర్వుల్నీ వారు పాటించరు. ఇక ఇంటర్ కాలేజీ విద్య విష యంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రెండే విద్యా సంస్థలది ఇష్టారాజ్యం. ప్రభుత్వ విధానాలనే తమకనుకూలంగా వారు ప్రభావితం చేస్తారు.
కదిలించే ఆత్మహత్యలు... కంటి తుడుపు విచారణలు
అశాస్త్రీయమైన బట్టీ విద్యావిధానంలో నెట్టుకురాలేని విద్యార్థులంతా నలిగి పోతున్నారు. సృజనని హతమార్చి పెట్టే వింత టార్గెట్లతో వారిని పగలూ రాత్రీ రుద్దుతూనే ఉంటారు. హేతుబద్ధంకాని మార్కుల తూనికలు– కొలత లతో, ఒకరితో ఒకర్ని పోల్చి వేధిస్తుంటారు. ఇదంతా ఒత్తిడే! ప్రతిభగల విద్యార్థులు కూడా ఈ వైఫల్యాల్ని జీర్ణించుకోలేక అవమానంగా భావిస్తుం టారు. చిన్న విషయాల్నీ భూతద్దంలో చూస్తున్నారు. విపరీత నిర్ణయాలకు తెగిస్తున్నారు. దీనికి తోడు తల్లిదండ్రుల ఆశల్ని నెరవేర్చలేకపోతున్నామన్న భావన వారిని మరింత వేదనకు గురిచేస్తోంది. నియంత్రణ లేని వ్యవస్థలో ర్యాగింగ్ భూతమొకటి! బంగారు భవిష్యత్తును పణంగా పెట్టి చిన్న వయ సులో బలవన్మరణాలకు సాహసిస్తున్నారు. గత రెండున్నరేళ్లలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో యాభై మందికి పైగా విద్యార్థులు ఇలా అర్ధంతరంగా తనువు చాలించారు. ఎంత మంది చనిపోతున్నా ప్రభుత్వాలకు పట్టదు.
కార్పొరేట్ సంస్థలపై కేసుల్లేవు. లోగడ చాలా విచారణ కమిటీలు వేసినా, కొన్ని కమిటీలు నిర్దిష్టమైన సిఫారసులు చేసినా అవి అమలుకు నోచుకోలేదు. కాలేజీ విద్యార్థుల బలవన్మరణాలపై ఇంటర్‌బోర్డు మాజీ కార్యదర్శి డి.చక్ర పాణి, మాజీ వీసీ రత్నకుమారిల నేతృత్వంలో ఒక కమిటీని ఏపీ ప్రభుత్వం నియమించింది. అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఇలాగే నియమించిన ప్రొఫెసర్ నీరదారెడ్డి కమిటీ లోతైన పరిశీలనతో విలువైన సూచనలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలు హాస్టళ్లు నిర్వహిస్తున్నాయని, అవి జైళ్లకన్నా ఘోరంగా ఉన్నాయని, ఫలితంగా ఒత్తిళ్లకు గురవుతున్న విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తేల్చింది. ఈ నివేదికను అధ్యయనం చేసిన ఓ త్రిసభ్య కమిటీ వారి సిఫార సుల్ని య«థాతథంగా అమలు చేయాలని చెప్పినా సర్కారు మొదట పట్టిం చుకోలేదు. పౌరసమాజం ఒత్తిళ్లకు లొంగి ఉత్తర్వులిచ్చినా... వాటి అమలును కార్పొరేట్ విద్యా సంస్థలు నీరుగార్చాయి. ఆదివారాలు పరీక్షలుండొద్దని, సాయంత్రం 4 తర్వాత స్వేచ్ఛగా తిరగనివ్వాలని, స్టడీ సమయాలు రోజూ 9 గంటలు మించొద్దని, ప్రతికాలేజీలో ఫిజికల్ డైరెక్టర్లను, సైక్రియాట్రిస్టుల్ని విధిగా నియమించాలని, జీవన నైపుణ్యాలపైన, నైతిక వర్తనపైన ప్రత్యేక తరగతులుండాలని, పేరెంట్స్‌తో కూడిన కమిటీలు–తరచూ సమావేశాలూ ఉండాలని ఇచ్చిన ఆదేశాలు అమలు కావట్లేదు.
ఏ సమస్యకూ చావు పరిష్కారం కాదు
విద్యాసంస్థ ఏదైనా తమ విద్యార్థుల్లో ధైర్యం నూరిపోయాలి. చావు దేనికీ పరిష్కారం కాదని ఒంటబట్టేలా చెప్పాలి. భారత్‌లో ప్రతి లక్ష మందికి 58 మంది విద్యార్థులు బలవన్మరణాల పాలవుతుంటే, 148 మంది విద్యార్థినులు ఆత్మహత్యలకు గురవుతున్నట్టు ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇది ప్రపంచ సగటు (14.5/లక్ష) కన్నా ఎక్కువ కాగా, బ్రిటన్ సగటు (2.1/లక్ష) కన్నా చాలా ఎక్కువ. భారత అమ్మాయిల్లో పరీక్షలకు సంబంధించిన గెలుపు ఒత్తిళ్లు ఎంతో అధికం. తల్లిదండ్రుల ఆశలకి–వ్యయానికి న్యాయం చేయలేక పోతు న్నామన్న బెంగా వారిలోనే ఎక్కువ. పరీక్షల్లో విఫలమైతే పెళ్లి తప్ప తమ కుండే ప్రత్యామ్నాయాలు తక్కువనే భావన అమ్మాయిల్లో ఈ అధిక ఒత్తిళ్లకు కారణం అయి ఉండవచ్చని చాలా కాలం కింద పీటర్ ఫోస్టర్ (టెలిగ్రాఫ్– బ్రిటన్) రాశారు. భారత ఉజ్జ్వల భవిష్యత్తును నిర్మించాల్సిన యువతను ఎవ రైనా కోరేదొక్కటే! ఆత్మహత్యలు బలవన్మరణాలు సరికాదు. అరుణోదయ తరపున వేదికలపై మార్మోగే విమలక్క పాట స్ఫురణకు వస్తోంది. ‘‘ఎందుకు కాలిపోతవు? నువెందుకు రాలి పోతవు? కాలకురా, రాలకురా... మాడి బూడిద కాకురా!....’’
(వ్యాసకర్త : దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com )