Best player
-
‘ఫిఫా’ అత్యుత్తమ ప్లేయర్‌గా మెస్సీ.. రికార్డు స్థాయిలో మూడోసారి
అర్జెంటీనా సూపర్‌స్టార్ మెస్సీ 2023 సంవత్సరానికిగాను పురుషుల విభాగంలో ‘ఫిఫా బెస్ట్ ప్లేయర్’గా నిలిచాడు. మెస్సీకి నార్వే ఫార్వర్డ్ ఎర్లింగ్ హాలాండ్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఇద్దరు 48 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచినప్పటికీ కెప్టెన్ల ప్యానెల్ నుంచి ఎర్లింగ్ కంటే మెస్సీకే ఎక్కువ ఓట్లు రావడంతో ‘ఫిఫా’ మెస్సీనే ఎంపిక చేసింది. మెస్సీ ఈ అవార్డును రికార్డు స్థాయిలో మూడోసారి (2019, 2022, 2023) గెలుచుకున్నాడు. మెస్సీ గతేడాది బాలన్ డి ఓర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును కూడా మెస్సీ రికార్డు స్థాయిలో ఎనిమిది సార్లు కైవసం చేసుకున్నాడు. మెస్సీ ఫిఫా’ అత్యుత్తమ ప్లేయర్ అవార్డు గెలుచుకున్న అనంతరం మరో ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అతనికి శుభాకాంక్షలు తెలిపాడు. రొనాల్డో 2023 ఫిఫా అత్యుత్తమ ప్లేయర్ అవార్డు రేసులో లేకపోవడం విశేషం. కాగా, లీగ్‌లతో బిజీగా ఉండటంతో మెస్సీ అవార్డు ప్రధానోత్సవ వేడుకకు హాజరుకాలేదు. -
మళ్లీ ఓడిన ఎంబాపె.. మెస్సీదే పైచేయి
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఫిఫా మెన్స్ బెస్ట్ ప్లేయర్ అవార్డును కొల్లగొట్టాడు. భారత కాలామాన ప్రకారం మంగళవారం తెల్లవారుజామున పారిస్ వేదికగా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్‌బాల్ అసోసియేషన్(FIFA) నిర్వహించిన బెస్ట్ ఫిఫా ఫుట్‌బాల్ అవార్డ్స్‌లో మెస్సీ ఈ అవార్డు అందుకున్నాడు. గతేడాది డిసెంబర్లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాను మెస్సీ విశ్వవిజేతగా నిలిపిన సంగతి తెలిసిందే. 36 సంవత్సరాల అర్జెంటీనా అభిమానుల నిరీక్షణకు తెరదించిన మెస్సీ వరల్డ్‌కప్ అందుకోవాలన్న తన చిరకాల కోరికను కూడా నెరవేర్చుకున్నాడు. ఇక గతేడాది జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో అర్జెంటీనా, ఫ్రాన్స్ కొదమసింహాల్లా తలపడ్డాయి. మెస్సీ రెండు గోల్స్‌తో మెరవగా.. ఎంబాపె ఏకంగా హ్యాట్రిక్ గోల్స్‌తో సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ 3-3తో డ్రా కావడంతో పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. ఇక పెనాల్టీ షూటౌట్లో అర్జెంటీనా 4-2 తేడాతో ఫ్రాన్స్‌ను మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది. మ్యాచ్ ఓడినా ఎంబాపె మాత్రం తన ప్రదర్శనతో అభిమానుల హృదయాలను దోచుకున్నాడు. ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న మెస్సీ తాజాగా ఫిఫా మెన్స్ బెస్ట్ ప్లేయర్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డు కోసం మెస్సీతో పాటు ఫ్రాన్స్ ఫుట్‌బాల్ స్టార్స్ కైలియన్ ఎంబాపె, కరీమ్ బెంజెమాలు పోటీ పడ్డారు. అయితే మెస్సీని దాటి అవార్డు అందుకోవడంలో ఈ ఇద్దరు విఫలమయ్యారు. 