శ్రమించి సెమీస్‌కి...
► సైనా ముందంజ
► పోరాడి ఓడిన సింధు
► ఇండియా ఓపెన్ టోర్నీ
న్యూఢిల్లీ: ఆద్యంతం అద్భుతంగా పోరాడిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సైనా 19-21, 21-14, 21-19తో ఐదో సీడ్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)పై విజయం సాధించింది. గంటా 23 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో సైనాకు తన ప్రత్య ర్థి నుంచి గట్టిపోటీనే ఎదురైంది. అయితే డిఫెం డింగ్ చాంపియన్ సైనా కీలకదశలో సంయమనం కోల్పోకుండా ఆడి విజయాన్ని దక్కించుకుంది. మ్యాచ్‌లో పలుమార్లు సైనా ఆధిక్యంలో ఉండటం, ఆ తర్వాత కోల్పోవడం జరిగింది.
నిర్ణాయక మూడో గేమ్‌లో మాత్రం ఈ హైదరాబాద్ అమ్మాయి ఒకదశలో 11-7తో ముందంజ వేసింది. అయితే సుంగ్ వెంటనే తేరుకొని వరుసగా ఆరు పాయింట్లు సంపాదించింది. దాంతో సైనా 11-13తో వెనుకబడింది. ఈ దశలో సైనా ఒత్తిడికి లోనుకాకుండా నిలకడగా ఆడి 14-14తో స్కోరును సమం చేసింది. స్కోరు 18-18 వద్ద సైనా రెండు పాయింట్లు నెగ్గి 20-18తో విజయానికి చేరువైంది. సుంగ్ మరో పాయింట్ నెగ్గినా, ఆ వెంటనే సైనా సుదీర్ఘంగా సాగిన ర్యాలీలో పైచేయి సాధించి విజయాన్ని దక్కించుకొని ఊపిరి పీల్చుకుంది. సుంగ్ జీ హున్‌పై సైనాకిది ఆరో విజయం కావడం విశేషం.
శనివారం జరిగే సెమీఫైనల్లో మూడో సీడ్ లీ జురుయ్ (చైనా)తో సైనా తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సైనా 2-10తో వెనుకబడి ఉంది. 2012 ఇండోనేసియా ఓపెన్‌లో చివరిసారి లీ జురుయ్‌ను ఓడించిన సైనా... ఆ తర్వాత ఈ చైనా ప్లేయర్‌తో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓడడం గమనార్హం.
మరో క్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన పీవీ సింధుకు ఓటమి ఎదురైంది. ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు 21-15, 15-21, 15-21తో ప్రపంచ 15వ ర్యాంకర్ యోన్ బే జు (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. గంటా 20 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌ను దక్కించుకున్నా... ఆ తర్వాత అదే జోరును కొనసాగించడంలో విఫలమైంది.