టాప్‌లేని జీపులో జాతీయజెండాతో షబీనా
తెనాలి: అంతర్జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీ ల్లో నాలుగు బంగారు పతకాలను కైవసం చేసుకుని స్వస్థలానికి తిరిగి వచ్చిన పట్టణ లిఫ్టర్ షేక్ షబీనాకు తెనాలిలో ఘనస్వాగతం లభించింది. కేరళ రాష్ట్రం అలెప్పీలో ఈనెల ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు జరిగిన ఆసియా పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో షబీనా 84 కిలోల కేటగిరీలో తలపడి, స్క్వాట్, బెంచ్‌ప్రెస్, డెడ్‌లిఫ్ట్‌లో ప్రథమ స్థానంలో నిలిచి, ఓవరాల్‌గా అగ్రగామిగా నాలుగు విభాగాల్లోనూ బంగారు పతకాలను గెలుచుకున్న విషయం తెలిసిందే.
ఇంటర్ పూర్తయే సరికి అంతర్జాతీయస్థాయిలో పతకాలను సాధించిన షబీనా, కేరళ నుంచి మంగళవారం తెనాలికి తిరిగొచ్చింది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద స్థానికులు తనకు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి షబీనా నివాసమైన సీబీఎన్ కాలనీ వరకు ర్యాలీ నిర్వహించారు. టాపులేని జీపులో నిలబడి, జాతీయ జెండాతో షబీనా అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగింది. ర్యాలీకి ముందుభాగాన డప్పుల విన్యాసం కొనసాగింది. తల్లిదండ్రులు షంషద్, బుజ్జి, కోచ్ ఎస్‌కే సంధానితో సహా వచ్చిన షబీనాకు పట్టణానికి చెందిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు షేక్ దుబాయ్‌బాబు, మొగల్ అహ్మద్, టీడీపీ నేత మహమ్మద్ ఖుద్దూస్‌లు స్వాగతం పలికారు. భారతదేశానికి పతకాలను సాధించి, తెనాలికి పవర్ లిఫ్టింగ్‌లో గల ఘనకీర్తిని నిలిపిన క్రీడాకారిణిగా అభినందనలతో ముంచెత్తారు.
దారిపొడవునా పలువురు పూలమాలలతో అభినందించారు. ఈ సందర్భంగా షబీనా మాట్లాడుతూ అంతర్జాతీయ పతకాల సాధనే లక్ష్యంగా కష్టమైనప్పటికీ పట్టుదలతో సాధన చేశానని చెప్పింది. ఆశించిన విధంగానే ఆసియా స్థాయిలో పతకాలను సాధించగలిగినట్టు తెలిపింది. ప్రపంచ పోటీలు, కామన్‌వెల్త్ గేమ్స్‌లోనూ పతకాలను సాధించాలనేది తన లక్ష్యంగా చెప్పా రు. తనను ప్రోత్సహించి, ఆశీర్వదిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేసింది. వీరితోపాటు రహంతుల్లా, కరిముల్లా, జాఫర్, పినపాటి రవీంద్ర, జగన్, ఫణిదపు దుర్గా, చల్లగాలి శివశంకర్, ముజీబ్ ప్రభృతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment