FIFA (International Federation of Association Football)
-
‘బెస్ట్ ప్లేయర్లు’గా వినిసియస్, బొన్మాతి
దోహా: రియల్ మాడ్రిడ్ స్టార్ వినిసియస్ జూనియర్ ఎట్టకేలకు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) అవార్డును చేజిక్కించుకున్నాడు. ఫురుషుల విభాగంలో అతను ‘ఫిఫా బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అందుకున్నాడు. ఈ అక్టోబర్‌లో ప్రతిష్టాత్మక బాలన్‌డోర్ అవార్డు రేసులో తుదిదాకా నిలిచినా... అనూహ్యంగా మాంచెస్టర్ మిడ్‌ఫీల్డర్ రోడ్రి అందుకోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఇప్పుడు ‘ఫిఫా’ ప్రతిష్టాత్మక అవార్డుతో ఆ అవమానాన్ని, నిరాశను ఒక్కసారిగా అధిగమించినట్లయ్యింది. 2023 ఆగస్టు నుంచి 2024 ఆగస్టు వరకు జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌ల్లో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా ‘ఫిఫా’ 11 మంది ప్లేయర్లను తుది అవార్డుల జాబితాకు ఎంపిక చేసింది. వీరిలో నుంచి వినిసియస్ విజేతగా నిలిచాడు. బ్రెజిల్‌కు చెందిన ఈ 24 ఏళ్ల స్టార్ స్ట్రయికర్ గత సీజన్లో విశేషంగా రాణించాడు. 39 మ్యాచ్‌ల్లో 24 గోల్స్ సాధించాడు. స్పానిష్ టీమ్ రియల్ మాడ్రిడ్ 15వసారి యూరోపియన్ కప్ గెలుపొందడంలో కీలకపాత్ర పోషించాడు. మహిళల విభాగంలో ‘ఫిఫా బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును స్పెయిన్ మిడ్‌ఫీల్డర్ ఐతనా బొన్మాతి కైవసం చేసుకుంది. 26 ఏళ్ల స్పానిష్ స్టార్ ఇదివరకే వరుస సీజన్లలో బాలన్‌డోర్ అవార్డును ముద్దాడింది. అభిమానులు, ప్రస్తుత కెప్టెన్లు, కోచ్‌లు, ప్రపంచ వ్యాప్త జాతీయ ఫుట్‌బాల్ జట్లు, మీడియా ప్రతినిధులు వేసిన ఓట్లకు సమాన వెయిటేజీ ఇచ్చినట్లు ‘ఫిఫా’ వెల్లడించింది. -
సౌదీ అరేబియాకే ఆతిథ్య హక్కులు
జ్యూరిచ్: పుష్కర కాలం వ్యవధిలో ఆసియాలోని మరో అరబ్ దేశం ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఖాయమైంది. 2022లో ఖతర్‌లో ఈ మెగా ఈవెంట్ జరగ్గా... ఇప్పుడు సౌదీ అరేబియా ఆ అవకాశం దక్కించుకుంది. 2034లో జరిగే ప్రపంచ కప్‌ను సౌదీ అరేబియాలో నిర్వహించనున్నట్లు ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అధికారికంగా ప్రకటించింది. 2034 వరల్డ్ కప్ కోసం ఒక్క సౌదీ మాత్రమే బిడ్ వేసింది. గత 15 నెలలుగా బిడ్డింగ్ ప్రక్రియ కొనసాగింది. మరే దేశం నుంచి పోటీ లేకపోవడంతో ఆ దేశానికే ఆతిథ్య హక్కులు గతంలోనే ఖాయమయ్యాయి. అయితే ‘ఫిఫా’ అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫ్యాంటినో నేతృత్వంలో బుధవారం 200 మంది ‘ఫిఫా’ సభ్యులు ఆన్లైన్ ద్వారా సమావేశమై దీనికి ఆమోద ముద్ర వేశారు. ఖతర్ తరహాలోనే ఈ దేశంలోనూ మానవ హక్కుల ఉల్లంఘన సాగుతోందని, వరల్డ్ కప్ అవకాశం ఇవ్వరాదని విమర్శలు వచి్చనా... ‘ఫిఫా’ వీటిని లెక్క చేయకుండా ముందుకు సాగింది. దేశ రాజధాని రియాద్‌తో పాటు ఇంకా ఇప్పటికీ నిర్మాణం ప్రారంభించని కొత్త నగరం ‘నియోమ్’లో వరల్డ్ కప్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మూడు దేశాల్లో 2030 టోర్నీ... ‘ఫిఫా’ సమావేశంలో 2030 వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులను కూడా ఖాయం చేశారు. ఈ టోర్నీని యూరోప్ దేశాలు స్పెయిన్, పోర్చుగల్‌తో పాటు ఆఫ్రికా దేశం మొరాకో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తాయి. దీంతో పాటు 1930లో జరిగిన తొలి వరల్డ్ కప్‌కు వందేళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని దక్షిణ అమెరికాలోని మూడు దేశాల్లో తొలి మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. 1930 విజేత ఉరుగ్వే, రన్నరప్ అర్జెంటీనాతో పాటు ప్రపంచంలోనే అతి పురాతనమైన ‘దక్షిణ అమెరికా ఫుట్‌బాల్ సమాఖ్య’ ప్రధాన కేంద్రం ఉన్న పరాగ్వేలో కూడా ఒక మ్యాచ్ జరుగుతుంది. టోర్నీలోని మొత్తం 104 మ్యాచ్‌లను మూడు వేర్వేరు ఖండాల్లో నిర్వహించనుండటం విశేషం. -
‘ఫిఫా’ అత్యుత్తమ ప్లేయర్‌గా మెస్సీ.. రికార్డు స్థాయిలో మూడోసారి
అర్జెంటీనా సూపర్‌స్టార్ మెస్సీ 2023 సంవత్సరానికిగాను పురుషుల విభాగంలో ‘ఫిఫా బెస్ట్ ప్లేయర్’గా నిలిచాడు. మెస్సీకి నార్వే ఫార్వర్డ్ ఎర్లింగ్ హాలాండ్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఇద్దరు 48 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచినప్పటికీ కెప్టెన్ల ప్యానెల్ నుంచి ఎర్లింగ్ కంటే మెస్సీకే ఎక్కువ ఓట్లు రావడంతో ‘ఫిఫా’ మెస్సీనే ఎంపిక చేసింది. మెస్సీ ఈ అవార్డును రికార్డు స్థాయిలో మూడోసారి (2019, 2022, 2023) గెలుచుకున్నాడు. మెస్సీ గతేడాది బాలన్ డి ఓర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును కూడా మెస్సీ రికార్డు స్థాయిలో ఎనిమిది సార్లు కైవసం చేసుకున్నాడు. మెస్సీ ఫిఫా’ అత్యుత్తమ ప్లేయర్ అవార్డు గెలుచుకున్న అనంతరం మరో ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అతనికి శుభాకాంక్షలు తెలిపాడు. రొనాల్డో 2023 ఫిఫా అత్యుత్తమ ప్లేయర్ అవార్డు రేసులో లేకపోవడం విశేషం. కాగా, లీగ్‌లతో బిజీగా ఉండటంతో మెస్సీ అవార్డు ప్రధానోత్సవ వేడుకకు హాజరుకాలేదు. -
ఫుట్‌బాల్ ప్రపంచకప్ ప్రైజ్‌మనీతో పోలిస్తే క్రికెట్ వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీ ఇంత తక్కువా..?
విశ్వవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన క్రీడల్లో ఫుట్‌బాల్, క్రికెట్ రెండు సరిసమానంగా ఉంటాయి. ఇటీవలికాలంలో ఫుట్‌బాల్‌తో పోలిస్తే క్రికెట్‌కు ప్రజాదరణ పెరిగిందనే చెప్పాలి. పాశ్యాత్య దేశాల్లో సైతం క్రికెట్‌కు విపరీతంగా క్రేజ్ పెరుగుతూ వస్తుంది. ప్రపంచంలో రెండు క్రీడలకు సరిసమానమైన క్రేజ్ ఉన్నా ఒక్క విషయంలో మాత్రం క్రికెట్‌కు అన్యాయమే జరుగుతుంది. ప్రైజ్‌మనీ విషయంలో జెంటిల్మెన్ గేమ్ బాగా వెనుకపడి ఉంది. ప్రపంచకప్ విషయానికొస్తే.. ఫుట్‌బాల్ ప్రైజ్‌మనీతో పోలిస్తే క్రికెట్ ప్రైజ్‌మనీ చాలా తక్కువగా ఉంది. 2022 ఫిఫా ప్రపంచకప్ విన్నర్ (అర్జెంటీనా) ప్రైజ్‌మనీ భారత కరెన్సీలో సుమారు 334 కోట్ల రూపాయలు (42 మిలియన్ యూఎస్ డాలర్లు) అయితే.. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ విజేతకు 33 కోట్ల రూపాయలు (4 మిలియన్ యూఎస్ డాలర్లు) మాత్రమే దక్కుతుంది. ప్రైజ్‌మనీ విషయంలో రెండు క్రీడల మధ్య ఇంత వ్యత్యాసం ఉండటంతో క్రికెట్ అభిమానులు బాగా ఫీలైపోతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అంత డబ్బు సంపాధిస్తున్నా క్రికెట్‌పై ఎందుకు ఇంత చిన్నచూపు అని వారు ప్రశ్నిస్తున్నారు. అనాదిగా క్రికెట్‌పై ఈ వివక్ష కొనసాగుతూనే ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రజాధరణ విషయంలో ఫుట్బాలర్లతో పోలిస్తే క్రికెటర్లు ఏమాత్రం తీసిపోనప్పటికీ వారికందే పారితోషికం మాత్రం నామమాత్రంగా ఉందని అంటున్నారు. ఇకనైనా క్రికెటర్ల వ్యక్తిగత పారితోషికం, జట్టుకు అందే ప్రైజ్‌మనీ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, వన్డే ప్రపంచకప్ 2023 ప్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీ మొత్తం 10 మిలియన్ యూఎస్ డాలర్లుగా నిర్ణయించబడింది. ఇండియన్ కరెన్సీలో దీని విలువ దాదాపు 83 కోట్లు (82 కోట్ల 93 లక్షల 57 వేల 500 రూపాయలు). ఈ మొత్తం ప్రైజ్‌మనీ విజేత, రన్నరప్, సెమీ ఫైనలిస్ట్‌లు, గ్రూప్ స్టేజ్‌లో నిష్క్రమించిన జట్ల మధ్య విభజించబడుతుంది. విజేతకు 40 లక్షల యూఎస్ డాలర్లు (33 కోట్ల 17 లక్షల 8 వేల రూపాయలు) దక్కుతుంది. రన్నరప్‌కు 20 లక్షల యూఎస్ డాలర్లు (16 కోట్ల 58 లక్షల 54 వేల రూపాయలు) అందుతుంది. సెమీ ఫైనలిస్ట్‌లకు 8 లక్షల యూఎస్ డాలర్లు (6 కోట్ల 63 లక్షల 43 వేల 600 రూపాయలు).. గ్రూప్ స్టేజీలో నిష్క్రమించిన జట్లకు లక్ష యూఎస్ డాలరు (82 లక్షల 92 వేల 950 రూపాయలు).. గ్రూప్ స్టేజీలో మ్యాచ్ గెలిచిన జట్టుకు 40 వేల యూఎస్ డాలర్లు (33 లక్షల 17 వేల 668 రూపాయలు) ప్రైజ్‌మనీగా అందుతుంది. ఇదిలా ఉంటే, ఐసీసీ వన్డే ప్రపంచకప్-2023 భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్-గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడుతుంది. టీమిండియా తమ చిరకాల ప్రత్యర్ధి పాక్‌ను అక్టోబర్ 14న నరేంద్ర మోదీ స్టేడియంలో ఢీకొంటుంది. నవంబర్ 19న జరిగే ఫైనల్‌తో మెగా టోర్నీ ముగుస్తుంది. -
బలవంతపు ముద్దుకు తగిన మూల్యం.. ఫెడరేషన్ చీఫ్‌పై సస్పెన్షన్ వేటు
స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ తమ దేశ స్టార్ క్రీడాకారిణి జెన్నిఫర్ హెర్మోసోను పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టుకున్నందుకు తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఈ ఉదంతం అనంతరం స్పెయిన్‌లో చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో రుబియాలెస్‌పై ఫిఫా సస్పెన్షన్ వేటు వేసింది. ఈ సస్పెన్షన్ ప్రాథమికంగా 90 రోజుల పాటు అమల్లో ఉంటుందని ఫిఫా పేర్కొంది. సస్పెన్షన్‌తో పాటు రుబియాలెస్‌పై క్రమశిక్షణా చర్యలు కూడా ఉంటాయని తెలిపింది. కాగా, స్పెయిన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు జగజ్జేతగా అవతరించిన అనంతరం మెడల్స్ ప్రజెంటేషన్ సందర్భంగా రుబియాలెస్.. జెన్నిఫర్ హెర్మోసోను పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టుకున్న విషయం తెలిసందే. ఆ సమయంలో రుబియాలెస్.. జెన్నిఫర్‌తో పాటు మిగతా క్రీడాకారిణులను కూడా చెంపలపై ముద్ద పెట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. రుబియాలెస్ నుంచి ఊహించని ఈ ప్రవర్తన చూసి జెన్నిఫర్‌తో పాటు అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. ఈ ఉదంతంపై స్పెయిన్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఓ మహిళలను అయిష్టంగా చుంబించడం సమర్ధనీయం కాదని స్పానిష్ ప్రజలు నిరసనలకు దిగారు. ఈ ఉదంతం స్పెయిన్‌లో రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది. నిరసనలు, ఆందోళలను తీవ్రరూపం దాల్చడంతో ఆ దేశ ప్రధాని పెడ్రో సాంచెజ్ రంగంలోకి దిగారు. రుబియాలెస్ బాధ్యతాయుతమైన వివరణ ఇవ్వాలని సూచించారు. క్రీడా శాఖకు సంబంధించిన స్పానిష్ హై కౌన్సిల్ రుబియాలెస్‌పై చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో ఫిఫా జోక్యం చేసుకుని రుబిమాలెస్పై తూలెసస్పెన్షన్ వేటు వేసింది. -
ఫుట్‌బాల్ క్రీడాకారిణికి ముద్దు పెట్టిన ఫెడరేషన్ చీఫ్.. స్పెయిన్‌లో రచ్చ రచ్చ
2023 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను స్పెయిన్ తొలిసారిగా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆగస్ట్ 20న జరిగిన ఫైనల్లో స్పెయిన్.. ఇంగ్లండ్‌ను 1-0 గోల్స్ తేడాతో మట్టికరిపించి జగజ్జేతగా ఆవిర్భవించింది. అయితే మ్యాచ్ అనంతరం ఆ దేశ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ సొంత క్రీడాకారిణుల పట్ల వ్యవహరించిన తీరు స్పెయిన్‌లో రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది. మెడల్స్ ప్రజెంటేషన్ సందర్భంగా లూయిస్.. స్వదేశీ స్టార్ ఫుట్‌బాలర్ జెన్నిఫర్ హెర్మోసోను పెదాలపై ముద్దు పెట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. మిగతా క్రీడాకారిణులను కూడా చెంపలపై ముద్ద పెట్టుకుని వల్గర్‌గా బిహేవ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో స్పెయిన్‌లో నిరసనలు హోరెత్తాయి. దీంతో లూయిస్ ఓ మెట్టుకిందికి దిగొచ్చి సదరు క్రీడాకారిణిలకు, అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. అయినా స్పెయిన్‌లో నిరసనలు శాంతించలేదు. ఔ లూయిస్ ఉద్దేశపూర్వకంగా తప్పుచేసి, సారీ చెబితే సరిపోతుందా అంటూ నిరసనకారులు స్వరాలను పెంచారు. నిరసనలు, ఆందోళలను తీవ్రరూపం దాల్చడంతో ఆ దేశ ప్రధాని పెడ్రో సాంచెజ్ జోక్యం చేసుకున్నారు. లూయిస్ నామమాత్రం సారీ చెబితే సరిపోదని నిరసనకారులతో స్వరం కలిపారు. ముద్దు వివాదంపై లూయిస్ బాధ్యతాయుతమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, ఫెడరేషన్ అధ్యక్షుడిపై చర్యలు తీసుకునే అధికారం తనకు లేదని చేతులు దులుపుకున్నాడు. దీంతో క్రీడా శాఖకు సంబంధించిన స్పానిష్ హై కౌన్సిల్ రంగంలోకి దిగింది. స్పెయిన్ ప్రభుత్వం కాని సాకర్ కౌన్సిల్ కాని లూయిస్‌పై చర్యలు తీసుకోకపోతే తాను చర్యలకు ఉపక్రమిస్తానని కౌన్సిల్ అధ్యక్షుడు ప్రకటన విడుదల చేశారు. మొత్తానికి స్పెయిన్‌లో ముద్దు వివాదం చినికిచినికి గాలివానలా మారుతుంది. -
FIFA Football Awards : కన్నులపండువగా ఫిఫా అవార్డ్స్ వేడుక (ఫొటోలు)
-
FIFA World Cup 2022: ఒకే సమయానికి రెండు మ్యాచ్‌లు.. ఎందుకిలా..?
ఫిఫా వరల్డ్‌కప్‌లో అన్ని జట్లు తమ ఆఖరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు (ఒకే గ్రూప్‌కు చెందినవి) ఒకే సమయంలో ఎందుకు ఆడతాయన్న విషయం చాలామంది సాకర్ ఫాలోవర్స్‌కు అర్ధం కాకపోవచ్చు. అయితే దీని వెనుక చాలా పెద్ద చరిత్ర ఉందన్నది అందరూ తెలుసుకోవాలి. వివరాల్లోకి వెళితే.. స్పెయిన్ వేదికగా జరిగిన 1982 వరల్డ్‌కప్‌లో అల్జీరియా తదుపరి రౌండ్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలు వెస్ట్ జర్మనీ, ఆస్ట్రియా జట్ల మధ్య జరిగే మ్యాచ్‌పై ఆధారపడి ఉన్నాయి. దీంతో గ్రూప్ మ్యాచ్‌లన్నీ ముగిసిన అల్జీరియా, ఆ మ్యాచ్ ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూసింది. ఆ మ్యాచ్‌లో పటిష్టమైన వెస్ట్ జర్మనీ రెండు గోల్స్ తేడాతో గెలిస్తే అల్జీరియా తర్వాతి రౌండ్‌కు చేరుతుంది. ఈ క్రమంలో ఆట మొదలయ్యాక 11 నిమిషాల్లోనే గోల్ చేసిన వెస్ట్ జర్మనీ.. ఆ తర్వాత గోల్ చేసే అవకాశం వచ్చినా ఉదాసీనంగా వ్యవహరించి, అల్జీరియా ఇంటిదారి పట్టడానికి పరోక్ష కారణమైంది. కారణం ఏంటంటే.. అల్జీరియా తమ గ్రూప్ దశ ఓపెనింగ్ మ్యాచ్‌లో వెస్ట్ జర్మనీపై విజయం సాధించింది. ఈ అక్కసుతో వెస్ట్ జర్మనీ.. అల్జీరియా తదుపరి రౌండ్‌కు చేరకుండా చావు దెబ్బకొట్టింది. వెస్ట్ జర్మనీ ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ మోసాన్ని అప్పట్లో సాకర్ ప్రపంచం మొత్తం వేలెత్తి చూపింది. వెస్ట్ జర్మనీని సస్పెండ్ చేయాలని అల్జీరియా.. ఫిఫా గవర్నింగ్ బాడీకి ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కు చేరిన వెస్ట్ జర్మనీ.. అల్జీరియాకు చేసిన మోసానికి ఫలితం అనుభవించింది. వెస్ట్ జర్మనీ.. నాటి చారిత్రక ఫైనల్లో ఇటలీ చేతిలో 1-3 గోల్స్ తేడాతో చావుదెబ్బ తినింది. అల్జీరియాతో మ్యాచ్‌లో వెస్ట్ జర్మనీ తొండాట ఆడిందని విచారణలో తెలుసుకున్న ఫిఫా.. ఆ జట్టుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ, ఆ తర్వాతి వరల్డ్‌కప్ (1986) నుంచి రూల్స్ మాత్రం మార్చింది. గ్రూప్ స్టేజ్‌లో అన్ని జట్ల తమ చివరి మ్యాచ్‌లు ఒకే సమయంలో ఆడాలని రూల్స్‌ను సవరించింది. ఇలా చేయడం వల్ల ఏ జట్టు ఉద్దేశపూర్వకంగా మరో జట్టుకు (ఒకే గ్రూప్) నష్టం కలిగించే విధంగా వ్యవహరించే అవకాశం ఉండదు. నాకౌట్స్‌కు చేరాలంటే ఓ మ్యాచ్ ఫలితంపై మరో జట్టు భవితవ్యం ఆధార పడే ఆస్కారం ఉండదు. నాకౌట్స్‌కు చేరే క్రమంలో ఆఖరి గ్రూప్ మ్యాచ్ కీలకం కాబట్టి ఫిఫా ఈ నిర్ణయం తీసుకుంది. 1986 నుంచి ఆఖరి గ్రూప్ మ్యాచ్ విషయంలో ఇదే పద్దతి పాటిస్తుంది. కాగా, నాటి రూల్ ప్రకారం ప్రస్తుత వరల్డ్‌కప్‌లోనూ తొలి 8 రోజులు రోజుకు నాలుగేసి మ్యాచ్‌లు, ఒక్కోటి ఒక్కో సమయంలో (మధ్యాహ్నం 3:30, సాయంత్రం 6:30, రాత్రి 9:30, అర్ధరాత్రి 12:30) జరిగాయి. రౌండ్ ఆఫ్ 16కి (నాకౌట్) ముందు జరగాల్సిన ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లు (ఒకే గ్రూప్‌కు చెందినవి) మాత్రం రెండూ ఒకే సమయంలో (రాత్రి 8:30, అర్ధరాత్రి 12:30) జరుగుతున్నాయి. నవంబర్ 29 నుంచి ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. -
FIFA World Cup Qatar 2022: స్పెయిన్ ‘సెవెన్’ స్టార్ ప్రదర్శన
దోహా: ఫుట్‌బాల్ ప్రపంచకప్ టైటిల్ ఫేవరెట్స్‌లో ఒక జట్టయిన స్పెయిన్ భారీ విజయంతో బోణీ కొట్టింది. గ్రూప్ ‘ఇ’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో 2010 విశ్వవిజేత స్పెయిన్ 7–0 గోల్స్ తేడాతో కోస్టారికా జట్టును చిత్తుగా ఓడించింది. స్పెయిన్ తరఫున ఫెరాన్ టోరెస్ (31వ, 54వ ని.లో) రెండు గోల్స్ సాధించగా... డానీ ఓల్మో (11వ ని.లో), మార్కో అసెన్సియో (21వ ని.లో), గావి (74వ ని.లో), కార్లోస్ సోలెర్ (90వ ని.లో), అల్వారో మొరాటా (90+2వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. తమ ప్రపంచకప్ చరిత్రలో స్పెయిన్కిదే అతిపెద్ద విజయం. ఆ జట్టు ప్రపంచకప్ మ్యాచ్‌లో ఏడు గోల్స్ చేయడం ఇదే తొలిసారి. కోస్టారికాతో మ్యాచ్‌లో స్పెయిన్ సంపూర్ ఆధిపత్యం చలాయించింది. 82 శాతం బంతి స్పెయిన్ ఆధీనంలో ఉండటం వారి ఆధిపత్యానికి నిదర్శనం. స్పెయిన్ ప్రత్యర్థి గోల్‌పోస్ట్ లక్ష్యంగా ఎనిమిది షాట్లు కొట్టగా... కోస్టారికా ఒక్కసారి కూడా స్పెయిన్ గోల్‌పోస్ట్ లక్ష్యంగా షాట్ కొట్టలేకపోయింది. స్పెయిన్ ఆటగాళ్లు ఏకంగా 1,043 పాస్‌లు పూర్తి చేశారు. ప్రపంచకప్ చరిత్రలో ఏ జట్టు కూడా ఒక మ్యాచ్‌లో ఇన్ని పాస్‌లు పూర్తి చేయలేదు. కోస్టారికా ఆటగాళ్లు 231 పాస్‌లతో సరిపెట్టుకున్నారు. ప్రపంచకప్ మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో స్పెయిన్ మూడు గోల్స్ చేయడం 1934 తర్వాత ఇదే తొలిసారి. 1934లో బ్రెజిల్‌పై తొలి అర్ధభాగంలో స్పెయిన్ మూడు గోల్స్ సాధించింది. క్రొయేషియా 0 మొరాకో 0 గత ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీ రన్నరప్ క్రొయేషియాను మొరాకో నిలువరించింది. బుధవారం గ్రూప్ ‘ఎఫ్’లో జరిగిన లీగ్ మ్యాచ్ 0–0తో డ్రాగా ముగిసింది. సీనియర్ స్ట్రయికర్, క్రొయేషియా కెప్టెన్ మోడ్రిచ్ ఖాతా తెరిచేందుకు గట్టి ప్రయత్నాలే చేసిన మొరాకో ఆటగాళ్లు అడ్డుగోడ కట్టేయంతో గోల్ నమోదు కాలేదు. -
FIFA World Cup Qatar 2022: ఫ్రాన్స్ సూపర్ షో
అల్ వాక్రా (ఖతర్): వరుసగా రెండు ప్రపంచకప్‌లలో ఒకే జట్టు విజేతగా నిలిచి 60 ఏళ్లయింది. బ్రెజిల్ పేరిట ఉన్న ఈ ఘనతను తాము కూడా సాధించాలనే లక్ష్యంతో ఖతర్‌కు వచ్చిన డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ తొలి పరీక్షలో పాస్ అయింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్ ‘డి’ లీగ్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ జట్టు 4–1 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియా జట్టును ఓడించి శుభారంభం చేసింది. ఫ్రాన్స్ తరఫున ఒలివియర్ జిరూడ్ (32వ, 71వ ని.లో) రెండు గోల్స్ సాధించగా... అడ్రియన్ రాబియోట్ (27వ ని.లో), ఎంబాపె (68వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. ఆస్ట్రేలియా తరఫున ఏకైక గోల్‌ను క్రెయిగ్ గుడ్విన్ (9వ ని.లో) సాధించాడు. షాక్ నుంచి తేరుకొని... వరుసగా ఐదోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఆస్ట్రేలియా మైదానంలో అభిమానులందరూ పూర్తిగా సర్దుకొని కూర్చునేలోపే ఖాతా తెరిచింది. ఆట తొమ్మిదో నిమిషంలో కుడి వైపు నుంచి లెకీ అందించిన పాస్‌ను క్రెయిగ్ గుడ్విన్ లక్ష్యానికి చేర్చడంతో ఆస్ట్రేలియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. దాంతో అభిమానులకు మరో సంచలన ఫలితం తప్పదా అనే అనుమానం కలిగింది. అయితే ఫ్రాన్స్ జట్టు వెంటనే తేరుకుంది. సమన్వయంతో ఆడింది. ఆస్ట్రేలియా జట్టుకు పగ్గాలు వేసింది. ఐదు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ సాధించి 2–1తో ఆధిక్యాన్ని అందుకుంది. 27వ నిమిషంలో ఎడమ వైపు నుంచి థియో హెర్నాండెజ్ కొట్టిన షాట్‌ను ‘డి’ ఏరియాలో ఉన్న ఆడ్రియన్ రాబియోట్ హెడర్ షాట్‌తో ఆస్ట్రేలియా గోల్కీపర్ను బోల్తా కొట్టించాడు. 32వ నిమిషంలో ఎడమ వైపు నుంచి రాబియోట్ అందించిన పాస్‌ను ఒలివియర్ జిరూడ్ గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఫ్రాన్స్ 2–1తో ముందంజలో ఉంది. రెండో అర్ధభాగంలోనూ ఫ్రాన్స్ ఆధిపత్యం కనబరిచింది. ఈసారి మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ సాధించి ఆస్ట్రేలియాకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ఈ గెలుపుతో ఫ్రాన్స్ జట్టుకు మూడు పాయింట్లు లభించాయి. 51 ఆస్ట్రేలియాపై రెండు గోల్స్ చేసిన క్రమంలో ఒలివియర్ జిరూడ్ ఫ్రాన్స్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా థియరీ హెన్రీ (51 గోల్స్) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. -
FIFA World Cup Qatar 2022: జర్మనీకి జపాన్ షాక్
FIFA World Cup 2022 Germany Vs Japan Highlights: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మరో అనూహ్య ఫలితం వచ్చింది. మంగళవారం రెండుసార్లు విశ్వవిజేత అర్జెంటీనాను సౌదీ అరేబియా బోల్తా కొట్టిస్తే... బుధవారం ఏకంగా నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన జర్మనీ జట్టును జపాన్ ఓడించి పెను సంచలనం సృష్టించింది. ఆసియా గడ్డపై రెండు దశాబ్దాల తర్వాత జరుగుతున్న ప్రపంచకప్‌లో రెండు రోజుల వ్యవధిలో రెండు ఆసియా జట్లు అద్భుతం చేశాయి. దోహా: ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో మేటి జట్లు, మాజీ చాంపియన్లకు ఆసియా జట్లు ఎవరూ ఊహించని విధంగా షాక్ ఇస్తున్నాయి. బుధవారం గ్రూప్ ‘ఇ’లో భాగంగా నాలుగుసార్లు చాంపియన్ జర్మనీని జపాన్ కంగుతినిపించింది. ఇద్దరు సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లు రిత్సు డాన్, టకుమా అసానో చివరి 15 నిమిషాల్లో చేసిన రెండు గోల్స్‌తో జపాన్ 2–1 స్కోరుతో జర్మనీని గట్టిదెబ్బే తీసింది. తరచూ జర్మన్ క్లబ్‌లలో ఆడే రిత్సు (75వ ని.), అసానో (83వ ని.) ఈ ప్రపంచకప్‌లో ఆ జాతీయ జట్టును ఓడించడంలో కీలకపాత్ర పోషించారు. జర్మనీ తరఫున ఇల్కే గుయెండగన్ (33వ ని.) గోల్ సాధించాడు. ఈ గ్రూప్‌లో టైటిల్ ఫేవరెట్ జట్టయిన జర్మనీ ఆరంభం నుంచే గోల్స్ ప్రయత్నాలకు పదును పెట్టింది. ఈ క్రమంలో 24 సార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్ లక్ష్యంగా షాట్లు ఆడింది. ప్రథమార్ధంలోనే గుయెండగన్ గోల్‌తో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తీవ్రమైన ఒత్తిడిలో రెండో అర్ధభాగాన్ని మొదలుపెట్టిన జపాన్‌కు సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లు అసాధారణ ఫలితాలను సాధించి పెట్టారు. జపాన్ 2–1 ఆధిక్యంతో గెలుపు దారిలో పడగా... జర్మనీ మాత్రం ఎక్కడా పట్టు సడలించలేదు. ఆఖరి నిమిషం దాకా కష్టపడింది. నిర్ణీత సమయంలోని 90వ నిమిషం నుంచి ఇంజ్యూరీ టైమ్ 9 నిమిషాల పాటు స్కోరు సమం చేసేందుకు కడదాకా చెమటోడ్చింది. ఫుల్క్రగ్, రుడిగెర్, గోరెట్జా, సులే అదేపనిగా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై షాట్లు ఆడారు. అయితే జపాన్ డిఫెండర్లు, గోల్ కీపర్ సమన్వయంతో ఆడ్డుకోవడంతో జర్మనీ ప్రయత్నాలన్నీ నీరుగారాయి. జపాన్ గోల్ కీపర్ షుయిచి గొండా పెట్టని కోటలా నిలుచున్నాడు. ప్రపంచకప్ చరిత్ర లో ఆసియా జట్టు చేతిలో ఓడిపోవడం జర్మనీకిది రెండోసారి. 2018 ప్రపంచకప్‌లో దక్షిణ కొరియా చేతిలో జర్మనీ 0–2తో ఓడిపోయింది. చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్.. టీమిండియాకు భారీ షాక్! స్టార్ ఆటగాడు దూరం Abu Dhabi T10: కెప్టెన్సీ పోయిందన్న కసితో విధ్వంసం! 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో! -
‘ఫ్రెంచ్ కిక్’ అదిరేనా!
తొమ్మిది దశాబ్దాల ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలో డిఫెండింగ్ చాంపియన్ జట్టు టైటిల్ నిలబెట్టుకొని 60 ఏళ్లు గడిచాయి. చివరిసారి బ్రెజిల్ జట్టు ఈ ఘనత సాధించింది. బ్రెజిల్ వరుసగా 1958, 1962 ప్రపంచకప్‌లలో చాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత మరో విజేత జట్టు తదుపరి ప్రపంచకప్‌లో టైటిల్ సాధించలేకపోయింది. 1994 తర్వాత ప్రపంచకప్ చాంపియన్‌గా నిలిచిన యూరోప్ జట్టు తదుపరి వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశ దాటడంలో విఫలమవుతోంది. చరిత్రపరంగా చూస్తే ప్రస్తుత విజేత ఫ్రాన్స్ జట్టుకు ప్రతికూలాంశాలు ఉన్నాయనుకోవాలి. కానీ ఎంతోమంది స్టార్ ఆటగాళ్లతో కళకళలాడుతున్న ఫ్రాన్స్ జట్టు ఖతర్‌లో చరిత్రను తిరగరాస్తుందా? 60 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ టైటిల్ నిలబెట్టుకున్న తొలి జట్టుగా నిలుస్తుందా వేచి చూడాలి. ఫ్రాన్స్ బలగాన్ని చూస్తే మాత్రం గ్రూప్ ‘డి’లో ఉన్న మిగతా జట్లు డెన్మార్క్, ఆస్ట్రేలియా, ట్యునీషియాలను దాటుకొని నాకౌట్ దశకు చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. మరో అవకాశం ఉండని నాకౌట్ దశ నుంచి ఆ జట్టుకు అసలు సవాళ్లు ఎదురవుతాయి. ఫ్రాన్స్ ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: విజేత (1998, 2018). ‘ఫిఫా’ ర్యాంక్: 4. అర్హత ఎలా: యూరోపియన్ క్వాలిఫయింగ్ గ్రూప్ ‘డి’ విన్నర్. ప్రపంచకప్‌లో 16వసారి బరిలోకి దిగుతున్న ఫ్రాన్స్ జట్టు క్వాలిఫయింగ్ పోటీల్లో అజేయంగా నిలిచింది. యూరో టోర్నీలో వైఫల్యం తర్వాత గత ఏడాది నేషన్స్ లీగ్ టైటిల్‌ను సాధించి ‘ది బ్లూస్’ జట్టు ఫామ్‌లోకి వచ్చింది. వ్యక్తిగత వివాదాల్లో ఇరుక్కొని 2018 ప్రపంచకప్‌నకు దూరమైన 34 ఏళ్ల స్టార్ స్ట్రయికర్ కరీమ్ బెంజెమా ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ప్రపంచకప్ ఆడనుండటం శుభసూచకం. ఈ ఏడాది యూరోప్ ప్రొఫెషనల్ లీగ్స్ చాంపియన్స్ లీగ్, లా లీగాలో రియల్ మాడ్రిడ్ క్లబ్ జట్టుకు టైటిల్ దక్కడంలో కరీమ్ బెంజెమా కీలకపాత్ర పోషించాడు. కరీమ్ బెంజెమాతోపాటు ఇతర స్టార్ ఆటగాళ్లు కిలియాన్ ఎంబాపె, గ్రీజ్మన్, థియో హెర్నాండెజ్ రాణిస్తే మాత్రం ఫ్రాన్స్ జట్టు ఈసారీ ప్రపంచకప్ టైటిల్ సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గ్రూప్ దశలో ఒక్క డెన్మార్క్ తప్ప ఇతర జట్ల నుంచి ఫ్రాన్స్‌కు గట్టిపోటీ లభించే అవకాశాలు స్వల్పంగా ఉన్నాయి. గ్రూప్ దశ దాటి నాకౌట్ మ్యాచ్‌లకు అర్హత పొందాకే ఫ్రాన్స్ జట్టుకు అసలు సవాళ్లు ఎదురవుతాయి. డెన్మార్క్ ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: క్వార్టర్ ఫైనల్స్ (1998). ‘ఫిఫా’ ర్యాంక్: 10. అర్హత ఎలా: యూరోపియన్ క్వాలిఫయింగ్ గ్రూప్ ‘ఎఫ్’ విన్నర్. ఆరోసారి ప్రపంచకప్‌లో పాల్గొంటున్న డెన్మార్క్ క్వాలిఫయింగ్‌లో అదరగొట్టే ప్రదర్శన చేసింది. ఆడిన పది మ్యాచ్‌ల్లో తొమ్మిదింట గెలిచి, కేవలం ఒక మ్యాచ్‌లో ఓడింది. 30 గోల్స్ సాధించి, కేవలం మూడు గోల్స్ ప్రత్యర్థి జట్లకు ఇచ్చింది. స్టార్ ప్లేయర్ క్రిస్టియన్ ఎరిక్సన్పైనే అందరి దృష్టి ఉంది. ఒకరిద్దరిపైనే ఆధారపడకుండా సమష్టిగా రాణించడం డెన్మార్క్ జట్టు ప్రత్యేకత. తమ గ్రూప్‌లో ఫ్రాన్స్ జట్టుతో మ్యాచ్‌ను మినహాయిస్తే మిగతా రెండు మ్యాచ్‌ల్లో డెన్మార్క్ జట్టుకు విజయాలు దక్కే అవకాశాలున్నాయి. తాము ఆడిన గత నాలుగు ప్రపంచకప్‌లలో డెన్మార్క్ గ్రూప్ దశను దాటి నాకౌట్ రౌండ్ మ్యాచ్‌లకు అర్హత సాధించింది. ఈసారి ఆ జట్టు ప్రస్థానం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగుస్తుందో ముందుకు సాగుతుందో చూడాలి. ఆస్ట్రేలియా ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: ప్రిక్వార్టర్ ఫైనల్ (2006). ‘ఫిఫా’ ర్యాంక్: 38. అర్హత ఎలా: ఆసియా–దక్షిణ అమెరికా మధ్య ప్లే ఆఫ్ మ్యాచ్ విజేత. ఆరోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఆస్ట్రేలియా నాకౌట్ దశకు చేరాలంటే విశేషంగా ఆడాల్సి ఉంటుంది. ట్యునీషియాపై ఆ జట్టుకు గెలిచే అవకాశాలున్నా... ఫ్రాన్స్, డెన్మార్క్ జట్ల మ్యాచ్‌ల ఫలితాలే ఆ జట్టుకు కీలకం కానున్నాయి. యూరోపియన్ లీగ్స్‌లో పలు మేటి జట్లకు ఆడిన స్ట్రయికర్ అజ్దిన్ రుస్టిక్పై ఆసీస్ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. గత రెండు ప్రపంచకప్‌లలో ఆసీస్ ఆరు మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో ఓడి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. ఈసారి తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌తో ఆడనున్న ఆస్ట్రేలియా కనీసం ‘డ్రా’తో గట్టెక్కినా అది విజయంతో సమానమే. ట్యునీషియా ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: గ్రూప్ దశ (2018). ‘ఫిఫా’ ర్యాంక్: 30. అర్హత ఎలా: ఆఫ్రికా క్వాలిఫయింగ్‌లో మూడో రౌండ్ విన్నర్. ఆరోసారి ప్రపంచకప్ ఆడుతున్న ట్యునీషియా జట్టుపై పెద్దగా అంచనాలు లేవు. ఎక్కువగా రక్షణాత్మకంగా ఆడే అలవాటున్న ట్యునీషియా ఈ ఏడాది 12 మ్యాచ్‌లు ఆడి కేవలం మూడు గోల్స్ మాత్రమే తమ ప్రత్యర్థి జట్లకు కోల్పోయింది. వాబి ఖాజ్రి, యూసెఫ్ మసాక్ని, నయీమ్ జట్టులోని కీలక ఆటగాళ్లు. పటిష్ట జట్లయిన ఫ్రాన్స్, డెన్మార్క్‌లతో జరిగే మ్యాచ్‌లే ఈ మెగా ఈవెంట్లో ట్యునీషియా ప్రస్థానాన్ని నిర్ణయిస్తాయి. –సాక్షి క్రీడా విభాగం -
FIFA World Cup 2022: అర్జెంటీనా జోరు కనబర్చేనా!
‘ఫిఫా’ ఫుట్‌బాల్ ప్రపంచకప్ అంటే గుర్తొచ్చేది అర్జెంటీనా. దివంగత దిగ్గజం మారడోనా నుంచి నేటి తరం మెస్సీ దాకా అర్జెంటీనాను అందలంలో నిలిపిన వారే! ఇలాంటి జట్టు ఉన్న గ్రూప్‌లో మిగతా ప్రత్యర్థులకు గుండె హడల్ గ్యారంటీ. గ్రూప్ ‘సి’లో ఈ మేటి జట్టును ఎదుర్కొనేందుకు మెక్సికో, పోలాండ్, సౌదీ అరేబియా సర్వశక్తులు ఒడ్డాల్సిందే. ఓడించలేకపోయినా... కనీసం నిలువరించినా ఆయా జట్లకు గెలిచినంత సంబరం. ఈ నేపథ్యంలో ఏ జట్టు అర్జెంటీనాను ‘ఢీ’కొంటుందనేది అసక్తికరం! అర్జెంటీనా ప్రపంచకప్‌లో శక్తిమంతమైన జట్లలో అర్జెంటీనా ఒకటి. ఖతర్ ఈవెంట్లో తన బలాన్ని ప్రపంచానికి చాటేందుకు సిద్ధమైంది. తమ ఆల్ టైమ్ గ్రేటెస్టు ఫుట్‌బాలర్ లయెనల్ మెస్సీకి ఘనమైన వీడ్కోలు పలకాలనే పట్టుదలతో ఉంది. 35 ఏళ్ల మెస్సీ ప్రపంచకప్ మెరుపులకు ఖతరే ఆఖరి వేదిక. ఆ తర్వాత ఆటకు టాటా చెప్పడమే తరువాయి. గతేడాది గట్టి ప్రత్యర్థి బ్రెజిల్‌ను ఓడించి ‘కోపా అమెరికా కప్’ను గెలిచింది. ఆ టోర్నీలో మెస్సీతో పాటు ఏంజెల్ డి మరియా అద్భుతంగా రాణించారు. ఫిఫా ర్యాంక్: 3 ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: రెండుసార్లు విజేత (1978, 1986). ఇతర ఘనతలు: 15 సార్లు ‘కోపా అమెరికా కప్’ టైటిళ్లు. అర్హత: దక్షిణ అమెరికా క్వాలిఫయింగ్ టోర్నీలో రన్నరప్ ద్వారా. కీలక ఆటగాళ్లు: మెస్సీ, డి మరియా, లో సెల్సో. మెక్సికో ఈ గ్రూప్‌లో అర్జెంటీనా తర్వాత మరో మంచి జట్టు మెక్సికో. గత ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీని కంగుతినిపించి గ్రూప్ దశను ఆరంభించిన మెక్సికో తదుపరి రౌండ్ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. ఈసారి మాత్రం మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు చెమటోడ్చింది. అర్జెంటీనాకు చెందిన కోచ్ గెరార్డో మార్టినో 2019 నుంచి మూడున్నరేళ్లుగా జట్టును సానబెడుతున్నారు. స్టార్ ఆటగాళ్లు రాల్ జిమెనెజ్, హెక్టర్ హెరెరా, హిర్వింగ్ లొజానోలపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఫిఫా ర్యాంక్: 13. ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: క్వార్టర్ ఫైనల్ (1986). ఇతర ఘనతలు: కాన్ఫెడరేషన్ కప్ విజేత (1999). అర్హత: ఉత్తర, మధ్య అమెరికా క్వాలిఫయింగ్ టోర్నీ రన్నరప్‌తో. కీలక ఆటగాళ్లు: జిమినెజ్, హిరెరా. పోలాండ్ అర్జెంటీనా, మెక్సికోలతో పోల్చితే గట్టి ప్రత్యర్థి కాదు కానీ... ఈ గ్రూప్‌లో ‘డార్క్ హార్స్’ అని చెప్పొచ్చు. తనదైన రోజున ఒక్క గోల్‌తో పైచేయి సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. స్టార్ ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. స్ట్రయికర్లు రాబర్ట్ లెవండోస్కీ, పీటర్ జెలిన్స్కీ, మాటీ కాష్లు ఇటీవల బాగా ఆకట్టుకుంటున్నారు. ఇంగ్లండ్, స్పెయిన్ లీగ్‌లలో సత్తా చాటుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే కోచ్ బాధ్యతలు చేపట్టిన చెస్లా మిచ్నివిక్ (పోలాండ్) సొంత జట్టును ప్రపంచకప్‌కు సిద్ధం చేస్తున్నారు. అయితే మేటి జట్లను దాటుకుని నాకౌట్ చేరడం అంత సులువేమీ కాదు. ఫిఫా ర్యాంక్: 26. ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: మూడో స్థానం (1982). ఇతర ఘనతలు: ‘యూరో కప్’లో క్వార్టర్స్ (2016). అర్హత: యూరోపియన్ క్వాలిఫయింగ్ ప్లేఆఫ్ విన్నర్. కీలక ఆటగాళ్లు: లెవండోస్కీ, జెలిన్స్కీ. సౌదీ అరేబియా గ్రూప్‌లోని మిగతా జట్లకంటే తక్కువ ర్యాంక్ జట్టు. పైగా గత నాలుగు ప్రపంచకప్‌లలో గ్రూప్ దశనే దాటలేకపోయింది. ఇలాంటి జట్టు గ్రూప్ ‘సి’ నుంచి ప్రిక్వార్టర్స్ చేరితే అది సంచలనమే అవుతుంది. అయితే గల్ఫ్ దేశంలోనే మెగా ఈవెంట్ జరగడం కాస్త కలిసొచ్చే అంశం కానీ... ముందడుగు వేయడం కష్టమే! కీలక ఆటగాళ్లు సలేహ్ అల్ శెహ్రి, సలిమ్, సాల్మన్ అల్ ఫరాజ్ తమ ప్రదర్శనతో గల్ఫ్ సాకర్ ప్రియుల్ని అలరించడం ఖాయం. ఫ్రాన్స్‌కు చెందిన కోచ్ హెర్వ్ రినార్డ్ 2019 నుంచి జట్టును తీర్చిదిద్దుతున్నాడు. ఫిఫా ర్యాంక్: 51. ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: ప్రిక్వార్టర్స్ (1994). ఇతర ఘనతలు: ఆసియా చాంపియన్ (1984, 1988, 1996). అర్హత: ఆసియా క్వాలిఫయింగ్‌లో గ్రూప్ ‘బి’ రన్నరప్. కీలక ఆటగాళ్లు: సలేహ్ అల్ శెహ్రి, అల్ ఫరాజ్. –సాక్షి క్రీడా విభాగం -
తడబడితే తారుమారు
విశ్వవ్యాప్తంగా ఆదరణ ఉన్న ఆట ఫుట్‌బాల్. ఇతర టీమ్ క్రీడల్లో మాదిరిగా ఈ ఆటలో రెండు దేశాల మధ్య ఏడాదికో రెండేళ్లకో ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవు. ఏడాదిలో ఎక్కువ భాగం స్టార్ ఆటగాళ్లందరూ ఆయా దేశాల్లో ప్రొఫెషనల్ లీగ్‌లలో క్లబ్ జట్లకు ఆడుతుంటారు. దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ లేదా యూరో టోర్నీ లేదా కోపా అమెరికా కప్ లేదా కాన్ఫడరేషన్స్ కప్‌లాంటి టోర్నీల కోసం వేచి చూడాల్సి ఉంటుంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ఆధ్వర్యంలో అప్పుడప్పుడు ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో బరిలోకి దిగుతారు. దాదాపు మూడేళ్లపాటు కొనసాగే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలలో ఎంతటి గొప్ప జట్టయినా ఆద్యంతం నిలకడగా రాణిస్తేనే ముందంజ వేస్తాం. కేవలం ప్రధాన టోర్నీకి అర్హత సాధిస్తే భారీ మొత్తంలో ప్రైజ్‌మనీ లభిస్తుంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని చిన్న చిన్న జట్లు కూడా వదులుకోవు. అందుకే ప్రత్యర్థి జట్టుకి ఎంత గొప్ప రికార్డు ఉన్నా ఈ చిన్న జట్లు కడదాకా సంచలనం కోసం పోరాడతాయి. ఈ క్రమంలో కాస్త నిర్లక్ష్యంగా ఉన్నా పెద్ద జట్లకు చుక్కెదురు తప్పదు. మరో పది రోజుల్లో ఖతర్ వేదికగా జరగనున్న 22వ ప్రపంచకప్‌లో కచ్చితంగా అర్హత సాధిస్తాయనుకున్న ఎనిమిది జట్లు (ఇటలీ, స్వీడన్, రష్యా, చిలీ, ఈజిప్ట్, నైజీరియా, కొలంబియా, అల్జీరియా) క్వాలిఫయింగ్‌లోనే నిష్క్రమించి ఆశ్చర్యపరిచాయి. ఈ జాబితాలో అతి ముఖ్యమైన జట్టు ఇటలీ. ప్రపంచకప్‌లో ఇటలీ జట్టుకు గొప్ప చరిత్రనే ఉంది. నాలుగుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఇటలీ వరుసగా రెండోసారి ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందలేకపోయింది. 2018 రష్యాలో జరిగిన ప్రపంచకప్‌కు బెర్త్ దక్కించుకోలేకపోయిన ఇటలీ జట్టు ఈసారి ఖతర్ విమానం కూడా ఎక్కడంలేదు. యూరోప్ దేశాలకు మొత్తం 13 బెర్త్‌లు ఉండగా... గ్రూప్ దశలో పది గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన 10 జట్లు ప్రపంచకప్‌కు అర్హత పొందాయి. గ్రూప్ ‘సి’లో ఇటలీ జట్టు రెండో స్థానంలో నిలిచి నేరుగా కాకుండా రెండో రౌండ్ ద్వారా అర్హత పొందేందుకు రేసులో నిలిచింది. అయితే రెండో రౌండ్లో ఇటలీ 0–1తో నార్త్ మెసడోనియా చేతిలో ఓడిపోయి ప్రపంచకప్‌నకు అర్హత పొందే అవకాశాన్ని చేజార్చుకుంది. 2018 ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన స్వీడన్ ఈసారి క్వాలిఫయింగ్‌ను దాటి ముందుకెళ్లలేకపోయింది. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యా జట్టుపై వేటు వేశారు. దక్షిణ అమెరికా జోన్లో ఆరో స్థానంలో నిలిచి కొలంబియా ఈ మెగా టోర్నీకి దూరమైంది. 1962లో ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వడంతోపాటు మూడో స్థానంలో నిలిచిన చిలీ వరుసగా రెండోసారి ప్రపంచకప్ బెర్త్ సాధించలేకపోయింది. ఆఫ్రికా జోన్ నుంచి చివరి రౌండ్ మ్యాచ్‌ల్లో ఓడి ఈజిప్ట్, నైజీరియా, అల్జీరియా మెగా టోర్నీకి అర్హత పొందలేకపోయాయి. 1938 నుంచి 2002 ప్రపంచకప్ వరకు ఆతిథ్య దేశంతోపాటు డిఫెండింగ్ చాంపియన్‌కు నేరుగా ఎంట్రీ లభించేది. కానీ 2006 ప్రపంచకప్ నుంచి కేవలం ఆతిథ్య జట్టుకే నేరుగా ఎంట్రీ ఇచ్చి డిఫెండింగ్ చాంపియన్ కూడా క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా బెర్త్ సాధించాలని ‘ఫిఫా’ నిర్ణయించింది. –సాక్షి క్రీడావిభాగం -
Qatar 2022 FIFA World Cup: మరో ప్రపంచకప్ వచ్చేసింది!
ప్రపంచపటంలో దిగువన పసిఫిక్ మహా సముద్రం పక్కన ఒక విశ్వ క్రీడా వినోదం చివరి దశకు చేరుకుంది. అది ముగిసిన సరిగ్గా వారం రోజులకే పశ్చిమాసియాలో అరేబియన్ ద్వీపకల్పం వద్ద మరో భారీ క్రీడా సంబరానికి తెర లేవనుంది. 16 జట్ల క్రికెట్ పోరు ముగియగానే క్రీడాభిమానుల కోసం 32 జట్ల ఫుట్‌బాల్ సమరానికి సర్వం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో అభిమానులను ఉర్రూతలూగించే ‘ఫిఫా’ వరల్డ్ కప్ మళ్లీ వచ్చేసింది. గల్ఫ్ దేశం ఖతర్ తొలిసారి ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు వేదికగా మారింది. నవంబర్ 20న ఆతిథ్య జట్టు మ్యాచ్‌తోనే మొదలయ్యే మెగా టోర్నీ పోరు 29 రోజుల పాటు గోల్స్ గోలతో ఊపేయనుంది. ఈ నేపథ్యంలో 22వ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు సంబంధించిన కొన్ని విశేషాలు... తొలి మ్యాచ్: ఖతర్ VS ఈక్వెడార్ ఫార్మాట్: 32 జట్లను ఎనిమిది గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో నాలుగు జట్లున్నాయి. ప్రతీ జట్టు తమ గ్రూప్‌లో మిగిలిన మూడు జట్లతో ఆడతాయి. ప్రతీ గ్రూప్ నుంచి రెండేసి జట్లు చొప్పున 16 టీమ్‌లు నాకౌట్ దశకు (ప్రిక్వార్టర్ ఫైనల్) అర్హత సాధిస్తాయి. ప్రిక్వార్టర్ దశలో ఎనిమిది గ్రూప్‌ల విజేతలు ఎనిమిది గ్రూప్‌ల రన్నరప్నే ఎదుర్కొంటాయి. మొత్తం మ్యాచ్‌ల సంఖ్య: 64 (గ్రూప్ దశలో 48; నాకౌట్లో 16) ► 2022 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులు 2010 డిసెంబర్ 2వ తేదీన ఖతర్‌కు కేటాయిస్తున్నట్లు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ప్రకటించింది. 2022 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం మొత్తం ఐదు దేశాలు (ఖతర్, అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా) పోటీపడ్డాయి. 22 మంది సభ్యులతో కూడిన ‘ఫిఫా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఓటింగ్ ద్వారా ఆతిథ్య దేశాన్ని ఎంపిక చేసింది. ఓటింగ్ రౌండ్–1లో ఆస్ట్రేలియా... రౌండ్–2లో జపాన్.. రౌండ్–3లో దక్షిణ కొరియా... ఓటింగ్ రౌండ్–4లో అమెరికా నిష్క్రమించాయి. ► 92 ఏళ్ల ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో ఖతర్ జట్టు తొలిసారి ఆడుతోంది. గతంలో ఏనాడూ ఖతర్ జట్టు ప్రపంచకప్‌నకు అర్హత సాధించలేదు. ఆతిథ్య దేశం హోదాలో ఖతర్‌కు నేరుగా టోర్నీలో ఆడే అవకాశం లభించింది. ► ప్రపంచకప్‌లో పోటీపడుతున్న 32 జట్లలో ఖతర్ మినహా మిగతా 31 దేశాలు గతంలో కనీసం ఒక్కసారైనా ప్రపంచకప్ టోర్నీలో బరిలోకి దిగాయి. 2022 ప్రపంచకప్ కోసం 2019 జూన్ 6 నుంచి 2022 జూన్ 14 వరకు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరిగాయి. 2018 ప్రపంచకప్‌లో ఐస్లాండ్, పనామా అరంగేట్రం చేసినా ఈసారి మాత్రం కొత్త జట్లు అర్హత పొందలేకపోయాయి. ► ఇప్పటి వరకు జరిగిన అన్ని ప్రపంచకప్‌లలో ఆడిన ఏకైక జట్టుగా బ్రెజిల్ నిలిచింది. జర్మనీ (18 సార్లు) రెండో స్థానంలో, అర్జెంటీనా (13 సార్లు) మూడో స్థానంలో ఉన్నాయి. -
ఫిఫా వరల్డ్ కప్‌లో బాలీవుడ్ బ్యూటీ.. ఆ విషయంలో తొలి నటిగా..!
బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన ఫిఫా వరల్డ్ కప్-2022లో ఆమె ప్రాతినిధ్యం వహించనుంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఈవెంట్లో ప్రముఖులైన షకీరా, జెన్నీఫర్ లోపెజ్‌లతో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్లో జరగనున్న ఫిఫా వరల్డ్ కప్ వేదికపై ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించే ఏకైక నటిగా ఆమె నిలవనుంది. ఫిఫా వరల్డ్‌కప్ కోసం రూపొందించిన థీమ్ సాంగ్‌లో నోరా ఫతేహీ నటించింది. అక్టోబర్ 7న ఈ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు. ఆమె ఫిఫా వరల్డ్ కప్ ముగింపు వేడుకల్లోనూ ప్రదర్శన ఇవ్వనుంది. నోరా తన ఇన్‌స్టాలో వీడియోను షేర్ చేస్తూ " ఈసారి ఫిఫా వరల్డ్ కప్ సాంగ్ "లైట్ ది స్కై" సేవ్ ది డేట్ 07/10/22..!" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ఫిఫా వరల్డ్ కప్ ఖతార్‌లో జరగనుంది. డ్యాన్స్‌తో గుర్తింపు పొందిన బాలీవుడ్ నటి దిల్బర్ దిల్బర్ సాంగ్‌తో ఫేమస్ అయింది. బాలీవుడ్లో భారత్, బాట్లా హౌస్, రోర్, సత్యమేవ జయతే చిత్రాల్లో కనిపించింది. ఆమె ప్రస్తుతం జడ్జిగా 'ఝలక్ దిఖ్ లా జా' ప్రోగ్రామ్‌కు వ్యవహరిస్తోంది. నోరాకు సోషల్ మీడియాలో విపరీతమైన అభిమానుల ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇటీవల సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న థ్యాంక్ గాడ్ సినిమాలోని మాణికే సాంగ్‌లోనూ కనిపించింది. View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) -
సునీల్ ఛెత్రికి ఫిఫా అరుదైన గౌరవం
ప్రపంచానికి క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ పరిచయం అక్కర్లేని పేర్లు. ఫుట్‌బాల్ క్రీడలో ఈ ఇద్దరు ఎవరికి వారే సాటి. ఆటలోనూ.. పాపులారిటీ విషయంలోనూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ ముందుకు దూసుకెళ్తున్నారు. అయితే భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి(Sunil Chhetri)పై ఫిఫా(FIFA) డాక్యుమెంటరీ రూపొందించడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచినా మన దేశం మాత్రం గర్వపడేలా చేసింది. రొనాల్డో, మెస్సీల లాగా సునీల్ ఛెత్రి ఫిఫా వరల్డ్‌కప్‌లు ఆడింది లేదు.. ప్రధాన ఫుట్‌బాల్ క్లబ్స్‌కు కూడా పెద్దగా ప్రాతినిధ్యం వహించింది లేదు. మరి ఫిఫా ఎందుకు సునీల్ ఛెత్రి డాక్యుమెంటరీ రూపొందించాలనుకుంది. పాపులారిటీ విషయంలో ఈ భారత కెప్టెన్ మెస్సీ, రొనాల్డోలతో సరితూగకపోవచ్చు కానీ.. గోల్స్ విషయంలో మాత్రం వారి వెనకాలే ఉన్నాడు. ఇప్పటివరకు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ రికార్డు పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో పేరిట ఉంది. రొనాల్డో 117 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉండగా.. తర్వాతి స్థానంలో అర్జెంటీనా స్టార్ మెస్సీ 90 గోల్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి ఉన్నాడు. సునీల్ 131 మ్యాచ్‌ల్లో 84 గోల్స్ చేశాడు. సునీల్ ఛెత్రి రొనాల్డో, మెస్సీలాగా ప్రపంచకప్‌లు ఆడకపోవచ్చు.. కానీ అతని ఆటతీరుతో ఒక స్టార్‌గా గుర్తింపు పొందాడు. ఈ ఒక్క కారణంతోనే ఫిఫా సునీల్ ఛెత్రిపై డాక్యుమెంటరీ తీయాలని అనుకుంది. ఎవరికి తెలియని సునీల్ ఛెత్రి పేరును డాక్యుమెంటరీ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే బాధ్యతను స్వయంగా ఫిఫా తీసుకుంది. భారతదేశం నుంచి ఫుట్‌బాల్‌లో హీరోగా వెలుగొందుతున్న సునీల్ ఛెత్రి లాంటి స్ట్రైకర్ ఎలా ఉద్భవించాడు.. అతని ఆటతీరును పరిచయం చేస్తూ డాక్యుమెంటరీ కొనసాగుతుంది. ఈ డాక్యుమెంటరీకి కెప్టెన్ ఫెంటాస్టిక్(Captain Fantastic Series) అని పేరు పెట్టిన ఫిఫా ఇటీవలే మొదటి సీజన్ విడుదల చేసింది. అంతా ఊహించినట్లుగానే 'కెప్టెన్ ఫెంటాస్టిక్ సిరీస్' డాక్యుమెంటరీ సూపర్‌హిట్ అయింది. అయితే కొన్నాళ్ల క్రితం సునీల్ ఛెత్రిపై ఫిఫా ఒక డాక్యుమెంటరీ రూపొందించనుందంటూ వార్తలు వచ్చాయి. అయితే మొదట ఛెత్రి, అతని కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని నమ్మలేదు. ఎందుకంటే ఫిఫా ఒక ఆటగాడిపై డాక్యుమెంటరీ రూపొందింస్తుందంటే కచ్చితంగా గొప్ప ఆటగాడు అయి ఉండాలి. ప్రపంచకప్ గెలిచిన జట్టులోని ఆటగాళ్లు లేదా ఫుట్‌బాల్‌లో గొప్ప ఆట ఆడిన ఆటగాళ్లపై మాత్రమే ఫిఫా డాక్యుమెంటరీలు రూపొందిస్తుంది. ఈ విషయంలో సునీల్ ఛెత్రి చాలా దూరంలో ఉన్నాడు. ప్రతి నాలుగేళ్లకోసారి ఉపఖండంలో జరిగే ఆసియా కప్‌లో మాత్రమే సునీల్ ఛెత్రి ఆడేవాడు. ఫుట్‌బాల్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి గోల్స్ చేస్తూ ప్రపంచ ఫుట్‌బాల్ స్టార్ల జాబితాలోకి అడుగుపెట్టిన సునీల్ ఎదుగుదల కథను ఫిఫా ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంది. ఈ నేపథ్యంలోనే భారత్ ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రిపై డాక్యుమెంటరీ మొదలుపెట్టింది. You know all about Ronaldo and Messi, now get the definitive story of the third highest scoring active men's international. Sunil Chhetri | Captain Fantastic is available on FIFA+ now 🇮🇳 — FIFA World Cup (@FIFAWorldCup) September 27, 2022 -
క్రీడలపై క్రీనీడ!
క్రీడా మైదానాల్లో సమవుజ్జీలైన రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టు తలపడుతూ అభిమానుల్లో ఉత్కంఠ రేపాలి. తమ ప్రతిభా పాటవాలతో స్టేడియంలను హోరెత్తించాలి. కానీ అందుకు భిన్నంగా ఈ ఆటలు నిర్వహించాల్సిన సంఘాల్లోని పెద్దలే ముఠాలు కట్టి పరస్పరం తలపడుతూ, క్రీడలను గాలికొదిలితే దేశం నగుబాటు పాలవుతుంది. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య(ఏఐఎఫ్ఎఫ్)పై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య(ఫిఫా) నిషేధాస్త్రం సంధించిన నేపథ్యంలో మన క్రీడా సంఘాల పనితీరు మరోసారి చర్చకొచ్చింది. 2012లో భారత్ ఒలింపిక్ సంఘం(ఐఓఏ) కూడా ఈ మాదిరే వివాదాల్లో చిక్కుకోవడంతో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం(ఐఓసీ) దాన్ని సస్పెండ్ చేయాల్సివచ్చింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్(బీసీసీఐ) వ్యవహారాలు సైతం గతంలో ఇలాగే బజారుకెక్కడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రక్షాళనకు పూను కుంది. అయినా మన క్రీడాసంఘాల్లో చెప్పుకోదగ్గ మార్పు రాలేదు. పర్యవసానంగా భారత ఫుట్ బాల్ సమాఖ్య దోషిగా నిలబడింది. క్రీడలతో పెద్దగా సంబంధం లేని రాజకీయ నాయకులు ఈ సంఘాల్లోకి జొరబడి వాటిని నియంత్రించడం, ఆ రంగంలో సుదీర్ఘానుభవం ఉన్నవారిని తృణీక రించడం మన దేశంలో రివాజుగా మారింది. ఇందువల్ల సంఘాల్లో నిధులు దుర్వినియోగం కావడం, నిబంధనలు గాలికొదిలి ఇష్టానుసారం వ్యవహరించడం పెరిగింది. దాంతో అసలైన ఔత్సాహిక క్రీడాకారులకు ప్రోత్సాహం కరువవుతోంది. మహిళా క్రీడాకారిణులకు లైంగిక వేధిం పులు ఎదురవుతున్నాయన్న ఆరోపణలు సరేసరి. ఎన్ని సమస్యలున్నా ఈమధ్య జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో మనవాళ్లు మంచి ప్రతిభ కనబరిచి పతకాల సాధనలో నాలుగో స్థానంలో నిలిచారు. 22 బంగారు పతకాలు, 16 వెండి పతకాలు, 23 కాంస్య పతకాలు–మొత్తంగా 61 పతకాలు తీసు కొచ్చారు. 2010లో ఇంతకన్నా ఎక్కువ పతకాలు సాధించి రెండో స్థానంలో నిలిచిన సంగతి నిజమే అయినా ఆ తర్వాత నిరాశ తప్పలేదు. ఇప్పుడిప్పుడే అంతా సర్దుకుంటోంది. ఈ ఉత్సాహాన్ని నీరుగార్చేలా ఏఐఎఫ్ఎఫ్పై నిషేధం వేటుపడింది. అంతర్జాతీయంగా 211 దేశాలకు సభ్యత్వం ఉన్న ఫిఫా కొంతకాలంగా మన సమాఖ్య పనితీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా పట్టించుకునే నాథుడు లేకపోయాడు. మా నిబంధనావళిని బేఖాతరు చేస్తున్నారంటూ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వస్తున్నా వినేవారే లేకుండా పోయారు. సమాఖ్యకు కొత్త కార్యవర్గం ఎన్నికై, దాని అధీనంలో రోజువారీ కార్యకలాపాలుండాలని ఫిఫా సూచిస్తోంది. సాధారణంగా క్రీడాసంఘాలకు అధికారంలో ఉండే పెద్దలవల్ల సమస్యలెదురవు తాయి. కానీ ఫుట్‌బాల్ సమాఖ్యకు విపక్ష ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ గుదిబండగా మారారు. వరసగా మూడుమార్లు ఎన్నికైన ఆయన పదవీకాలం 2020లోనే ముగిసినా న్యాయస్థానాలను ఆశ్రయించి ఆ పదవి పట్టుకుని వేలాడారు. చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో ఫుట్‌బాల్ సమాఖ్యకు ఆయన్నుంచి విముక్తి కలిగినా కొత్త సమస్యలొచ్చి పడ్డాయి. పటేల్‌ను తప్పించినప్పుడే ఫిఫా నిబంధనావళికి అనుగుణంగా చర్యలు తీసుకోమని ఆదేశాలిస్తే వేరుగా ఉండేది. కానీ సమాఖ్య కార్యకలాపాల నిర్వహణకంటూ ఒక పరిపాలక సంఘాన్ని(సీఓఏ) ఏర్పాటుచేయడం, ఆ సంఘం వెనువెంటనే మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారులతో ఓటర్ల జాబితా తయారుచేసి, ఎన్నికైన 36 సంఘాల ప్రతినిధులను బేఖాతరు చేయడం, ఎన్నికలకు సిద్ధం కావడం వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. సీఓఏను ఫిఫా గుర్తించడానికి నిరాకరించి, మన ఫుట్‌బాల్ సమాఖ్యను నిషేధించడంతో కేంద్రం కూడా రంగంలోకి దిగక తప్పలేదు. నిజానికి బీసీసీఐ కేసు తనముందుకు వచ్చినప్పుడే క్రీడాసంఘాలకు రాజకీయ నాయకులు దూరంగా ఉండాలని సుప్రీంకోర్టు హితవు చెప్పింది. కానీ ఆ తర్వాత కూడా ఏమీ మారనందువల్లే 85 ఏళ్ల మన ఫుట్‌బాల్ సమాఖ్య తొలిసారి వీధిన పడాల్సి వచ్చింది. ఫిఫాతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దాలని సుప్రీంకోర్టు కేంద్రానికి చేసిన సూచనవల్ల ఈ భంగపాటు నుంచి సమాఖ్య బయటపడొచ్చు. కానీ ఎన్నాళ్లిలా? క్రీడా సంఘాలు అంకితభావంతో, స్వయంప్రతిపత్తితో పనిచేయలేవా? కొరడా ఝళిపించినప్పుడు మాత్రమే దారికొస్తాయా? క్రీడాసంఘాల తీరువల్ల ఆటగాళ్లలో నిరాశానిస్పృహలు అలుముకోవడం, దేశానికి తలవం పులు తప్పకపోవడం మాత్రమే కాదు... ఫిఫా తాజా నిర్ణయం పర్యవసానంగా ఏటా రావాల్సిన రూ. 4 కోట్ల నిధులు ఆగిపోతాయి. ఫుట్‌బాల్ క్రీడకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కుంటుపడుతుంది. పైగా వచ్చే అక్టోబర్‌లో భారత్‌లో జరగాల్సిన మహిళల అండర్–17 ప్రపంచ కప్ సందిగ్ధంలో పడింది. నిషేధం ఎత్తేసేవరకూ అన్ని దేశాల ఫుట్‌బాల్ సమాఖ్యలూ మన దేశాన్ని దూరం పెడతాయి. ఈ నెలాఖరులో ఇరాన్లో జరగాల్సిన మ్యాచ్‌లలో... వచ్చే నెలలో వియత్నాం, సింగపూర్లలో జరిగే మ్యాచ్‌లలో మన క్రీడాకారులు పాల్గొనలేరు. అందుకే మన క్రీడాసంఘాలు కళ్లు తెరవాలి. క్రీడలపట్ల నిబద్ధత, నిమగ్నతా ఉన్నవారు మాత్రమే సారథ్యం వహించే స్థితి రావాలి. దిగ్గజ క్రీడాకారులూ, క్రీడాభిమానులూ సమష్టిగా నిలబడితే ఇదేమంత అసాధ్యం కాదు. క్రీడా సంఘాలు సర్వస్వతంత్ర సంఘాలుగా రూపొంది దేశంలో క్రీడాభివృద్ధికి కృషిచేస్తేనే మెరికల్లాంటి క్రీడాకారులు రూపొందుతారు. అందుకు భిన్నంగా నిర్ణయరాహిత్యమో, తప్పుడు నిర్ణయాలో రివాజుగా మారితే దేశం తీవ్రంగా నష్టపోతుంది. -
భారత ఫుట్‌బాల్ సమాఖ్యపై నిషేధం.. కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు
అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్)పై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) నిషేధం విధించిన నేపథ్యంలో భారత దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై ఇవాళ (ఆగస్ట్ 17) విచారణ జరిపిన కోర్టు.. ఏఐఎఫ్ఎఫ్పై ఫిఫా సస్పెన్షన్ ఎత్తివేసేలా కేంద్రం తగు చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అండర్ 17 మహిళల ప్రపంచకప్‌ను భారత్‌లోనే నిర్వహించేలా చూడాలని ఆదేశించింది. FIFA suspending All India Football Federation | SG Tushar Mehta, representing Centre, tells SC that considering several factors about what can be done, y'day Centre took up the issue with FIFA, and Committee of Administrators also played a key role & there's some breaking of ice. pic.twitter.com/LTiAbDe4Zq — ANI (@ANI) August 17, 2022 కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. ఫిఫాతో చర్చలు జరుపుతున్నామని వివరణ ఇచ్చారు. ఈ అంశాన్ని ఆగస్టు 22న విచారించాలని కోర్టును అభ్యర్థించారు. దీంతో కోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, తృతీయ పక్షం జోక్యం కారణంగా ఏఐఎఫ్ఎఫ్పై ఫిఫా సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. చదవండి: భారత ఫుట్‌బాల్ సమాఖ్యకు భారీ షాక్.. సస్పెన్షన్ వేటు వేసిన ఫిఫా