సాధించాలనే సంకల్పం ఉంటే విజయానికి వయసుతో సంబంధంలేదని పుణేకు చెందిన ఓ 47 ఏళ్ల తల్లి నిరూపించింది. ఇద్దరు టీనేజర్స్‌కు తల్లి అయినా.. పవర్‌లిప్టింగ్ చాంపియన్‌షిప్‌లో నాలుగు స్వర్ణాలు గెలిచి ఔరా అనిపించింది. ఆరేళ్ల క్రితమే ఈ ఆటను మొదలు పెట్టిన ఆమె అత్యత్తమ ప్రదర్శనతో మెరిసి భారత మువ్వెన్నెల జెండాను రెపరెపలాడించింది.
రష్యా వేదికగా జరిగిన ఓపెన్ ఏషియన్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ టోర్నీలో భారత్ తరఫున పాల్గొన్న భావనా టోకెకర్ 4 స్వర్ణాలు గెలిచి అందిరి దృష్టిని ఆకర్షించింది. చర్మసంబంధిత సమస్య కోసం వేసుకునే మందులతో సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఆరేళ్ల క్రితం సరదగా జిమ్‌లో అడుగుపెట్టిన ఆమె నేడు ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. భారత వాయుసేన ఫైటర్ భార్య అయిన ఆమెకు వెయిట్‌లిఫ్ట్ శిక్షణతో మరింత దృఢంగా తయారు కావచ్చనే ఐఏఎఫ్ బాడీబిల్డింగ్ జట్టు ఇచ్చిన సలహా.. అటువైపు ఆకర్షితురాలయ్యేలా చేసింది. ‘మాములుగా వెయిట్‌లిఫ్టింగ్ అనగానే ఆడవాళ్లకు కష్టమని, ఇది కేవలం యువకులకు సంబంధించినదేనని, శరీరం కటువుగా తయారవుతుందనే అపోహలుంటాయి. కానీ నేను మాత్రం అవేవి పట్టించుకోలేదు. నా 41 ఏళ్ల వయసులో ఈ శిక్షణను ప్రారంభించాను. వెయిట్‌లిప్టింగ్‌కు ఇక్కడ అంతగా ప్రాచుర్యం లేనందున, దాని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలని, గాయాలు కాకుండా టెక్నిక్‌లు నేర్చుకోవాలనే ఆతృత నాకు కలిగింది. అదే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది’ అని విజయానంతరం భావన తెలిపింది.
ఇంటర్నెటే గురువు..
సాధారణ గృహిణి అయిన ఆమె వెయిట్ లిప్టింగ్ పాఠాలను ఇంటర్నెట్ సాయంతో నేర్చుకుంది. యూట్యూబ్ వీడియోలు, ఇతర వెబ్‌సైట్స్‌లో తన పూర్తి స్థాయి సమాయాన్ని వెచ్చించేది. ఐఏఎఫ్ బాడీబిల్డింగ్ జట్టు పర్యవేక్షణలో గత ఆరేళ్లుగా నిరాంతరాయంగా శ్రమించింది. ఇదే ఆమెను ఈ స్థాయికి తీసుకొచ్చింది.
పోటీలంటే ఏడుపొచ్చేది..
‘ఈ వయసులో నేను ఈవెంట్లలో పాల్గొనగలనా? ప్రమాణాలకు అనుగుణంగా ప్రదర్శన ఇవ్వగలనా? అనే సదేహం ఉండేంది. దీంతో పోటీల్లో పాల్గొనాలంటే ఏడుపొచ్చేది.’ అని రష్యాలో ఆదివారం జరిగిన తన తొలి ఈవెంట్‌లో గెలిచిన భావన చెప్పుకొచ్చింది. అయితే ఆమె ఈవెంట్లో పాల్గొనడానికి తొలి అడుగులు మాత్రం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పడ్డాయి. ప్రపంచ పవర్ లిఫ్టింగ్ కాంగ్రెస్(డబ్ల్యూపీసీ) కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల హెడ్ మొహమ్మద్ అజ్మాత్ వీడియోలు ఆమెకు స్పూర్తిగా నిలిచాయి. ఇదే ఆమెను పోటీల్లో పాల్గొనేలా చేసింది. ‘ ఆయనకు మేసేజ్ చేసిన రోజు నాకు ఇంకా గుర్తింది. అది ఫిబ్రవరి 10. భారత్ తరఫున నేను పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనగలనా? అని అడిగాను. అయితే పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్‌కు చాలా వ్యత్యాసం ఉందని, తానే స్వయంగా వచ్చి ట్రయల్స్ ఇస్తానని అజ్మత్ సర్ బదులివ్వగానే నేను ఉలిక్కిపడ్డాను.’ అని భావన తెలిపింది. ఈ ఏడాది మేలో బెంగళూరులో ట్రయల్స్‌కు హాజరైన భావన మాస్టర్-2 కేటగిరి (45-50 గ్రూప్)కు ఎంపికైంది. అనంతరం ఆన్‌లైన్ వేదికగా అజ్మత్ శిక్షణలో నియమ నిబంధనలు, కొత్త టెక్నిక్స్ నేర్చుకుంది. తాజాగా రష్యా వేదికగా జరిగిన అండర్ 67.5 మాస్టర్స్2 కేటగిరిలో స్క్వాట్-87 కేజీ, బెంచ్-65 కేజీ, డెడ్‌లిప్ట్-120 కేజీ విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబర్చి పసిడి పతకాలను సొంతం చేసుకుంది.
నమ్మలేకపోతున్నాను..
‘ఈ ఛాంపియన్‌షిప్‌లో ఇంత గొప్ప క్రీడాకారులను చూడటం చాలా ఆనందంగా ఉంది. ప్రపంచస్థాయి టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చడాన్ని నేను నమ్మలేకపోతున్నాను. నా బలాన్ని పెంపొందించాడానికి తొలుత దీన్ని ప్రారంభించాను. కానీ ప్రస్తుతం ఈ వెయిట్ ట్రైనింగ్‌ను ఆస్వాదిస్తున్నాను. నా కుటుంబం కూడా నాకు చాలా మద్దతుగా నిలిచింది. నా విజయానికి మూలస్థంబాలు వారే. నా శిక్షణకు సహాయం చేస్తూ.. నాతో్ పాటు జిమ్‌కు కూడా వచ్చేవారు. దేశంలో ఈ తరహా ఆటలపై మరింత అవగాహన పెరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని విజయానంతరం భావన పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment