Body building championship
-
Syed Asifa: దీపస్తంభం
‘శక్తి’ అనే మాటకు ఎన్నో కోణాలలో ఎన్నో నిర్వచనాలు ఉన్నాయి. ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్ మాటల్లో ‘శక్తి’కి నిర్వచనం ‘లక్ష్యం కోసం ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకపోవడం’. అలాంటి ‘శక్తి’ సయ్యద్ ఆసిఫాలో ఉంది. బాడీ బిల్డింగ్‌లో ‘రాణి’స్తున్న ఆసిఫా ఎంతోమంది యువతులకు స్ఫూర్తిని ఇస్తోంది. ఈ నెల 5 నుంచి 11 వరకు మాల్దీవులలో జరిగే వరల్డ్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్–2024లో 52 దేశాలు పాల్గొనబోతున్నాయి. ఈ పోటీకి తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక మహిళ సయ్యద్ ఆసిఫా...‘పెళ్లికి ముందు ప్రపంచాన్ని జయించాలని కల కంటాం. పెళ్లయిన తరువాత ఇల్లే ప్రపంచం అవుతుంది’ అనేది చాలామంది గృహిణుల నోటినుంచి నిరాశ నిండిన చమత్కారంతో వినిపించే మాట. ఆ చమత్కారం మాట ఎలా ఉన్నా... ఎంతోమంది ప్రతిభావంతులైన మహిళలు పెళ్లి తరువాత కలలకు తెర వేసి, ఇంటి నాలుగు గోడలకే పరిమితం అవుతున్నారనేది అక్షర సత్యం. అయితే కొందరు మాత్రం‘ఇలాగే జరగాలని లేదు. ఇలా కూడా జరుగుతుంది’ అని తమ విజయాలతో నిరూపిస్తారు. సయ్యద్ ఆసిఫా ఈ కోవకు చెందిన మహిళ.ప్రకాశం జిల్లా కంభం పట్టణానికి చెందిన ఆసిఫా పెళ్లయిన తరువాత ఇల్లే లోకం అనుకోలేదు. ఒక కల కన్నది. ఆ కలను నిజం చేసుకుంది. బీ ఫార్మసీ చేస్తున్నప్పుడు కంభం పట్టణానికి చెందిన మిలిటరీలో పనిచేసే మొఘల్ అన్వర్ బేగ్‌తో ఆసిఫా వివాహం జరిగింది. చదువుపై ఆమె ఇష్టం బీఫార్మసీ పూర్తి చేసేలా చేసింది. ఆ తరువాత ఎంబీఎ పూర్తి చేసింది. చదువుల విషయంలో భర్త ఏరోజూ అభ్యంతరం చెప్పలేదు. తానే చదువుతున్నంత సంతోషపడేవాడు.‘పెళ్లికిముందు తల్లిదండ్రులు ప్రోత్సహించినట్లుగా, పెళ్లయిన తరువాత భర్త ప్రోత్సాహం ఉండాలి. ఆ ఉత్సాహంతో ఎన్నో విజయాలు సాధించవచ్చు’ అంటుంది ఆసిఫా. చదువు పూర్తయిన తరువాత ఒక ప్రముఖ ఫార్మా కంపెనీలో జనరల్ మేనేజర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించింది. ‘ఇక చాలు’ అనుకొని ఉంటే ఆసిఫా దేశదేశాలకు వెళ్లేది కాదు. విజేతగా ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చి ఉండేది కాదు.ఒకానొక రోజు ‘బాడీ బిల్డింగ్’పై తన ఆసక్తిని భర్తకు తెలియజేసింది ఆసిఫా. ‘ఇప్పుడు ఎందుకు ... ఉద్యోగ బాధ్యతలు, మరోవైపు బాబును చూసుకోవాలి’ అని ఆయన నిరాశపరిచి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదుగానీ ‘నువ్వు కచ్చితంగా సాధించగలవు’ అని ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ ధైర్యంతోనే ముందడుగు వేసింది ఆసిఫా.ప్రముఖ అమెరికన్ బాడీ బిల్డింగ్ చాంపియన్ కొరినా ఎవర్సన్ గ్రాడ్యుయేషన్ చేసింది. పెళ్లయిన తరువాత ‘బాడీ బిల్డింగ్’ వైపు వెళ్లింది. ‘ఇప్పుడు ఏమిటీ! బాడీ బిల్డింగ్ ఏమిటీ!!’ అన్నట్లుగా మాట్లాడారు చాలామంది. వీలైనంతగా వెటకారాలు కూడా చేశారు. ‘రెస్పాన్స్ ఇలా వస్తుంది ఏమిటీ’ అని ఆమె వెనకడుగు వేయలేదు. జిమ్ వైపే అడుగులు వేసింది.‘నేను కూడా వస్తాను’ అంటూ భర్త ఆమెతోపాటు మాడిసన్లోని ‘ఎర్నీ’ జిమ్‌కు వెళ్లి ప్రాక్టీస్ చేసేవాడు. ఆమె శ్రమ వృథా పోలేదు. 1980లో ‘మిస్ మిడ్ అమెరికా’గా మొదలైన ఆమె విజయ పరంపర రిటైరయ్యే వరకు అజేయంగా కొనసాగింది. కొరినా ఎవర్సన్లాంటి ఎంతోమంది విజేతలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లిన ఆసిఫా వెటకారాలను పట్టించుకోలేదు. ఆమె సాధన వృథా పోలేదు. బాడీబిల్డింగ్‌లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించి తిరుగులేని విజేతగా నిలిచింది.బాడీ బిల్డింగ్‌లోకి అడుగు పెట్టకముందు ఎంబీఏ చదివే రోజుల్లో జైపూర్‌లో జరిగిన ఈత పోటీల్లో వెండి పతకం సాధించింది ఆసిఫా. ఆ సమయంలో ఎంతోమంది నోటినుంచి వినిపించిన ‘కంగ్రాచ్యులేషన్స్’ అనే మాట తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆనాటి ఆ ఉత్సాహమే శక్తిగా మారి నలుగురు గొప్పగా మాట్లాడుకునేలా ‘బాడీ బిల్డింగ్ ఛాంపియన్’ను చేసింది. ట్రాక్ రికార్డ్→ 2019లో ఆసిఫా బాడీ బిల్డింగ్‌లో శిక్షణ మొదలు పెట్టింది → 2023లో తెలంగాణలో జరిగిన రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్ పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచింది → 2023లో గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీలలో పతకాలు గెలుచుకుంది → 2024లో ‘సౌత్ ఇండియన్ చాంపియన్ షిప్’లో ప్రథమ స్థానంలో నిలిచింది. అర్జున కలఅర్జున అవార్డు సాధించడమే లక్ష్యంగా కష్టపడుతున్నాను. అర్జున అవార్డు సాధించాలంటే మూడు సార్లు వరల్డ్ చాంపియన్ షిప్ సాధించాల్సి ఉంటుంది. అందుకోసం కష్టపడి సాధన చేస్తున్నాను. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. ఇందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం కావాలి. పెళ్లి తర్వాత భర్త ప్రోత్సహించాలి. నా భర్త ప్రోత్సాహంతో నేను ఈ స్థాయికి రాగలిగాను. అందరూ ప్రోత్సహిస్తే ప్రతి ఇంటికి ఒక మెడల్ వచ్చే అవకాశం ఉంటుంది.– సయ్యద్ ఆసిఫా– ఖాదర్ బాష, సాక్షి, కంభం, ప్రకాశం జిల్లా -
సిక్‌ప్యాక్! లుక్ కోసమైతే ఫసక్కే
అనారోగ్యంపాలవుతున్న బాడీ బిల్డర్స్సిక్స్ ప్యాక్ శరీరానికి మంచిది కాదు..ఆరోగ్యకరమైన కొవ్వులూ అవసరమే : వైద్యులు ఏదైనా అతిగా చేస్తే అనర్థమే..! ఔను నిజమనే అంటున్నారు వైద్యులు.. ఇంతకీ ఏంటది? దేని గురించి? ఈ చర్చంతా దేనికి అనుకుంటున్నారా? అదే నండి బాబు సిక్స్ ప్యాక్ గురించి.. సిక్స్ ప్యాక్ అనగానే.. ప్రస్తుత తరానికి ఎంతో క్రేజ్. ఆ పేరు చెప్పగానే శరీరంలోని నరాలన్నీ జివ్వుమన్నట్లు అవుతుంది.. కానీ అతిగా చేస్తే ఆరోగ్యానికి అనర్థమే అంటున్నారు వైద్యులు.. ఇటీవల పలువురు హీరోలు అతిగా వ్యాయామం చేసి అనారోగ్యం పాలవ్వడమే దీనికి చక్కటి ఉదాహరణ. అసలు సిక్స్ ప్యాక్ కథేంటి? వైద్యులు ఏమంటున్నారు? తెలుసుకుందాం.. బాలీవుడ్ టు టాలీవుడ్.. సిక్స్ ప్యాక్ సినిమా స్క్రీన్కు పరిచయమై రెండు దశాబ్దాలు పైమాటే. అయినా అంతకంతకూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది. దాదాపు బాలీవుడ్, టాలీవుడ్ అగ్రహీరోల్లో యుక్తవయసులో ఉన్న హీరోలందరూ ఆరున్నొక్కరాగం ఆలపిస్తున్నవారే. తెలుగులో ‘దేశ ముదురు’తో అల్లు అర్జున్ నుంచి మొదలై సునీల్, ప్రభాస్, నితిన్, జూనియర్ ఎనీ్టయార్, రామ్‌చరణ్, సుధీర్‌బాబు, విజయ్ దేవరకొండ...తాజాగా అఖిల్..ఇలా అనేకమంది ఆరు–ఎనిమిది పలకల దేహాలతో తెరపై గ్రీక్ లుక్‌లో తళుక్కుమంటున్నారు. అనుకరణ మరింత ప్రమాదమట.. సిక్స్‌ప్యాక్ కొనసాగింపు కోసం నాగశౌర్య నెలల తరబడి తీవ్ర కసరత్తులు చేశారని, అదే విధంగా కఠినమైన డైట్ ను పాటించారని సమాచారం. ఎప్పుడూ హుషారుగా ఆరోగ్యంగా కనిపించే శౌర్యకు ఆకస్మికంగా స్పృహ కోల్పోయే పరిస్థితి రావడానికి సిక్స్ ప్యాక్ క్రేజ్ కారణమై ఉండవచ్చని పలువురి వాదన.. అయితే వైద్యులు మాత్రం ఆ విషయాన్ని ధృవీకరించలేదు. ఈ నేపధ్యంలో హీరోల్ని చూసి మక్కీకి మక్కీ అనుసరించే లక్షలాది మంది యువ అభిమానులు జాగ్రత్త పడాల్సి ఉందని, అన్ని రకాల వసతులూ, శిక్షకులూ ఉన్న స్టార్లకే అలా అయితే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరుపలకల దేహాన్ని పొందాలని కోరుకునేవారు చాలా మంది ఉండొచ్చు.. అయితే దానిని సాధించడం చాలా కష్టం. అంతేకాదు సాధించినా కూడా ఆ సిక్స్‌ప్యాక్‌ని కొనసాగించడం మరింత కష్టం. ఈ విషయం చాలా మందికి తెలీదు సిక్స్–ప్యాక్ మ్యానియాలో పడి గుడ్డిగా అనుసరించే ముందు, ఆకస్మిక, కఠినమైన డైట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి యువత తెలుసుకోవాలని వైద్యులు, ఫిట్నెస్ నిపుణులు సూచిస్తున్నారు. వైద్యులు ఏం చెబుతున్నారు.. 👉సిక్స్ ప్యాక్ కొనసాగింపు శరీరానికి ఆరోగ్యకరమైనది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 👉అసహజమైన శరీరపు అతి తక్కువ కొవ్వు శాతం ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కొన్ని నెలల పాటు సిక్స్ ప్యాక్ మెయింటెయిన్ చేయడం అంటే శరీరపు కొవ్వు శాతం ఉండాల్సిన కనీస స్థాయి కన్నా పురుషులలో అయితే 12% మహిళల్లో అయితే 18% తక్కువవుతుందని వైద్యులు చెబుతున్నారు. 👉కొవ్వు ఇలా పరిమితికి మించి తగ్గడం అనేది అంతర్గత అవయవాల లైనింగ్‌ను ప్రభావితం చేస్తుంది. 👉తమకు వచ్చిన సిక్స్ ప్యాక్ చూపులకు బిగుతుగా కనిపించేలా చేయడానికి కొందరు ఆహారంలో ఉప్పును పూర్తిగా వదులుకుంటారు ఇది మరింత ప్రమాదకరం. ఆహారం నుంచి ఉప్పు తొలగించడం ఆరోగ్యంపై ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది. 👉అదే విధంగా కొన్ని సందర్భాల్లో తాగే నీటికి కూడా ప్రమాదకర పరిమితి పాటించాల్సి ఉంటుంది. ఇది తీవ్రమైన డీ హైడ్రేషన్‌కు గురిచేసే అవకాశం ఉంది. 👉అలాగే సిక్స్–ప్యాక్ సాధించిన తర్వాత కూడా దాన్ని నిలబెట్టుకోవడం కోసం నిరంతరం పరిగెత్తడం, అవి కనపడని రోజున తీవ్ర ఒత్తిడికి గురికావడం జరుగవచ్చని, అది మానసిక సమస్యలకు దోహదం చేస్తుందని సైక్రియాట్రిస్ట్లు హెచ్చరిస్తున్నారు. 👉బాడీ బిల్డింగ్ పోటీలకు హాజరయ్యేవారు లేదా పూర్తిగా వైద్యుల, న్యూట్రిషనిస్ట్‌ల పర్యవేక్షణలో గడిపేవారు, ఒత్తిడితో కూడిన వృత్తి వ్యాపకాలు నిర్వహించని వారు తప్ప సిక్స్ ప్యాక్ గురించి ఎక్కువ శ్రమించడం ప్రమాదకరం అంటున్నారు. 👉ఇక ఫాస్ట్‌గా సిక్స్ ప్యాక్ దక్కించుకోవడం కోసం స్టెరాయిడ్స్ వంటివి అతిగా తీసుకుంటున్నారు కొందరు. ఇది కూడా శరీరంలోని హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తుందని, ఫలితంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అదే అసలు కారణమా? ఆ మధ్య టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఉన్న నటుడు రానా దగ్గుబాటి ఆరోగ్యం విషయంలో రకరకాల వార్తలు గుప్పుమన్నాయి. బాహుబలి అనంతరమే ఆయన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడని, సిక్స్ ఫిజిక్ కోసం ఆశ్రయించిన పలు మార్గాలే దీనికి కారణమని పలు వార్తలు వెలుగు చూశాయి. అలాగే ఇటీవల కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ యువ నటుడు నాగÔౌర్య ఆకస్మిక అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సినిమా షూటింగ్లో పాల్గొన్న ఆయన ఆకస్మికంగా సొమ్మసిల్లిపడిపోగా ఆయనను గచ్చి»ౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం కోలుకున్నారు. ఆసుపత్రిలో చేరే సమయంలో డీ హైడ్రేషన్, హై ఫీవర్‌తో బాధపడుతున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇక కన్నడ సూపర్‌స్టార్ పునీత్‌రాజ్ జిమ్ చేస్తూ స్ట్రోక్ వచ్చి మరణించిన విషయమూ తెలిసిందే...జాగ్రత్తలు పాటించాలి... అబ్బాయిలు మాత్రమే కాదు అమ్మాయిలు సైతం సిక్స్ ప్యాక్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. శారీరకంగా అమ్మాయిలకు, అబ్బాయిలతో పోలిస్తే చాలా పరిమితులు ఉంటాయనే విషయం గుర్తుంచుకోవాలి. మగవాళ్లకన్నా ఆరోగ్య సమస్యలు ఎక్కువ. ఫిట్నెస్ రంగాన్ని ప్రొఫెషన్‌గా తీసుకున్నా, బాడీ బిల్డింగ్ రంగంలో రాణించాలనుకున్నా.. ఓకే గానీ... సరదాకో, గుర్తింపు కోసమో సిక్స్‌ప్యాక్ చేయాలనుకోవడం ఏ మాత్రం సరికాదు. –కిరణ్ డెంబ్లా, డి.జె, ఫిట్నెస్ శిక్షకురాలుఏడాది పాటు శ్రమించా..కఠినమైన వర్కవుట్స్‌తో పాటు డైట్ కూడా ఫాలో అయ్యా. షూటింగ్ ఉన్నప్పుడు వర్కవుట్ చేయడంతో పాటు నీళ్లు కూడా తీసుకోలేదు. ఇలాంటి సందర్భంలో సైకలాజికల్ ప్రెషర్‌ను ఎదుర్కోవడం అంత సులభం కాదు. సిక్స్ ప్యాక్ అనేది చాలా కష్టమైన ప్రక్రియ. –ఆనంద్ దేవర్కొండ, సినీ హీరోరాంగ్ రూట్లో అనర్థాలే.. చాలా మంది యువత ఎఫర్ట్ పెట్టి సిక్స్‌ప్యాక్ సాధిస్తున్నారు. అయితే కొందరు మాత్రం త్వరగా షేప్ వచ్చేయాలని రాంగ్ రూట్లో ప్రయత్నాలు చేయడం, మజిల్స్‌ను పరిమితికి మించి శ్రమకు గురిచేయడం వల్ల ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. –ఎం.వెంకట్, ట్రైనర్, సిక్స్ ప్యాక్ స్పెషలిస్ట్ -
పోటీకి వెళ్తే.. పతకంతోనే ఇంటికి..!
పార్వతీపురం టౌన్: జిల్లా కేంద్రానికి చెందిన పడాల సంతోష్ నచ్చిన రంగంలో రాణించేందుకు ఆసక్తి ఉంటే చాలని నిరూపించాడు. ఏడో తరగతి వరకూ రెగ్యులర్ విద్యాభ్యాసం చేసిన ఆ యువకుడు చదువు వంటబట్టకపోయినా ఓపెన్ టెన్త్ ద్వారా పది పాసయ్యాడు. వ్యాయామంపై ఆసక్తి ఉన్న సంతోష్ తన పేదరికాన్ని పక్కన పెట్టి ఇంటివద్దే ఉంటూ బాడీ బిల్డర్‌గా అవతరించాడు. ఎప్పటికైనా ఇంటర్నేషనల్ స్టేజీపై ప్రదర్శన ఇవ్వాలనుకున్న కలను మహారాష్ట్రలోని పూణేలో జరిగిన మిస్టర్ ఇండియా బాడీ బిల్డింగ్ పోటీల్లో సాకారం చేసుకున్నాడు. పార్వతీపురం పట్టణంలోని జగన్నాథపురం కాలనీలో ఉంటున్న సంతోష్ దేశంలో ఎక్కడ బాడీ బిల్డర్ పోటీలు జరిగినా ప్రదర్శన ఇస్తూ ప్రతిభ చూపుతున్నాడు. అనుకున్నది సాధించి.. సంతోష్ చదువు ఏడవతరగతితో ఆగిపోయింది. తండ్రి మజ్జయ్య రోజువారీ కూలీకాగా, తల్లి సత్యవతి పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికరాలు. బాడీ బిల్డింగ్ పోటీలపై ఆసక్తి ఉన్న సంతోష్ ఇంటి వద్దే తర్ఫీదు పొంది మంచి బాడీ బిల్డర్‌గా శరీర సౌష్టవాన్ని మెరుగుపరుచుకున్నాడు. పలు పోటీల్లో పాల్గొంటూ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగాడు. ప్రోత్సహిస్తున్న భార్య 29 ఏళ్ల సంతోష్ ఇప్పటివరకూ 29 పర్యాయాలు స్టేట్ లెవెల్లో ప్రథమ స్థానంలో నిలిచి మెడల్స్ సాధించాడు. ఏడు పర్యాయాలు స్టేట్ లెవెల్ చాంపియన్ షిప్ సాధించాడు. నాలుగేళ్ల క్రితం వివాహం జరగ్గా, సంతోష్‌కు బాడీబిల్డింగ్ పోటీలపై ఆసక్తి ఉండడంతో భార్య రాధారాణి ప్రోత్సహిస్తూ వచ్చింది. ఇప్పటికీ చిన్నచిన్న ప్రైవేట్ కూలీ పనులు చేస్తున్న సంతోష్ ప్రభుత్వపరమైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాడు. పదోతరగతి అర్హతతో ఉండే ఉద్యోగాల కోసం పలుచోట్లకు వెళ్తున్నాడు. తన భార్య ప్రోత్సాహం కారణంగానే ఈ అవకాశం, మెడల్స్ లభించాయని సంతోష్ తెలిపాడు. జిల్లాకు ఖ్యాతి.. పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడిన తరువాత జిల్లాకు చెందిన యువకుడు జాతీయ స్థాయిలో రాణించడం, దేశ నలుమాలలో ఎక్కడ బాడీ బిల్డింగ్ పోటీలు జరిగినా ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబరుస్తూ పతకాలు సాధిస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకువస్తున్నాడు. అంతేకాకుండా జిల్లా నుంచి 40 మంది యువకులకు బాడీ బిల్డింగ్‌లో తర్ఫీదు ఇస్తూ వారిలో 20 మంది రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దుతున్నాడు. సాధించిన విజయాలు రాష్ట్రస్థాయిలో 29సార్లు ప్రథమ స్థానం 15సార్లు చాంపియన్ ఆఫ్ చాంపియన్ జిల్లాస్థాయిలో 16సార్లు ప్రథమ స్థానం మిస్టర్ సౌత్ ఇండియా పోటీల్లో రెండోస్థానం ఐబీబీఎఫ్ జూనియర్ నేషనల్స్‌లో రెండోస్థానం 2012 పూణెలో జరిగిన జూనియర్‡ నేషనల్ మిస్టర్ ఇండియాలో రెండవ స్థానం 2014 గుజరాత్లో జరిగిన సీనియర్ నేషనల్ మిస్టర్ ఇండియాలో ఐదవ స్థానం 2015 మహారాష్ట్రలో జరిగిన సీనియర్ నేషనల్ మిస్టర్ ఇండియాలో నాల్గవ స్థానం 2018 పూణెలో జరిగిన మిస్టర్ ఇండియా పోటీల్లో ప్రథమ స్థానం 2021 శ్రీకాకుళం, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో మిస్టర్ ఆంధ్రా, ఓవరాల్ చాంపియన్ 2022 పూణెలో జరిగిన సీనియర్ నేషనల్ మిస్టర్ ఇండియా పోటీల్లో బ్రాంజ్ మెడల్ -
సీఎం ప్రోత్సాహంతో కాంస్య పతకం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహంతో ప్రపంచస్థాయి దేహదారుఢ్య పోటీలో కాంస్య పతకం సాధించినట్లు బాడీబిల్డర్ రవికుమార్ తెలిపారు. బాడీ బిల్డింగ్ పోటీకి సీఎం ఆర్థికంగా సాయం అందించి ప్రోత్సహించారని తెలిపారు. ఈ మధ్యనే దక్షిణ కొరియాలో జరిగిన 170కి పైగా దేశాలు పాల్గొన్న మిస్టర్ యూనివర్స్–2022 పోటీలో 70 కేజీల విభాగంలో రవికుమార్ కాంస్యపతకం సాధించారు. ఈ సందర్భంగా ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ జవ్వాది సుబ్రమణ్యంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 2020 అక్టోబర్‌లో సీఎం జగన్‌ను కలిసి ఆర్థికసాయం అందించాల్సిందిగా కోరగా, సీఎం ఆదేశాల మేరకు స్వర్గీయ మేకపాటి గౌతమ్‌రెడ్డి చొరవ తీసుకొని ఆర్జాస్ స్టీల్ కంపెనీ ద్వారా రూ.9 లక్షల సాయాన్ని అందించారని గుర్తు చేశారు. ఈ కాంస్య పతకాన్ని మేకపాటి గౌతమ్‌రెడ్డికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. రవికుమార్‌ను ఏపీఐఐసీ ఎండీ సత్కరించి అభినందించారు. మరిన్ని అంతర్జాతీయ పతకాలను సాధించాలని ఆకాంక్షించారు. -
నాడు ప్రపంచంలోనే అత్యంత బలమైన బాలుడు... పిన్న వయసు బాడీబిల్డర్... ఐతే ఇప్పుడు!!
చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభతో అందర్నీ ఆశ్చర్యచకితులను చేసి పేరుగాంచిన చిన్నారుల గురించి విని ఉన్నాం. కొంతమంది ఆ ప్రతిభను తమ జీవితాంతం కొనసాగిస్తే. మరికొందరికి పెద్దయ్యాక చిన్నప్పటి ప్రతిభ కనుమరగవుతుందో లేక వాళ్లకి ఇక ఆసక్తి తగ్గిపోతుందో తెలియదుగాను వారిలో కొన్ని తేడాలు కనిపిస్తూ ఉంటాయి. అచ్చం అలానే ఉక్రెయిన్‌కి చెందిన బాలుడు చిన్న వయసులోనే బాడీబిల్డర్‌గా పేరుగాంచాడు. కానీ ఇప్పడూ ఆ బాలుడిని చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. (చదవండి: సారీ! రిపోర్టులు మారిపోయాయి.. నీకు కరోనా లేదు!) అసలు విషయంలోకెళ్లితే.....ఉక్రేనియాకి చెందిన రిచర్డ్ సాండ్రాక్ 1992లో జన్మించాడు. అతను 2000 సంవత్సరం నుండి అతని పేరు మారు మ్రోగిపోయింది. కేవలం ఆరేళ్ల ప్రాయం నుండే 85 కిలోలు బరువులు ఎత్తాడు. ఇక ఎనిమిదేళ్లకు 95 కిలోలు వరకు బరువులు ఎత్తి ప్రపంచంలోనే బలమైన బాలుడిగా పేరుగాంచాడు. అంతేకాదు ఆ బాలుడికి 'లిటిల్ హెర్క్యులస్' అని పేరు కూడా పెట్టారు. అతి చిన్న వయసులో బాల సెలబ్రిటీగా పేరు సంపాదించుకున్నాడు. కానీ ఈ పేరు ప్రఖ్యాతుల వెనుకు ఆ బాలుడి కఠోర శ్రమ అసాధారణమైనది. అంతేకాదు ఆ చిన్న వయసులో ఆ బాలుడు తన తండ్రితో కలిసి రోజుకి ఏడు గంటలు వ్యాయమం చేసేవాడు. పైగా రోజుకు 600 పుష్అప్లు, 300 స్క్వాట్లు చేసేవాడు. కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్‌తో మంచి దేహదారుఢ్యాని సొంత చేసుకుని పేరు ప్రఖ్యాతులు పొందాడు. అయితే ఈ వ్యాయమాల వల్ల ఆ బాలుడి శరీరంలో కొవ్వు స్థాయిలు పడిపోయి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో అతని తల్లిదండ్రుల పై సర్వత్రా విమర్శలు రావడమే కాదు ఈ మేరకు అతని పై ఒక డాక్యుమెంటరీని కూడా విడుదల చేశారు. అయితే ట్విస్ట్ ఏంటంటే ఇది అప్పటి సంగతి కానీ ఇప్పుడు అతన్ని చూస్తే మాత్రం ఆ బాలుడేనా అనే సందేహం కలగకమానదు. అయితే ఆ బాలుడికి ఇప్పుడు 29 ఏళ్లు. తాను ఇప్పుడు ఎటువంటి బరువులు ఎత్తడం లేదని చెప్పాడు. ప్రస్తుతం అతను హాలీవుడ్ స్టంట్‌మ్యాన్‌గా పని చేస్తున్నాడు. బరువులు ఎత్తడం బోరు కొట్టేసిందని ఇప్పుడూ తాను నాసా సంబంధించిన క్వాంటం శాస్త్రవేత్త కావలన్నదే తన ధ్యేయమని చెప్పాడు. (చదవండి: ఖరీదైన గిఫ్ట్‌ల స్థానంలో కుక్క బిస్కెట్లు, షేవింగ్ క్రీమ్‌లు) -
ముగిసిన మిస్టర్ తెలంగాణ బాడీ బిల్డింగ్ పోటీలు
సాక్షి, హైదరాబాద్: కేఎం పాండు మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్టర్ తెలంగాణ బాడీ బిల్డింగ్ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సుమారు 200 మందికి పైగా బాడీ బిల్డర్లు పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద్ బహుమతులు ప్రదానం చేశారు. 55 కేజీల నుంచి 100 కేజీల వరకు మొత్తం 10 రౌండ్లలో పోటీలు జరిగాయి. ఒక్కో రౌండ్లో మొదటి స్థానంలో 10 మందిని ఎంపిక చేసి మిస్టర్ తెలంగాణ పోటీలు నిర్వహించారు. కుత్బుల్లాపూర్ వాజ్‌పేయినగర్‌కు చెందిన కట్టా కుమార్ మిస్టర్ తెలంగాణ–2019 విజేతగా నిలిచాడు. 2018 ఆగస్టులో రామంతాపూర్‌లో జరిగిన మిస్టర్ తెలంగాణ పోటీల్లోనూ కుమార్ విజేతగా నిలిచాడు. -
కండ ఉంది... సాయం చేసే గుండె కావాలి
ప్రతి రోజూ ఏడు గంటల వ్యాయం. రుచీ పచీ లేని ఆహారం. సరదాగా తిరగాల్సిన వయసులో ఏదో సాధించాలనే తపన. మరోవైపు బీదరికంతో పోరాటం. కష్టంగా ఉన్నా ఎంతో ఇష్టంతో ముందుకెళుతూ అంతర్జాతీయ పతకాలు సాధిస్తున్నాడు ఈ యువ యోధుడు. ఇంటర్మీడియట్ చదువుకున్న ఎన్.రవి కుమార్ (21) తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎవరూ సాధించని అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. సెప్టెంబర్‌లో ఇండోనేషియాలో జరిగిన ఏషియన్ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించాడు. నవంబర్‌లో సౌత్ కొరియాలో జరగనున్న ప్రపంచ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికైన తొలి తెలుగువ్యక్తి రవికుమారే. అయితే పేదరికం మూలన ఆ ప్రపంచ కప్ పోటీలకు దూరం అయ్యాడు. ప్రతిభ పుష్కలంగా ఉన్నా ఆర్ధిక ఇబ్బందులను అధిగమించడమే అతనికి కష్టంగా ఉంది. నెలకు ఆహార ఖర్చులకే దాదాపు రూ.లక్ష అవుతుంది. స్పాన్సర్షిప్ కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. కొంత చేయూతనిస్తే తప్పకుండా ప్రపంచ మెడల్ సాధిస్తానని ఆత్మ విశ్వాసంతో చెబుతున్నాడు. లారీడ్రైవర్ కుమారుడు రవి కుమార్‌ది గుంటూరు జిల్లా ఏటుకూరు గ్రామం. తండ్రి వెంకట్రావు లారీడ్రైవర్. అమ్మ వెంకట నరసమ్మ గృహిణి. వారిది సాధారణ కుటుంబం. తండ్రి సంపాదన కుటుంబ పోషణకు సరిపోతుంది. అయితే వారు రాత్రింబగళ్లు కష్టం చేసి కుమారుడికి తమ వంతు ప్రోత్సాహం ఇస్తున్నారు. కొడుకు బంగారు పతకం సాధిస్తే చాలని నాన్న లారీ డ్రైవర్‌గా కష్టపడుతుంటే తల్లి చిల్లర అంగడి పెట్టుకొని వచ్చిన సంపాదనను కుమారునికే ఖర్చుపెడుతోంది. పోటీలకు వెళ్లేందుకు డబ్బులు లేకపోతే తన బంగారు నగలు తాకట్టు పెట్టి మరీ పోటీలకు పంపిందామె. ఆ తర్వాత ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రోత్సాహం లభించింది. కండలు పెంచే వ్యాయామం కోసం రవి కుమార్ తీసుకునే పాలు, గుడ్లు, చికెన్, పండ్లు, చేపలు, కూరగాయలు, ప్రోటీన్ పౌడర్లు వీటి ఖర్చు చాలా ఎక్కువ. ప్రస్తుతం స్నేహితుల సాయం, పోటీల ద్వారా వచ్చే ప్రైజ్‌మనీతో సాధన నడుస్తోంది. ఇటీవల సెప్టెంబరు నెలలో ఇండోనేషియా బాటమ్‌లో జరిగిన ప్రపంచ బాడీబిల్డింగ్ పోటీల్లో పతకం సాధించి, పతకంతోపాటు, భారతదేశ జెండాను ప్రదర్శిస్తూ... సరదాగా మొదలైన సాధన రవి కుమార్ తన 15వ ఏట స్నేహితులతో సరదాగా వ్యాయామం ప్రారంబించాడు. రోజుకు గంట సేపు చేస్తున్నా సీరియస్‌గా తీసుకుని చేసింది లేదు. 2014లో గుంటూరులో జి.శ్రీనివాసరావు అనే సీనియర్ బాడీ బిల్డర్ ఏర్పాటు చేసిన పోటీలకు అన్ని జిమ్లకూ ఆహ్వానం అందింది. రవి కుమార్ కూడా ఆ పోటీల్లో సరదాగా పాల్గొన్నాడు. అప్పుడు రవి దేహాన్ని చూసి కొంత మంది నవ్వారు. అది అతని మనస్సులో నాటుకుపోయింది. అప్పుడు కోచ్ జి.శ్రీనివాసరావును కలసి మంచి బాడీ బిల్డర్ అవ్వాలంటే ఏం చేయాలని అడగడం, అందుకు ఆయన కొన్ని సూచనలు చేయడంతో రవి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఇక అప్పటి నుంచి సాధన గంట నుంచి రెండు, మూడు.. నాలుగు గంటలైంది. ‘మిస్టర్ ఆంధ్ర’ టైటిల్ సొంతమయ్యింది. ప్రస్తుతం రవికుమార్ 75 కేజీల విభాగంలో ఇండియాలోనే బెస్ట్‌గా కొనసాగుతున్నాడు. తల్లి వెంకట నరసమ్మతో చిల్లర కొట్టులో... ఆహార నియమాలు కఠోరం బాడీ బిల్డర్స్ ఆహార నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. రవి కుమార్ తీసుకునే చికెన్, ఫిష్, కూరగాయలలో కనీసం ఉప్పుగాని, మసాలాలుగాని వాడరు. సగం ఉడికినవే తినాలి. అంతే కాదు పోటీలకు 10 రోజుల ముందు నుంచి మంచినీరు తాగడం క్రమేపీ తగ్గించేస్తారు. పోటీలకు మూడు రోజుల ముందునుంచి చుక్క నీరు కూడా తీసుకోరు. అప్పుడే బాడీలో ఉండే మజిల్స్‌ను పోటీల్లో ప్రదర్శించే అవకాశం లబిస్తుంది. ఈ మూడు రోజులు వారు పడే అవస్థలు వర్ణాతీతం. అయినా వాటిని ఎంతో ఆనందంగా స్వీకరిస్తారు. అప్పుడే కదా పతకాలు సాధించేది. సాధించిన పతకాలతో... ప్రపంచ కప్ పోటీలకు దూరం నవంబరు 5 నుంచి 11 వరకు దక్షిణ కొరియాలో జరిగే ప్రపంచ బాడీ బిల్డింగ్ పోటీలకు ఎంపిక అయ్యాడు రవి. కాని పేదరికం అడ్డొచ్చింది. స్పాన్సర్లు దొరకకపోవడంతో పోటీలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పతకం సంపాదించాలనే తపన ఉన్నా డబ్బులు లేక వెళ్లలేకపోయాననే బాధ అతనిని పట్టి పీడిస్తోంది. అతను మాత్రం పట్టు వదలకుండా మిస్టర్ ఇండియా బాడీ బిల్డింగ్ పోటీలకు వెళ్లాలని కఠోర శ్రమ చేస్తూనే ఉన్నాడు. ఈ పోటీలు ఫిబ్రవరి 1–2, 2020 సంవత్సరంలో జరగనున్నాయి. స్పాన్సర్లు, ప్రభుత్వం చేయూతనిస్తే, తెలుగోడి సత్తా చాటి బంగారు పతకం సాధిస్తానని ధీమాగా చెబుతున్నాడు. ‘నాకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు. గతంలో ప్రయత్నించి వదిలేసాను. వ్యాయామమే జీవితంలా బతుకుతున్నాను. దాని కోసం ఇంట్లో భారంగా ఉన్నా నెట్టుకొస్తున్నాను. ఒక్కొక్కసారి వదిలేద్దామని అనుకున్నా మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళుతున్నాను. త్వరలో ముఖ్యమంత్రి జగనన్నను కలుస్తాను. ఆయనకు నా పతకాలన్నీ చూపిస్తాను’ అని ఆశగా చెబుతున్నాడు రవి కుమార్. – ఒ.వెంకట్రామిరెడ్డి, సాక్షి అమరావతి బ్యూరో -
బాడీబిల్డర్ రవి కుమార్‌కు స్వర్ణం
గుంటూరు వెస్ట్: ఆసియా జూనియర్ బాడీబిల్డింగ్, ఫిజిక్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిశ్శంకరరావు రవి కుమార్ మెరిశాడు. ఇండోనేసియాలోని బెట్టాంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో గుంటూరుకు చెందిన రవి కుమార్ 75 కేజీల విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు. తద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి బాడీబిల్డర్‌గా ఘనత వహించాడు. ఈ సందర్భంగా రవి కుమార్‌కు గుంటూరు జిల్లా బాడీ బిల్డింగ్ సంఘం కార్యదర్శి, కోచ్ జి.శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. -
కండల వీరులొస్తున్నారు
సాక్షి, సిటీబ్యూరో: కండలు తిరిగిన బాడీ బిల్డర్లు, విదేశాలకు చెందిన అంతర్జాతీయ బాడీ బిల్డర్లు హైటెక్స్ వేదికపై ప్రదర్శన ఇవ్వనున్నారు. దీంతో పాటు ఫిట్నెస్ అండ్ మెడికల్ సర్వీసెస్ సైతం ప్రారంభం కానుంది. ఇటీవల ఏర్పడిన సర్టిఫైడ్ పర్సనల్ ట్రెయినర్స్ అసోసియేషన్ (సీపీటీఏ) ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెల 23, 24, 25 తేదీల్లో హైటెక్స్‌లో ‘స్పోర్ట్స్ ఎక్స్పో’ పేరుతో ఈ పోటీలను నిర్వహించనున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన క్రాంతికిరణ్‌రావు నగరంలోని పలు ప్రాంతాల్లో ‘క్రాన్ ఫిట్నెస్’ను ఏర్పాటు చేశారు. ఆయన ‘సర్టిఫైడ్ పర్సనల్ ట్రెయినర్స్ అసోసియేషన్’ (సీపీటీఏ)కు వర్కింగ్ ప్రెసిడెంట్. ట్రెయినర్‌గా ఎందరికో ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెల 23, 24, 25వ తేదీల్లో హైటెక్స్‌లో ‘స్పోర్ట్స్ ఎక్స్పో’ను నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా ‘సీపీటీఏ’ ‘హైదరాబాద్ ఇంటర్నేషనల్ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్’ను ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్‌పోలో బాడీబిల్డింగ్ పోటీలు నిర్వహిస్తారు. పోటీలకు బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, విజయవాడ, విశాఖపట్టణం ప్రాంతాలతో పాటు విదేశాలకు చెందిన కండల వీరులు సైతం సందడి చేయనున్నారు. 24న బాడీ బిల్డింగ్‌తో పాటు ఫిట్నెస్ అండ్ మెడికల్ ప్రొఫెషనల్ సర్వీసెస్‌ను సైతం ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకుడు క్రాంతికిరణ్‌రావు తెలిపారు. ఫిట్‌నెస్‌పై అవగాహనకల్పిస్తారు.. ‘సర్టిఫైడ్ పర్సనల్ ట్రెయినర్స్ అసోసియేషన్’ (సీపీటీఏ) ఆధ్వర్యంలో ‘హైదరాబాద్ ఇంటర్నేషనల్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్’ పోటీలు నిర్వహిస్తున్నాం. సర్టిఫికెట్ ట్రెయిన్డ్ ట్రెయినర్స్గా ఈ పోటీలను తొలిసారిగా చేపట్టాం. ఫిట్నెస్, హెల్త్‌పై ఇన్స్ట్రక్టర్స్ అవగాహన కల్పిస్తారు. – క్రాంతికిరణ్‌రావు, క్రాన్ఫిట్నెస్అధినేత, సీపీటీఏ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవీ కేటగిరీలు.. బాడీ బిల్డింగ్ పోటీల్లో ‘బాడీ బిల్డింగ్, క్లాసిక్ బాడీబిల్డింగ్, మాస్టర్స్ బాడీ బిల్డింగ్, మెన్స్ ఫిజిక్, మెన్స్ ఫిట్నెస్ మోడల్, ఫిజికల్లీ చాలెంజ్డ్, ఉమెన్ ఫిట్నెస్ మోడల్’ వంటి కేటగిరీల్లో పోటీలు ఉంటాయి. పాల్గొనదల్చినవారు నేరుగా అదే రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. -
చేయూతనందిస్తే సత్తా చాటుతా..!
మారేడుపల్లి : చైనా దేశంలోని మంగోలియాలో సెప్టెంబర్ 12 నుంచి 18 వరకు జరగనున్న మిస్టర్ ఏషియన్, మిస్టర్ వరల్డ్ బాడీబిల్డింగ్ పోటీలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాకగూడకు చెందిన సంజీవ కిరణ్‌కుమార్ ఎంపికయ్యాడు. మిస్టర్ వరల్డ్‌గా ఎంపిక కావడమే తన లక్ష్యమని, తన కల సాకారం అయ్యే రోజులు దగంగరలోనే ఉన్నాయని అందుకు ప్రభుత్వం, దాతలు సహకారం అందించాలని కోరాడు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే మరిన్ని విజయాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. చిన్నతనం నుంచే బాడీ బిల్డింగ్‌పై ఆసక్తి... కంటోన్మెంట్ కార్ఖానా కాకగూడకు చెందిన కిరణ్‌కుమార్ (27) జిమ్‌లో ట్రైనర్‌గా పనిచేస్తూనే తన ఆశయసాధన కోసం శక్తివంచలేకుండా కృషి చేస్తున్నాడు. చిన్నతనం నుంచే బాడీబిల్డింగ్‌పై ఆసక్తిని పెంచుకున్న అతను 2001 నుంచి శరీర దృఢత్వ పోటీల్లో పాల్గొని సత్తా చాటాడు. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ఎన్నో రికార్డులు సాధించాడు. మిస్టర్ తెలంగాణ టైటిల్ విన్నర్‌గా 8సార్లు, మిస్టర్ ఉస్మానియా 6 సార్లు, మిస్టర్ గ్రేటర్ హైదరాబాద్ 8 సార్లు ఎంపికయ్యాడు. మిస్టర్ సౌత్ ఇండియా 3 సార్లు, గోల్డ్‌మెడల్, ఫెడరేషన్‌కప్ (సిల్వర్) సాధించాడు. ఈ నెల 6, 7 తేదీల్లో ఖమ్మంలో జరిగిన ఇండియన్ బాడీబిల్డర్స్ ఫెడరేషన్లో 200 మంది పాల్గొనగా రాష్ట్రం నుండి 90 కిలోల కేటగిరిలో మిస్టర్ వరల్డ్‌కు కిరణ్‌కుమార్ ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఓల్డ్ వాసవీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు తేలుకుంట సతీష్‌కుమార్ గుప్తా పలువురు కిరణ్‌కుమార్‌ను అభినందించారు. ప్రభుత్వం సహకారం అందిస్తే మరిన్ని విజయాలు సాధిస్తానని కిరణ్‌కుమార్ పేర్కొన్నాడు. జిమ్ కోచ్‌గా పనిచేస్తూ వచ్చిన ఆదాయంతోనే తన ఖర్చులను చూసుకోవాల్సి వస్తుందన్నారు. నిత్యం ఆరు గంటలు జిమ్‌లోనే సాధన చేయాల్సి ఉంటుందని, అందుకు ప్రొటీన్స్తో కూడిన ఆహారం తీసుకోవాల్సి ఉంటుందని, ఇందుకు తనకు వచ్చే ఆదాయం సరిపోవడం లేదన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మిస్టర్ వరల్డ్–2019 టైటిల్ సాధించడమే తన లక్ష్యమని ఆయన ధీమా వ్యక్తంచేశాడు. -
కండల వీరులొస్తున్నారు..!
ఆ కండలు కొండలను తలపిస్తాయి. బాప్రే.. ఎలా పెంచారంటూ ఒకింత ఆశ్చర్య చకితులను చేస్తాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వందలాది మంది బాడీ బిల్డర్లు తమ కండలను ప్రదర్శించే వేదిక సిద్ధమైంది. సౌతిండియాలోనే తొలిసారిగా ‘నరేష్ సూర్య క్లాసిక్ ఫిట్నెస్ ఎక్స్పో– 2019 పేరుతో నిర్వహించనున్న ఈ పోటీలు శంషాబాద్‌లో జరగనున్నాయి. మన దేశంతోపాటు దుబాయి, హాంకాంగ్, ఖతార్ వంటి పలు దేశాలకు చెందిన బాడీబిల్డర్లు ఇందులో పాల్గొని తమ విన్యాసాలతో కనువిందు చేయనున్నారు. హిమాయత్‌నగర్ :బంజారాహిల్స్‌కు చెందిన నరేష్ సూర్య సిటీలోని ఎంతోమంది ప్రముఖులకు పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్‌గా సేవలు అందిస్తున్నారు. నగరవాసుల్లో ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించేందుకు, తెలంగాణలోని బాడీ బిల్డర్లకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు ‘నరేష్ సూర్య క్లాసిక్ ఫిట్నెస్ ఎక్స్పో’ పేరుతో 2016లో ఎక్స్పోను ప్రారంభించారు. ఈ ఏడాది శంషాబాద్ సతంరియాలోని రాజ్‌మహాల్ ఫంక్షన్ హాల్లో ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఎక్స్పోను తన స్నేహితుడు జయసింహగౌడ్‌తో కలిసి ఆయన నిర్వహించనున్నారు. కేటగిరీలివే.. ‘మెన్స్ బాడీ బిల్డింగ్, మెన్స్ క్లాసిక్ బాడీ బిల్డింగ్, మెన్స్ ఫిజిక్, మేల్ ఫిట్నెస్ మోడల్, మాస్టర్స్ బాడీ బిల్డింగ్, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ బాడీ బిల్డింగ్, ఉమెన్స్ బికినీ, ఉమెన్స్ ఫిగర్, జూనియర్ బాడీ బిల్డింగ్, జూనియర్ మెన్స్ ఫిజిక్ (23సంవత్సరాల కంటే తక్కువ వయసు వారికి)’ విభాగాల్లో పోటీలను నిర్వహించనున్నారు. వీటిలో ప్రధానంగా ‘పవర్ లిఫ్టింగ్, స్ట్రెంత్ లిఫ్టింగ్, ఆర్మ్ రెజ్లింగ్, క్రాస్‌ఫిట్ ఛాలెంజ్’లతో పాటు ‘మౌతాయి, ఎంఎంఏ, కిక్‌బాక్సింగ్’ వంటి వాటిని జత చేర్చారు. ఈ ఎక్స్పో సౌతిండియాలోనే తొలిసారిగా నిర్వహిస్తున్నట్లు నరేష్ సూర్య తెలిపారు. బాడీ బిల్డింగ్ పోటీలను మొత్తం ఐదు కేటగిరీల్లో నిర్వహించనున్నారు. అండర్– 60, అండర్– 70, అండర్70– 80, అండర్– 80–90, అండర్– 90 ప్లస్ కేజీల్లో నిర్వహిస్తున్నారు. ఈ ఐదు కేటగిరీల్లో చాంపియన్‌గా నిలిచిన వారికి ‘నరేష్ సూర్య క్లాసిక్ పిట్నెస్– 2019’ పేరుతో రూ.లక్ష నగదు బహుమతినిఇవ్వనున్నారు. అలరించనున్న అంతర్జాతీయ బిల్డర్లు మూడు రోజుల పాటు జరిగే ఎక్స్‌పోలో జాతీయ, అంతర్జాతీయ బాడీ బిల్డర్లు కనువిందు చేయనున్నారు. ఈ నెల 20న ‘ఇంటర్నేషనల్ మెన్స్ ఫిజిక్ అథ్లెట్ సిద్ధాంత్ జైస్వాల్, అర్నాల్ క్లాసిక్ విజేత, మిస్టర్ ఏషియన్ అంకుర్ శర్మ, బెంగళూరుకు చెందిన ఫిట్ కపూల్ పూజ, గౌరవ్, ఉమెన్స్ ఫిగర్ సోనాలీస్వామి, బాడీబిల్డర్ పుణిత్ సాందూ, నిపున్ అగర్వాల్, ప్రీతం చౌగ్లీ, రోహిత్‌రాజ్‌పుత్’లు డెమో ఇవ్వనున్నారు. గుర్తింపు, అవగాహన కోసం.. రాష్ట్రంలోని బాడీ బిల్డర్లకు గుర్తింపు తేవడంతో పాటు ప్రజల్లో ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచాలనే ఈ ఎక్స్పోను ఏటా నిర్వహిస్తున్నాం. ఈసారి పోటీలు సౌతిండియాలోనే ఎక్కడా జరగని విధంగా తలపెట్టాం. ప్రభుత్వం సాయం అందిస్తే ఈ పోటీలకు మరింత ఆదరణ లభిస్తుంది. – నరేష్ సూర్య,ఆర్గనైజర్ రోజుకు రూ.100 మూడు రోజుల పాటు ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు జరిగే ఈవెంట్స్ ప్రవేశ రుసుం ఒక్కరోజుకు రూ.100.టికెట్లను బుక్‌మై షో లేదా నేరుగా తీసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 86866 52655/77022 72803 -
‘మిస్టర్ తెలంగాణ’ రాహుల్
సాక్షి, హైదరాబాద్: ‘మిస్టర్ తెలంగాణ’ ఓపెన్ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్–2017 పోటీల్లో అల్వాల్‌కు చెందిన రాహుల్ విజేతగా నిలిచాడు. సుల్తాన్షాహి జీహెచ్ఎంసీ ప్లే గ్రౌండ్లో జరిగిన ఈ పోటీల్లో పలు జిల్లాలకు చెందిన బాడీ బిల్డర్లు బరిలోకి దిగారు. ‘మిస్టర్ తెలంగాణ’ టైటిల్ గెలిచిన రాహుల్‌కు టోర్నీ చైర్మన్ సుంకరి రంగారావు ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బండారు దత్తాత్రేయ, మాజీ కార్పొరేటర్ పాశం సురేందర్, ట్రాఫిక్ ఏసీపీ రాజ్ కుమార్, టోర్నీ నిర్వాహకులు రషీద్ షరీఫ్, నరేశ్ కుమార్, శివకాంత్, లక్ష్మణ్ రావు పాల్గొన్నారు. -
డోన్ట్ వరీ... బి పాజిటివ్!
ఆదర్శం కండర కండరులతో బ్యాంకాక్ సందడి సందడిగా ఉంది. ‘మిస్టర్ వరల్డ్ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్’ కోసం ప్రపంచ నలుమూలల నుంచి ఎందరో వచ్చారు. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? ఎన్నో లెక్కలు, అంచనాలు. పోటీలు మొదలయ్యాయి. 65 కేజీల కేటగిరిలో మణిపూర్‌కి చెందిన ప్రదీప్‌కుమార్ సింగ్ కాంస్య పతకం గెలుచుకున్నాడన్న వార్త ప్రపంచాన్ని తాకింది. ప్రదీప్ ముఖం అయితే ఆనందంతో వెలిగిపోయింది. అయితే అది ఆటలో గెలిచిన ఆనందపు వెలుగు కాదు. చీకటిని సవాలు చేసిన సాహసోపేత వెలుగు. అవమానం నడ్డి విరిచే ఆత్మ స్థ్యైర్యం నుంచి పుట్టిన వెలుగు. ఆ వెలుగు మళ్లీ కొద్ది రోజుల్లోనే మరోసారి అతనిలో కనిపించింది... ‘మిస్టర్ సౌత్ ఏషియా’ టైటిల్ గెలుచుకున్నప్పుడు! అతనిలో అంతటి విజయగర్వానికి కారణం తెలుసుకోవాలంటే... అతని గురించిన ఓ నిజం తెలుసుకోవాలి. 1986. హెరాయిన్ మణిపూర్‌ను మత్తులో ఊపేస్తున్న కాలం. ఇంటర్ చదువుతోన్న ప్రదీప్, తన కజిన్ కారణంగా హెరాయిన్‌కు అలవాటు పడ్డాడు. అది తీసుకున్నప్పుడల్లా ఏదో శక్తి వచ్చినట్లు అనిపించేది. దాంతో దానికి బానిసైపోయాడు. అతడి దృష్టి మార్చ డానికి పై చదువుల కోసం ఒడిశాకు పంపించారు తల్లిదండ్రులు. అక్కడ ప్రదీప్‌కి హెరాయిన్ జాడ కనిపించలేదు. కానీ బ్రౌన్‌షుగర్ పరిచయమయ్యింది. ఆ కొత్త మత్తులో మునిగి తేలసాగాడు. పతనం వైపుగా ఒక్కొక్క మెట్టూ దిగు తూనే ఉన్నాడు. మెల్లగా చదువుతో పాటు జ్ఞాపకశక్తి కూడా దెబ్బ తినడం మొద లైంది. చిన్న చిన్న విషయాలు కూడా గుర్తుండేవి కావు. భవిష్యత్ ఎంతమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. సరిగ్గా అప్పుడే ఎయిడ్స అన్న మాట తొలిసారి విన్నాడు ప్రదీప్. ‘సిరంజీలను షేర్ చేసుకోవడం ద్వారా కూడా హెచ్ఐవీ సోకవచ్చు’ అని తెలిసి హడలిపోయాడు. మత్తుమందు తీసుకునే క్రమంలో ఎన్నో సార్లు ఇతరులు వాడిన సిరంజిని తాను వాడాడు. అంటే తనకి కూడా?... ఆ ఆలోచనే వణికించింది. ఇంకెప్పుడూ అలా చేయకూడదనుకున్నాడు. కానీ అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. ఒకరోజు తీవ్రమైన గొంతునొప్పి, జ్వరం వచ్చింది. ఎంతకీ తగ్గలేదు. ఏమీ తినలేని పరిస్థితి. దాంతో రీజనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(రిమ్స్)కు వెళ్లాడు. డాక్టర్లు పరీక్షించి టీబీ అని చెప్పారు. బరువు తగ్గడం మొదలైంది. 30 కేజీలకు చేరుకున్నాడు. ఇక బతుకుతాడన్న నమ్మకం ఎవరికీ లేదు. చివరి ప్రయ త్నంగా గౌహతి మెడికల్ కాలేజీకి తీసుకు వెళ్లి చికిత్స చేయించారు. అప్పుడే అతనికి ఉన్నది టీబీ కాదని, ఎయిడ్స అని తెలి సింది. షాకైపోయాడు ప్రదీప్. ఏది జరగ కూడదనుకున్నాడో అదే జరిగిందని కుంగి పోయాడు. లోకమంతా ఏకమై తనను చూసి నవ్వుతున్నట్లు, తనను దూరంగా తరిమికొడుతున్నట్లు అనిపించేంది. దానికి తగ్గట్టుగానే ఫ్రెండ్స అందరూ దూరమై పోయారు. చూడ్డానికి కూడా వచ్చేవారు కాదు. బంధువులూ ఛీదరించుకున్నట్టు చూసేవారు. ఆ అవమానాలతో, ఆలో చనల భారంతో అలిసియాడు. ఆ బాధ లోంచి ఓ ప్రశ్న పుట్టింది. నేనేం తప్పు చేశాను? నాకు తెలియకుండానే ఈ వ్యాధి వచ్చింది. ఇది కేవలం జబ్బు. దీనికి నేను ఈ సమాజంలో బతికే అర్హతను కోల్పో వాలా? అలా అనుకోగానే కసి పెరిగింది. ‘ఇక భయపడుతూ బతకను. నా నుంచి దూరంగా వెళ్లిపోయినవాళ్లే నన్ను వెతు క్కుంటూ వచ్చేలా చేస్తాను’ అనుకున్నాడు. ఆ నిర్ణయం అతనిలో కొత్త శక్తి నింపింది. కానీ ముందు శరీరానికి శక్తి రావాలి. అందుకే హాస్పిటల్ నుంచి బయటికి రాగానే ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు ప్రదీప్. రోజూ ఉదయం వాకింగ్ చేయడం ప్రారం భించాడు. మూడేళ్ల తరువాత పొరుగూరు లోని జిమ్‌లో చేరాడు. తన పరిస్థితి అక్కడెవరికీ తెలియదు కాబట్టి ఎలాంటి సమస్యా ఎదురుకాలేదు. అక్కడి యువ కుల బాడీ చూసి తనకూ అలా ఉంటే బాగుణ్ననిపించింది. ‘‘నేను బాడీ బిల్డింగ్ చేయవచ్చా?’’ అని డాక్టర్‌ను అడిగాడు. ఆయన ‘నో’ అన్నారు. అయినా వెనక్కి తగ్గలేదు. పట్టు వదలకుండా ప్రయత్నిం చాడు. బాడీ పెంచాడు. మూడేళ్ల తర్వాత ‘మిస్టర్ మణిపూర్’ టైటిల్‌ను గెలుచు కున్నాడు. ఆరోజు స్టేజిమీద తనకు హెచ్ఐవీ ఉందని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు ప్రదీప్. ‘‘నాలాంటి హెచ్ఐవీ పాజిటివ్ పేషెంట్లలో ఆత్మస్థైర్యం నింపడానికే నిజం చెప్పాను’’ అన్నాడు. అతడు చెప్పిన నిజం వృథా పోలేదు. ఎందరో స్ఫూర్తి పొందారు. బాడీ బిల్డరులుగా మారారు. తలరాతనే తిరిగి రాసిన ప్రదీప్... ఇప్పుడు వాళ్లందరికీ గురువు! -
ముగిసిన వాలీబాల్ పోటీలు
కడప స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : కడప నేక్‌నామ్ కళాక్షేత్రంలో ఆదివారం రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు, కాబోయే కడప నగర మేయర్ కె.సురేష్‌బాబు ముఖ్య అతి థిగా విచ్చేసి పోటీలు ప్రారంభించారు. బాడీబిల్డిం గ్ క్రీడ సాధన కష్టంతో పాటు ఖర్చుతో కూడుకోవడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపేవారు కాదన్నా రు. ప్రసుత్త పరిస్థితుల్లో ఆరోగ్యం, అందం కోసం ఈ క్రీడకు ఆదరణ పెరుగడం శుభపరిణామమన్నా రు. జిల్లాలో గతంలో నాలుగుసార్లు విజయవంతం గా రాష్ర్ట స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించి న అనుభవం అసోసియేషన్‌కు ఉందన్నారు. వికలాంగుల విభాగంలో సైతం జాతీయస్థాయిలో రాణించిన క్రీడాకారులు జిల్లాలో ఉన్నారన్నారు. 13 జిల్లాలకు చెందిన క్రీడాకారులు హాజరై పోటీల్లో పాల్గొనడం సంతోషకరమని కడప ఎమ్మెల్యే, జిల్లా బాడీబిల్డింగ్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ ఎస్.బి. అంజద్‌బాషా అన్నారు. కడప జిల్లాకు బాడీబిల్డింగ్ క్రీడలో ప్రత్యేక స్థానం ఉందని, జాతీయస్థాయి క్రీడాకారులు ఇక్కడ ఉండటంతో పాటు కేవలం క్రీడకే పరిమితం కాకుండా సామాజిక సేవలో పాల్గొనడం సంతోషకరమని ఏపీ బాడీబిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు, చీఫ్ రెఫరీ ఆనంద్‌కుమార్ తెలిపారు. అనంతరం 55 కిలోల నుంచి 90 కిలోల విభాగాల్లో దాదాపు 100 మందిపైగా క్రీడాకారులు ప్రదర్శన నిర్వహించారు. డీఎస్డీఓ బాషామోహిద్దీన్, జిల్లా బాడీబిల్డింగ్ అసోసియేషన్ చైర్మ న్ రాజారత్నం ఐజాక్, ప్రెసిడెంట్ ఎస్కేఎస్ మహ్మ ద్, కార్యదర్శి షంషీరుద్దీన్, రెఫరీలు భాస్కరన్, పవన్‌కుమార్, సుధాకర్‌రెడ్డి, సతీష్, న్యామతుల్లా, ప్రముఖులు సలావుద్దీన్, అబ్దుల్‌ఖాదర్, షాజహా న్, ఇలియాస్‌బాషా, రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
55 కేజీ విజేత రామ్మూర్తి
హుడా కాంప్లెక్స్, న్యూస్‌లైన్: జాతీయ స్థాయి జూనియర్ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్‌లో 55 కేజీ విభాగంలో రామ్మూర్తి విజేతగా నిలిచాడు. జ్యోతి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ పోటీలు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగాయి. 55, 60, 65, 70, 75, 80, 85 కేజీ విభాగాల్లో మిస్టర్ ఇండియా పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు తదితర రాష్ట్రాలతో పాటు తెలంగాణ నుంచి పలువురు బాడీబిల్డర్లు పాల్గొన్నారు. 55 కేజీ విభాగంలో మొదటి స్థానం దక్కించుకున్న రామ్మూర్తి (తమిళనాడు)కి హైదరాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముద్దగౌని రాంమోహన్‌గౌడ్ బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి సంజయ్‌మోర్, కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయస్వామి దేవాలయ చైర్మన్ సుదర్శన్ యాదవ్, తెలంగాణ అమెచ్యూర్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బెన్ని ఫ్రాన్సిస్, నర్సింగంరెడ్డి, పి.మల్లారెడ్డి, సలీం, దయానిధి, శ్రీనివాస్, సంజీవ్, కె.శ్రీధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
బాడీ బిల్డింగ్ చాంప్ అహ్మద్ బామాస్
కాచిగూడ, న్యూస్‌లైన్: షేక్ హుస్సేన్ మెమోరియల్ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్‌లో అహ్మద్ బామాస్ విజేతగా నిలిచాడు. తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాచిగూడలోని నెహ్రూనగర్ మైదానంలో ఈ పోటీలు నిర్వహించారు. ఇందులో జంట నగరాల నుంచి దాదాపు 150 జిమ్‌లకు చెందిన సుమారు 200 మంది బాడీబిల్డర్లు పాల్గొన్నారు. తొలి స్థానంలో నిలిచిన అహ్మద్‌కు ట్రోఫీతో పాటు నగదు బహుమతి కూడా అందజేశారు. రాజు రన్నరప్‌గా నిలువగా, శివకు మూడో స్థానం దక్కింది. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సికింద్రాబాద్ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఎండీ సలీమ్, ఎండీ ఖాజా, ఎండీ ఖాదర్, మాజీ మంత్రి కృష్ణయాదవ్, పీసీసీ కార్యదర్శి ఆర్.లక్ష్మణ్ యాదవ్, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ ముస్తాఫా అలీ, భావి ధన్‌రాజ్, బాడీ బిల్డర్స్ సంతోష్, మోతేశామ్ తదితరులు పాల్గొన్నారు.