జకార్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో బుధవారం పురుషుల సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన ముగ్గురు భారత క్రీడాకారులు ముందంజ వేశారు. కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్ తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారులను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. ప్రియాన్షు రజావత్‌కు ప్రపంచ మూడో ర్యాంకర్ కున్లావుత్ వితిద్‌సర్న్ (థాయ్‌లాండ్) నుంచి వాకోవర్ లభించడంతో అతను కోర్టులో అడుగు పెట్టకుండానే ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు.
ప్రపంచ 13వ ర్యాంకర్ గ్వాంజ్ జు లూ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 22వ ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ శ్రీకాంత్ 21–13, 21–19తో గెలుపొందాడు. 46 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో శ్రీకాంత్ 4–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ తొలి గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో శ్రీకాంత్‌కు ప్రతిఘటన ఎదురైంది. అయితే స్కోరు 19–19 వద్ద శ్రీకాంత్ వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు గ్వాంజ్ జు లూపై వరుసగా ఐదో విజయాన్ని సాధించాడు.
ప్రపంచ 11వ ర్యాంకర్, ఆసియా చాంపియన్ లీ జి జియా (మలేసియా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 20వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–17, 21–13తో గెలిచాడు. 33 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్ తొలి గేమ్‌లో స్కోరు 17–17 వద్ద వరుసగా నాలుగు పాయింట్లు గెలిచాడు. రెండో గేమ్‌లో స్కోరు 5–3 వద్ద లక్ష్య సేన్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఏడు పాయింట్లు నెగ్గి 12–3తో ఆధిక్యంలోకి వెళ్లి వెనుదిరిగి చూడలేదు.
మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణి ఆకర్షి కశ్యప్‌నకు నిరాశ ఎదురైంది. ప్రపంచ 43వ ర్యాంకర్ ఆకర్షి తొలి రౌండ్‌లో 10–21, 4–21తో ప్రపంచ రెండో ర్యాంకర్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో లక్ష్య సేన్‌తో శ్రీకాంత్; ఎన్జీ కా లాంగ్ అంగుస్ (వియత్నాం)తో ప్రణయ్; ఆంథోనీ సినిసుక జిన్‌టింగ్ (ఇండోనేసియా)తో ప్రియాన్షు రజావత్; తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో పీవీ సింధు తలపడతారు.
Comments
Please login to add a commentAdd a comment