దోహా: రియల్ మాడ్రిడ్ స్టార్ వినిసియస్ జూనియర్ ఎట్టకేలకు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) అవార్డును చేజిక్కించుకున్నాడు. ఫురుషుల విభాగంలో అతను ‘ఫిఫా బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అందుకున్నాడు. ఈ అక్టోబర్‌లో ప్రతిష్టాత్మక బాలన్‌డోర్ అవార్డు రేసులో తుదిదాకా నిలిచినా... అనూహ్యంగా మాంచెస్టర్ మిడ్‌ఫీల్డర్ రోడ్రి అందుకోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు.
ఇప్పుడు ‘ఫిఫా’ ప్రతిష్టాత్మక అవార్డుతో ఆ అవమానాన్ని, నిరాశను ఒక్కసారిగా అధిగమించినట్లయ్యింది. 2023 ఆగస్టు నుంచి 2024 ఆగస్టు వరకు జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌ల్లో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా ‘ఫిఫా’ 11 మంది ప్లేయర్లను తుది అవార్డుల జాబితాకు ఎంపిక చేసింది. వీరిలో నుంచి వినిసియస్ విజేతగా నిలిచాడు. బ్రెజిల్‌కు చెందిన ఈ 24 ఏళ్ల స్టార్ స్ట్రయికర్ గత సీజన్‌లో విశేషంగా రాణించాడు.
39 మ్యాచ్‌ల్లో 24 గోల్స్ సాధించాడు. స్పానిష్ టీమ్ రియల్ మాడ్రిడ్ 15వసారి యూరోపియన్ కప్ గెలుపొందడంలో కీలకపాత్ర పోషించాడు. మహిళల విభాగంలో ‘ఫిఫా బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును స్పెయిన్ మిడ్‌ఫీల్డర్ ఐతనా బొన్మాతి కైవసం చేసుకుంది.
26 ఏళ్ల స్పానిష్ స్టార్ ఇదివరకే వరుస సీజన్లలో బాలన్‌డోర్ అవార్డును ముద్దాడింది. అభిమానులు, ప్రస్తుత కెప్టెన్లు, కోచ్‌లు, ప్రపంచ వ్యాప్త జాతీయ ఫుట్‌బాల్ జట్లు, మీడియా ప్రతినిధులు వేసిన ఓట్లకు సమాన వెయిటేజీ ఇచ్చినట్లు ‘ఫిఫా’ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment