విజ్డన్‌ అత్యుత్తమ క్రికెటర్‌గా స్టోక్స్‌ | Sakshi
Sakshi News home page

విజ్డన్‌ అత్యుత్తమ క్రికెటర్‌గా స్టోక్స్‌

Published Thu, Apr 9 2020 12:19 AM

Ben Stokes And Ellyse Perry named Wisdens Leading Cricketers of 2019 - Sakshi

లండన్‌: గత ఏడాది అత్యద్భుత ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఇంగ్లండ్‌ టాప్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యాడు. 2019 సంవత్సరానికిగాను ‘లీడింగ్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద వరల్డ్‌’గా స్టోక్స్‌ను ఎంపిక చేసినట్లు విజ్డన్‌ క్రికెటర్స్‌ అల్మనాక్‌ ప్రకటించింది. 2005లో ఆండ్రూ ఫ్లింటాఫ్‌ తర్వాత ఒక ఇంగ్లండ్‌ ఆటగాడు దీనికి ఎంపిక కావడం ఇదే మొదటిసారి. వరుసగా గత మూడు సంవత్సరాలు లీడింగ్‌ క్రికెటర్‌గా కోహ్లి ఎంపిక కాగా... ఇప్పుడు స్టోక్స్‌ ఆ స్థానంలోకి వచ్చాడు. ఇంగ్లండ్‌ తొలిసారి వన్డే వరల్డ్‌ కప్‌ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించిన స్టోక్స్‌... ఫైనల్లోనూ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు.

ఆ తర్వాత కొద్ది రోజులకే స్టోక్స్‌ టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటి ఆడాడు. హెడింగ్లీలో జరిగిన యాషెస్‌ సిరీస్‌ మూడో టెస్టులో 135 పరుగులు చేసి ఇంగ్లండ్‌కు సంచలన విజయం అందించాడు. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ ఎలీస్‌ పెర్రీ ఉత్తమ ప్లేయర్‌గా ఎంపికైంది. 2016లోనూ ఇదే అవార్డుకు ఎంపికైన పెర్రీ...రెండుసార్లు ఈ పురస్కారానికి ఎంపికైన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. యాషెస్‌ టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీ, అర్ధసెంచరీ చేయడంతో పాటు వన్డేల్లో 73 సగటుతో, టి20ల్లో 150 సగటుతో పరుగులు సాధించింది. మరో 27 వికెట్లు కూడా పడగొట్టింది. టి20ల్లో వరల్డ్‌ లీడింగ్‌ క్రికెటర్‌ గా వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ రసెల్‌ ఎంపికయ్యాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement