పార్వతీపురం టౌన్: జిల్లా కేంద్రానికి చెందిన పడాల సంతోష్ నచ్చిన రంగంలో రాణించేందుకు ఆసక్తి ఉంటే చాలని నిరూపించాడు. ఏడో తరగతి వరకూ రెగ్యులర్ విద్యాభ్యాసం చేసిన ఆ యువకుడు చదువు వంటబట్టకపోయినా ఓపెన్ టెన్త్ ద్వారా పది పాసయ్యాడు. వ్యాయామంపై ఆసక్తి ఉన్న సంతోష్ తన పేదరికాన్ని పక్కన పెట్టి ఇంటివద్దే ఉంటూ బాడీ బిల్డర్‌గా అవతరించాడు. ఎప్పటికైనా ఇంటర్నేషనల్ స్టేజీపై ప్రదర్శన ఇవ్వాలనుకున్న కలను మహారాష్ట్రలోని పూణేలో జరిగిన మిస్టర్ ఇండియా బాడీ బిల్డింగ్ పోటీల్లో సాకారం చేసుకున్నాడు. పార్వతీపురం పట్టణంలోని జగన్నాథపురం కాలనీలో ఉంటున్న సంతోష్ దేశంలో ఎక్కడ బాడీ బిల్డర్ పోటీలు జరిగినా ప్రదర్శన ఇస్తూ ప్రతిభ చూపుతున్నాడు.
అనుకున్నది సాధించి..
సంతోష్ చదువు ఏడవతరగతితో ఆగిపోయింది. తండ్రి మజ్జయ్య రోజువారీ కూలీకాగా, తల్లి సత్యవతి పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికరాలు. బాడీ బిల్డింగ్ పోటీలపై ఆసక్తి ఉన్న సంతోష్ ఇంటి వద్దే తర్ఫీదు పొంది మంచి బాడీ బిల్డర్‌గా శరీర సౌష్టవాన్ని మెరుగుపరుచుకున్నాడు. పలు పోటీల్లో పాల్గొంటూ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగాడు.
ప్రోత్సహిస్తున్న భార్య
29 ఏళ్ల సంతోష్ ఇప్పటివరకూ 29 పర్యాయాలు స్టేట్ లెవెల్‌లో ప్రథమ స్థానంలో నిలిచి మెడల్స్ సాధించాడు. ఏడు పర్యాయాలు స్టేట్ లెవెల్ చాంపియన్ షిప్ సాధించాడు. నాలుగేళ్ల క్రితం వివాహం జరగ్గా, సంతోష్‌కు బాడీబిల్డింగ్ పోటీలపై ఆసక్తి ఉండడంతో భార్య రాధారాణి ప్రోత్సహిస్తూ వచ్చింది. ఇప్పటికీ చిన్నచిన్న ప్రైవేట్ కూలీ పనులు చేస్తున్న సంతోష్ ప్రభుత్వపరమైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాడు. పదోతరగతి అర్హతతో ఉండే ఉద్యోగాల కోసం పలుచోట్లకు వెళ్తున్నాడు. తన భార్య ప్రోత్సాహం కారణంగానే ఈ అవకాశం, మెడల్స్ లభించాయని సంతోష్ తెలిపాడు.
జిల్లాకు ఖ్యాతి..
పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడిన తరువాత జిల్లాకు చెందిన యువకుడు జాతీయ స్థాయిలో రాణించడం, దేశ నలుమాలలో ఎక్కడ బాడీ బిల్డింగ్ పోటీలు జరిగినా ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబరుస్తూ పతకాలు సాధిస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకువస్తున్నాడు. అంతేకాకుండా జిల్లా నుంచి 40 మంది యువకులకు బాడీ బిల్డింగ్‌లో తర్ఫీదు ఇస్తూ వారిలో 20 మంది రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దుతున్నాడు.
సాధించిన విజయాలు
- రాష్ట్రస్థాయిలో 29సార్లు ప్రథమ స్థానం
- 15సార్లు చాంపియన్ ఆఫ్ చాంపియన్
- జిల్లాస్థాయిలో 16సార్లు ప్రథమ స్థానం
- మిస్టర్ సౌత్ ఇండియా పోటీల్లో రెండోస్థానం
- ఐబీబీఎఫ్ జూనియర్ నేషనల్స్‌లో రెండోస్థానం
- 2012 పూణెలో జరిగిన జూనియర్‡ నేషనల్ మిస్టర్ ఇండియాలో రెండవ స్థానం
- 2014 గుజరాత్‌లో జరిగిన సీనియర్ నేషనల్ మిస్టర్ ఇండియాలో ఐదవ స్థానం
- 2015 మహారాష్ట్రలో జరిగిన సీనియర్ నేషనల్ మిస్టర్ ఇండియాలో నాల్గవ స్థానం 2018 పూణెలో జరిగిన మిస్టర్ ఇండియా పోటీల్లో ప్రథమ స్థానం
- 2021 శ్రీకాకుళం, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో మిస్టర్ ఆంధ్రా, ఓవరాల్ చాంపియన్
- 2022 పూణెలో జరిగిన సీనియర్ నేషనల్ మిస్టర్ ఇండియా పోటీల్లో బ్రాంజ్ మెడల్
Comments
Please login to add a commentAdd a comment