powerlifting
-
Peruri Jyoti Varma: పవర్ ఫుల్
విరామం అంటే వెనక్కి తగ్గడం కాదు, పరాజయం అంతకంటే కాదు. విత్తనం నాటిన రోజు నుంచి అది పచ్చగా మొలకెత్తడానికి మధ్య కూడా విరామం ఉంటుంది. ఒకప్పుడు హ్యాండ్‌బాల్ గేమ్ నేషనల్ ప్లేయర్ అయిన జ్యోతి పెళ్లి తరువాత కుటుంబ బాధ్యతల వల్ల ఆటలకు విరామం ఇవ్వాల్సి వచ్చింది. విరామం తర్వాత మళ్లీ ఆటల ప్రపంచంలోకి అడుగుపెట్టిన పేరూరి జ్యోతి పవర్ లిఫ్టింగ్‌లో తక్కువ సమయలోనే సాధన చేసి గోవాలో జరిగిన బెంచ్‌ప్రెస్ నేషనల్ చాంపియన్‌షిప్‌లో 45 కిలోల బరువు ఎత్తి కాంస్యం సాధించింది. నిజానికి అది పతకం కాదు... అపూర్వమైన ఆత్మవిశ్వాసం...జ్యోతి స్వస్థలం మహారాష్ట్రలోని నాగ్‌పూర్. పెళ్లికిముందు హ్యాండ్‌బాల్ గేమ్‌లో నేషనల్ ప్లేయర్. 1994లో ‘విజ్ఞాన్ యూనివర్శిటీ’లో ప్రొఫెసర్‌గా చేస్తున్న డాక్టర్ పిఎల్ఎన్ వర్మతో వివాహం జరగడంతో గుంటూరుకు వచ్చింది. కుటుంబ బాధ్యతల వల్ల ఆటలకు దూరంగా ఉండక తప్పలేదు. అయితే వ్యాయామాలకు, యోగ సాధనకు విరామం ఇవ్వలేదు. కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, మగ్గం పని... వంటి అభిరుచుల పట్ల మక్కువను విడవలేదు. మనం అడుగుపెట్టే స్థలాలు కూడా భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి అంటారు. జ్యోతి విషయంలో అలాగే జరిగింది.ఏడాది క్రితం స్థానిక ‘ఇన్ఫినిటీ జిమ్’లో చేరి రకరకాల వ్యాయామాలు చేసేది. ఆమె ఉత్సాహం, పట్టుదల చూసి కోచ్ రమేష్ శర్మ ‘మీరు పవర్ లిఫ్టింగ్‌లో అద్భుతాలు సాధించగలరు’ అన్నారు. ఆమె నవ్వుతూ ఊరుకుంటే ఆ కథ అక్కడితో ముగిసేది. కోచ్ మాటలను ఆమె సీరియస్‌గా తీసుకుంది. ‘ఒకసారి ఎందుకు ప్రయత్నించకూడదు’ అనుకున్నది. అలా అనుకోవడంలో పతకాలు సాధించాలనే ఆశయం కంటే... ఆటల పట్ల చిన్నప్పటి నుంచి ఉన్న ఇష్టమే కారణం. ఆరు నెలల క్రితం పవర్ లిఫ్టింగ్‌లో సాధన మొదలుపెట్టింది. ఇది చాలామందికి ఆశ్చర్యంగా అనిపించింది. ‘ఇంకా నువ్వు కాలేజీ స్టూడెంటే అని అనుకుంటున్నావా’ లాంటి వెటకారాలు వినిపించాయి. అయితే ఈ వెటకారాలు, మిరియాలు ఆమె సాధన ముందు నిలవలేకపోయాయి. మరింత దీక్షతో సాధన చేసింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన మాస్టర్స్ నేషనల్స్‌లో కొద్దితేడాతో పతకం మిస్ అయింది. ‘పతకంతో తిరిగి వస్తావనుకున్నాం’ అన్నారు మిత్రులు. ‘వంద పతకాలతో తిరిగి వచ్చాను’ అన్నది జ్యోతి నవ్వుతూ. ఆమె చెప్పిన వంద పతకాలు... ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసంతోనే గోవాలో జరిగిన బెంచ్‌ప్రెస్ నేషనల్స్ చాంపియన్ షిప్లో రికార్డు స్థాయిలో 45 కేజీలు బరువు ఎత్తి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. నిజానికి ఇదిప్రారంభం మాత్రమే. ఆమె ఉత్సాహం, పట్టుదల చూస్తుంటే మరిన్ని విజయాలు ఆమె ఖాతాలో పడతాయని నిశ్చయంగా చెప్పవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే...ఏదైనా సాధించాలంటే మన విలువ మనం ముందుగా గుర్తించాలి. నిత్య వ్యాయామంతోనే ఆరోగ్యం సాధ్యం అవుతుంది. నాకు ఆరోగ్య సమస్యలున్నాయి. హైపో థైరాయిడ్, స్పాండిలైటిస్ నన్ను ఇబ్బంది పెట్టినా వాటిని అధిగమించి ముందుకు వెళ్తున్నాను. రోజూ యోగ, జిమ్, మెడిటేషన్, గార్డెనింగ్ చేస్తాను.– పేరూరి జ్యోతి– దాళా రమేష్‌బాబు, సాక్షి, గుంటూరుఫొటోలు: మురమళ్ల శ్రీనివాసరావు. -
‘కామన్వెల్త్’ పవర్ లిఫ్టింగ్‌లో సాదియాకు బంగారు పతకాలు
సాక్షి, అమరావతి: దక్షిణాఫ్రికాలో జరుగుతున్న కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఎక్విప్డ్ చాంపియన్ షిప్ జూనియర్ విభాగంలో సాదియా అల్మాస్ గురువారం బంగారు పతకాలు సాధించారు. స్వాట్, బెంచ్ ప్రెస్, డెట్ లిఫ్ట్ మూడు విభాగాల్లోను బంగారు పతకాలతోపాటు 460 కిలోల బరువులు ఎత్తి ఓవరాల్ విభాగంలో కూడా మరో బంగారు పతకం సాధించారు. ఈ సందర్భంగా అమెకు ఏపీ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అభినందనలు తెలిపింది. -
వరల్డ్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ కప్.. స్లోవేనియాకు వెళ్లనున్న గుంటూరు అమ్మాయి
స్లోవేనియా వేదికగా జరగనున్న వరల్డ్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ కప్ పోటీల్లో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి షేక్ సాదియా అల్మస్ పాల్గోనుంది. కాగా అల్మస్ 57 కేజీ విభాగంలో పోటీ పడనుంది. ఈ ఈవెంట్ కోసం ఆమె ఆదివారం(ఆక్టోబర్29) స్లోవేనియాకు పయనం కానుంది. ఈ విషయాన్ని అల్మస్ కోచ్ ఎస్కే సందాని తెలియజేశారు. ఈ ఛాంపియన్ షిప్లో అల్మస్ కచ్చితంగా పతకం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. కాగా ఈ వరల్డ్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ కప్ పోటీలలో భారత్ నుంచి నలుగురు లిఫ్టర్స్ పాల్గోనున్నారు. అంతర్జాతీయ వేదికపై సత్తా చాటేందుకు వెళ్తున్న సాదియా అల్మస్కు ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు మద్ది ప్రభాకారరావు, కార్యదర్శి సకల సూర్యనారాయణ ఆల్‌ది బెస్ట్ తెలియజేశారు. ఈ సందర్భంగా షేక్ సాదియా మాట్లాడుతూ..వరల్డ్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొనటానికి అర్హత సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. అవకాశం కల్పించిన పవర్ లిఫ్టింగ్ ఇండియా అధ్యక్షులు సతీష్ కుమార్ గారికి , కార్యదర్శి పీజీ జోసప్, ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వారికి, గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ పోటీలో పతకం సాధించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తానని ఆమె పేర్కొంది. చదవండి: World Cup 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్.. సిరాజ్‌కు నో ఛాన్స్! జట్టులోకి సీనియర్ ఆటగాడు -
షబీనాకు ఘనస్వాగతం
తెనాలి: అంతర్జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీ ల్లో నాలుగు బంగారు పతకాలను కైవసం చేసుకుని స్వస్థలానికి తిరిగి వచ్చిన పట్టణ లిఫ్టర్ షేక్ షబీనాకు తెనాలిలో ఘనస్వాగతం లభించింది. కేరళ రాష్ట్రం అలెప్పీలో ఈనెల ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు జరిగిన ఆసియా పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో షబీనా 84 కిలోల కేటగిరీలో తలపడి, స్క్వాట్, బెంచ్‌ప్రెస్, డెడ్‌లిఫ్ట్‌లో ప్రథమ స్థానంలో నిలిచి, ఓవరాల్‌గా అగ్రగామిగా నాలుగు విభాగాల్లోనూ బంగారు పతకాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇంటర్ పూర్తయే సరికి అంతర్జాతీయస్థాయిలో పతకాలను సాధించిన షబీనా, కేరళ నుంచి మంగళవారం తెనాలికి తిరిగొచ్చింది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద స్థానికులు తనకు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి షబీనా నివాసమైన సీబీఎన్ కాలనీ వరకు ర్యాలీ నిర్వహించారు. టాపులేని జీపులో నిలబడి, జాతీయ జెండాతో షబీనా అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగింది. ర్యాలీకి ముందుభాగాన డప్పుల విన్యాసం కొనసాగింది. తల్లిదండ్రులు షంషద్, బుజ్జి, కోచ్ ఎస్కే సంధానితో సహా వచ్చిన షబీనాకు పట్టణానికి చెందిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు షేక్ దుబాయ్‌బాబు, మొగల్ అహ్మద్, టీడీపీ నేత మహమ్మద్ ఖుద్దూస్లు స్వాగతం పలికారు. భారతదేశానికి పతకాలను సాధించి, తెనాలికి పవర్ లిఫ్టింగ్‌లో గల ఘనకీర్తిని నిలిపిన క్రీడాకారిణిగా అభినందనలతో ముంచెత్తారు. దారిపొడవునా పలువురు పూలమాలలతో అభినందించారు. ఈ సందర్భంగా షబీనా మాట్లాడుతూ అంతర్జాతీయ పతకాల సాధనే లక్ష్యంగా కష్టమైనప్పటికీ పట్టుదలతో సాధన చేశానని చెప్పింది. ఆశించిన విధంగానే ఆసియా స్థాయిలో పతకాలను సాధించగలిగినట్టు తెలిపింది. ప్రపంచ పోటీలు, కామన్వెల్త్ గేమ్స్‌లోనూ పతకాలను సాధించాలనేది తన లక్ష్యంగా చెప్పా రు. తనను ప్రోత్సహించి, ఆశీర్వదిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేసింది. వీరితోపాటు రహంతుల్లా, కరిముల్లా, జాఫర్, పినపాటి రవీంద్ర, జగన్, ఫణిదపు దుర్గా, చల్లగాలి శివశంకర్, ముజీబ్ ప్రభృతులు పాల్గొన్నారు. -
అమ్మను ఒప్పించి..ఊరును మెప్పించి!
అదో మారుమూల గ్రామం. జిల్లా కేంద్రానికి దూరంగా విసిరేసినట్లు ఉంటుంది. అక్కడో నిరుపేద కుటుంబం. కుటుంబ పెద్ద మరణించడంతో తల్లి రెక్కలుముక్కలు చేసుకుంటోంది. ముగ్గురు ఆడపిల్లల పోషణ ఆమెకు తలకుమించిన భారం. ఎలాగోలా నెట్టుకొస్తున్నా.. రెండో కూతురు లక్ష్యం ఆమెను ఆలోచనలో పడేసింది. ఎంత కష్టమైనా.. కుమార్తె ఎదుగుదలకు తోడుగా నిలవాలనుకుంది. ఉన్నంతలో డబ్బు సర్దుతూ స్వేచ్ఛనిచ్చింది. అందుకు అనుగుణంగానే ఆ యువతి ఇప్పుడు పవర్ లిఫ్టర్‌గా రాణిస్తూ.. ఒలింపిక్స్ లక్ష్యంగా సాధన చేస్తోంది. సాక్షి, ఆస్పరి(కర్నూలు): వెంకటలక్ష్మి. ఈ పేరు ఆస్పరి మండలం కైరుప్పల గ్రామానికే కాదు.. జిల్లా, రాష్ట్రస్థాయిలో ఇప్పుడిప్పుడే వినిపిస్తోంది. ఇంట్లో ముగ్గురూ ఆడపిల్లలే అయినా.. చిన్నప్పటి నుంచి మగరాయుడిలా పెరుగుతూ సరికొత్త లక్ష్యాన్ని ఎంచుకుంది. పేదరికం అడుగడుగునా అవాంతరాలు సృష్టిస్తున్నా.. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకెళ్తోంది. కృషి, పట్టుదల ఉంటే గమ్యం చేరుకోవడం సులువని నిరూపిస్తూ.. పురుషులకే కష్టమైన పవర్ లిఫ్టింగ్‌లో తనదైన శైలిలో రాణిస్తోంది. ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయిలో తనకంటూ ఓ ప్రత్యేకతను కనపరుస్తున్న ఈమె ఒలింపిక్స్‌లో పతకం సాధనే తన జీవిత ఆశయమని చెబుతోంది. వివరాలు ఆమె మాటల్లోనే.. అమ్మ నరసమ్మ, నాన్న వీరభద్రప్ప. మేము ముగ్గురు ఆడపిల్లలం. చిన్నతనంలోనే నాన్న మరణించడంతో అమ్మ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. అక్క, చెల్లికి పెళ్లిళ్లు చేసింది. అమ్మ కష్టం దగ్గర నుంచి చూడటంతో నేను ఆమెకు మగబిడ్డగా తోడు నిలిచేందుకు నిర్ణయించుకున్నా. చిన్నతనం నుంచి హెయిర్ కటింగ్‌తో పాటు దుస్తుల విషయంలోనూ మగ పిల్లలనే అనుసరించేదాన్ని. అమ్మ కూడా నన్ను అలాగే పెంచింది. పాఠశాలకు వెళ్లినా.. కళాశాలలో అడుగుపెట్టినా ఎవరూ పోల్చుకోలేనంతగా నేను మగరాయుడిలా ఉండేదాన్ని. కూలి పనులకు వెళ్తూనే.. కష్టం విలువ తెలియడం వల్ల అమ్మకు భారం కాకూడదని బలంగా నిశ్చయించుకున్నా. ఆలూరులో ఇంటర్మీడియట్, ఎమ్మిగనూరులో డిగ్రీ పూర్తి చేశా.. ఆదివారం, సెలవు రోజుల్లో కూలి పనులకు వెళ్లి కూడబెట్టుకున్న డబ్బుతో కాలేజీ ఫీజులు, బస్సు పాస్‌లకు లోటు లేకుండా చూసుకునేదాన్ని. పదో తరగతి చదువుతుండగా ప్రతి రోజు జిమ్‌కు వెళ్లేదాన్ని. అప్పట్లోనే మంచి లిఫ్టర్‌గా ఎదగాలని నిర్ణయించుకున్నా. అయితే ఇంట్లో పరిస్థితులు బాగోలేక ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తయ్యాక నా లక్ష్యానికి పదును పెట్టా. అమ్మను ఒప్పించి కర్నూలుకు చేరుకున్నా. రెండేళ్లుగా ఇక్కడ పవర్ లిఫ్టింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నా. ఆర్థికపరంగా మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఒలింపిక్స్ లక్ష్యంగా.. మొట్టమొదటి జిల్లాస్థాయి పోటీల్లో ప్రథమ స్థానం దక్కడంతో ఇంకా పైకి ఎదగాలనే కోరిక బలపడింది. కిందిస్థాయి నుంచి వచ్చినదాన్ని కావడంతో జయాపజయాలను పెద్దగా పట్టించుకోను. అయితే ముందుకు వెళ్లాలని మాత్రం నిర్ణయించుకున్నా. పవర్ లిఫ్టింగ్ ఒక్కటే కాదు, వెయిట్ లిఫ్టింగ్‌లోనూ నాకు కరణం మల్లీశ్వరి, మీరాబాయ్ చాను ఆదర్శం. పోటీల్లో రాణించి ఉద్యోగం సంపాదించి స్థిరపడాలని అనుకోలేదు. ఒలింపిక్స్‌లో దేశానికి పతకం తీసుకురావాలనేది నా కోరిక. ఉన్నత చదువులు అభ్యసించాలని ఉన్నా, ఆర్థిక స్థోమత సరిపోక పోటీలపైనే దృష్టి సారిస్తున్నా. లక్ష్యం దిశగా ముందుకు సాగుతోంది వెంకటలక్ష్మీ పట్టుదల చాలా ఎక్కువ. కఠోర సాధన చేస్తుంది. కష్టాలను దగ్గర నుంచి చూడటం వల్ల అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే బలమైన కోరిక ఉంది. అందువల్లే ఇప్పటి వరకు పాల్గొన్న అన్ని పోటీల్లో మంచి ఫలితాలనే సాధించింది. శిక్షణకు క్రమం తప్పకుండా హాజరవుతుంది. అంతర్జాతీయ పోటీల్లో తప్పక రాణిస్తుంది. – యూసుఫ్ బాషా, శాప్ కోచ్, కర్నూలు పెళ్లి చేసి పంపక ఎందుకివన్నీ.. ముగ్గురూ ఆడ పిల్లలే కావడం, నాన్న అకాలమరణంతో మా ఇంట్లో చీకటి అలుముకుంది. అక్కకు అతి కష్టం మీద పెళ్లి చేయగా.. నేను మగరాయుడిలా తిరగడం చూసి అమ్మకు గ్రామస్తుల నుంచి సూటిపోటి మాటలు ఎదురయ్యాయి. రెండో కూతురికి పెళ్లి చేయకుండా చిన్న పాపకు పెళ్లి చేస్తే ఎలా, దాన్ని ఎవరు చేసుకుంటారనే ప్రశ్నలతో మౌనంగా రోదించింది. ఇంటరీ్మడియట్ చదువుతున్న సమయంలోనే సంబంధం చూస్తామంటే ససేమిరా అన్నా. బాగా చదువుకోవడంతో పాటు జీవితంలో స్థిరపడి అమ్మను బాగా చూసుకోవాలనే కోరిక ఉంది. అందుకే ఎవరేమన్నా పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దని గట్టిగా చెప్పిన. ఆ తర్వాత ఇంక నా గురించి వదిలేసి మా చెల్లెకి కూడా పెళ్లి చేసినారు. తీసుకునే ఆహారం ఇలా.. ఉదయం: ఆరు కోడిగుడ్లు, 500 గ్రాముల రాగిజావ, మొలకెత్తిన విత్తనాలు, నాలుగు అరటి పండ్లు, డ్రైఫ్రూట్స్ మధ్యాహ్నం: రైస్‌తో పాటు చపాతి, కర్రీ. రాత్రి: రోటి, కర్రీ. వారానికి మూడు సార్లు చికెన్. ఒక్కోరోజు మటన్, చేప. శిక్షణ ఇలా.. : ఉదయం: 3 గంటలు సాయంత్రం: 3 గంటలు సాధించిన ముఖ్య విజయాలు 2022 మే 16, 17వ తేదీలలో కర్నూలులో జరిగిన జూనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మొదటి స్థానం. 2022 జూన్ 16,17వ తేదీలలో నంద్యాలలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో మొదటి స్థానం. విశాఖపట్టణంలో ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు 52 కేజీల విభాగంలో నిర్వహించిన జాతీయ స్థాయి జూనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మొదటి స్థానం. కష్టమంతా మర్చిపోతున్నా మా ఆయన చనిపోయాక ముగ్గురు పిల్లల పోషణ చాలా భారమైంది. నాకు తోడుగా నిలవాలని వెంకటలక్ష్మి చిన్నప్పటి నుంచి ఎంతో ఆలోచిస్తుంది. అందుకే పెద్ద పిల్లకు, చిన్న పిల్లకు పెళ్లి చేసినా ఆ పిల్లను మగపిల్లాడిలా పెంచిన. ఎప్పటికైనా నీకు మంచి పేరు తీసుకొస్తా అనేది. ఇప్పుడు బరువు ఎత్తే పోటీల్లో ఫస్ట్ వచ్చిందని తెలిసి చానా సంతోషమైంది. అందరూ ఆ పిల్లను పొగుడుతుంటే నా కష్టమంతా మర్చిపోతున్నా. మా పాప ఇంకా పైకి రావాల. – నరసమ్మ, తల్లి తెలిసిన వాళ్లు డబ్బు సర్దితే.. నంద్యాలలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తుండగా పాల్గొనేందుకు అప్పట్లో డబ్బుకు చానా ఇబ్బందిగా ఉండింది. ఇంట్లో చెబుదామంటే అమ్మ పరిస్థితి అంతంతే. నా లక్ష్యం గట్టిదైతే ఎలాగైనా డబ్బు అందుతుందని నమ్మిన. తెలిసిన వాళ్లతో రూ.100, రూ.200 సర్దుబాటు చేసుకొని బస్సు చార్జీలతో పాటు ప్రవేశ రుసుం రూ.వెయ్యి చెల్లించా. నా కష్టం ఊరికే పోలేదు. ఆ పోటీల్లో గెలవడం ఎప్పటికీ మర్చిపోలేను. ఇంక వెనక్కి తిరిగి చూడదలుచుకోలేదు. ఇప్పుడు ఊర్లో కూడా అందరూ మెచ్చుకుంటున్నారు. – వెంకటలక్ష్మీ, పవర్ లిఫ్టర్ (చదవండి: నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు) -
యజమాని సాయం.. కోచ్ అండ.. ఇళ్లలో పనిచేసే ఆ ‘తల్లి’.. పవర్ లిఫ్టింగ్‌లో ‘పసిడి’!
ప్రతిభ ఉండి, వెలుగులోకి రానివారిని మట్టిలో మాణిక్యాలుగా పోలుస్తుంటారు పెద్దలు. అలాంటి పోలికకు సరిగ్గా సరిపోయే వ్యక్తే మాసిలామణి. పొట్టకూటికోసం పనిమనిషిగా చేస్తూ కూడా తనలోని ప్రతిభకు పదునుపెట్టి పవర్ లిఫ్టింగ్‌లో ఏకంగా బంగారు పతకం గెలుచుకుని ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. కోయంబత్తూరులోని కునియముత్తూరు దగ్గరల్లో ఉన్న రామానుజం నగర్లో నలభై ఏళ్ల మాసిలామణికి దర్శిని, ధరణి అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్దకూతురుకు పెళ్లి అయి అత్తారింట్లో ఉంటోంది. మాసిలామణి భర్త రమేశ్ కూలిపనులు చేస్తుంటే మాసిలామణి రెండు ఇళ్లలో పనిచేస్తూ ఇద్దరూ కలిసి కుటుంబాన్ని లాక్కొస్తున్నారు. దయార్ద్ర హృదయం.. చేసిన సాయం ఇళ్లల్లో పనిచేస్తున్నప్పటికీ ఆమె పనితీరు, నిజాయితీ కారణంగా ఆమె పని చేసే ఇంటి యజమానులు మాసిలామణిని సొంతమనిషిలా చూసుకునేవారు. ఆమె కుటుంబం ఉండడానికి అద్దె లేకుండా ఇంటిని కూడా ఇచ్చారు ఒక ఇంటి యజమాని. ఎంతో దయార్ద్ర హృదయం కలిగిన ఈ యజమాని ఓ రోజు... ‘‘మాసిలామణి నువ్వు కాస్త లావుగా ఉన్నావు. వ్యాయామం చేస్తే అధిక బరువు తగ్గడమేగాక, మరింత ఆరోగ్యంగా తయారవుతావు. నాకు తెలిసిన ఒక జిమ్ ఉంది, అక్కడికి వెళ్లు’’ అని చెప్పారు. అలా పవర్‌లిఫ్టింగ్ నేర్చుకుని.. ఆ యజమానికి తెలిసిన జిమ్ ఓనర్ సి. శివకుమార్... పవర్ లిఫ్టింగ్‌లో ఏసియన్ గోల్డ్‌మెడల్ సాధించిన వ్యక్తి. జిమ్ నిర్వహించడంతోపాటు, ట్రైనర్‌గా కూడా పనిచేస్తున్నారు. ఇంటి యజమాని సలహాతో మాసిలామణి శివకుమార్ జిమ్‌లో చేరింది. కొద్దిరోజుల్లోనే జిమ్‌లో చేసే వ్యాయామం నచ్చడంతో తన కూతురు ధరణిని కూడా జిమ్‌లో చేర్పించింది. తల్లీకూతుళ్లిద్దరూ ఎంతో ఉత్సాహంగా జిమ్‌లో ఉన్న బరువైన పరికరాలను సునాయాసంగా ఎత్తుతూ వ్యాయామం చేసేవారు. దీంతో మాసిలామణి బరువు తగ్గడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. వర్కవుట్స్‌లో మొదటి నుంచి వీరిద్దరి పట్టుదలను, దీక్షని గమనిస్తోన్న శివకుమార్ ‘‘మీకు పవర్‌లిఫ్టింగ్ ఎలా చేయాలో నేను ఉచితంగా నేర్పిస్తాను. మీరు చక్కగా నేర్చుకోండి చాలు’’ అని చెప్పారు. ఆ రోజు నుంచి ఇద్దరూ పవర్ లిఫ్టింగ్ సాధన చేయడం ప్రారంభించారు. కోచింగ్ ఫ్రీగా దొరికినప్పటికీ... కోచింగ్ ఉచితంగా అందుతున్నప్పటికీ బలమైన ఆహారం తీసుకునే స్తోమత వారికి లేదు. అయినా ఏ మాత్రం నిరాశపడలేదు. కఠోరదీక్షతో సాధన చేసేవారు. ఇలా చక్కగా శిక్షణ తీసుకున్న తల్లీ కూతుళ్లిద్దరూ గతనెలలో తిరుచ్చిలో జరిగిన ‘తమిళనాడు పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్’ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. మాసిలామణి 63 కేజీల విభాగంలో 77.5 కేజీల బరువుని అవలీలగా ఎత్తి స్వర్ణపతకం గెలుచుకుంది. 17 ఏళ్ల ధరణి 47 కేజీల విభాగంలో 72.5 కేజీల బరువును ఎత్తి కాంస్య పతకం దక్కించుకుంది. పేదరికం నుంచి పవర్ లిఫ్టింగ్‌లో తమ సత్తా చాటిన ఈ తల్లీకూతుళ్లు సెప్టెంబర్ 14 నుంచి 19 వరకు చెన్నైలో జరగనున్న తమిళనాడు పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్ పోటీలలో పతకాలు గెలుచుకునేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నారు. నవ్విన వాళ్లే అభినందిస్తున్నారు జిమ్‌లో చేరిన తొలినాళ్లలో అంతా మమ్మల్ని చూసి నవ్వారు. కొంతమంది కుటుంబ సభ్యులు, స్నేహితులు పనులు చేసేవాళ్లకు జిమ్‌లు అవసరమా? అని అవహేళనగా మాట్లాడారు. పవర్ లిఫ్టింగ్ గురించి తెలిసినప్పుడు ఈ వయసులో ఇలాంటి పనులు అవసరమా? ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? అని ఈసడించారు. ఇప్పుడు మేమేంటో నిరూపించాం. దీంతో అప్పుడు నవ్విన వారంతా అభినందిస్తున్నారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధిస్తాం. – మాసిలామణి చదవండి: Bengaluru: స్నేహితుడి అనారోగ్యం.. చికిత్స రిపోర్టు ఆలస్యం.. ఆ ఘటనే.. కల్యాణ్ ఆవిష్కరణకు బీజం Manasi Chaudhari: ‘పింక్ లీగల్’.. మహిళలకు న్యాయ సమాచారం.. ఏ డౌట్ వచ్చినా.. -
‘బంగారు’ కుర్రాడికి ఘనస్వాగతం
కాశీబుగ్గ: టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన యాదం సతీష్‌కుమార్ బంగారు పతకం సాధించాడు. ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గతేడాది డిసెంబర్లో ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ నిర్వహించిన ఈ పోటీల్లో ఆంధ్రా క్రీడాకారులకు పతకాలు లభించాయి. అందులో సతీష్ బంగారు పతకంతో మెరిశాడు. విద్యార్థి విశాఖలోని బుల్లయ్య కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా పలాస. పతకం సాధించాక ఆదివారం స్వగ్రామానికి రావడంతో స్థానికులు విద్యారి్థకి ఘన స్వాగతం పలికారు. విద్యార్థి తల్లిదండ్రులు సావిత్రి, ఆంజనేయులు వెదురు బుట్టలు అల్లి కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుమారుడికి దక్కిన స్వాగతం చూసి వారు ఆనందభరితులయ్యారు. -
‘ఇద్దరు పిల్లల తల్లి .. నాలుగు స్వర్ణాలు గెలిచింది’
సాధించాలనే సంకల్పం ఉంటే విజయానికి వయసుతో సంబంధంలేదని పుణేకు చెందిన ఓ 47 ఏళ్ల తల్లి నిరూపించింది. ఇద్దరు టీనేజర్స్‌కు తల్లి అయినా.. పవర్‌లిప్టింగ్ చాంపియన్‌షిప్‌లో నాలుగు స్వర్ణాలు గెలిచి ఔరా అనిపించింది. ఆరేళ్ల క్రితమే ఈ ఆటను మొదలు పెట్టిన ఆమె అత్యత్తమ ప్రదర్శనతో మెరిసి భారత మువ్వెన్నెల జెండాను రెపరెపలాడించింది. రష్యా వేదికగా జరిగిన ఓపెన్ ఏషియన్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ టోర్నీలో భారత్ తరఫున పాల్గొన్న భావనా టోకెకర్ 4 స్వర్ణాలు గెలిచి అందిరి దృష్టిని ఆకర్షించింది. చర్మసంబంధిత సమస్య కోసం వేసుకునే మందులతో సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఆరేళ్ల క్రితం సరదగా జిమ్‌లో అడుగుపెట్టిన ఆమె నేడు ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. భారత వాయుసేన ఫైటర్ భార్య అయిన ఆమెకు వెయిట్‌లిఫ్ట్ శిక్షణతో మరింత దృఢంగా తయారు కావచ్చనే ఐఏఎఫ్ బాడీబిల్డింగ్ జట్టు ఇచ్చిన సలహా.. అటువైపు ఆకర్షితురాలయ్యేలా చేసింది. ‘మాములుగా వెయిట్‌లిఫ్టింగ్ అనగానే ఆడవాళ్లకు కష్టమని, ఇది కేవలం యువకులకు సంబంధించినదేనని, శరీరం కటువుగా తయారవుతుందనే అపోహలుంటాయి. కానీ నేను మాత్రం అవేవి పట్టించుకోలేదు. నా 41 ఏళ్ల వయసులో ఈ శిక్షణను ప్రారంభించాను. వెయిట్లిప్టింగ్కు ఇక్కడ అంతగా ప్రాచుర్యం లేనందున, దాని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలని, గాయాలు కాకుండా టెక్నిక్‌లు నేర్చుకోవాలనే ఆతృత నాకు కలిగింది. అదే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది’ అని విజయానంతరం భావన తెలిపింది. ఇంటర్నెటే గురువు.. సాధారణ గృహిణి అయిన ఆమె వెయిట్ లిప్టింగ్ పాఠాలను ఇంటర్నెట్ సాయంతో నేర్చుకుంది. యూట్యూబ్ వీడియోలు, ఇతర వెబ్‌సైట్స్‌లో తన పూర్తి స్థాయి సమాయాన్ని వెచ్చించేది. ఐఏఎఫ్ బాడీబిల్డింగ్ జట్టు పర్యవేక్షణలో గత ఆరేళ్లుగా నిరాంతరాయంగా శ్రమించింది. ఇదే ఆమెను ఈ స్థాయికి తీసుకొచ్చింది. పోటీలంటే ఏడుపొచ్చేది.. ‘ఈ వయసులో నేను ఈవెంట్లలో పాల్గొనగలనా? ప్రమాణాలకు అనుగుణంగా ప్రదర్శన ఇవ్వగలనా? అనే సదేహం ఉండేంది. దీంతో పోటీల్లో పాల్గొనాలంటే ఏడుపొచ్చేది.’ అని రష్యాలో ఆదివారం జరిగిన తన తొలి ఈవెంట్లో గెలిచిన భావన చెప్పుకొచ్చింది. అయితే ఆమె ఈవెంట్లో పాల్గొనడానికి తొలి అడుగులు మాత్రం ఇన్స్టాగ్రామ్ వేదికగా పడ్డాయి. ప్రపంచ పవర్ లిఫ్టింగ్ కాంగ్రెస్(డబ్ల్యూపీసీ) కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల హెడ్ మొహమ్మద్ అజ్మాత్ వీడియోలు ఆమెకు స్పూర్తిగా నిలిచాయి. ఇదే ఆమెను పోటీల్లో పాల్గొనేలా చేసింది. ‘ ఆయనకు మేసేజ్ చేసిన రోజు నాకు ఇంకా గుర్తింది. అది ఫిబ్రవరి 10. భారత్ తరఫున నేను పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనగలనా? అని అడిగాను. అయితే పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్‌కు చాలా వ్యత్యాసం ఉందని, తానే స్వయంగా వచ్చి ట్రయల్స్ ఇస్తానని అజ్మత్ సర్ బదులివ్వగానే నేను ఉలిక్కిపడ్డాను.’ అని భావన తెలిపింది. ఈ ఏడాది మేలో బెంగళూరులో ట్రయల్స్‌కు హాజరైన భావన మాస్టర్-2 కేటగిరి (45-50 గ్రూప్)కు ఎంపికైంది. అనంతరం ఆన్లైన్ వేదికగా అజ్మత్ శిక్షణలో నియమ నిబంధనలు, కొత్త టెక్నిక్స్ నేర్చుకుంది. తాజాగా రష్యా వేదికగా జరిగిన అండర్ 67.5 మాస్టర్స్2 కేటగిరిలో స్క్వాట్-87 కేజీ, బెంచ్-65 కేజీ, డెడ్లిప్ట్-120 కేజీ విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబర్చి పసిడి పతకాలను సొంతం చేసుకుంది. నమ్మలేకపోతున్నాను.. ‘ఈ ఛాంపియన్‌షిప్‌లో ఇంత గొప్ప క్రీడాకారులను చూడటం చాలా ఆనందంగా ఉంది. ప్రపంచస్థాయి టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చడాన్ని నేను నమ్మలేకపోతున్నాను. నా బలాన్ని పెంపొందించాడానికి తొలుత దీన్ని ప్రారంభించాను. కానీ ప్రస్తుతం ఈ వెయిట్ ట్రైనింగ్‌ను ఆస్వాదిస్తున్నాను. నా కుటుంబం కూడా నాకు చాలా మద్దతుగా నిలిచింది. నా విజయానికి మూలస్థంబాలు వారే. నా శిక్షణకు సహాయం చేస్తూ.. నాతో్ పాటు జిమ్‌కు కూడా వచ్చేవారు. దేశంలో ఈ తరహా ఆటలపై మరింత అవగాహన పెరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని విజయానంతరం భావన పేర్కొంది. -
భారత పవర్ లిఫ్టింగ్ జట్టు మేనేజర్‌గా నాగరాజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ సంఘం కార్యదర్శి ఎం. నాగరాజ్ గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఆసియా పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు మేనేజర్‌గా ఎంపికయ్యాడు. కేరళలోని అలెప్పీలో సోమవారం ఈ మెగా టోర్నీ ప్రారంభమైంది. ఈనెల 10 వరకు ఆసియా పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ జరుగుతుంది. భారత్ జట్టుకు సాయిరాం, నిత్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
‘స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ ఏపీ’ చంద్రిక దీనగాథ
‘కామన్వెల్త్’ రమ్మంది.. పేదరికం అడ్డయింది పవర్‌లిఫ్టింగ్‌లో ఎన్నో పతకాలు సాధించిన వైనం ఆర్థిక సహకారం అందిస్తే కామన్వెల్త్ క్రీడల్లో సత్తా చూపిస్తానంటున్న చంద్రిక దేశం గర్వించే స్థాయిలో రాణించాలనే ఆశ ఆమెది.. ఇప్పటికే తానేంటో వివిధ పోటీల్లో ప్రతిభ చూపి నిరూపించుకుంది. తాజాగా కామన్వెల్త్ గేమ్స్‌కు ఎంపికైనా.. పోటీలకు హాజరయ్యేందుకు ఆర్థిక పరిస్థితులు సహకరించని దుస్థితిలో ఉంది. దీంతో ఈ అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నుంచి సహాయం లేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన బొల్లినేని చంద్రిక చిన్నతనం నుంచి పవర్‌లిఫ్టింగ్‌లో ప్రతిభ చాటుతోంది. ఇప్పుడు తన జీవిత లక్ష్యమైన కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన అవకాశం ఆర్థిక పరిస్థితి కారణంగా చేజారిపోతోందని ఆందోళన చెందుతోంది. సెప్టెంబర్‌లో కామన్వెల్త్ గేమ్స్ ఈ ఏడాది సెప్టెంబర్ 10 నుంచి 17వ తేదీ వరకు దక్షిణాఫ్రికాలో కామన్వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. ఈ పోటీలకు మనదేశం నుంచి ఎంపికైన 16 మంది పవర్లిఫ్టర్లలో మన రాష్ట్రానికి చెందిన ముగ్గురున్నారు. వారిలో ఒకరు బొల్లినేని చంద్రిక కాగా మరో ఇద్దరు తెనాలికి చెందినవారు. కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనాలంటే ఎంట్రీ ఫీజు రూ.1.85 లక్షల్ని ఈనెల 6వ తేదీలోపు చెల్లించాల్సి ఉంది. విమాన చార్జీలు, మిగతా ఖర్చులతో కలిపి రూ.5 లక్షలు ఖర్చవుతుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంతో దాతల సహాయం కోసం చంద్రిక ఎదురుచూస్తోంది. పతకాల్లో మేటి 2016లో ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్‌తో పాటు ఆల్ ఇండియా బ్రాంజ్ మెడల్ సాధించిన ఘనత చంద్రిక సొంతం. ఇప్పటివరకు వివిధ పోటీల్లో పాల్గొన్న చంద్రిక 40కుపైగా పతకాలు సాధించడంతోపాటు స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బహుమతి సాధించింది. కాకినాడ జేఎన్టీయూ నుంచి ఐదుసార్లు స్ట్రాంగ్ ఉమెన్‌గా అవార్డులందుకుంది. ఊహ తెలియని వయస్సులో తండ్రి నరసింహమూర్తి మృతిచెందగా ఇంటర్ అనంతరం తల్లి తనువు చాలించింది. చిన్నతనం నుంచి చంద్రిక అమ్మమ్మ గుంటుపల్లి పార్వతి వద్దే ఉంటోంది. చంద్రిక చెల్లికి వివాహం కాగా సోదరుడు ఉన్నాడు. వీరికి పార్వతి నడుపుతున్న చిన్న హోటల్‌పై వచ్చే ఆదాయమే జీవనాధారం. కొంతకాలంగా అనారోగ్యానికి గురైన పార్వతి హోటల్ నడపలేని స్థితికి చేరడంతో కుటుంబం గడవడమే కష్టమైంది. ప్రభుత్వంగానీ, దాతలుగానీ ప్రోత్సాహం అందిస్తే పతకం సాధిస్తానని చంద్రిక చెబుతున్నారు. -
11, 12 తేదీల్లో రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు
తాడితోట(రాజమహేంద్రవరం) : రాష్ట్రస్థాయి 3వ సబ్ జూనియర్ బాల బాలికల పవర్ లిఫ్టింగ్ పోటీలు ఈ నెల 11,12 తేదీల్లో రాజమహేంద్రవరంలో జరుగుతాయని జిల్లా పవర్ లిఫ్టింగ్ సమాఖ్య ప్రతినిధి డి.వి.వి.సత్యనారాయణ తెలిపా రు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో తొలిసారి రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న పోటీల నిర్వహణకు భవాని చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఆదిరెడ్డి వాసు, ప్రముఖ న్యాయవాది గొందేశి శ్రీనివాసులరెడ్డి, సహకరిస్తున్నారని తెలిపారు. తాను పవర్ లిఫ్టింగ్ క్రీడలో 14వ ఏట నుంచి పలు విజయాలు సాధించానని, 1988లో తపాలా శాఖలో క్రీడల కోటాలో ఉద్యోగం వచ్చిందని, జాతీయస్థాయిలో గుర్తింపు లభించి నేషనల్ రిఫరీగా ఎంపిక చేశారని చెప్పారు. -
బెస్ట్ పవర్ లిఫ్టర్‌గా సాయిరేవతి
మంగళగిరి : జిల్లాకు చెందిన పవర్‌లిఫ్టర్ ఘట్టమనేని సాయిరేవతి బెస్ట్ లిఫ్టర్ ప్రైజ్‌మని అవార్డు అందుకోవడం అభినందనీయమని గుంటూరు జిల్లా పవర్ లిఫ్టర్ అసోసియేషన్ కార్యదర్శి గుమ్మడి పుల్లేశ్వరరావు అన్నారు. పట్టణంలోని జిమ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సాయిరేవతిని అభినందించారు. జెంషెడ్‌పూర్‌లో జరిగిన సుబ్రత క్లాసిక్ ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో సాయిరేవతి చూపిన ప్రతిభ కారణంగా అవార్డుకు ఎంపికయ్యారన్నారు. సాయిరేవతిని అభినందించిన వారిలో కోచ్ ఎన్. శేషగిరిరావు, అధ్యక్షులు షేక్ మహ్మద్ రఫీ, కోచ్‌లు సంధాని, ఖమురుద్దీన్ తదితరులున్నారు. -
భారత్‌కు మరో రెండు పతకాలు
కొవెంట్రీ: ఇంగ్లండ్‌లో జరుగుతున్న ప్రపంచ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్లు అదరగొడుతున్నారు. తొలిరోజు రెండు స్వర్ణాలు భారత్ ఖాతాలో పడగా.. గురువారం రెండో రోజు 125 కేజీ విభాగంలో వైభవ్ రాణా రజత పతకం సాధించాడు. మరోవైపు 100 కేజీ రా విభాగంలో పోటీపడిన కన్వర్దీప్ కాంస్యం సాధించాడు. దీంతో మొత్తం ఆరు పతకాలు భారత్ వశమయ్యాయి. -
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో కాంస్యం
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో పతకం దక్కింది. భారత పవర్‌లిఫ్టర్ సకీనా ఖటన్ కాంస్య పతకం సాధించింది. శనివారం జరిగిన మహిళల లైట్‌వెయిట్ (61 కిలోల వరకు) కేటిగిరిలో సకీనా మొత్తం 88.2 కిలోల బరువులెత్తి మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో నైజీరియా లిఫ్టర్ ఈస్తర్ ఒయెబా (136 కిలోలు), ఇంగ్లండ్ లిఫ్టర్ నటాలీ బ్లాక్ (100.2 కిలోలు) వరుసగా పసిడి, రజత పతకాలు సాధించారు. -
స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా శంషాబాద్ కుర్రాడు
హైదరాబాద్: శంషాబాద్ కుర్రాడు పవర్ లిఫ్టింగ్ పోటీల్లో భారతదేశంలోనే స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందాడు. శంషాబాద్‌కు చెందిన వై. రాఘవేందర్ స్థానికంగా ఉన్న యాదవ్ ఫిట్నెస్ జిమ్‌లో శిక్షణ తీసుకుంటూ పవర్ లిఫ్టింగ్‌లో ఇప్పటికే పలు పతకాలు సాధించాడు. తాజాగా ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కర్ణాటకలోని మంగళూరులో జరిగిన సీనియర్ పవర్ లిఫ్టింగ్ చాంఫియన్ షీప్ (2013) పోటీల్లో 93 కేజీల విభాగంలో రాఘవేందర్ స్వర్ణపతకాన్ని సాధించాడు. దీంతో పాటు క్రీడాకారుల్లో అత్యుత్తమ ప్రతిభ కనపర్చినందుకు అతడి ని పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ సంస్థ స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఇచ్చి ప్రత్యేక ప్రశంసాపత్రాన్ని అందజేసింది.రాఘవేందర్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఇప్పటికే ఏషియా స్థాయిలో రజత పతకాన్ని కూడా కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా శుక్రవారం యాదవ్ఫిట్నెస్ జిమ్‌లో రాఘవేందర్‌ను కోచ్ లక్ష్మణ్‌యాదవ్ అభినందించారు. ఇదే ఫిట్నెస్ జిమ్‌నుంచి పోటీల్లో పాల్గొన్న మరో ఇద్దరు యువకులు అమర్‌సింగ్, ఆర్. ప్రసాద్‌లు కూడా టాప్ ఐదుర్యాంకుల్లో ఉన్నారని కోచ్ లక్ష్మణ్‌యాదవ్ తెలిపారు.