కూర్చున్న కొమ్మనే నరుక్కునే వంచన | dileep reddy writes on loans to farmers | Sakshi
Sakshi News home page

కూర్చున్న కొమ్మనే నరుక్కునే వంచన

Published Fri, Jun 9 2017 12:35 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

కూర్చున్న కొమ్మనే నరుక్కునే వంచన - Sakshi

కూర్చున్న కొమ్మనే నరుక్కునే వంచన

సమకాలీనం

ఈ దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో జరిగేంత దోపిడీ మరెక్కడా కనిపించదు. ప్రపంచంలో ఎక్కడైనా ఉత్పత్తిదారే తన ఉత్పత్తి ధరను నిర్ణయిస్తాడు, ఒక్క రైతు తప్ప. రైతును ఆదుకుంటామంటూ ప్రభుత్వాలు నిర్ణయించే కనీస మద్దతు ధర ఎన్నటికీ గిట్టు బాటు ధర కాలేదు. పైగా అదీ అమలు కాదు. వ్యాపారులు, దళారులు కుమ్మక్కై సరుకు వచ్చేనాటికి ధరల్ని దిగజార్చి రైతు నోట్లో మట్టికొడతారు. అప్పులు, అవసరాలు వెంటాడు తుండగా మార్కెట్‌కు చేరిన రైతు పరిస్థితి తోడేళ్ల గుంపు మ«ధ్య చిక్కిన జింకలా ఉంటుంది.


‘‘సంపన్నులు పేదల్ని దోచుకుంటే అది వ్యాపారం అంటారు, తిరిగి రాబ ట్టుకునేందుకు పేదలు పోరాడితే దాన్ని హింస అంటారు’’ అన్న ప్రఖ్యాత రచయిత మార్క్‌ ట్వైన్‌ మాటలు, భారత రైతుల్ని తలచుకున్నప్పుడల్లా అక్షర సత్యాలనిపిస్తాయి. స్వేదరక్తాలు కలగలిసిన తమ కష్టార్జితంతో నడిచే మార్కెట్‌ కమిటీలు దళారులకు వంత పాడుతున్నాయని గొంతెత్తిన ఖమ్మం రైతులకు నిలువెల్లా సంకెళ్లు వేసిన దుర్మార్గాన్ని ఏమనాలి? ఉత్పత్తి వ్యయంలో మూడో వంతు కూడా ధర పలుకక ఘోష పెట్టిన ఏపీ మిర్చి రైతుల ఒళ్లు లాఠీలతో హూనం చేసిన ఖాకీ సంస్కృతికి కారణమెవరు? పంట నష్టానికి పరిహారం రాక, దిగుబడికి ధర గిట్టక, కొత్తగా అప్పు పుట్టక... కడుపు మండి మధ్యప్రదేశ్‌ రైతు రోడ్డెక్కితే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిన పోలీసు చర్యలకు అర్థమేంటి? ‘విచారణ జరిపిస్తున్నాం, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ అనటంతోనే ప్రభుత్వాల బాధ్యత తీరిపోతుందా? పోలీసులు ప్రభుత్వంలో భాగం కాదా? జరిగిన దాష్టీకాలకు ప్రభుత్వ నైతిక బాధ్యత ఏంటి?  రైతులు పట్ల, వ్యవసాయం పట్ల ప్రభుత్వాలు తమ వైఖరిని స్పష్టం చేయాల్సిన సమయం ఇది.

చేష్టలుడగడమో, తప్పుడు విధానాలో, ప్రభుత్వ నిర్వాకాలో కాదా నేటి దేశవ్యాప్త వ్యావసాయిక అశాంతికి కారణం! తడిసిన రైతు ఉడుకు నెత్తురుతో మధ్యప్రదేశ్‌ ఇంకా అట్టుడుకుతోంది. మహారాష్ట్రలో రైతులు ఆందోళనలో ఉన్నారు. నిన్నటిదాకా తమిళ రైతులు దేశ రాజధానిలో దీక్షలు నిర్వహించారు. హరియాణా, రాజస్థాన్‌ రైతాంగం పోరాటాలతో అలసిపోతోంది. మృగశిర ముంచుకొచ్చినా వ్యవసాయ ప్రణాళికే లేక రెండు తెలుగు రాష్ట్రాల రైతులు దిక్కులు చూస్తున్నారు. దేశానికి వెన్నెముకని చెప్పే రైతు పరిస్థితి ఇంత దీనంగానూ, 70% జనాభాకు జీవనాధారమైన వ్యవ సాయరంగం ఇంత నిస్తేజంగానూ ఎందుకుంది? ప్రతి 30 నిమిషాలకో రైతు బలవన్మరణానికి పాల్పడుతున్నాడీ నేలపై! రేయింబవళ్లు శ్రమిస్తున్నా బతుకు గడవక గత 20 ఏళ్లలో 3.18 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకు న్నారు. దేశంలో 50%కు పైగా శ్రామికశక్తి కృషి చేస్తున్న వ్యవసాయరంగం, స్థూల జాతీయోత్పత్తికి 17% మించి దోహదపడలేకపోతోంది ఎందుకు? అందుకు ఎవరు బాధ్యులు? వ్యవసాయ రంగం పట్ల చూపుతున్న తీవ్ర నిర్లక్ష్యం వల్ల దేశంలో నెలకొన్న పరిస్థితి కొత్త వ్యవసాయిక విప్లవానికి భూమి కను సిద్ధం చేస్తోంది.

పాశమై కాటేస్తున్న రుణం–దారుణం
రుణ సమస్య లోతులెరిగీ పరిష్కారం లేక రైతు భంగపడుతున్నాడు.  ఏయేటి కాయేడు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. అప్పు లేకుండా వ్యవ సాయం చేసే ఆర్థిక పరిస్థితి అత్యధిక రైతులకు లేదు. బ్యాంకు అప్పులు దొరక్క, ప్రైవేటు అప్పుల వడ్డీలకు తట్టుకోలేక సతమతమౌతున్నాడు. ఏటా పెరుగుతున్న పెట్టుబడి వ్యయం, ఖర్చులు, పంట నష్టాలతో మధ్య తరగతి రైతు కూడా పేదరికంలోకి జారుతున్నాడు. పండిన పంటకూ ధర దక్కట్లేదు. తీర్చలేనంత అప్పు, చుట్టూ ముసిరే సమస్యలతో పోరాడలేక బలవన్మరణా లతో రైతులు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. తిండిపెట్టే ఇంటి పెద్ద మరణంతో  మొత్తం కుటుంబమే చితికిపోతోంది.

వ్యవసాయ రుణం మాఫీ చేస్తామన్న రాజకీయ పార్టీల మాట నిజమేనని నమ్మి గద్దెనెక్కిస్తే, వారు మాట తప్పినప్పుడల్లా ఏపీలోలాగే రైతులు విలవిల్లాడుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం రూ. 36 వేల కోట్ల రుణ మాఫీకి సిద్ధపడటంతో మహారాష్ట్ర, తమిళనాడు, హరియాణా, పంజాబ్, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో ఒత్తిడి పెరిగింది. దేశవ్యాప్త రైతు రుణ మాఫీకి దాదాపు రూ. 3 లక్షల కోట్ల వ్యయ మని అంచనా. 2008లో మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం రూ.60 వేల కోట్ల రుణాల్ని మాఫీ చేసింది. రుణ మాఫీ ఒక అంశమైతే, రుణ లభ్యతే మరో ప్రధాన సమస్యగా ఉంది. నోట్ల రద్దు తర్వాత ఇది మరింత కష్టమౌతోంది. గ్రామీణ భారతంలోని 70%కు మించిన బ్యాంకేతర ఆర్థిక వ్యవస్థనంతటినీ ఒక్క దెబ్బతో బ్యాంకుల పరిధిలోకి తెచ్చారు.

ప్రైవేటు అప్పు ఇçప్పుడంత తేలిగ్గా పుట్టే పరిస్థితి లేదు. బ్యాంకులేమో ఇవ్వట్లేదు. వ్యవసాయ రుణాల వృద్ధి రేటు 2016 ఏప్రిల్‌లో 15%గా ఉండగా ఈ ఏప్రిల్‌లో అది 8% మాత్ర మేనని తాజాగా ఆర్‌బీఐ  ప్రకటించింది. వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తూ పోతే, ‘రుణ సంస్కృతి’ దెబ్బతింటుందని పదే పదే వల్లించే ఆర్‌బీఐ గవర్నర్‌ మళ్లీ అదే రాగం పాడటం విడ్డూరం. పెద్ద పెద్ద కార్పొరేట్ల ‘పాత–కొత్త అప్పు సర్దుబాట’్లకు, ‘ఒకే దఫా పరిష్కారాల’కు లెక్కే లేదు. కార్పొరేట్లకు బ్యాంకు లు దాసోహమంటున్న తత్వానికి ఇది నిదర్శనం. లేకుంటే, 7.7 లక్షల కోట్ల నిరర్థక ఆస్తులు బ్యాంకుల్లో ఎలా పేరుకుపోతాయి? రూ. 500 బాకీకి బ్యాంకు నోటీసులందుకొని మధ్యప్రదేశ్‌లో ఓ రైతు కుమిలి కుమిలి ఏడుస్తున్న రోజున బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన విజయ్‌ మాల్యా ఇంగ్లండ్‌లో దర్జాగా స్టేడి యంలో కూచుని ఛాంపియన్స్‌ ట్రోఫీ క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తూ టీవీ తెరలపై కనిపిస్తే కడుపు మండదా?


విత్తనం–కార్పొరేట్ల పెత్తనం
ప్రతి వ్యవసాయ సీజన్లో విత్తనాలు దొరక్క, దొరికిన వాటిపై భరోసా లేక బిక్కుబిక్కుమంటాడు రైతు. బహుళజాతి కంపెనీలు వాణిజ్య పంటల నుంచి సంప్రదాయ పంటల వైపు సాగుతూ మొత్తం విత్తన వ్యవస్థను, రైతుల్ని, వారి జీవితాల్ని చెరబడుతున్నాయి. నిజంగా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు బ్యాంకు అప్పుల్ని, విత్తనాల్ని, ఎరువుల్ని అందించే ప్రక్రియను సమ న్వయపరచి రైతుకు ఏక గవాక్ష పద్ధతి పాటించాలి. గడువు వరకు నిరీక్షించకుండా చొరవతో రుణ మేళాలు ఏర్పాటు చేసి, రుణ మంజూరితో పాటు విత్తనాలు, ఎరువుల్ని ఏ విక్రేత నుంచి, ఎప్పుడు, ఎంత మేర పొందొచ్చో సమాచారమివ్వొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎరువుల సబ్సిడీనీ దీనికి అనుసంధానం చేయొచ్చు. వీట న్నింటినీ రుణ మంజూరీతో సమన్వయపరచి రైతులకు సదరు ‘స్లిప్పు’లు అందజేస్తే చాలని నిపుణులు సూచిస్తున్నారు.  కొన్ని రకాల విత్తనాలు, ఎరువుల విషయంలోనైనా ఇది సుసాధ్యమే.

ఉదాహరణకు తెలంగాణలో రైతుల 36 లక్షల ఖాతాల సమాచారంతో రుణ మేళాలు నిర్వహించి, విత్తనాలు, ఎరువులతో పాటు పంట బీమా ప్రీమి యంను కూడా అక్కడే మినహాయించుకోవచ్చు. అన్ని పనులు ఏక కాలంలో జరిగిపోతాయి. నిరీక్షణ, మోసం లేకుండా రైతుకు కొంత ఉపశమనం లభి స్తుంది. వర్షాలు మొదలై వ్యవసాయ సీజన్‌ ప్రారంభమౌతున్నా, ప్రభుత్వాల సంసిద్ధత ఘోరం. మే లో ప్రకటించాల్సిన వ్యవసాయ ప్రణాళిక ఇప్పటి వరకూ లేదు. పంటల ధరల విషయంలో తమకెదురవుతున్న చేదు అనుభ వాల దృష్ట్యా రైతులు అయోమయంలో ఉన్నారు.

దొరకని కనీస మద్దతు ధరే ఓ మాయ
ఈ దేశంలో వ్యవసాయ ఉత్పత్తులకు జరిగేంత దోపిడీ, మరే విషయంలోనూ జరుగదేమో అనిపిస్తుంది. ప్రపంచంలో ఎక్కడైనా ఉత్పత్తిదారే తన ఉత్పత్తికి ధర నిర్ణయిస్తాడు, ఒక్క రైతు తప్ప. రైతును ఆదుకుంటామనే పేరుతో ప్రభు త్వాలు అశాస్త్రీయ పద్ధతిన ఓ ‘కనీస మద్దతు ధర’(ఎమ్మెస్పీ)ను నిర్ణయి స్తాయి. ఎన్నటికీ గిట్టుబాటు ధర కాలేని అది కూడా అమలుకు నోచదు. వ్యాపారులు రింగై, దళారీ వ్యవస్థ దానికి తోడై మార్కెట్లోకి సరుకు వచ్చేనాటికి ధరల్ని రమారమి దిగజార్చి రైతు నోట్లో మట్టికొడతారు. చేసిన అప్పులు వెంటాడుతుంటే, ఆర్థిక అవసరాలతో పంటను మార్కెట్‌ తరలించే రైతు పరిస్థితి, దళారీల నడుమ తోడేళ్లు చుట్టుముట్టిన జింక పిల్లలా ఉంటుంది. మార్కెట్లో సరుకును చూసి వ్యాపారులు, దళారీలు ధర దిగజార్చే వికృతక్రీడ ఆడుతుంటారు.

సదరు మద్దతు ధరైనా, ఎప్పుడో పంటలు పండి, 80 శాతం సరుకు దళారులు, వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయాక కాకుండా సర్కార్లు ఇప్పుడే ప్రకటించాలి. దాన్ని బట్టి ఏ పంట వేసుకోవాలో రైతు తగి నంత ముందుగానే నిర్ణయించుకోవడానికి వీలవుతుంది. కొన్ని పంటల్ని ప్రోత్సహించి కూడా ప్రభుత్వం ధరకు భరోసా ఇవ్వట్లేదు. విస్తృత మార్కెట్‌ సదుపాయాల్ని కల్పించాలి. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి–ఎమ్మెస్పీ దక్కనపుడు తానే కొనగోళ్లు చేయాలి, శీతల–సాధారణ గిడ్డంగులు అందు బాటులోకి తేవాలి. 2014–15 ఆర్థిక సర్వే సిఫారసు ప్రకారం చేపట్టిన ‘జాతీయ వ్యవసాయ మార్కెట్‌’(నామ్‌) ఏర్పాటు ప్రక్రియ సాఫ్ట్‌వేర్‌ లేదని నిలిచిపోయింది.

సదరు గ్రిడ్‌ ఏర్పడితే, ప్రోత్సాహక ధరలకు దేశంలో ఎక్కడైనా తమ పంటను అమ్ముకునే అవకాశం రైతుకు లభిస్తుంది. పాలకుల లెక్కల్లో రైతు సంఘటిత ‘ఓటు బ్యాంకు’ కానందునే ఈ చిన్నచూపనే అభిప్రా యముంది. దేశానికి వెన్నెముకను మనమే విరిచేస్తే మున్ముందు దేశం గతేం టని పాలకులు ప్రశ్నించుకోవాలి. దేశంలోని, ఒక రాష్ట్రంలోని, ఓ జిల్లాలోని... ఓ మారుమూల ‘క్రాప్‌ హాలిడే’ ప్రకటిస్తేనే సాటి సమాజం నివ్వెరపోయింది. రేపు దేశమంతా రైతు ‘క్రాప్‌ హాలీడే’ ప్రకటిస్తే దేశం గతి ఏం కాను? ఆలో చించాలి. భయమో, భక్తో... ‘జై జవాన్‌’ను గౌరవిస్తున్నాం. తిండిపెట్టి పోషిస్తున్న ‘జై కిసాన్‌’ సంగతేంటి? అన్నం పెట్టే రైతు క్షోభిస్తే దేశానికే అరిష్టం!!


దిలీప్‌ రెడ్డి
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement