ముద్దుల కూతుళ్లు | Special Story About Star Players Daughters In Family | Sakshi
Sakshi News home page

ముద్దుల కూతుళ్లు

Published Thu, Jul 9 2020 12:20 AM | Last Updated on Thu, Jul 9 2020 5:26 AM

Special Story About Star Players Daughters In Family - Sakshi

దేవుడు ఒక్కొక్కరికీ ఒక్కో గిఫ్ట్‌ ఇస్తాడు. క్రీడాకారులకు మాత్రం.. కొన్నేళ్లుగా ఒకే గిఫ్ట్‌ అందుతోంది! సెరెనాకు అదే గిఫ్ట్‌.. ఉసేన్‌కీ అదే గిఫ్ట్‌. ఇండియన్‌ క్రికెటర్‌లకీ సేమ్‌ టు సేమ్‌. వరం అడిగితే.. ఆయన వరాల కొండనే ఇస్తున్నాడు. ఈ అదృష్టవంతుల లిస్ట్‌ చిన్నదేం కాదు.

ఇరవై ఒకటవ పుట్టినరోజు ప్రత్యేకమైనది. పరిణితికి అది ప్రారంభ దినం. జమైకన్‌ స్ప్రింటర్‌ ఉసేన్‌ బోల్ట్‌ జూలై 7న తన గర్ల్‌ ఫ్రెండ్‌ క్యాసీ బ్యానెట్‌ ‘21వ’ పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా జరిపించాడు. ఈ ఏడాది మే 17న పుట్టిన తమ కూతురు ఫొటోను జతపరిచి క్యాసీ బర్త్‌డేని సెలబ్రేట్‌ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో తల్లి ఒడిలో ఉన్న బిడ్డ ఫొటోను పెట్టి, బిడ్డ పేరును తొలిసారి లోకానికి వెల్లడించాడు. పేరులో ఒక మెరుపు, ఒక ఉరుము ఉన్న ఆ బంగారు కొండ.. ‘ఒలింపియా లైటెనింగ్‌ బోల్డ్‌’. ఒలింపియా అంటే మౌంటేన్‌ ఆఫ్‌ గాడ్స్‌. దేవుళ్లంతా కొలువుతీరి ఉండే స్వర్ణ పర్వతం. తల్లీబిడ్డల ఫొటో కింద భార్యకోసం కొంచెం కవిత్వం కూడా రాశాడు బోల్ట్‌. నువ్వు హ్యాపీగా ఉండటం తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదు అన్నాడు.

నిన్ను సంతోషంగా ఉంచేందుకు నేను చేయగలిగినదంతా చేస్తాను అన్నాడు. పాప రాకతో మన జీవితంలో కొత్త సంతోషాల అధ్యయనం మొదలైంది అన్నాడు. ‘ఐ లవ్‌ యూ. హ్యాపీ ట్వంటీ ఫస్ట్‌ బర్త్‌డే’ అని శుభాకాంక్షలు తెలిపాడు. అసలుకైతే ఆమెది 31వ జన్మదినం. ప్రేమ.. వయసును తగ్గించి చూస్తుంది. పదేళ్ల స్నేహపూర్వక దాంపత్యం వాళ్లది. అందుకే ఆమె వయసులోంచి పదేళ్లు తగ్గించినట్లున్నాడు. ఇంకో ఇరవై ఏళ్లు కూడా తగ్గిస్తే.. అచ్చు కూతురు ఒలింపియా లైటెనింగ్‌ బోల్డ్‌లా ఉండొచ్చు క్యాసీ బెనెట్‌. ఫొటోలో పింక్‌ గౌన్, పింక్‌ కిరీటం, పింక్‌ నవ్వుతో బోల్ట్‌ కూతురు ముద్దులు చిందిస్తూ తండ్రినో, తల్లినో, ఇద్దరినీ కలిపో చూస్తూ ఉన్నట్లుంది ఒలింపియా.   

సెరెనా విలియమ్స్‌ కూతురి పేరు కూడా ‘ఒలింపియా’నే. ఆ దేశాల వాళ్లంతా కూతుళ్లను కడుపులోంచి తెచ్చుకున్నట్లు కాకుండా.. గ్రీకుదేవుళ్లు ఉండే పసిడి కొండల నుంచి తుంచుకుని వచ్చినట్లుగా ‘ఒలింపియా’అనే పేరు పెట్టుకుంటారు! సెరెనా ఆఫ్రికన్‌ సంతతి అమెరికన్‌. ఉసేన్‌ బోల్ట్‌దీ అదే బెల్ట్‌. మన దేశపు క్రీడాకారులైతే.. ఏ వరాల కొండమీదనో బేబీ గర్ల్‌ దొరికినట్లుగా ఉంటారు. గుండెల మీద నుంచి దించరు. గుండెలపైనే నడక నేర్చుకోవాలి ఆడపిల్లలు. ధోనీకి గానీ, రైనాకు గానీ కూతుళ్లంటే అంత మురిపెం. ఇండియన్‌ క్రికెట్‌లో ఇలాంటి ‘ఫాదర్‌ ఆఫ్‌ డాటర్‌’ల లిస్ట్‌ కాస్త పెద్దదే. రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా, హర్బజన్‌ సింగ్, సౌరవ్‌ గంగూలీ, ఇంకొంచెం పాస్ట్‌లోకి వెళితే కపిల్‌ దేవ్, మొన్నమొన్నయితే అజింక్యా రెహానె.. అంతా కూతురు కూచీలు. తల్లిని కూడా పక్కకు నెట్టేసి ఫొటోలు దిగేస్తారు ఈ తండ్రీ కూతుళ్లు.

సెరెనా కూతురి పేరు అలెక్సిస్‌ ఒలింపియా. పేరులో కూడా కూతురి పక్కనే తండ్రి. ఆయన పేరు అలెక్సిస్‌. ముగ్గురూ కలిసి ఎక్కడ తిరిగినా నాలుగు అడుగులు నడిచాక కూతురి పక్కకు వచ్చేస్తాడు అలెక్సిస్‌! ఇటీవల సెరెనా తన తో పాటు కూతుర్ని టెన్సిస్‌ కోర్టుకు తెచ్చేసుకుంది. రెండున్నరేళ్ల ఒలింపియా, ముప్పై ఎనిమిదేళ్ల ఆమె జోడీ (తల్లి) కలిసి డబుల్స్‌ ఆడారు. ఎవరిమీద డబుల్స్‌ ఆడారో ఆ షేర్‌ చేసిన వీడియోలో, ఫొటోలలో లేదు. మొత్తానికి గెలిచినట్లున్నారు! ఒక హై ఫైవ్‌ కూడా ఇచ్చుకున్నారు.
 ఇండియన్‌ క్రికెట్‌ వైస్‌–కెప్టెన్‌ అజింక్యా రెహానే.. టీమ్‌లోని ఇటీవలి ‘చిన్న తండ్రి’. గత ఏడాది అక్టోబర్‌లో ఆయనకు కూతురు పుట్టింది. ఆర్య అని పేరు పెట్టుకున్నాడు. మొదట అతడికి హర్బజన్‌సింగ్‌ ట్వీట్‌ చేశాడు.. ‘‘కంగ్రాట్స్‌ న్యూబడ్డీ.. ఫన్‌ పార్ట్‌ ఆఫ్‌ లైఫ్‌ స్టార్ట్స్‌ నౌ’’ అని కామెంట్‌ పెట్టాడు. కూతురు పుడితే జీవితం ఎన్ని నవ్వుల పువ్వుల్ని పూస్తుందో హర్బజన్‌ గత ఏడాది జనవరి ఫస్ట్‌కి ట్విట్టర్‌లో పెట్టిన ఫొటోను చూస్తే తెలుస్తుంది. అందులో ఆయన తన మూడేళ్ల లిటిల్‌ ఏంజిల్‌తో కలిసి చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు. ఆ పాప పేరు హునాయా హీర్‌ ప్లాహా. ధోనీకైతే కూతురే పద్నాలుగు లోకాలు. ఐదేళ్ల క్రితం పుట్టింది జివా. ‘చిరీ’ కిడ్‌. చీర్‌ఫుల్‌ అండ్‌ లవ్‌లీ. ధోనీ, జివా కలిసి కెమెరాలను ఆటపట్టిస్తుంటారు.. ఒంటికన్నుతో చూసి, ఒకవైపుకు మూతులు బిగించీ! బయటికి వెళితే షాపింగ్‌ మాల్స్‌ సరిపోవు ఈ పితృప్రేమకు! సురేశ్‌ రైనా కూతురు గ్రేసియా. ఈ ‘వరల్డ్‌ కప్పు’ను ఎప్పుడూ చేతుల్లో పెట్టుకునే కనిపిస్తుంటాడు రైనా. నాన్న ఎత్తుకుంటే కూతురు కిలకిలమంటుండాలి కదా. ఇక్కడ నాన్నగారే కిలకిలిస్తుంటారు! ‘మైన్‌ సన్‌షైన్‌’ అంటాడు రైనా.
తన జీవితానికి సూర్యోదయం అట కూతురు. ‘మా ఇంటి మహాలక్ష్మి’ అని కూడా అందరికీ చూపిస్తుంటాడు. ‘‘నేను, ప్రియాంక వరం ఇమ్మని దేవుడిని అడిగాం. గ్రేసియాను అనుగ్రహించాడు’’ అని చెబుతున్నప్పుడు అతడి కళ్లలో కూతురి చిరునవ్వులు మెరుస్తుంటాయి. రైనా అన్నట్లే సౌరవ్‌ గంగూలీ కూడా ‘‘సనా.. మాకు బిగ్గెస్ట్‌ గాడ్స్‌ గిఫ్ట్‌ అంటుండేవాడు. సనా ఇప్పుడు పెద్దదైంది. క్లాసికల్‌ మ్యూజిక్, ఒడిస్సీ డ్యాన్స్‌.. తన లోకమే వేరు. గంగూలీకి ఇప్పటికీ తనే లోకం. సీనియర్‌ ప్లేయర్‌ కపిల్‌దేవ్‌ ఇంట్లో కూడా ‘అమియా’ అనే ఒక లోకం ఉంది. 1996లో పుట్టింది. బాధ కలిగినా, సంతోషం కలిగినా ముందు కూతురుతోనే షేర్‌ చేసుకుంటారు కపిల్‌దేవ్‌. యు.కె.లోని సెయింట్‌ ఆండ్రూస్‌లో చదివొచ్చింది ఆ అమ్మాయి. 

ప్రస్తుత టీమ్‌లో ఇంకా.. రవీంద్ర జడేజాకు, రోహిత్‌ శర్మకు కూతుళ్లే. జడేజా కూతురు నిధ్యాన. బేబీ డాల్‌ అని పిలుస్తుంటాడు. లైఫ్‌లో తనకి బెస్ట్‌ ఆఫ్‌ బెస్ట్‌ ఇవ్వాలని అతడి తపన. రోహిత్‌ శర్మ కూతురు సమైరా. పుట్టి ఏడాదిన్నరయింది. భార్య భుజం మీద నుంచి ఆమె చేతుల్లో ఉన్న కూతుర్ని చూస్తూ అతడు మురిసిపోతున్న ఫొటో అతడి అభిమానులకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. కరెంట్‌ టీమ్‌లోనే చతేశ్వర్‌ పుజారాకు అదితి అనే రెండేళ్ల కూతురు ఉంది. రవిచంద్రన్‌ అశ్విన్‌కు అఖీరా, ఆద్య అని ఇద్దరు కూతుళ్లు. రెండు వరాలు! షమీకి కూడా కూతురు ఉంది కానీ ఇప్పుడు తలి ్లదగ్గర ఉంటోంది. భార్యాభర్తలు విడిపోయారు. కూతురి పేరు ఆయిరా. కెరీర్‌లో పైకొస్తున్న క్రమంలో కూతురు పుట్టిందనే వార్త వినగానే ఊహించని ప్రమోషన్‌ లభించినట్లు మేఘాల్లో తేలియాడిన వారే ఈ క్రీడాకారులంతా. కొడుకైనా, కూతురైనా ప్రమోషనే. అయితే ఆటగాళ్లందరికీ కూతుళ్లే పుట్టడం, పుడుతుండటం ఒక ఆసక్తికరమైన విశేషం. l

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement