singapore open
-
సింగపూర్ ఓపెన్ స్నూకర్ టోర్నీ విజేత పంకజ్ అద్వానీ
సింగపూర్: భారత దిగ్గజ క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్–స్నూకర్ ) ప్లేయర్ పంకజ్ అద్వానీ అంతర్జాతీయస్థాయిలో మరో టైటిల్ సాధించాడు. ఆదివారం ముగిసిన సింగపూర్ ఓపెన్ స్నూకర్ టోర్నమెంట్లో పంకజ్ అద్వానీ చాంపియన్‌గా నిలిచాడు. జాడెన్ ఓంగ్ (సింగపూర్)తో జరిగిన ఫైనల్లో పంకజ్ 5–1 (65–57, 62–46, 85–18, 15–66, 71–62, 75–11) ఫ్రేమ్‌ల తేడాతో విజయం సాధించాడు. సెమీఫైనల్లో పంకజ్ 4–3తో ప్రపంచ మాజీ స్నూకర్ చాంపియన్ దెచావత్ పూమ్జేంగ్ (థాయ్‌లాండ్)పై గెలుపొందాడు. ఐదు దేశాల నుంచి 123 మంది ప్లేయర్లు ఈ టోర్నీలో పోటీపడ్డారు. విజేతగా నిలిచిన పంకజ్‌కు 11 వేల సింగపూర్ డాలర్లు (రూ. 7 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. పుణేలో జన్మించి బెంగళూరులో స్థిరపడ్డ 39 ఏళ్ల పంకజ్ తన కెరీర్లో వివిధ ఫార్మాట్లలో 27 ప్రపంచ టైటిల్స్‌ను సాధించాడు. -
గాయత్రి–ట్రెసా జోరుకు సెమీస్‌లో బ్రేక్
సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో సంచలన విజయాలతో దూసుకెళ్తున్న పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీకి సెమీఫైనల్లో చుక్కెదురైంది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీస్‌లో భారత ద్వయం 21–23, 11–21తో ప్రపంచ నాలుగో ర్యాంకు జోడీ నమి మత్సుయామ–చిహారు షిదా (జపాన్) చేతిలో పరాజయం చవిచూసింది. 47 నిమిషాల పాటు జరిగిన ఈ పోరాటంలో గాయత్రి–ట్రెసా జంట తొలి గేమ్‌లో నాలుగో సీడ్ ప్రత్యర్థులతో హోరాహోరీగా తలపడింది. ఒక దశలో 5–10తో వెనుకబడిన వీరు చక్కటి ఆటతో స్కోరును 16–16 వరకు తీసుకొచ్చారు. ఆ తర్వాత జపాన్ జోడి 20–18తో గేమ్ పాయింట్ వద్ద నిలిచినా...భారత ద్వయం సులువుగా తలవంచలేదు. చివరకు ఈ గేమ్‌లో పోరాడి ఓడింది. రెండో గేమ్‌లో మాత్రం జపాన్ జంట జోరుకు ఎదురు నిలువ లేకపోయింది. చెలరేగిన ఈ జోడి 20–6తో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకుపోయింది. గాయత్రి–ట్రెసా పట్టుదలగాఆడి మరో 5 పాయింట్లు సాధించినా...ఆ తర్వాత పరాజయం తప్పలేదు. తాజా ఫలితంతో జపనీస్ ద్వయం ఫిబ్రవరిలో ఆసియా టీమ్ చాంపియన్íÙప్లో గాయత్రి–ట్రెసా జోడీ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకుంది. -
గాయత్రి–ట్రెసా జోడీ మరో సంచలనం
సింగపూర్: భారత మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్ భవిష్యత్‌కు భరోసా ఇస్తూ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో మరో సంచలనం సృష్టించింది. గురువారం ప్రపంచ రెండో ర్యాంక్ జంటను బోల్తా కొట్టించిన గాయత్రి–ట్రెసా శుక్రవారం ప్రపంచ ఆరో ర్యాంక్ జోడీని ఇంటిదారి పట్టించింది. 79 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 30వ ర్యాంక్ ద్వయం గాయత్రి–ట్రెసా 18–21, 21–19, 24–22తో కిమ్ సో యోంగ్–కాంగ్ హీ యోంగ్ (దక్షిణ కొరియా) జోడీని ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ గెలుపుతో గత ఏడాది ఆసియా క్రీడల్లో ఈ కొరియా జోడీ చేతిలో ఎదురైన ఓటమికి భారత జోడీ బదులు తీర్చుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో నాలుగో సీడ్ నమి మత్సుయామ–చిహారు షిదా (జపాన్)లతో గాయత్రి–ట్రెసా తలపడతారు. కొరియా ద్వయంతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా ఓటమి అంచుల్లో నుంచి పుంజుకున్నారు. తొలి గేమ్ కోల్పోయి, రెండో గేమ్‌లో 12–18తో వెనుకబడిన గాయత్రి–ట్రెసా వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి ఆధిక్యాన్ని 17–18కి తగ్గించారు. ఆ తర్వాత కొరియా ద్వయం ఒక పాయింట్ సాధించగా... ఆ వెంటనే గాయత్రి–ట్రెసా వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచారు. నిర్ణాయక మూడో గేమ్‌లో పూర్తి సమన్వయంతో ఆడిన గాయత్రి–ట్రెసా కీలకదశలో పాయింట్లు నెగ్గి మరో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నారు. -
గాయత్రి–ట్రెసా జోడీ సంచలనం
సింగపూర్: భారత మహిళల డబుల్స్ జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో సంచలన విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అయితే సింగిల్స్‌లో సీనియర్ షట్లర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధుకు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే చుక్కెదురైంది. మహిళల డబుల్స్‌లో గాయత్రి–ట్రెసా జంట చక్కని పోరాటపటిమతో దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ బేక్ హ న–లీ సో హీని కంగుతినిపించింది.గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో భారత ద్వయం 21–9, 14–21, 21–15తో కొరియన్ జంటకు ఊహించని షాక్ ఇచ్చింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్ల ఆరో సీడ్ కిమ్ సో యోంగ్–కాంగ్ హీ యోంగ్ (దక్షిణ కొరియా)లతో గాయత్రి–ట్రెసా తలపడతారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధుకు కొరకరాని కొయ్య, స్పెయిన్ స్టార్ కరోలినా మారిన్ చేతిలో మరోసారి పరాజయం ఎదురైంది. సింధు 21–13, 11–21, 20–22తో మూడో సీడ్ మారిన్ ధాటికి చేతులెత్తేసింది. వీళ్లిద్దరు ముఖాముఖిగా ఇప్పటివరకు 17 సార్లు తలపడగా... 12 సార్లు స్పెయిన్ షట్లరే నెగ్గింది. సింధు కేవలం ఐదుసార్లే గెలిచింది. మారిన్‌పై సింధు చివరిసారి 2018 జూన్‌లో మలేసియా ఓపెన్ టోర్నీలో గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ ప్రణయ్ ఆట కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. ప్రణయ్ 13–21, 21–14, 15–21తో కెంటా నిషిమొటో (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. -
సింధు, ప్రణయ్ ముందుకు...
సింగపూర్: భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ లో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21–12, 22–20తో ప్రపంచ 21వ ర్యాంకర్ లినె హొమార్క్ జార్స్‌ఫెల్ట్ (డెన్మార్క్)పై... పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రణయ్ 21–9, 18–21, 21–9తో జూలియన్ కరాగి (బెల్జియం)పై గెలుపొందారు. భారత్‌కే చెందిన అగ్రశ్రేణి ఆటగాళ్లు లక్ష్య సేన్, కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. లక్ష్య సేన్ 13–21, 21–16, 13–21తో ప్రపంచ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడిపోగా... కొడాయ్ నరోకా (జపాన్)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ తొలి గేమ్‌ను 14–21తో కోల్పోయి రెండో గేమ్‌లో 3–11తో వెనుకబడ్డాడు. ఈ దశలో మోకాలి గాయంతో శ్రీకాంత్ వైదొలిగాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు; కెంటా నిషిమోటో (జపాన్)తో ప్రణయ్ తలపడతారు. ముఖాముఖి రికార్డులో సింధు 5–11తో, ప్రణయ్ 2–3తో వెనుకబడి ఉన్నారు. అశ్విని–తనీషా జోడీ ఓటమి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ ఈ టోర్నీలో తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. పొలీనా బురోవా–యెవెనియా (ఉక్రెయిన్) జంటతో జరిగిన మ్యాచ్‌లో అశ్విని–తనీషా ద్వయం 21–18, 19–21, 19–21తో ఓడిపోయింది. పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జంట 21–7, 21–14తో చెంగ్ యు పె–సన్ యు సింగ్ (చైనీస్ తైపీ) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో బేక్ హా నా–లీ సో హీ (దక్షిణ కొరియా)లతో గాయత్రి–ట్రెసా పోటీపడతారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–సిక్కి రెడ్డి (భారత్) జోడీ 18–21, 19–21తో గో సూన్ హువాట్–లాయ్ షెవోన్ జేమీ (మలేసియా) ద్వయం చేతిలో పోరాడి ఓడిపోయింది. -
సాత్విక్–చిరాగ్ జోడీకి చుక్కెదురు
సింగపూర్: ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీకి అనూహ్య పరాజయం ఎదురైంది. సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన సాత్విక్– చిరాగ్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 34వ స్థానంలో ఉన్న డానియల్ లుండ్‌గార్డ్– మాడ్స్ వెస్టెర్గార్డ్ (డెన్మార్క్) ద్వయం 22–20, 21–18తో సాత్విక్–చిరాగ్ శెట్టి జోడీని బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. 47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు గేముల్లోనూ పలు దశల్లో సాత్విక్–చిరాగ్ ఆధిక్యంలో ఉన్నా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఈ టోర్నీకి ముందు సాత్విక్–చిరాగ్ సీజన్లో ఆరు టోర్నీలు ఆడి ఫ్రెంచ్ ఓపెన్ సూపర్–750 టోర్నీలో, థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–500 టోర్నీలో టైటిల్స్ నెగ్గారు. మలేసియా సూపర్–1000, ఇండియా ఓపెన్ సూపర్–750 టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచి, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. -
Singapore Squash Open 2023: సౌరవ్ పరాజయం
న్యూఢిల్లీ: సింగపూర్ ఓపెన్ అంతర్జాతీయ స్క్వాష్ టోర్నమెంట్ నుంచి భారత స్టార్ సౌరవ్ ఘోషాల్ నిష్క్రమించాడు. సింగపూర్‌లో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో సౌరవ్ 3–11, 7–11, 10–12తో నాలుగో సీడ్ ముస్తఫా అసల్ (ఈజిప్ట్) చేతిలో ఓడిపోయాడు. భారత్‌కే చెందిన మరో ప్లేయర్ రమిత్ టాండన్ 3–11, 2–11, 4–11తో రెండో సీడ్ డీగో ఇలియాస్ (పెరూ) చేతిలో పరాజయం పాలయ్యాడు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సౌరవ్ 11–6, 7–11, 11–6, 11–5తో టాడీ హారిటి (అమెరికా)పై, రమిత్ 11–7, 12–10, 12–10తో రోరీ స్టీవర్ట్ (స్కాట్లాండ్)పై గెలుపొందారు. -
సింధు సత్తాకు పరీక్ష.. నేటి నుంచి సింగపూర్ ఓపెన్ టోర్నీ
సింగపూర్: సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ టైటిల్ నిలబెట్టుకోవాలంటే భారత స్టార్ షట్లర్ పీవీ సింధు విశేషంగా రాణించాల్సి ఉంటుంది. నేడు మొదలయ్యే ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ సింధుకు తొలి రౌండ్లోనే కఠిన ప్రత్యర్థి ఎదురుకానుంది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ అకానె యామగుచి (జపాన్)తో సింధు తొలి రౌండ్లో ఆడనుంది. ముఖాముఖి రికార్డులో సింధు 14–9తో ఆధిక్యంలో ఉంది. భారత్‌కే చెందిన మరో స్టార్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో ప్రపంచ మాజీ చాంపియన్ రచనోక్ (థాయ్‌లాండ్)తో తలపడనుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో వాంగ్‌చరోన్ (థాయ్‌లాండ్)తో కిడాంబి శ్రీకాంత్... కొడాయ్ నరోకా (జపాన్)తో ప్రణయ్... సునెయామ (జపాన్)తో ప్రియాన్షు రజావత్... చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో లక్ష్య సేన్ ఆడతారు. చదవండి: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్.. భారత బౌలర్లకు పాక్ లెజెండ్ కీలక సలహా -
Singapore Open 2022: ఫైనల్స్‌కు దూసుకెళ్లిన సింధు
సింగపూర్ ఓపెన్ 2022 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు దూసుకుపోతుంది. శనివారం (జులై 16) జరిగిన సెమీఫైనల్లో జపాన్ క్రీడాకారిణి, వరల్డ్ 38వ ర్యాంకర్ సయినా కవకామిపై 21-15, 21-7తేడాతో వరుస సెట్లలో విజయం సాధించి తుదిపోరుకు అర్హత సాధించింది. తొలి సెట్ నుంచే ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించిన సింధు.. కేవలం 32 నిమిషాల్లోనే గేమ్‌ను ముగించింది. ఈ ఏడాది రెండు సూపర్ 300 టైటిల్స్ (సయ్యద్ మోదీ, స్విస్ ఓపెన్) సాధించిన సింధు.. సింగపూర్ ఓపెన్ గెలిచి తొలి సూపర్ 500 టైటిల్ సాధించాలని ఉవ్విళ్లూరుతుంది. డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ అయిన సింధు.. క్వార్టర్ ఫైనల్లో చైనా షట్లర్ హాన్ యుయేపై 17-21, 21-11, 21-19 తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, కెరీర్లో దాదాపు అన్ని సూపర్ 500 టైటిల్స్ సాధించిన సింధు సింగపూర్ ఓపెన్ మాత్రం గెలవలేకపోయింది. దీంతో సింధు ఈసారి ఎలాగైనా ఈ టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. ప్రస్తుత టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించిన సహచర షట్లర్ సైనా నెహ్వాల్ ప్రొఫెషనల్‌గా మారకముందే 2010లో సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలిచింది. చదవండి: Singapore Open 2022: సెమీస్‌కు దూసుకెళ్లిన సింధు.. సైనాకు తప్పని భంగపాటు -
Singapore Open 2022: సెమీస్‌కు దూసుకెళ్లిన సింధు.. సైనాకు తప్పని భంగపాటు
సింగపూర్ ఓపెన్ 2022 టోర్నీలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సత్తా చాటింది. క్వార్టర్ ఫైనల్లో చైనా షట్లర్ హాన్ యుయేపై విజయం సాధించింది. ప్రత్యర్థిని 17-21, 21-11, 21-19 తేడాతో ఓడించి తెలుగు తేజం సింధు సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే.. మరో భారత షట్లర్ సైనా నెహ్వాల్‌కు భంగపాటు తప్పలేదు. జపాన్ ప్లేయర్ ఒహరి చేతిలో ఓటమి పాలైంది. శుక్రవారం నాటి క్వార్టర్ ఫైనల్స్‌లో 13-21, 21-15, 20-22 తేడాతో సైనా ప్రత్యర్థి చేతిలో ఓడిపోయింది. దీంతో ఆమె టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ సైతం బీడబ్ల్యూఎఫ్ 500 టోర్నీ క్వార్టర్స్‌లో జపాన్ షట్లర్ కొడాయి నరోకా చేతిలో ఓడి ఇంటిబాటపట్టాడు. చదవండి: Rohit Sharma: అందుకే ఓడిపోయాం.. నన్ను అమితంగా ఆశ్చర్యపరిచిన విషయం అదే! కనీసం ఒక్కరైనా.. -
రీ ఎంట్రీలో రెచ్చిపోతున్న సైనా.. ఐదో సీడ్ ప్లేయర్‌కు ఝలక్
సింగపూర్ ఓపెన్ 2022లో భారత షట్లర్లు రెచ్చిపోతున్నారు. పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ ఇదివరకే క్వార్టర్స్‌కు చేరగా.. తాజాగా వెటరన్ స్టార్ సైనా నెహ్వాల్ కూడా ఫైనల్ 8కు దూసుకెళ్లింది. రెండో రౌండ్లో సైనా.. చైనా షట్లర్ హి బింగ్ జియావోపై 21-19, 11-21, 21-17 తేడాతో విజయం సాధించి, దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత వరల్డ్ టూర్ 500 టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. అంతకుముందు సైనా తొలి రౌండ్లో భారత్‌కే చెందిన మాళవిక బాన్సోద్‌పై 21-18, 21-14 తేడాతో విజయం సాధించింది. 2010లో చివరిసారి ఈ టైటిల్ సాధించిన సైనా.. మరోసారి ఆ ఫీట్‌ను రిపీట్ చేయాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే, పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌కు షాకిచ్చి సంచలనం సృష్టించిన మిథున్ మంజునాథ్.. రెండో రౌండ్లో వరల్డ్ నెం.42 ర్యాంకర్ నాట్ గుయెన్ చేతిలో 10-21, 18-21, 16-21 తేడాతో పోరాడి ఓడాడు. పురుషుల డబుల్స్‌లో భారత జోడి అర్జున్, ధృవ్ కపిలా ద్వయం ప్రపంచ నెం.12 మలేషియా జోడి గో సీ ఫెయ్ - నుర్ ఇజుదుద్దీన్పై 18-21, 24-22, 21-18 తేడాతో సంచలన విజయం సాధించి ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. చదవండి: కిదాంబి శ్రీకాంత్‌కు షాక్.. క్వార్టర్స్‌కు సింధు, ప్రణయ్ -
కిదాంబి శ్రీకాంత్‌కు షాక్.. క్వార్టర్స్‌కు సింధు, ప్రణయ్
సింగపూర్ ఓపెన్ 2022 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు ఇవాళ (జులై 14) మిశ్రమ ఫలితాలు వచ్చాయి. తొలి రౌండ్లో వరల్డ్ నెం.11 ర్యాంకర్ కిదాంబి శ్రీకాంత్‌కు భారత్‌కే చెందిన మరో షట్లర్ మిథున్ మంజునాథ్ షాకివ్వగా, హెచ్ఎస్ ప్రణయ్.. ప్రపంచ నెం.4 ఆటగాడు చో టెన్ చెన్పై సంచలన విజయం నమోదు చేసి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు రెండో రౌండ్ గండాన్ని అధిగమించి ప్రీక్వార్టర్స్‌కు అర్హత సాధించగా.. మరో మ్యాచ్‌లో వెటరన్ స్టార్ సైనా నెహ్వాల్ భారత్‌కే చెందిన మాళవిక బాన్సోద్‌పై విజయం సాధించి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో మిథున్ మంజునాథ్ చేతిలో కిదాంబి శ్రీకాంత్ పోరాడి (17-21, 21-15, 18-21) ఓడగా.. మరో మ్యాచ్‌లో హెచ్ఎస్ ప్రణయ్, చైనీస్ తైపీకి చెందిన చో టెన్ చెన్పై 14-21, 22-20, 21-18తేడాతో విజయం సాధించి ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. మహిళల సింగిల్స్ విషయానికొస్తే.. స్టార్ షట్లర్ పీవీ సింధు రెండో రౌండ్లో వియత్నాంకి చెందిన వరల్డ్ 59వ ర్యాంకర్ తుయ్ లిన్ గుయెన్‌పై 19-21, 21-19, 21-18 తేడాతో విజయం సాధించగా.. వెటరన్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో మాళవిక బాన్సోద్‌పై 21-18, 21-14 తేడాతో విజయం సాధించి రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. మరో మ్యాచ్‌లో అశ్మిత చాలిహా వరల్డ్ నెం.19వ ర్యాంకర్ హ్యాన్ యూయ్ చేతిలో పరాజయం పాలైంది. చదవండి: World Cup 2022: అసలైన మ్యాచ్‌లలో చేతులెత్తేశారు! జపాన్‌తో పోరులో.. -
సింధు మిగిలింది!
సింగపూర్: సింగపూర్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ లో పీవీ సింధు ఆట మాత్రమే మిగిలింది. ఈ నాలుగో సీడ్ తెలుగుతేజం మహిళల సింగిల్స్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ సీజన్లో ఇంకా టైటిల్ బోణీ కొట్టని సింధు ఇప్పుడు ఆ వేటలో రెండడుగుల దూరంలో ఉంది. ఆమె మినహా మిగతా భారత షట్లర్లు శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లోనే కంగుతిన్నారు. మహిళల సింగిల్స్‌లో వెటరన్ స్టార్ సైనా నెహ్వాల్‌తో పాటు పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్ కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ పరాజయం చవిచూశారు. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీ కూడా ఓడిపోయింది. శ్రమించి సెమీస్‌కు... భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధుకు ప్రపంచ 18వ ర్యాంకర్ కై యన్యన్ (చైనా) గట్టిపోటీనిచ్చింది. దీంతో మ్యాచ్ గెలిచేందుకు నాలుగో సీడ్ సింధు చెమటోడ్చాల్సివచ్చింది. గంటపాటు జరిగిన ఈ పోరులో చివరకు 21–13, 17–21, 21–14తో చైనా ప్రత్యర్థిని కంగుతినిపించింది. మరో క్వార్టర్స్‌లో ఆరో సీడ్ సైనా నెహ్వాల్ 8–21, 13–21తో రెండో సీడ్ నొజొమి ఒకుహర (జపాన్) చేతిలో పరాజయం చవిచూసింది. నేడు (శనివారం) జరిగే సెమీఫైనల్లో సింధు... ఈ మాజీ ప్రపంచ చాంపియన్ ఒకుహరతో తలపడుతుంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ శ్రీకాంత్ 18–21, 21–19, 9–21తో టాప్ సీడ్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో, సమీర్ వర్మ 10–21, 21–15, 15–21తో రెండో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయారు. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జంట 14–21, 16–21తో మూడో సీడ్ డెచపొల్ పువరనుక్రొ–సప్సిరి టెరతనచయ్ (థాయ్‌లాండ్) జోడీ చేతిలో కంగుతింది. -
సెమీస్‌లో పీవీ సింధు
సింగపూర్: సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగు తేజం పీవీ సింధు సెమీస్‌లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు 21-13, 17-21, 21-14 తేడాతో యాన్యాన్(చైనా)పై విజయం సాధించి సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. తొలి గేమ్‌ను సింధు అవలీలగా గెలవగా, రెండో గేమ్‌లో యాన్యాన్ పుంజుకుంది. ఫలితంగా రెండో గేమ్‌లో సింధుకు ఓటమి తప్పలేదు. కాగా, నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు జోరును కొనసాగించింది. మూడో గేమ్‌లో తన జోరును కొనసాగించిన సింధు వరుసగా పాయింట్లు సాధిస్తూ ఆధిక్యంలోకి దూసుకుపోయింది. ఇదే ఊపును కడవరకూ కొనసాగించి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుంది. ఇక మరో మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ ఓటమి పాలైంది. సైనా నెహ్వాల్ 8-21, 13-21 తేడాతో ఒకుహరా(జపాన్) చేతిలో పరాజయం చవిచూసింది. ఏ దశలోనూ ఒకుహరాకు పోటీ ఇవ్వని సైనా నెహ్వాల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. శనివారం జరుగనున్న సెమీ ఫైనల్లో పీవీ సింధుతో ఒకుహరా తలపడనుంది. -
సాయిప్రణీత్‌కు చుక్కెదురు
సింగపూర్ సిటీ: గతేడాది ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఏకంగా టైటిల్ నెగ్గిన భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ ఈసారి సింగపూర్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 24వ ర్యాంకర్ సాయిప్రణీత్ 21–16, 16–21, 18–21తో 59వ ర్యాంకర్ యు ఇగారషి (జపాన్) చేతిలో ఓడిపోయాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో స్కోరు 17–17తో సమంగా ఉన్న దశలో సాయిప్రణీత్ వరుసగా మూడు పాయింట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో కశ్యప్ 15 నిమిషాల్లో 9–21, 6–21తో భారత్‌కే చెందిన సౌరభ్ వర్మ చేతిలో... క్వాలిఫయర్ గురుసాయిదత్ 14–21, 19–21తో కియావో బిన్ (చైనా) చేతిలో ఓడిపోయారు. శుభాంకర్ డే 14–21, 21–14, 21–16తో జేసన్ ఆంథోని (కెనడా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. రుత్విక శుభారంభం మహిళల సింగిల్స్ విభాగంలో రుత్విక శివాని, రితూపర్ణ దాస్ ముందంజ వేయగా... జక్కా వైష్ణవి రెడ్డి, చుక్కా సాయి ఉత్తేజిత రావు తొలి రౌండ్లో ఓడిపోయారు. రుత్విక 21–15, 17–21, 21–16తో ప్రపంచ 44వ ర్యాంకర్ లిండా జెట్చిరి (బల్గేరియా)ను ఓడించింది. రితూపర్ణ 5–3తో ఆధిక్యంలో ఉన్నపుడు ఆమె ప్రత్యర్థి సబ్రీనా జాక్వెట్ (స్విట్జర్లాండ్) గాయంతో వైదొలిగింది. వైష్ణవి 19–21, 7–21తో మినత్సు మితాని (జపాన్) చేతిలో, ఉత్తేజిత 23–21, 4–21, 6–21తో బీట్రిజ్ కొరాలెస్ (స్పెయిన్) చేతిలో పరాజయం పాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) ద్వయం 21–19, 16–21, 21–12తో జోన్స్ జాన్సెన్–కార్లా నెల్టీ (జర్మనీ) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట 21–18, 13–21, 14–21తో ఎన్జీ సాజ్ యావు–యుయెన్ సిన్ యింగ్ (హాంకాంగ్) జోడీ చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట 21–16, 24–22తో రిజ్కీ హిదాయత్–లో కీన్ హీన్ (సింగపూర్) ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
జోరు కొనసాగించేనా?
♦ నేటి నుంచి ఆస్ట్రేలియన్ ♦ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ ♦ బరిలో శ్రీకాంత్, సాయిప్రణీత్, సింధు, సైనా సిడ్నీ: ఇటీవలే సింగపూర్ ఓపెన్ నెగ్గిన సాయిప్రణీత్, గతవారం ఇండోనేసియా ఓపెన్‌లో విజేతగా నిలిచిన కిడాంబి శ్రీకాంత్... మాజీ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా), రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)ను ఓడించి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న హెచ్ఎస్ ప్రణయ్ మరో టైటిల్ వేటకు సిద్ధమయ్యారు. మంగళవారం మొదలయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్స్ శ్రీకాంత్, ప్రణయ్, సాయిప్రణీత్, అజయ్ జయరామ్, సైనా నెహ్వాల్, పీవీ సింధు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పారుపల్లి కశ్యప్, సిరిల్ వర్మ, శ్రేయాన్‡్ష జైస్వాల్, రుత్విక శివాని క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడనున్నారు. తొలి రోజు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి, మనూ అత్రి–సుమీత్ రెడ్డి, కోనా తరుణ్–ఫ్రాన్సిస్ ఆల్విన్ జోడీలు బరిలో ఉన్నాయి. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో క్వాలిఫయర్‌తో ఆడనున్న శ్రీకాంత్‌కు ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ సన్ వాన్ హో (కొరియా) ఎదురవుతాడు. ఇతర మ్యాచ్‌ల్లో టామీ సుగియార్తో (ఇండోనేసియా)తో సాయిప్రణీత్, యూరోపియన్ చాంపియన్ రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్)తో ప్రణయ్, ఏడో సీడ్ ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో జయరామ్ ఆడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఇండోనేసియా ఓపెన్ విజేత సయాకా సాటో (జపాన్)తో సింధు; నాలుగో సీడ్ సుంగ్ జీ హున్ (కొరియా)తో సైనా తలపడతారు. ఏప్రిల్‌లో సాయిప్రణీత్ సింగపూర్ ఓపెన్‌లో... ఆదివారం కిడాంబి శ్రీకాంత్ ఇండోనేసియా ఓపెన్‌లో విజేతగా నిలిచారు. భారత్‌కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్ ఇండోనేసియా ఓపెన్‌లో మాజీ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా), రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)లను ఓడించి పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. -
సాయిప్రణీత్ సాధించాడు
-
సైలెంట్ కిల్లర్!
2013 జూన్ తొలి వారంలో థాయ్‌లాండ్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్ హఫీజ్ (మలేసియా)పై గెలుపు... రెండో వారంలో ఇండోనేసియా సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీలో దిగ్గజం తౌఫిక్ హిదాయత్పై అతని వీడ్కోలు మ్యాచ్‌లో సంచలన విజయం... మూడో వారంలో సింగపూర్ ఓపెన్‌లో అప్పటి ప్రపంచ నాలుగో ర్యాంకర్ హు యున్ (హాంకాంగ్)పై గెలుపు... 20 ఏళ్ల ప్రాయంలోనే ఇలా ఒకే నెలలో ముగ్గురు మేటి స్టార్లపై అద్భుత విజయాలు సాధించిన సాయిప్రణీత్ భారత బ్యాడ్మింటన్‌కు భావితారగా కనిపించాడు. ఆ తర్వాత సైనా నెహ్వాల్, సింధు, శ్రీకాంత్‌ల నీడలో అతని ప్రదర్శనకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. 2015లో ఈ హైదరాబాద్ ప్లేయర్ మళ్లీ సత్తా చాటి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆ ఏడాది బంగ్లాదేశ్, లాగోస్, శ్రీలంక ఓపెన్ టోర్నీలలో టైటిల్స్ సాధించాడు. 2016 ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో మలేసియా దిగ్గజం లీ చోంగ్ వీని తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టించాడు. ఆ తర్వాత కెనడా ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నీలో విజేతగా నిలిచి తనలో మేటి క్రీడాకారుడికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయని సాయిప్రణీత్ నిరూపించాడు. ఈ ఏడాది జనవరిలో సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన అతను భుజం గాయం కారణంగా నెలరోజులపాటు ఆటకు దూరమయ్యాడు. అయితే గాయం నుంచి కోలుకున్నాక తీవ్ర సాధన చేసి పూర్తి ఫిట్నెస్ను సంతరించుకున్నాడు. తాజాగా సింగపూర్ ఓపెన్‌లో సాయిప్రణీత్ కోర్టులో ఏకంగా 5 గంటలు గడపడం... మూడు గేమ్‌లపాటు సాగిన నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించడం అతని ఫిట్నెస్ స్థాయిని సూచిస్తోంది. చిన్న చిన్న బలహీనతలను అధిగమించడంతో పాటు మానసికంగా ఇంకా దృఢత్వాన్ని సంపాదించడం... కీలక సమయంలో ఒత్తిడిని తట్టుకోవడం వంటి పలు అంశాల్లో సాయిప్రణీత్ మెరుగవ్వాల్సి ఉంది. ప్రస్తుతం ఓఎన్జీసీలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ హోదాలో పని చేస్తున్న 24 ఏళ్ల సాయి కెరీర్‌కు తాజా విజయం కొత్త ఉత్సాహాన్నిస్తుందనడంలో సందేహం లేదు. – సాక్షి క్రీడావిభాగం -
సింధు నిష్క్రమణ
హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సింగపూర్ ఓపెన్ టోర్నమెంట్లో పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్‌తో జరిగిన పోరులో ఓటమి పాలైంది. దీంతో సింధు క్వార్టర్ పైనల్స్ నుంచి నిష్క్రమించింది. కరోలినా, పీవీ సింధుపై వరుస సెట్లలో 21-11, 21-15 తేడాతో విజయం సాధించింది. -
సింగపూర్ ఓపెన్ నుంచి కశ్యప్ నిష్క్రమణ
సింగపూర్:భారత పురుషుల బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారపల్లి కశ్యప్ సింగపూర్ ఓపెన్ నుంచి నిష్ర్కమించాడు. శనివారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో హాంకాంగ్ క్రీడాకారుడు హూ యున్ 22-20, 21-11, 21-14 తేడాతో కశ్యప్ ను ఓడించి ఫైనల్ కు ప్రవేశించాడు. తొలి సెట్ ను గెలుచుకున్న కశ్యప్.. ఆ తరువాత పేలవమైన ఆటను ప్రదర్శించి ఓటమి పాలయ్యాడు. కేవలం గంటలోపే హూ యూన్ మ్యాచ్ ను ముగించి కశ్యప్ సింగపూర్ ఆశలకు కళ్లెం వేశాడు. దీంతో కశ్యప్ పై హూ యున్ విజయాల సంఖ్యను 3-1 పెరిగింది. -
సింగపూర్ ఓపెన్‌కు సైనా దూరం
సింగపూర్: రెండు నెలలుగా తీరిక లేకుండా టోర్నీలు ఆడుతున్న భారత బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ సైనా నెహ్వాల్ కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటోంది. దీంతో రేపటి (బుధవారం) నుంచి 12 వరకు జరిగే సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంది. గత నెల సైనా బిజీబిజీగా గడిపింది. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్, ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ ఆ తర్వాత వెంటనే మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్‌లో పాల్గొంది. ‘మార్చి నెల నాకు తీరికలేకుండా గడిచిపోయింది. మూడు టోర్నీలు ఆడితే రెండింట్లో ఫైనల్స్‌కు వచ్చి ఒకటి గెలిచాను. అయితే నా శరీరానికి అధిక శ్రమను పెట్టదలచుకోలేదు. ఈ ఏడాది నాకు చాలా ముఖ్యమైంది. అందుకే ఓ వారం పాటు విశ్రాంతి తీసుకుని ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆడాలనుకుంటున్నాను’ అని 25 ఏళ్ల సైనా తెలిపింది. మరోవైపు గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పీవీ సింధు కూడా సింగపూర్ ఓపెన్ ఆడటం లేదు. ఆమె కూడా ఈనెల 21 నుంచి 26 వరకు జరిగే ఆసియా బ్యాడ్మింటన్‌లోనే ఆడబోతోంది. సైనా, సింధు గైర్హాజరీతో కిడాంబి శ్రీకాంత్‌పై భారత అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. గత నెలలో స్విస్ గ్రాండ్‌ప్రి గోల్డ్, ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచి ఊపు మీదున్న అతను తొలి రౌండ్లో వియత్నాంకు చెందిన తియెన్ మిన్హ్ గుయెన్‌తో తలపడనున్నాడు. గతేడాది ఇదే టోర్నీలో ఇదే ప్రత్యర్థిని 22 ఏళ్ల శ్రీకాంత్ ఓడించాడు. ఇక పారుపల్లి కశ్యప్ కొరియా ఆటగాడు లీ హుయాన్ ఇల్‌ను ఎదుర్కోనున్నాడు. గతంలో ఈ ప్రత్యర్థిపై నాలుగు సార్లు తలపడితే కశ్యప్‌కు మూడు సార్లు ఓటమే ఎదురైంది. మహిళల సింగిల్స్‌లో భారత్ నుంచి పీసీ తులసి ఒక్కరే తలపడనుంది. డబుల్స్‌లో గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప జోడి తమ సత్తాను ప్రదర్శించనున్నారు. మంగళవారం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. -
సింగపూర్ ఓపెన్‌లో సైనా అవుట్
సింగపూర్: భారత ఏస్ షట్లర్ సైన నెహ్వాల్ మరోసారి స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచలేకపోయింది. సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో సైనా తొలిరౌండ్లోనే చతికిలపడింది. మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన హైదరాబాదీ 21-16, 15-21, 11-21 స్కోరుతో జపాన్ షట్లర్ ఎరికో హిరోసి చేతిలో ఓడిపోయింది. బుధవారమిక్కడ దాదాపు గంటసేపు హోరాహోరీగా సాగిన పోరులో సైనా తొలి గేమ్ నెగ్గినా ఆనక అదే జోరు కొనసాగించలేకపోయింది. రెండు గేమ్‌లతో పాటు మ్యాచ్‌ను కోల్పోయింది.