హెడింగ్లే వేదికగా రేపటి నుంచి (జులై 6) ప్రారంభంకానున్న యాషెస్ సిరీస్ మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ భారీ మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. భుజం గాయం కారణంగా వైస్ కెప్టెన్ ఓలీ పోప్ జట్టుకు దూరం కాగా.. తొలి రెండు టెస్ట్‌ల్లో విఫలమైన వెటరన్ పేసర్ జిమ్మీ ఆండర్సన్ (2 టెస్ట్‌ల్లో 3 వికెట్లు) తుది జట్టులో ఉండడని సమాచారం. అలాగే రెండో టెస్ట్‌లో 5 వికెట్లతో రాణించినప్పటికీ, జోష్ టంగ్‌కు విశ్రాంతినివ్వాలని ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్ భావిస్తుందట.
పై పేర్కొన్న ముగ్గురి స్థానాల్లో మార్క్, క్రిస్ వోక్స్, మొయిన్ అలీలను తుది జట్టులోకి తీసుకోవాలన్నది కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ మెక్‌కల్లమ్ ఆలోచనగా తెలుస్తుంది. మూడో టెస్ట్‌కు వేదిక అయిన హెడింగ్లే (లీడ్స్) పేసర్లకు సహకరించే అవకాశం ఉండటంతో భారీ పేస్ బౌలింగ్ అటాక్‌తో బరిలోకి దిగాలన్నది ఇంగ్లండ్ ప్రణాళికగా తెలుస్తుంది.
ఈ మార్పులతో పాటు బ్యాటింగ్ ఆర్డర్‌లోనూ మార్పులు చేయాలని కోచ్ మెక్‌కల్లమ్ అనుకుంటున్నాడట. హ్యారీ బ్రూక్‌కు ప్రమోషన్ ఇచ్చి మూడో స్థానంలో బరిలోకి దించాలని ఇంగ్లండ్ యోచిస్తుందట. ఈ విషయాలను ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ద టెలిగ్రాఫ్ యాషెస్ సిరీస్‌పై తమ ప్రత్యేక కథనంలో వెల్లడించింది.
కాగా, తాజాగా లార్డ్స్‌లో ముగిసిన రెండో టెస్ట్‌లో పర్యాటక ఆస్ట్రేలియా 43 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 327 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆసీస్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బెన్ స్టోక్స్ (214 బంతుల్లో 155; 9 ఫోర్లు, 9 సిక్స్‌లు) వీరోచితంగా పోరాడినప్పటికీ ఇంగ్లండ్‌ను గెలిపించలేకపోయాడు. మ్యాచ్ ఆఖరి రోజు జానీ బెయిర్‌స్టో స్టంపౌట్ వివాదాస్పదమైంది.
Comments
Please login to add a commentAdd a comment