
‘ఫిఫా’ ఫుట్‌బాల్ ప్రపంచకప్ అంటే గుర్తొచ్చేది అర్జెంటీనా. దివంగత దిగ్గజం మారడోనా నుంచి నేటి తరం మెస్సీ దాకా అర్జెంటీనాను అందలంలో నిలిపిన వారే! ఇలాంటి జట్టు ఉన్న గ్రూప్‌లో మిగతా ప్రత్యర్థులకు గుండె హడల్ గ్యారంటీ. గ్రూప్ ‘సి’లో ఈ మేటి జట్టును ఎదుర్కొనేందుకు మెక్సికో, పోలాండ్, సౌదీ అరేబియా సర్వశక్తులు ఒడ్డాల్సిందే. ఓడించలేకపోయినా... కనీసం నిలువరించినా ఆయా జట్లకు గెలిచినంత సంబరం. ఈ నేపథ్యంలో ఏ జట్టు అర్జెంటీనాను ‘ఢీ’కొంటుందనేది అసక్తికరం!
అర్జెంటీనా
ప్రపంచకప్‌లో శక్తిమంతమైన జట్లలో అర్జెంటీనా ఒకటి. ఖతర్ ఈవెంట్‌లో తన బలాన్ని ప్రపంచానికి చాటేందుకు సిద్ధమైంది. తమ ఆల్ టైమ్ గ్రేటెస్టు ఫుట్‌బాలర్ లయెనల్ మెస్సీకి ఘనమైన వీడ్కోలు పలకాలనే పట్టుదలతో ఉంది. 35 ఏళ్ల మెస్సీ ప్రపంచకప్ మెరుపులకు ఖతరే ఆఖరి వేదిక. ఆ తర్వాత ఆటకు టాటా చెప్పడమే తరువాయి. గతేడాది గట్టి ప్రత్యర్థి బ్రెజిల్‌ను ఓడించి ‘కోపా అమెరికా కప్’ను గెలిచింది. ఆ టోర్నీలో మెస్సీతో పాటు ఏంజెల్ డి మరియా అద్భుతంగా రాణించారు.
ఫిఫా ర్యాంక్: 3
ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: రెండుసార్లు విజేత (1978, 1986).
ఇతర ఘనతలు: 15 సార్లు ‘కోపా అమెరికా కప్’ టైటిళ్లు.
అర్హత: దక్షిణ అమెరికా క్వాలిఫయింగ్ టోర్నీలో రన్నరప్ ద్వారా.
కీలక ఆటగాళ్లు: మెస్సీ, డి మరియా, లో సెల్సో.
మెక్సికో
ఈ గ్రూప్‌లో అర్జెంటీనా తర్వాత మరో మంచి జట్టు మెక్సికో. గత ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీని కంగుతినిపించి గ్రూప్ దశను ఆరంభించిన మెక్సికో తదుపరి రౌండ్ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. ఈసారి మాత్రం మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు చెమటోడ్చింది. అర్జెంటీనాకు చెందిన కోచ్ గెరార్డో మార్టినో 2019 నుంచి మూడున్నరేళ్లుగా జట్టును సానబెడుతున్నారు. స్టార్ ఆటగాళ్లు రాల్ జిమెనెజ్, హెక్టర్ హెరెరా, హిర్వింగ్ లొజానోలపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.
ఫిఫా ర్యాంక్: 13.
ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: క్వార్టర్ ఫైనల్ (1986).
ఇతర ఘనతలు: కాన్ఫెడరేషన్ కప్ విజేత (1999).
అర్హత: ఉత్తర, మధ్య అమెరికా క్వాలిఫయింగ్ టోర్నీ రన్నరప్‌తో.
కీలక ఆటగాళ్లు: జిమినెజ్, హిరెరా.
పోలాండ్
అర్జెంటీనా, మెక్సికోలతో పోల్చితే గట్టి ప్రత్యర్థి కాదు కానీ... ఈ గ్రూప్‌లో ‘డార్క్ హార్స్’ అని చెప్పొచ్చు. తనదైన రోజున ఒక్క గోల్‌తో పైచేయి సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. స్టార్ ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. స్ట్రయికర్లు రాబర్ట్ లెవండోస్కీ, పీటర్ జెలిన్‌స్కీ, మాటీ కాష్‌లు ఇటీవల బాగా ఆకట్టుకుంటున్నారు. ఇంగ్లండ్, స్పెయిన్ లీగ్‌లలో సత్తా చాటుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే కోచ్ బాధ్యతలు చేపట్టిన చెస్లా మిచ్‌నివిక్ (పోలాండ్) సొంత జట్టును ప్రపంచకప్‌కు సిద్ధం చేస్తున్నారు. అయితే మేటి జట్లను దాటుకుని నాకౌట్ చేరడం అంత సులువేమీ కాదు.
ఫిఫా ర్యాంక్: 26.
ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: మూడో స్థానం (1982).
ఇతర ఘనతలు: ‘యూరో కప్’లో క్వార్టర్స్ (2016).
అర్హత: యూరోపియన్ క్వాలిఫయింగ్ ప్లేఆఫ్ విన్నర్.
కీలక ఆటగాళ్లు: లెవండోస్కీ, జెలిన్‌స్కీ.
సౌదీ అరేబియా
గ్రూప్‌లోని మిగతా జట్లకంటే తక్కువ ర్యాంక్ జట్టు. పైగా గత నాలుగు ప్రపంచకప్‌లలో గ్రూప్ దశనే దాటలేకపోయింది. ఇలాంటి జట్టు గ్రూప్ ‘సి’ నుంచి ప్రిక్వార్టర్స్ చేరితే అది సంచలనమే అవుతుంది. అయితే గల్ఫ్ దేశంలోనే మెగా ఈవెంట్ జరగడం కాస్త కలిసొచ్చే అంశం కానీ... ముందడుగు వేయడం కష్టమే! కీలక ఆటగాళ్లు సలేహ్ అల్ శెహ్రి, సలిమ్, సాల్మన్ అల్ ఫరాజ్ తమ ప్రదర్శనతో గల్ఫ్ సాకర్ ప్రియుల్ని అలరించడం ఖాయం. ఫ్రాన్స్‌కు చెందిన కోచ్ హెర్వ్ రినార్డ్ 2019 నుంచి జట్టును తీర్చిదిద్దుతున్నాడు.
ఫిఫా ర్యాంక్: 51.
ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: ప్రిక్వార్టర్స్ (1994).
ఇతర ఘనతలు: ఆసియా చాంపియన్ (1984, 1988, 1996).
అర్హత: ఆసియా క్వాలిఫయింగ్‌లో గ్రూప్ ‘బి’ రన్నరప్.
కీలక ఆటగాళ్లు: సలేహ్ అల్ శెహ్రి, అల్ ఫరాజ్.
–సాక్షి క్రీడా విభాగం
Comments
Please login to add a commentAdd a comment