యాషెస్ సిరీస్ రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వీరోచిత పోరాటం చేశాడు. భారీ శతకంతో చెలరేగాడు. పట్టుసడలని పోరాటంతో ప్రత్యర్ధిని గడగడలాడించాడు. అదే ప్రత్యర్ధి చేతనే శభాష్ అనిపించుకున్నాడు.
2019లో హెడింగ్లీ మైదానంలో జరిగిన మ్యాచ్ తరహాలో ఒంటి చేత్తో జట్టును గెలిపించేలా కనిపించాడు. అయితే గెలుపుకు మరో 70 పరుగులు చేయాల్సిన తరుణంలో హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔటై, నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఆతర్వాత ఇంగ్లండ్ 26 పరుగుల వ్యవధిలో మిగిలిన 3 వికెట్లు కోల్పోవడంతో ఓటమిపాలైంది.
స్టోక్స్ వీరోచిత పోరాటానికి ఫలితం లేకుండా పోయింది. ఇంగ్లండ్ కెప్టెన్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ వృధా అయ్యింది. ఏ స్థితిలోనైనా ‘బజ్‌బాల్’ను కొనసాగిస్తానంటూ పట్టుదలగా నిలిచి సిక్సర్లతో చెలరేగిన స్టోక్స్, చివరకు జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. ఫలితంగా ఆసీస్ లార్డ్స్‌లో గెలుపు జెండా ఎగరేసి 5 టెస్ట్‌ల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
లండన్: ఆ్రస్టేలియా జట్టు యాషెస్ సిరీస్‌పై తమ ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంది. లార్డ్స్ మైదానంలో ఆదివారం ముగిసిన రెండో టెస్టులో ఆసీస్ 43 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. 371 పరుగులను ఛేదించే ప్రయత్నంలో ఓవర్‌నైట్ స్కోరు 114/4తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌటైంది.
బెన్ స్టోక్స్ (214 బంతుల్లో 155; 9 ఫోర్లు, 9 సిక్స్‌లు) చెలరేగగా... బెన్ డకెట్ (112 బంతుల్లో 83; 9 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్ తలా 3 వికెట్లు పడగొట్టారు. గాయంతో ఉన్న స్పిన్నర్ లయన్ బౌలింగ్ చేయకుండానే ఆసీస్ ఈ విజయాన్ని అందుకోగలిగింది. స్టీవ్ స్మిత్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవగా, మూడో టెస్టు గురువారంనుంచి లీడ్స్‌లో జరుగుతుంది.
విజయం కోసం చివరి రోజు చేతిలో 6 వికెట్లతో 257 పరుగులు సాధించాల్సిన స్థితిలో ఇంగ్లండ్ బరిలోకి దిగింది. డకెట్, స్టోక్స్ భారీ భాగస్వామ్యంతో జట్టును ముందుకు నడిపించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 132 పరుగులు జోడించారు. డకెట్‌తో పాటు బెయిర్‌స్టో (10) తక్కువ వ్యవధిలో వెనుదిరిగారు. విజయం కోసం మరో 178 పరుగులు చేయాల్సిన ఈ స్థితిలో స్టోక్స్ బాధ్యత తీసుకొని భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
గ్రీన్ ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన అతను...గ్రీన్ తర్వాతి ఓవర్లో ఒక ఫోర్ కొట్టి 82 పరుగులకు చేరుకున్నాడు. అదే ఓవర్లో వరుస బంతుల్లో 6, 6, 6 బాది అతను సెంచరీని పూర్తి చేసుకోవడం విశేషం. హాజల్‌వుడ్ ఓవర్లోనూ మరో 2 సిక్సర్లు బాదిన స్టోక్స్... స్టార్క్ ఓవర్లోనూ వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి 150కు చేరుకున్నాడు. ఏడో వికెట్‌కు బ్రాడ్ (11)తో కలిసి స్టోక్స్ 20.2 ఓవర్లలోనే 108 పరుగులు జోడించాడు. ఆసీస్ మూడు క్యాచ్‌లు వదిలేయడం కూడా స్టోక్స్‌కు కలిసొచ్చింది. ఇంగ్లండ్ గెలుపు దిశగా వెళుతున్నట్లు అనిపించింది.
అయితే హాజల్‌వుడ్ బౌలింగ్‌లో స్టోక్స్ మరో భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అంచనా తప్పడంతో ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేవగా బ్యాక్‌వర్డ్ పాయింట్ వరకు పరుగెత్తుతూ వెళ్లి కీపర్ క్యారీ అందుకోవడంతో అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత మిగిలిన 3 వికెట్లు తీసేందుకు ఆసీస్‌కు ఎక్కువ సమయం పట్టలేదు.
Comments
Please login to add a commentAdd a comment