అదో మారుమూల గ్రామం. జిల్లా కేంద్రానికి దూరంగా విసిరేసినట్లు ఉంటుంది. అక్కడో నిరుపేద కుటుంబం. కుటుంబ పెద్ద మరణించడంతో తల్లి రెక్కలుముక్కలు చేసుకుంటోంది. ముగ్గురు ఆడపిల్లల పోషణ ఆమెకు తలకుమించిన భారం. ఎలాగోలా నెట్టుకొస్తున్నా.. రెండో కూతురు లక్ష్యం ఆమెను ఆలోచనలో పడేసింది. ఎంత కష్టమైనా.. కుమార్తె ఎదుగుదలకు తోడుగా నిలవాలనుకుంది. ఉన్నంతలో డబ్బు సర్దుతూ స్వేచ్ఛనిచ్చింది. అందుకు అనుగుణంగానే ఆ యువతి ఇప్పుడు పవర్ లిఫ్టర్‌గా రాణిస్తూ.. ఒలింపిక్స్ లక్ష్యంగా సాధన చేస్తోంది.
సాక్షి, ఆస్పరి(కర్నూలు): వెంకటలక్ష్మి. ఈ పేరు ఆస్పరి మండలం కైరుప్పల గ్రామానికే కాదు.. జిల్లా, రాష్ట్రస్థాయిలో ఇప్పుడిప్పుడే వినిపిస్తోంది. ఇంట్లో ముగ్గురూ ఆడపిల్లలే అయినా.. చిన్నప్పటి నుంచి మగరాయుడిలా పెరుగుతూ సరికొత్త లక్ష్యాన్ని ఎంచుకుంది. పేదరికం అడుగడుగునా అవాంతరాలు సృష్టిస్తున్నా.. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకెళ్తోంది. కృషి, పట్టుదల ఉంటే గమ్యం చేరుకోవడం సులువని నిరూపిస్తూ.. పురుషులకే కష్టమైన పవర్ లిఫ్టింగ్‌లో తనదైన శైలిలో రాణిస్తోంది.
ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయిలో తనకంటూ ఓ ప్రత్యేకతను కనపరుస్తున్న ఈమె ఒలింపిక్స్‌లో పతకం సాధనే తన జీవిత ఆశయమని చెబుతోంది. వివరాలు ఆమె మాటల్లోనే.. అమ్మ నరసమ్మ, నాన్న వీరభద్రప్ప. మేము ముగ్గురు ఆడపిల్లలం. చిన్నతనంలోనే నాన్న మరణించడంతో అమ్మ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. అక్క, చెల్లికి పెళ్లిళ్లు చేసింది.
అమ్మ కష్టం దగ్గర నుంచి చూడటంతో నేను ఆమెకు మగబిడ్డగా తోడు నిలిచేందుకు నిర్ణయించుకున్నా. చిన్నతనం నుంచి హెయిర్ కటింగ్‌తో పాటు దుస్తుల విషయంలోనూ మగ పిల్లలనే అనుసరించేదాన్ని. అమ్మ కూడా నన్ను అలాగే పెంచింది. పాఠశాలకు వెళ్లినా.. కళాశాలలో అడుగుపెట్టినా ఎవరూ పోల్చుకోలేనంతగా నేను మగరాయుడిలా ఉండేదాన్ని.
కూలి పనులకు వెళ్తూనే..
కష్టం విలువ తెలియడం వల్ల అమ్మకు భారం కాకూడదని బలంగా నిశ్చయించుకున్నా. ఆలూరులో ఇంటర్మీడియట్, ఎమ్మిగనూరులో డిగ్రీ పూర్తి చేశా.. ఆదివారం, సెలవు రోజుల్లో కూలి పనులకు వెళ్లి కూడబెట్టుకున్న డబ్బుతో కాలేజీ ఫీజులు, బస్సు పాస్‌లకు లోటు లేకుండా చూసుకునేదాన్ని. పదో తరగతి చదువుతుండగా ప్రతి రోజు జిమ్‌కు వెళ్లేదాన్ని. అప్పట్లోనే మంచి లిఫ్టర్‌గా ఎదగాలని నిర్ణయించుకున్నా. అయితే ఇంట్లో పరిస్థితులు బాగోలేక ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తయ్యాక నా లక్ష్యానికి పదును పెట్టా. అమ్మను ఒప్పించి కర్నూలుకు చేరుకున్నా. రెండేళ్లుగా ఇక్కడ పవర్ లిఫ్టింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నా. ఆర్థికపరంగా మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా.
ఒలింపిక్స్ లక్ష్యంగా..
మొట్టమొదటి జిల్లాస్థాయి పోటీల్లో ప్రథమ స్థానం దక్కడంతో ఇంకా పైకి ఎదగాలనే కోరిక బలపడింది. కిందిస్థాయి నుంచి వచ్చినదాన్ని కావడంతో జయాపజయాలను పెద్దగా పట్టించుకోను. అయితే ముందుకు వెళ్లాలని మాత్రం నిర్ణయించుకున్నా. పవర్ లిఫ్టింగ్ ఒక్కటే కాదు, వెయిట్ లిఫ్టింగ్‌లోనూ నాకు కరణం మల్లీశ్వరి, మీరాబాయ్ చాను ఆదర్శం. పోటీల్లో రాణించి ఉద్యోగం సంపాదించి స్థిరపడాలని అనుకోలేదు. ఒలింపిక్స్‌లో దేశానికి పతకం తీసుకురావాలనేది నా కోరిక. ఉన్నత చదువులు అభ్యసించాలని ఉన్నా, ఆర్థిక స్థోమత సరిపోక పోటీలపైనే దృష్టి సారిస్తున్నా.
లక్ష్యం దిశగా ముందుకు సాగుతోంది
వెంకటలక్ష్మీ పట్టుదల చాలా ఎక్కువ. కఠోర సాధన చేస్తుంది. కష్టాలను దగ్గర నుంచి చూడటం వల్ల అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే బలమైన కోరిక ఉంది. అందువల్లే ఇప్పటి వరకు పాల్గొన్న అన్ని పోటీల్లో మంచి ఫలితాలనే సాధించింది. శిక్షణకు క్రమం తప్పకుండా హాజరవుతుంది. అంతర్జాతీయ పోటీల్లో తప్పక రాణిస్తుంది.
– యూసుఫ్ బాషా, శాప్ కోచ్, కర్నూలు
పెళ్లి చేసి పంపక ఎందుకివన్నీ..
ముగ్గురూ ఆడ పిల్లలే కావడం, నాన్న అకాలమరణంతో మా ఇంట్లో చీకటి అలుముకుంది. అక్కకు అతి కష్టం మీద పెళ్లి చేయగా.. నేను మగరాయుడిలా తిరగడం చూసి అమ్మకు గ్రామస్తుల నుంచి సూటిపోటి మాటలు ఎదురయ్యాయి. రెండో కూతురికి పెళ్లి చేయకుండా చిన్న పాపకు పెళ్లి చేస్తే ఎలా, దాన్ని ఎవరు చేసుకుంటారనే ప్రశ్నలతో మౌనంగా రోదించింది. ఇంటరీ్మడియట్ చదువుతున్న సమయంలోనే సంబంధం చూస్తామంటే ససేమిరా అన్నా. బాగా చదువుకోవడంతో పాటు జీవితంలో స్థిరపడి అమ్మను బాగా చూసుకోవాలనే కోరిక ఉంది. అందుకే ఎవరేమన్నా పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దని గట్టిగా చెప్పిన. ఆ తర్వాత ఇంక నా గురించి వదిలేసి మా చెల్లెకి కూడా పెళ్లి చేసినారు.
తీసుకునే ఆహారం ఇలా..
- ఉదయం: ఆరు కోడిగుడ్లు, 500 గ్రాముల రాగిజావ, మొలకెత్తిన విత్తనాలు, నాలుగు అరటి పండ్లు, డ్రైఫ్రూట్స్
- మధ్యాహ్నం: రైస్‌తో పాటు
- చపాతి, కర్రీ.
- రాత్రి: రోటి, కర్రీ. వారానికి మూడు సార్లు చికెన్.
- ఒక్కోరోజు మటన్, చేప.
- శిక్షణ ఇలా.. :
- ఉదయం: 3 గంటలు
- సాయంత్రం: 3 గంటలు
సాధించిన ముఖ్య విజయాలు
- 2022 మే 16, 17వ తేదీలలో కర్నూలులో జరిగిన జూనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మొదటి స్థానం.
- 2022 జూన్ 16,17వ తేదీలలో నంద్యాలలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో మొదటి స్థానం.
- విశాఖపట్టణంలో ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు 52 కేజీల విభాగంలో నిర్వహించిన జాతీయ స్థాయి జూనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మొదటి స్థానం.
కష్టమంతా మర్చిపోతున్నా
మా ఆయన చనిపోయాక ముగ్గురు పిల్లల పోషణ చాలా భారమైంది. నాకు తోడుగా నిలవాలని వెంకటలక్ష్మి చిన్నప్పటి నుంచి ఎంతో ఆలోచిస్తుంది. అందుకే పెద్ద పిల్లకు, చిన్న పిల్లకు పెళ్లి చేసినా ఆ పిల్లను మగపిల్లాడిలా పెంచిన. ఎప్పటికైనా నీకు మంచి పేరు తీసుకొస్తా అనేది. ఇప్పుడు బరువు ఎత్తే పోటీల్లో ఫస్ట్ వచ్చిందని తెలిసి చానా సంతోషమైంది. అందరూ ఆ పిల్లను పొగుడుతుంటే నా కష్టమంతా మర్చిపోతున్నా. మా పాప ఇంకా పైకి రావాల.
– నరసమ్మ, తల్లి
తెలిసిన వాళ్లు డబ్బు సర్దితే..
నంద్యాలలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తుండగా పాల్గొనేందుకు అప్పట్లో డబ్బుకు చానా ఇబ్బందిగా ఉండింది. ఇంట్లో చెబుదామంటే అమ్మ పరిస్థితి అంతంతే. నా లక్ష్యం గట్టిదైతే ఎలాగైనా డబ్బు అందుతుందని నమ్మిన. తెలిసిన వాళ్లతో రూ.100, రూ.200 సర్దుబాటు చేసుకొని బస్సు చార్జీలతో పాటు ప్రవేశ రుసుం రూ.వెయ్యి చెల్లించా. నా కష్టం ఊరికే పోలేదు. ఆ పోటీల్లో గెలవడం ఎప్పటికీ మర్చిపోలేను. ఇంక వెనక్కి తిరిగి చూడదలుచుకోలేదు. ఇప్పుడు ఊర్లో కూడా అందరూ మెచ్చుకుంటున్నారు.
– వెంకటలక్ష్మీ, పవర్ లిఫ్టర్
Comments
Please login to add a commentAdd a comment