సిక్‌ప్యాక్‌! లుక్‌ కోసమైతే ఫసక్కే | Is building six-pack abs bad for health? | Sakshi
Sakshi News home page

సిక్‌ప్యాక్‌! లుక్‌ కోసమైతే ఫసక్కే

Published Mon, Jun 17 2024 7:22 AM | Last Updated on Mon, Jun 17 2024 10:43 AM

Is building six-pack abs bad for health?

అనారోగ్యంపాలవుతున్న బాడీ బిల్డర్స్‌
సిక్స్‌ ప్యాక్‌ శరీరానికి మంచిది కాదు..
ఆరోగ్యకరమైన కొవ్వులూ అవసరమే : వైద్యులు 

ఏదైనా అతిగా చేస్తే అనర్థమే..! ఔను నిజమనే అంటున్నారు వైద్యులు.. ఇంతకీ ఏంటది? దేని గురించి? ఈ చర్చంతా దేనికి అనుకుంటున్నారా? అదే నండి బాబు సిక్స్‌ ప్యాక్‌ గురించి.. సిక్స్‌ ప్యాక్‌ అనగానే.. ప్రస్తుత తరానికి ఎంతో క్రేజ్‌. ఆ పేరు చెప్పగానే శరీరంలోని నరాలన్నీ జివ్వుమన్నట్లు అవుతుంది.. కానీ అతిగా చేస్తే ఆరోగ్యానికి అనర్థమే అంటున్నారు వైద్యులు.. ఇటీవల పలువురు హీరోలు అతిగా వ్యాయామం చేసి అనారోగ్యం పాలవ్వడమే దీనికి చక్కటి ఉదాహరణ. అసలు సిక్స్‌ ప్యాక్‌ కథేంటి? వైద్యులు ఏమంటున్నారు? తెలుసుకుందాం..  

బాలీవుడ్‌ టు టాలీవుడ్‌.. 
సిక్స్‌ ప్యాక్‌ సినిమా స్క్రీన్‌కు పరిచయమై రెండు దశాబ్దాలు పైమాటే. అయినా అంతకంతకూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది. దాదాపు బాలీవుడ్, టాలీవుడ్‌ అగ్రహీరోల్లో యుక్తవయసులో ఉన్న హీరోలందరూ ఆరున్నొక్కరాగం ఆలపిస్తున్నవారే. తెలుగులో ‘దేశ ముదురు’తో అల్లు అర్జున్‌ నుంచి మొదలై సునీల్, ప్రభాస్, నితిన్, జూనియర్‌ ఎనీ్టయార్, రామ్‌చరణ్, సుధీర్‌బాబు, విజయ్‌ దేవరకొండ...తాజాగా అఖిల్‌..ఇలా అనేకమంది  ఆరు–ఎనిమిది పలకల దేహాలతో తెరపై గ్రీక్‌ లుక్‌లో తళుక్కుమంటున్నారు.  
అనుకరణ మరింత ప్రమాదమట.. 

సిక్స్‌ప్యాక్‌ కొనసాగింపు కోసం నాగశౌర్య నెలల తరబడి తీవ్ర కసరత్తులు చేశారని, అదే విధంగా కఠినమైన డైట్‌ ను పాటించారని సమాచారం. ఎప్పుడూ హుషారుగా ఆరోగ్యంగా కనిపించే శౌర్యకు ఆకస్మికంగా స్పృహ కోల్పోయే పరిస్థితి రావడానికి సిక్స్‌ ప్యాక్‌ క్రేజ్‌ కారణమై ఉండవచ్చని పలువురి వాదన.. అయితే వైద్యులు మాత్రం ఆ విషయాన్ని ధృవీకరించలేదు. ఈ నేపధ్యంలో హీరోల్ని చూసి మక్కీకి మక్కీ అనుసరించే లక్షలాది మంది యువ అభిమానులు జాగ్రత్త పడాల్సి ఉందని, అన్ని రకాల వసతులూ, శిక్షకులూ ఉన్న స్టార్లకే అలా అయితే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఆరుపలకల దేహాన్ని పొందాలని కోరుకునేవారు చాలా మంది ఉండొచ్చు.. అయితే దానిని సాధించడం చాలా కష్టం. అంతేకాదు సాధించినా కూడా ఆ సిక్స్‌ప్యాక్‌ని కొనసాగించడం మరింత కష్టం. ఈ విషయం చాలా మందికి తెలీదు సిక్స్‌–ప్యాక్‌ మ్యానియాలో పడి గుడ్డిగా అనుసరించే ముందు, ఆకస్మిక, కఠినమైన డైట్‌ వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి యువత తెలుసుకోవాలని వైద్యులు, ఫిట్‌నెస్‌ నిపుణులు సూచిస్తున్నారు.  



వైద్యులు ఏం చెబుతున్నారు.. 
👉సిక్స్‌ ప్యాక్‌ కొనసాగింపు శరీరానికి ఆరోగ్యకరమైనది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  

👉అసహజమైన శరీరపు అతి తక్కువ కొవ్వు శాతం ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.  కొన్ని నెలల పాటు సిక్స్‌ ప్యాక్‌ మెయింటెయిన్‌ చేయడం అంటే శరీరపు కొవ్వు శాతం ఉండాల్సిన కనీస స్థాయి కన్నా పురుషులలో అయితే 12%  మహిళల్లో అయితే 18% తక్కువవుతుందని వైద్యులు చెబుతున్నారు.  

👉కొవ్వు ఇలా పరిమితికి మించి తగ్గడం అనేది అంతర్గత అవయవాల లైనింగ్‌ను ప్రభావితం చేస్తుంది.  

👉తమకు వచ్చిన సిక్స్‌ ప్యాక్‌ చూపులకు బిగుతుగా కనిపించేలా చేయడానికి కొందరు ఆహారంలో ఉప్పును పూర్తిగా వదులుకుంటారు ఇది మరింత ప్రమాదకరం. ఆహారం నుంచి ఉప్పు తొలగించడం ఆరోగ్యంపై ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది.  

👉అదే విధంగా కొన్ని సందర్భాల్లో తాగే నీటికి కూడా ప్రమాదకర పరిమితి పాటించాల్సి ఉంటుంది. ఇది తీవ్రమైన డీ హైడ్రేషన్‌కు గురిచేసే అవకాశం ఉంది.  

👉అలాగే సిక్స్‌–ప్యాక్‌ సాధించిన తర్వాత కూడా దాన్ని నిలబెట్టుకోవడం కోసం నిరంతరం పరిగెత్తడం, అవి కనపడని రోజున తీవ్ర ఒత్తిడికి గురికావడం జరుగవచ్చని, అది మానసిక సమస్యలకు దోహదం చేస్తుందని సైక్రియాట్రిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు.  

👉బాడీ బిల్డింగ్‌ పోటీలకు హాజరయ్యేవారు లేదా పూర్తిగా వైద్యుల, న్యూట్రిషనిస్ట్‌ల పర్యవేక్షణలో గడిపేవారు, ఒత్తిడితో కూడిన వృత్తి వ్యాపకాలు నిర్వహించని వారు తప్ప సిక్స్‌ ప్యాక్‌ గురించి ఎక్కువ శ్రమించడం ప్రమాదకరం అంటున్నారు. 

👉ఇక ఫాస్ట్‌గా సిక్స్‌ ప్యాక్‌ దక్కించుకోవడం కోసం స్టెరాయిడ్స్‌ వంటివి అతిగా తీసుకుంటున్నారు కొందరు. ఇది కూడా శరీరంలోని హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తుందని, ఫలితంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు.  

అదే అసలు కారణమా? 
ఆ మధ్య టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ ఉన్న నటుడు రానా దగ్గుబాటి ఆరోగ్యం విషయంలో రకరకాల వార్తలు గుప్పుమన్నాయి. బాహుబలి అనంతరమే ఆయన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడని,  సిక్స్‌ ఫిజిక్‌ కోసం ఆశ్రయించిన పలు మార్గాలే దీనికి కారణమని పలు వార్తలు వెలుగు చూశాయి. అలాగే ఇటీవల కొన్ని రోజుల క్రితం టాలీవుడ్‌ యువ నటుడు నాగÔౌర్య ఆకస్మిక అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. హైదరాబాద్‌లో జరుగుతున్న  సినిమా షూటింగ్‌లో  పాల్గొన్న ఆయన ఆకస్మికంగా సొమ్మసిల్లిపడిపోగా ఆయనను గచ్చి»ౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం కోలుకున్నారు. ఆసుపత్రిలో చేరే సమయంలో డీ హైడ్రేషన్, హై ఫీవర్‌తో బాధపడుతున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇక కన్నడ సూపర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌ జిమ్‌ చేస్తూ స్ట్రోక్‌ వచ్చి మరణించిన విషయమూ తెలిసిందే...

జాగ్రత్తలు పాటించాలి... 
అబ్బాయిలు మాత్రమే కాదు అమ్మాయిలు సైతం సిక్స్‌ ప్యాక్‌ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. శారీరకంగా అమ్మాయిలకు, అబ్బాయిలతో పోలిస్తే చాలా పరిమితులు ఉంటాయనే విషయం గుర్తుంచుకోవాలి. మగవాళ్లకన్నా ఆరోగ్య సమస్యలు ఎక్కువ. ఫిట్‌నెస్‌ రంగాన్ని ప్రొఫెషన్‌గా తీసుకున్నా, బాడీ బిల్డింగ్‌ రంగంలో రాణించాలనుకున్నా.. ఓకే గానీ... సరదాకో,  గుర్తింపు కోసమో సిక్స్‌ప్యాక్‌ చేయాలనుకోవడం ఏ మాత్రం సరికాదు.  
–కిరణ్‌ డెంబ్లా, డి.జె, ఫిట్‌నెస్‌ శిక్షకురాలు

ఏడాది పాటు శ్రమించా..
కఠినమైన వర్కవుట్స్‌తో పాటు డైట్‌ కూడా ఫాలో అయ్యా. షూటింగ్‌ ఉన్నప్పుడు వర్కవుట్‌ చేయడంతో పాటు నీళ్లు కూడా తీసుకోలేదు. ఇలాంటి సందర్భంలో సైకలాజికల్‌ ప్రెషర్‌ను ఎదుర్కోవడం అంత సులభం కాదు. సిక్స్‌ ప్యాక్‌ అనేది చాలా కష్టమైన ప్రక్రియ.   
–ఆనంద్‌ దేవర్‌కొండ, సినీ హీరో

రాంగ్‌ రూట్‌లో అనర్థాలే.. 
చాలా మంది యువత ఎఫర్ట్‌ పెట్టి సిక్స్‌ప్యాక్‌ సాధిస్తున్నారు. అయితే కొందరు మాత్రం త్వరగా షేప్‌ వచ్చేయాలని రాంగ్‌ రూట్‌లో ప్రయత్నాలు చేయడం, మజిల్స్‌ను పరిమితికి మించి శ్రమకు గురిచేయడం వల్ల ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు.   
–ఎం.వెంకట్, ట్రైనర్, సిక్స్‌ ప్యాక్‌  స్పెషలిస్ట్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement