సౌదీ అరేబియాకే ఆతిథ్య హక్కులు | Saudi Arabia to host Football World Cup | Sakshi
Sakshi News home page

సౌదీ అరేబియాకే ఆతిథ్య హక్కులు

Published Thu, Dec 12 2024 3:49 AM | Last Updated on Thu, Dec 12 2024 3:49 AM

Saudi Arabia to host Football World Cup

2034లో ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ నిర్వహణకు ‘ఫిఫా’ ఆమోద ముద్ర 

జ్యూరిచ్‌: పుష్కర కాలం వ్యవధిలో ఆసియాలోని మరో అరబ్‌ దేశం ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఖాయమైంది. 2022లో ఖతర్‌లో ఈ మెగా ఈవెంట్‌ జరగ్గా... ఇప్పుడు సౌదీ అరేబియా ఆ అవకాశం దక్కించుకుంది. 2034లో జరిగే ప్రపంచ కప్‌ను సౌదీ అరేబియాలో నిర్వహించనున్నట్లు ప్రపంచ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) అధికారికంగా ప్రకటించింది. 

2034 వరల్డ్‌ కప్‌ కోసం ఒక్క సౌదీ మాత్రమే బిడ్‌ వేసింది. గత 15 నెలలుగా బిడ్డింగ్‌ ప్రక్రియ కొనసాగింది. మరే దేశం నుంచి పోటీ లేకపోవడంతో ఆ దేశానికే ఆతిథ్య హక్కులు గతంలోనే ఖాయమయ్యాయి. అయితే ‘ఫిఫా’ అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫ్యాంటినో నేతృత్వంలో బుధవారం 200 మంది ‘ఫిఫా’ సభ్యులు ఆన్‌లైన్‌ ద్వారా సమావేశమై దీనికి ఆమోద ముద్ర వేశారు. 

ఖతర్‌ తరహాలోనే ఈ దేశంలోనూ మానవ హక్కుల ఉల్లంఘన సాగుతోందని, వరల్డ్‌ కప్‌ అవకాశం ఇవ్వరాదని విమర్శలు వచి్చనా... ‘ఫిఫా’ వీటిని లెక్క చేయకుండా ముందుకు సాగింది. దేశ రాజధాని రియాద్‌తో పాటు ఇంకా ఇప్పటికీ నిర్మాణం ప్రారంభించని కొత్త నగరం ‘నియోమ్‌’లో వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తారు.  

మూడు దేశాల్లో 2030 టోర్నీ... 
‘ఫిఫా’ సమావేశంలో 2030 వరల్డ్‌ కప్‌ ఆతిథ్య హక్కులను కూడా ఖాయం చేశారు. ఈ టోర్నీని యూరోప్‌ దేశాలు స్పెయిన్, పోర్చుగల్‌తో పాటు ఆఫ్రికా దేశం మొరాకో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తాయి. దీంతో పాటు 1930లో జరిగిన తొలి వరల్డ్‌ కప్‌కు వందేళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని దక్షిణ అమెరికాలోని మూడు దేశాల్లో తొలి మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. 

1930 విజేత ఉరుగ్వే, రన్నరప్‌ అర్జెంటీనాతో పాటు ప్రపంచంలోనే అతి పురాతనమైన ‘దక్షిణ అమెరికా ఫుట్‌బాల్‌ సమాఖ్య’ ప్రధాన కేంద్రం ఉన్న పరాగ్వేలో కూడా ఒక మ్యాచ్‌ జరుగుతుంది. టోర్నీలోని మొత్తం 104 మ్యాచ్‌లను మూడు వేర్వేరు ఖండాల్లో నిర్వహించనుండటం విశేషం.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement