‘స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ ఏపీ’ చంద్రిక దీనగాథ
‘కామన్‌వెల్త్’ రమ్మంది.. పేదరికం అడ్డయింది
పవర్‌లిఫ్టింగ్‌లో ఎన్నో పతకాలు సాధించిన వైనం
ఆర్థిక సహకారం అందిస్తే కామన్‌వెల్త్ క్రీడల్లో సత్తా చూపిస్తానంటున్న చంద్రిక
దేశం గర్వించే స్థాయిలో రాణించాలనే ఆశ ఆమెది.. ఇప్పటికే తానేంటో వివిధ పోటీల్లో ప్రతిభ చూపి నిరూపించుకుంది. తాజాగా కామన్వెల్త్ గేమ్స్‌కు ఎంపికైనా.. పోటీలకు హాజరయ్యేందుకు ఆర్థిక పరిస్థితులు సహకరించని దుస్థితిలో ఉంది. దీంతో ఈ అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నుంచి సహాయం లేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది.
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన బొల్లినేని చంద్రిక చిన్నతనం నుంచి పవర్‌లిఫ్టింగ్‌లో ప్రతిభ చాటుతోంది. ఇప్పుడు తన జీవిత లక్ష్యమైన కామన్‌వెల్త్ గేమ్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన అవకాశం ఆర్థిక పరిస్థితి కారణంగా చేజారిపోతోందని ఆందోళన చెందుతోంది.
సెప్టెంబర్‌లో కామన్‌వెల్త్ గేమ్స్
ఈ ఏడాది సెప్టెంబర్ 10 నుంచి 17వ తేదీ వరకు దక్షిణాఫ్రికాలో కామన్‌వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. ఈ పోటీలకు మనదేశం నుంచి ఎంపికైన 16 మంది పవర్‌లిఫ్టర్లలో మన రాష్ట్రానికి చెందిన ముగ్గురున్నారు. వారిలో ఒకరు బొల్లినేని చంద్రిక కాగా మరో ఇద్దరు తెనాలికి చెందినవారు. కామన్‌వెల్త్ గేమ్స్‌లో పాల్గొనాలంటే ఎంట్రీ ఫీజు రూ.1.85 లక్షల్ని ఈనెల 6వ తేదీలోపు చెల్లించాల్సి ఉంది. విమాన చార్జీలు, మిగతా ఖర్చులతో కలిపి రూ.5 లక్షలు ఖర్చవుతుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంతో దాతల సహాయం కోసం చంద్రిక ఎదురుచూస్తోంది.
పతకాల్లో మేటి
2016లో ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్‌తో పాటు ఆల్ ఇండియా బ్రాంజ్ మెడల్ సాధించిన ఘనత చంద్రిక సొంతం. ఇప్పటివరకు వివిధ పోటీల్లో పాల్గొన్న చంద్రిక 40కుపైగా పతకాలు సాధించడంతోపాటు స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బహుమతి సాధించింది. కాకినాడ జేఎన్‌టీయూ నుంచి ఐదుసార్లు స్ట్రాంగ్ ఉమెన్‌గా అవార్డులందుకుంది. ఊహ తెలియని వయస్సులో తండ్రి నరసింహమూర్తి మృతిచెందగా ఇంటర్ అనంతరం తల్లి తనువు చాలించింది.
చిన్నతనం నుంచి చంద్రిక అమ్మమ్మ గుంటుపల్లి పార్వతి వద్దే ఉంటోంది. చంద్రిక చెల్లికి వివాహం కాగా సోదరుడు ఉన్నాడు. వీరికి పార్వతి నడుపుతున్న చిన్న హోటల్‌పై వచ్చే ఆదాయమే జీవనాధారం. కొంతకాలంగా అనారోగ్యానికి గురైన పార్వతి హోటల్ నడపలేని స్థితికి చేరడంతో కుటుంబం గడవడమే కష్టమైంది. ప్రభుత్వంగానీ, దాతలుగానీ ప్రోత్సాహం అందిస్తే పతకం సాధిస్తానని చంద్రిక చెబుతున్నారు.