కోడల్నీ కుటుంబ సభ్యురాలుగా చూడాలి..
కోడలికి కుటుంబంలో కనీస గౌరవం కూడ దక్కడం లేదని, కోడల్ని బయటి వ్యక్తిగాకాక, కూతురుగా చూసే సంప్రదాయం అలవరచుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. వైవాహిక జీవితాల్లో వచ్చే గొడవల్లో కోడల్ని పరాయి మనిషిగా చూస్తున్నారని, ఆమెను ఓ అద్దెకు తెచ్చుకున్న సేవకురాలిగానే తప్పించి స్వంత మనిషిగా స్వీకరించలేకపోతున్నారని, ముఖ్యంగా భారత దేశంలో కోడళ్ళు అనేక సందర్భాల్లో తీవ్ర వేధింపులకు గురౌతున్నారని భారత ఉన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది.
వివాహం తర్వాత అత్తవారింటికి వచ్చే కోడలు... ఎట్టిపరిస్థితుల్లోనూ బయటి వ్యక్తి కాదని సుప్రీం కోర్టు తెలిపింది. అంతేకాక ఆమెను భర్త, అత్తమామలు, కుటుంబ సభ్యులు, కోడలుగా కాక కూతురుగా చూడాలని సూచించింది. కోడలికి ఇచ్చే సమానత్వం, గౌరవం నాగరిక సమాజంలోని సున్నితత్వాన్ని ప్రతిబింబిస్తాయని సుప్రీంకోర్టు పేర్కొంది. భర్త చేతిలో చిత్రహింసలకు గురై ఆత్మ హత్య చేసుకున్న భార్య కేసుకు తీర్పు ఇచ్చిన సందర్భంలో, భర్తకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించిన కోర్టు... అత్తవారింట్లో కోడల్ని చూడాల్సిన విధానానంపై ప్రకటన చేసింది.
వరకట్నదాహం, దురాశతో మానసిక, శారీరక వేధింపులకు గురిచేయడంతో ఒక్కోసారి వధువులు ప్రాణాలను సైతం తీసుకోవడం క్రూరత్వానికి నిదర్శనమని, ఇది అత్యంత సిగ్గు పడాల్సిన విషయమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నో కోరికలతో, కలలుగన్న జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాల్సిన వధువులు అవమాన భారంతోనో, భరించలేని బాధలతోనో ఆత్మహత్యలకు పాల్పడటం నిజంగా అత్తింటి రాక్షసత్వానికి పరాకాష్ట అని అభిప్రాయపడింది. కొందరు బాధలను భరిస్తూ బానిసలుగా బతుకుతున్నారని అటువంటి పరిస్థితుల్లో మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని న్యాయమూర్తులు రాధాకృష్ణన్, దీపక్ మిశ్రాల ధర్మాసనం సూచించింది. సుప్రీంకోర్టు ప్రకటనను దేశవ్యాప్తంగా మహిళా సంఘాలే కాక, ప్రజలు సైతం స్వాగతించారు.