2021 ఆగస్టు 8 నుంచి 18 డిసెంబర్ 2022 వరకు మెన్స్ ఫుట్‌బాల్‌లో ఔట్‌స్టాండింగ్ ప్రదర్శన ఇచ్చిన ఆటగాళ్ల జాబితాను ఎంపిక చేశారు. ఈ జాబితాలో మెస్సీ 52 పాయింట్లతో టాప్ ర్యాంక్ కైవసం చేసుకోగా.. కైలియన్ ఎంబాపె 44 పాయింట్లతో రెండో స్థానం, కరీమ్ బెంజెమా 34 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచాడు. కాగా మెస్సీ ఫిఫా మెన్స్ బెస్ట్ ప్లేయర్ అవార్డు గెలుచుకోవడం ఇది ఏడోసారి కావడం విశేషం. ఇంతకముందు వరుసగా 2009, 2010, 2011, 2012, 2015, 2019.. తాజాగా 2023లో మరోసారి అవార్డును గెలుచుకున్నాడు. ఉత్తమ FIFA ఉమెన్స్ ప్లేయర్ విజేత: అలెక్సియా పుటెల్లాస్ ఉత్తమ FIFA పురుషుల కోచ్ విజేత: లియోనెల్ స్కలోని ఉత్తమ FIFA మహిళా కోచ్ విజేత: సరీనా విగ్మాన్ ఉత్తమ FIFA పురుషుల గోల్ కీపర్ విజేత: ఎమిలియానో మార్టినెజ్ ఉత్తమ FIFA మహిళా గోల్ కీపర్ విజేత: మేరీ ఇయర్ప్స్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) MESSI IS THE WINNER OF THE BEST AWARD ❤️🐐 pic.twitter.com/4pJhMoVCI6 — Messi Media (@LeoMessiMedia) February 27, 2023 -
ఈ దశాబ్దపు మేటి క్రికెటర్ కోహ్లి
దుబాయ్: మన కోహ్లి మరో రెండు పురస్కారాలకి ఎంపికయ్యాడు. అలాగే ధోని కీర్తిలో ఇప్పుడు ‘క్రీడాస్ఫూర్తి’ చేరింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన దశాబ్దపు మేటి సారథులుగా మన ఆటగాళ్లే (ధోని, కోహ్లి) నిలిచారు. ఇప్పుడు వ్యక్తిగతంగానూ మేటి క్రికెటర్లుగా ఎంపికయ్యారు. గత పదేళ్ల ప్రపంచ క్రికెట్లో పురుషుల విభాగంలో అత్యుత్తమ క్రికెటర్ (సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ అవార్డు) విరాట్ కోహ్లి అని ఐసీసీ ప్రకటించింది. ‘దశాబ్దపు వన్డే క్రికెటర్’ కూడా అతనే కావడం మరో విశేషం. ఈ పదేళ్ల కాలంలో అంతర్జాతీయ క్రికెట్ (మూడు ఫార్మాట్లు)లో విరాట్ 66 సెంచరీలు సాధించాడు. అలాగే 94 ఫిఫ్టీలు ఉన్నాయి. 56.97 సగటుతో 20,396 పరుగులు చేశాడు. మొత్తం 70కి మించి ఇన్నింగ్స్‌లు ఆడిన ఆటగాళ్లలో కోహ్లినే అగ్రగణ్యుడని ఈ గణాంకాల ద్వారా ఐసీసీ ప్రకటించింది. ఇందులో పోటీపడిన అశ్విన్, రూట్ (ఇంగ్లండ్), సంగక్కర (శ్రీలంక), స్మిత్ (ఆస్ట్రేలియా), డివిలియర్స్ (దక్షిణాఫ్రికా), కేన్ విలియమ్సన్ (కివీస్) అతని నిలకడ ముందు వెనుకబడ్డారు. ప్రత్యేకించి వన్డేల్లో 61.83 సగటుతో 12,040 పరుగులు, 39 సెంచరీలు, 48 అర్ధసెంచరీలు చేయడం ద్వారా కోహ్లి ‘దశాబ్దపు వన్డే క్రికెటర్’గానూ ఎంపికయ్యాడు. మూడు ఫార్మాట్లలోనూ దశాబ్దపు క్రికెట్ జట్లలో ఉన్న ఏకైక ఆటగాడు కూడా కోహ్లినే! ఓవరాల్‌గా అతని కెరీర్లో 70 శతకాలు బాదాడు. ఆస్ట్రేలియా స్టార్ స్మిత్ దశాబ్దపు ఉత్తమ టెస్టు క్రికెటర్‌గా, అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ దశాబ్దపు ఉత్తమ టి20 క్రికెటర్‌గా నిలిచారు. గత పదేళ్ల కాలంలో స్మిత్ 69 టెస్టులు ఆడి 65.79 సగటుతో 7,040 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు ఉన్నాయి. రషీద్ ఖాన్ 48 టి20 మ్యాచ్‌లు ఆడి 89 వికెట్లు తీశాడు. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన ఓటింగ్ ద్వారా ఈ అవార్డీలను ఎంపిక చేశారు. ఈ ఓటింగ్‌లో 53 లక్షల మంది పాల్గొన్నారు. మహిళల్లో ఎలీస్ పెర్రీ బెస్ట్... మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా క్రికెటర్ ఎలీస్ పెర్రీ అందుబాటులో ఉన్న మూడు అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం. 30 ఏళ్ల ఎలీస్ ఈ దశాబ్దపు ఉత్తమ మహిళా క్రికెటర్, ఉత్తమ వన్డే క్రికెటర్, ఉత్తమ టి20 క్రికెటర్‌గా ఎంపికైంది. గత పదేళ్ల కాలంలో ఎలీస్ పెర్రీ 73 వన్డేలు ఆడి 2,621 పరుగులు చేసి 98 వికెట్లు తీసింది. 100 టి20 మ్యాచ్‌లు కూడా ఆడిన ఆమె 1,155 పరుగులు చేసి 89 వికెట్లు పడగొట్టింది. మరోవైపు ఆరు టెస్టుల్లో బరిలోకి దిగి 453 పరుగులు చేసింది. ఇందులో ఒక డబుల్ సెంచరీ, సెంచరీ, అర్ధ సెంచరీ ఉన్నాయి. క్రికెట్‌తోపాటు ఫుట్‌బాల్ క్రీడలోనూ ఎలీస్ పెర్రీకి ప్రవేశం ఉంది. ఆమె ఆస్ట్రేలియా మహిళల ఫుట్‌బాల్ జట్టుకు 18 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించి మూడు గోల్స్ కూడా చేసింది. -
గ్రేటెస్ట్ ఎవరో గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సంఖ్య నిర్ణయిస్తుంది
న్యూఢిల్లీ: సమకాలీన పురుషుల టెన్నిస్‌లో ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ (గోట్)’ ఎవరనే చర్చకు ప్రపంచ మాజీ నంబర్‌వన్ ఇవాన్ లెండిల్ ఒక పరిష్కారం చూపే ప్రయత్నం చేశారు. ఎవరైతే ఎక్కువ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతారో వారే ‘గ్రేటెస్ట్’ అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘గ్రేటెస్ట్’ ప్లేయర్ రేసులో ఫెడరర్ (20 టైటిల్స్), నాదల్ (19), జొకోవిచ్ (17)ల మధ్య పోటీ నడుస్తోంది. వీరిలోఎవరైతే తమ కెరీర్‌ను అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో ముగిస్తాడో అతనే ‘గ్రేటెస్ట్’గా నిలుస్తాడు’ అని ఆయన అన్నారు. -
విజ్డన్ అత్యుత్తమ క్రికెటర్‌గా స్టోక్స్
లండన్: గత ఏడాది అత్యద్భుత ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఇంగ్లండ్ టాప్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యాడు. 2019 సంవత్సరానికిగాను ‘లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద వరల్డ్’గా స్టోక్స్‌ను ఎంపిక చేసినట్లు విజ్డన్ క్రికెటర్స్ అల్మనాక్ ప్రకటించింది. 2005లో ఆండ్రూ ఫ్లింటాఫ్ తర్వాత ఒక ఇంగ్లండ్ ఆటగాడు దీనికి ఎంపిక కావడం ఇదే మొదటిసారి. వరుసగా గత మూడు సంవత్సరాలు లీడింగ్ క్రికెటర్‌గా కోహ్లి ఎంపిక కాగా... ఇప్పుడు స్టోక్స్ ఆ స్థానంలోకి వచ్చాడు. ఇంగ్లండ్ తొలిసారి వన్డే వరల్డ్ కప్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించిన స్టోక్స్... ఫైనల్లోనూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే స్టోక్స్ టెస్టు క్రికెట్లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటి ఆడాడు. హెడింగ్లీలో జరిగిన యాషెస్ సిరీస్ మూడో టెస్టులో 135 పరుగులు చేసి ఇంగ్లండ్‌కు సంచలన విజయం అందించాడు. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ ఉత్తమ ప్లేయర్‌గా ఎంపికైంది. 2016లోనూ ఇదే అవార్డుకు ఎంపికైన పెర్రీ...రెండుసార్లు ఈ పురస్కారానికి ఎంపికైన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. యాషెస్ టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీ, అర్ధసెంచరీ చేయడంతో పాటు వన్డేల్లో 73 సగటుతో, టి20ల్లో 150 సగటుతో పరుగులు సాధించింది. మరో 27 వికెట్లు కూడా పడగొట్టింది. టి20ల్లో వరల్డ్ లీడింగ్ క్రికెటర్ గా వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రసెల్ ఎంపికయ్యాడు. -
మెరిసిన హరికృష్ణ
సాక్షి, హైదరాబాద్: పలువురు మేటి క్రీడాకారులు పాల్గొన్న చైనా చెస్ లీగ్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్, భారత స్టార్ చెస్ ప్లేయర్ పెంటేల హరికృష్ణ అదరగొట్టాడు. చైనాలోని షెన్జెన్ నగరంలో ముగిసిన ఈ లీగ్‌లో హరికృష్ణ సభ్యుడిగా ఉన్న షాంఘై చెస్ క్లబ్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచి టైటిల్‌ను సొంతం చేసుకోవడం విశేషం. హరికృష్ణకు ఓవరాల్‌గా ఉత్తమ ప్లేయర్ పురస్కారంతోపాటు ఉత్తమ విదేశీ ప్లేయర్ అవార్డు కూడా లభించాయి. 12 జట్ల మధ్య 22 రౌండ్లపాటు జరిగిన ఈ లీగ్‌లో షాంఘై క్లబ్ 38 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 17 మ్యాచ్‌ల్లో గెలిచిన షాంఘై జట్టు నాలుగు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని, మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ లీగ్‌లో విజయానికి రెండు పాయింట్లు, ‘డ్రా’ చేసుకుంటే ఒక పాయింట్ కేటాయించారు. హరికృష్ణ మొత్తం 19 గేమ్‌లు ఆడి 16.5 పాయింట్లు సాధించాడు. 14 గేముల్లో గెలిచిన అతను, ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. షాంఘై జట్టులో హరికృష్ణతోపాటు ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక, మత్లకోవ్ మాక్సిమ్ (రష్యా), వాంగ్ పిన్, ని షికిన్, జు వెన్జున్, లూ యిపింగ్, జు యి, ని హువా (చైనా) సభ్యులుగా ఉన్నారు. -
‘ఫిఫా’ ఉత్తమ ప్లేయర్‌గా రొనాల్డో
జ్యూరిక్ (స్విట్జర్లాండ్): గత ఏడాది అంతర్జాతీయస్థాయిలో అద్వితీయ ప్రదర్శనతో తాను ప్రాతినిధ్యం వహించిన జట్లకు గొప్ప విజయాలు అందించిన ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డోకు తగిన గుర్తింపు లభిం చింది. 2016 సంవత్సరానికిగాను ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ఈ పోర్చుగల్ కెప్టెన్‌ను పురుషుల విభాగంలో ‘ఉత్తమ ప్లేయర్’గా ఎంపిక చేసింది. 31 ఏళ్ల రొనాల్డో సారథ్యంలో గతేడాది పోర్చుగల్ జట్టు తొలిసారి ‘యూరో’ చాంపియన్‌గా అవతరించగా... అతని క్లబ్ రియల్ మాడ్రిడ్ జట్టు ప్రతిష్టాత్మక చాంపియన్స్ లీగ్, ప్రపంచ క్లబ్ ఫుట్‌బాల్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. గతేడాది రొనాల్డో మొత్తం 61 మ్యాచ్‌లు ఆడి 60 గోల్స్ చేశాడు. 20 సార్లు సహచరులు గోల్స్ చేసేందుకు సహకరించాడు. మహిళల విభాగంలో అమెరికా మిడ్‌ఫీల్డర్ కార్లీ లాయిడ్ రెండోసారి ‘ఉత్తమ క్రీడాకారిణి’ పురస్కారం గెల్చుకుంది. మరోవైపు 2026 ప్రపంచకప్‌లో పాల్గొనే జట్ల సంఖ్యను 32 నుంచి 48 జట్లకు పెంచాలని ‘ఫిఫా’ నిర్ణయం తీసుకుంది. -
‘బెస్ట్ ప్లేయర్’గా సహజశ్రీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్లో సెయింట్ ఆన్స్ మహిళా కాలేజ్ విద్యార్థిని చొల్లేటి సహజశ్రీ రాణించింది. ఫుణే చెస్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్లో సహజశ్రీ ‘ఉత్తమ మహిళా క్రీడాకారిణి’ పురస్కారాన్ని అందుకుంది. మొత్తం తొమ్మిది రౌండ్లపాటు జరిగిన టోర్నీలో సహజశ్రీ 6.5 పాయింట్లను సాధించింది. ఈ టోర్నీ సెప్టెంబర్ 24నుంచి 29 వరకు పుణేలో జరిగింది.