యాషెస్ సిరీస్ రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో వివాదాస్పద స్టంపౌట్‌పై క్రికెట్‌ను ఎంతగానో ఇష్టపడే బ్రిటన్ ప్రధాని రిషి సునక్ స్పందించారు. బెయిర్‌స్టో విషయంలో ఆస్ట్రేలియా క్రికెట్ స్ఫూర్తిని విచ్ఛిన్నం చేసిందని ఆరోపించారు. ఈ వివాదంపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందనతో ఏకీభవించారు. ఆస్ట్రేలియా తరహాలో గేమ్ గెలవాలని తాను కోరుకోనని అన్నారు. ఆసీస్ వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాలను రిషి సునక్ ప్రతినిధి వెల్లడించారు.
కాగా, యాషెస్ సిరీస్ రెండో టెస్ట్ ఆఖరి రోజు ఆటలో బెయిర్‌స్టో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఔటైన విషయం తెలిసిందే. బంతి వికెట్‌కీపర్ చేతిలో ఉండగానే బెయిర్‌స్టో ఓవర్ పూర్తయ్యిందనుకుని క్రీజ్ దాటి వెళ్లాడు. ఇది గమనించిన వికెట్‌కీపర్ వికెట్లను గిరాటు వేశాడు. సుదీర్ఘ పరిశీలన అనంతరం ధర్డ్ అంపైర్ బెయిర్‌స్టోను స్టంపౌట్‌గా ప్రకటించాడు. దీంతో వివాదం రాజుకుంది.
నిబంధనల ప్రకారం ఇది ఔటే అయినా.. ఆసీస్ ఆటగాళ్లు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆసీస్ క్రీడాస్పూర్తికి వ్యతిరేకంగా ప్రవర్తించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్ కెప్టెన్ అయితే తాము ఆసీస్ తరహాలో మ్యాచ్ గెలవాలని ఎప్పటికీ కోరుకోమని వ్యాఖ్యానించాడు. ఇదే విషయాన్ని తాజాగా బ్రిటన్ ప్రధాని కూడా వెల్లబుచ్చారు.
ఇదిలా ఉంటే, రెండో టెస్ట్‌లో బెయిర్‌స్టో కీలక సమయంలో ఔట్ కావడంతో ఇంగ్లండ్ 43 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా ఆసీస్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంగ్లండ్, ఆసీస్ మధ్య మూడో టెస్ట్ జులై 6 నుంచి హెడింగ్లీలో ప్రారంభమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment