2023 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను స్పెయిన్ తొలిసారిగా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆగస్ట్ 20న జరిగిన ఫైనల్లో స్పెయిన్.. ఇంగ్లండ్‌ను 1-0 గోల్స్ తేడాతో మట్టికరిపించి జగజ్జేతగా ఆవిర్భవించింది. అయితే మ్యాచ్ అనంతరం ఆ దేశ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ సొంత క్రీడాకారిణుల పట్ల వ్యవహరించిన తీరు స్పెయిన్‌లో రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది.
మెడల్స్ ప్రజెంటేషన్ సందర్భంగా లూయిస్.. స్వదేశీ స్టార్ ఫుట్‌బాలర్ జెన్నిఫర్ హెర్మోసోను పెదాలపై ముద్దు పెట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. మిగతా క్రీడాకారిణులను కూడా చెంపలపై ముద్ద పెట్టుకుని వల్గర్‌గా బిహేవ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో స్పెయిన్‌లో నిరసనలు హోరెత్తాయి. దీంతో లూయిస్ ఓ మెట్టుకిందికి దిగొచ్చి సదరు క్రీడాకారిణిలకు, అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. అయినా స్పెయిన్‌లో నిరసనలు శాంతించలేదు. ఔ
లూయిస్ ఉద్దేశపూర్వకంగా తప్పుచేసి, సారీ చెబితే సరిపోతుందా అంటూ నిరసనకారులు స్వరాలను పెంచారు. నిరసనలు, ఆందోళలను తీవ్రరూపం దాల్చడంతో ఆ దేశ ప్రధాని పెడ్రో సాంచెజ్ జోక్యం చేసుకున్నారు. లూయిస్ నామమాత్రం సారీ చెబితే సరిపోదని నిరసనకారులతో స్వరం కలిపారు. ముద్దు వివాదంపై లూయిస్ బాధ్యతాయుతమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అయితే, ఫెడరేషన్ అధ్యక్షుడిపై చర్యలు తీసుకునే అధికారం తనకు లేదని చేతులు దులుపుకున్నాడు. దీంతో క్రీడా శాఖకు సంబంధించిన స్పానిష్ హై కౌన్సిల్ రంగంలోకి దిగింది. స్పెయిన్ ప్రభుత్వం కాని సాకర్ కౌన్సిల్ కాని లూయిస్‌పై చర్యలు తీసుకోకపోతే తాను చర్యలకు ఉపక్రమిస్తానని కౌన్సిల్ అధ్యక్షుడు ప్రకటన విడుదల చేశారు. మొత్తానికి స్పెయిన్‌లో ముద్దు వివాదం చినికిచినికి గాలివానలా మారుతుంది.
Comments
Please login to add a commentAdd a comment