
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఫిఫా మెన్స్ బెస్ట్ ప్లేయర్ అవార్డును కొల్లగొట్టాడు. భారత కాలామాన ప్రకారం మంగళవారం తెల్లవారుజామున పారిస్ వేదికగా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్‌బాల్ అసోసియేషన్(FIFA) నిర్వహించిన బెస్ట్ ఫిఫా ఫుట్‌బాల్ అవార్డ్స్‌లో మెస్సీ ఈ అవార్డు అందుకున్నాడు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాను మెస్సీ విశ్వవిజేతగా నిలిపిన సంగతి తెలిసిందే.
36 సంవత్సరాల అర్జెంటీనా అభిమానుల నిరీక్షణకు తెరదించిన మెస్సీ వరల్డ్‌కప్ అందుకోవాలన్న తన చిరకాల కోరికను కూడా నెరవేర్చుకున్నాడు. ఇక గతేడాది జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో అర్జెంటీనా, ఫ్రాన్స్ కొదమసింహాల్లా తలపడ్డాయి. మెస్సీ రెండు గోల్స్‌తో మెరవగా.. ఎంబాపె ఏకంగా హ్యాట్రిక్ గోల్స్‌తో సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ 3-3తో డ్రా కావడంతో పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. ఇక పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా 4-2 తేడాతో ఫ్రాన్స్‌ను మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది. మ్యాచ్ ఓడినా ఎంబాపె మాత్రం తన ప్రదర్శనతో అభిమానుల హృదయాలను దోచుకున్నాడు.
ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న మెస్సీ తాజాగా ఫిఫా మెన్స్ బెస్ట్ ప్లేయర్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డు కోసం మెస్సీతో పాటు ఫ్రాన్స్ ఫుట్‌బాల్ స్టార్స్ కైలియన్ ఎంబాపె, కరీమ్ బెంజెమాలు పోటీ పడ్డారు. అయితే మెస్సీని దాటి అవార్డు అందుకోవడంలో ఈ ఇద్దరు విఫలమయ్యారు. 2021 ఆగస్టు 8 నుంచి 18 డిసెంబర్ 2022 వరకు మెన్స్ ఫుట్‌బాల్‌లో ఔట్‌స్టాండింగ్ ప్రదర్శన ఇచ్చిన ఆటగాళ్ల జాబితాను ఎంపిక చేశారు.
ఈ జాబితాలో మెస్సీ 52 పాయింట్లతో టాప్ ర్యాంక్ కైవసం చేసుకోగా.. కైలియన్ ఎంబాపె 44 పాయింట్లతో రెండో స్థానం, కరీమ్ బెంజెమా 34 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచాడు. కాగా మెస్సీ ఫిఫా మెన్స్ బెస్ట్ ప్లేయర్ అవార్డు గెలుచుకోవడం ఇది ఏడోసారి కావడం విశేషం. ఇంతకముందు వరుసగా 2009, 2010, 2011, 2012, 2015, 2019.. తాజాగా 2023లో మరోసారి అవార్డును గెలుచుకున్నాడు.
ఉత్తమ FIFA ఉమెన్స్ ప్లేయర్ విజేత: అలెక్సియా పుటెల్లాస్
ఉత్తమ FIFA పురుషుల కోచ్ విజేత: లియోనెల్ స్కలోని
ఉత్తమ FIFA మహిళా కోచ్ విజేత: సరీనా విగ్మాన్
ఉత్తమ FIFA పురుషుల గోల్ కీపర్ విజేత: ఎమిలియానో మార్టినెజ్
ఉత్తమ FIFA మహిళా గోల్ కీపర్ విజేత: మేరీ ఇయర్ప్స్
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
MESSI IS THE WINNER OF THE BEST AWARD ❤️🐐 pic.twitter.com/4pJhMoVCI6
— Messi Media (@LeoMessiMedia) February 27, 2023